భక్తి ప్రధానమైన జానపదచిత్రాల గురించి చెప్పేముందు వాటికున్న మార్కెట్ గురించి ముందు చెప్తాను. జానపద సినిమాల్లో ఈ తరహా వాటికి మంచి డిమాండ్. రాజనీతి ప్రధానమైన సినిమాలు జనాల ఆదరం పొందుతుందో లేదో చెప్పలేం కానీ ఈ తరహా సినిమాలు జనాల మనస్సులను సూటిగా తాకుతాయి. మనకు అమ్మా, అమ్మమ్మా చిన్నప్పటినుండీ నూరిపోసినది ఏమిటి? దెయ్యాలు, భూతాలు వుంటాయని, వాటిని దేవుడు ఒక్కడే అరికట్టగలడనీ. మంత్రాలూ తంత్రాలతో దెయ్యాలనీ, భూతాలనీ శాసించేవారంటే మనకు మహా గురి. అందువల్ల చాలాభాగం సినిమాల్లో మాంత్రికుడు వుండడం తప్పనిసరి. మంత్రాలంటూ ప్రవేశపెట్టాక కథను ఎలా బడితే అలా తిప్పవచ్చు. శాపాలు, వరాలు ఎలా కావాలంటే అలా యిప్పించవచ్చు.
ఇక్కడో మాట చెప్పుకోవాలి. ఈ తరహా జానపద సినిమాల్లో గొప్ప సౌలభ్యం వుంది. హీరో కాల్‌షీట్లు యివ్వకుండా యిబ్బంది పెడుతున్నాడనుకోండి. ఓ శాపం యిప్పించి గుఱ్ఱంగానో, గొఱ్ఱెగానో మార్చిపారేయవచ్చు. ఇక అక్కణ్నుంచి గుఱ్ఱంతో కథ నడుస్తుంది. గుఱ్ఱంలో వున్నది కాంతారావేనని ప్రేక్షకుడు అనుకుంటాడు కాబట్టి స్టార్ వేల్యూకి స్టార్ వేల్యూ వుంటుంది. ఈ విధానం వలన పెద్ద స్టార్‌ని బుక్ చేసినా తక్కువ కాల్‌షీట్లతో పని నడిపించవచ్చు. కాల్‌షీట్ల సంఖ్య తక్కువే కాబట్టి తక్కువ పారితోషికానికి ఆయన్ను ఒప్పించవచ్చు. జానపదం అంటేనే ఊహాశక్తిని కళ్లెం లేని గుఱ్ఱంలా నడిపించవచ్చు. ఇక ఇలాటి మంత్రతంత్రాల సినిమా అయితే కథను చిత్తం వచ్చినట్టు మెలికలు తిప్పి జనాలను టెన్షన్ పెట్టవచ్చు. చివర్లో దేవుడు ప్రత్యక్షమైతే చాలు, అన్ని కష్టాలూ మంచల్లే కరిగిపోతాయి. అప్పటికప్పుడు చచ్చిపోయిన కొడుకు బతికి వస్తాడు. ఎలుగుబంటిరూపంలో వున్నది నీ భర్తే అని శివుడు చెప్పేస్తాడు. అంతా కలిసి శివుణ్ని కీర్తిస్తారు. కథ సుఖాంతం.
ఇలాటి కథను జనాలు నమ్ముతారా? నమ్మక ఛస్తారా? ప్రజల్లో నూటికి 99 మంది దేవుణ్ని నమ్మేవారే! దేవుణ్ని నమ్మినవాళ్లు దెయ్యాన్ని నమ్మకుండా వదిలిపెడతారా? దేవుడు మహిమలు చూపడం మానేసిన ఈ రోజుల్లో కూడా బాణామతులున్నాయని, చేతబడులున్నాయని వాటిని చేసే మాంత్రికులున్నారని పల్లెటూళ్లలో జనం నమ్మి కొంతమంది పళ్లు రాలగొడుతున్నారు. చంపుతున్నారు. అందువల్లనే 'అమ్మోరు' వంటి సాంఘిక సినిమాల్లో కూడా రామిరెడ్డి లాటి మాంత్రిపాత్రలు చోటు చేసుకుంటున్నాయి. 'నాగమ్మ' లాటి టీవీ సీరియల్స్ సంవత్సరాల తరబడి ఆడుతున్నాయి. ఇంకో తమాషా చెప్పమంటారా? సినిమాల్లో సెక్స్ ఎప్పుడూ సెల్లింగ్ పాయింటే! జనంలో రక్తి కలిగించాలంటే భక్తి అత్యంత సులభమైన షార్ట్‌కట్! శక్తి, యుక్తితో కంటె భక్తితోనే రక్తి బాగా అతుకుతుంది. దేవుడి మహిమను హైలైట్ చేయాలంటే క్షుద్రశక్తులను విస్తారంగా చూపించాలి. క్షుద్రశక్తులంటే మదిర, మదవతి మస్ట్ అండ్ షుడ్‌గా వుండాలి. అందువల్ల వాటిని హద్దులు దాటి చూపించినా జనం తప్పు పట్టరు.
విఠలాచార్య అనేక మంచి జానపదాలు తీశారు. తర్వాత రామారావుగారితో 'నిన్నే పెళ్లాడతా' వంటి హాస్య సాంఘిక సినిమా, నాగేశ్వరరావుగారితో కలిసి 'బీదలపాట్లు' విషాద సాంఘిక సినిమా తీశారు. అవి ఫెయిలయ్యి ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నారు. కొన్నాళ్లు విరామం తీసుకుని మళ్లీ జానపదాల్లోకి వచ్చారు. ఈ సారి 'కనకదుర్గ పూజామహిమ' వంటి క్లీన్ భక్తి సినిమా కాదు, బందిపోటు వంటి రాజనీతి ప్రధానమైన సినిమా కాదు – 'జగన్మోహిని' అనే రక్తి, భక్తి దాయకమైన సినిమా తీశారు. దీనిలో జయమాలినిది ప్రధాన పాత్ర. ఆమె ఓ మోహిని. యక్షిణి టైపన్నమాట. నరసింహరాజును మోహించి అతని వెంట పడుతుంది. చాలీచాలని బట్టలు వేసుకుని డాన్సులు చేస్తుంది. ప్రేక్షకులతో బాటు అతనూ కూడా ఆమె మాయలో పడిపోతాడు. అప్పుడు అతని భార్య ప్రభ భక్తితో దేవత గురించి పాటలు పాడి భర్తను ఆ యక్షిణి బారినుండి కాపాడుకుంటుంది.
దీనిలో భక్తికి భక్తి వుంది, రక్తికి రక్తి వుంది. రొమాంటిక్ సీన్లు పుష్కలంగా, ఘాటుగా పెట్టడానికి బోల్డంత స్కోపుంది. విఠలాచార్య సినిమా కాబట్టి మ్యూజిక్ అద్భుతంగా వుంది. జయమాలిని తెగబడి ఆడేసింది. ప్రభ భక్తిగీతాలకు మహిళా ప్రేక్షకులు కన్నీరు కార్చారు. విఠలాచార్యకు కనకవర్షం కురిసింది. ఇక అదే ఫార్ములా పట్టుకున్నాడాయన. 'జగన్మోహిని' తర్వాత ఇంకో మోహిని, మరో మోహిని. అదే టీము. అందరూ బి గ్రేడ్ స్టార్లే. జయమాలిన్నే హీరోయిన్ అనుకోండి, వ్యాంప్ అనుకోండి. ఏమనుకున్నా నష్టం లేదు – కనువిందు చేస్తున్నంత సేపు. ప్రేక్షకులు విరగబడి చూశారు. విఠలాచార్య పోయేదాకా ఆ ఫార్ములానే నమ్ముకున్నారు. మళ్లీ సాంఘికాల జోలికి పోలేదు.
'జగన్మోహిని' టైపు సినిమాలు ఇతర భాషల్లో డబ్ చేసినప్పుడు కూడా బ్రహ్మాండంగా ఆడాయి. అంటే ఖర్చు తక్కువ, ఫలం ఎక్కువ! ఇక్కడో పాయింటు చెప్పాలి. సాంఘిక సినిమాలను డబ్ చేస్తే అంత బాగా ఆడవు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి వాళ్ల వాళ్ల కట్టూబొట్టూ వేరేవేరే వుంటాయి. అరవ్వాళ్లు లుంగీ కట్టుకుని వీధిలోకి వెళ్లినట్టు చూపిస్తారు. మన సినిమాల్లో అలా చూపితే నవ్వుతారు. మలయాళం సినిమాలో హీరో చాలాసేపు లుంగీలో కనబడతాడు. మన హీరో అర్ధరాత్రి కూడా ప్యాంటు, చొక్కా టక్ చేసుకుని కనబడతాడు. హిందీలోనూ అంతే! అయితే జానపదాల్లో ఆ బాధ లేదు. మన దేశం మొత్తానికి పాతకాలం డ్రస్ ఒక్కటే. పెద్దవాళ్లయితే గోచీపోసుకుని పంచీ కట్టుకోవడం, యువకులైతే టైట్ పైజమాల్లాటివి వేసుకుని, పైన అంగరఖాలాటిది వేసుకోవడం. చందమామలో బొమ్మలు చూడండి. చందమామ అన్ని భాషల్లో వస్తుందా? అన్నిటికీ కలిపి ఒకే బొమ్మలు. బెంగాలీ వెర్షన్‌కి ఓ రకం బొమ్మ, పంజాబీ వెర్షన్‌కి మరో బొమ్మ వుండదు. ఒక్క వెర్షన్‌కి బొమ్మలు వేయిస్తే 14 భాషలకు పనికి వస్తుంది. జానపద సినిమాలకు, పౌరాణిక సినిమాలకు ఈ అడ్వాంటేజి వుంది. చూస్తుంటే మనది కాదు అన్న ఫీలింగు కలగదు. యాక్టర్లు కూడా ఎస్టాబ్లిష్‌డ్ యాక్టర్లు కారు కాబట్టి వాళ్లు వేరే భాష మాట్లాడేవాళ్లు, మనకోసం డబ్ చేశారు అనే ఫీలింగు కలగదు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ సినిమాలు తెలుగులోకి డబ్ చేయలేదు. వాళ్లు తెలుగు మాట్లాడరని మనకు బాఘా తెలుసు. అదే మహీపాల్, జయశ్రీ గడ్‌కర్ సినిమాలు వేసే పౌరాణిక, జానపద సినిమాలు డబ్ చేశారనుకోండి. మనకు వాళ్లెవరో పెద్దగా తెలియదు కాబట్టి, వాళ్ల ఒరిజినల్ వాయిస్‌లు మనకు పరిచయం కాదు కాబట్టి మనం ఈజీగా ఆమోదించేస్తాం. అందువల్లనే 'రామభక్త హనుమాన్' 'గాంధారి గర్వభంగం' 'జింబో' లాటివి తెలుగునాట కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)