చంద్రబాబుగారు ఏ వూరు కెళితే ఆంధ్ర రాజధానిని అలా రూపుదిద్దుతానంటారు. సింగపూరు, జపాన్ అయ్యాయి. మొన్న టర్కీ వెళ్లి వచ్చారు కాబట్టి అమరావతిని ఇస్తాంబుల్‌ను చేస్తామంటున్నారు. మరో వూరు వెళ్లేవరకు ఇస్తాంబుల్ స్తోత్రాలే వినాలి కాబోలు. పోలిక ఎందుకు తెచ్చారో తెలియదు కానీ టర్కీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇస్తాంబుల్‌లో మరీనూ. ఇప్పుడు అమరావతి కూడా అలాగే తయారైందని వ్యాపారస్తులు మొత్తుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని కంపెనీల రీజనల్ ఆఫీసులు, మెయిన్ డీలర్లు, సిఅండ్‌ఎఫ్ ఏజంట్లు హైదరాబాదులోనే వుండేవారు. విభజన సమయంలో జరిగిన చర్చల కారణంగా పన్నుల గురించి ఆంధ్రుల్లో అవగాహన పెరిగిపోయింది. ఆంధ్రలో ఎక్కడ కాఫీ తాగినా ఆ గ్రూపు హెడాఫీసు హైదరాబాదులో వుందంటే పన్ను ఆదాయమంతా హైదరాబాదుకే పోతుందని తెలిసిపోయింది.
మనకు దక్కకుండా పోయిన హైదరాబాదుకు యింకా ఎందుకు సంపదలు కట్టబెట్టాలన్న వ్యథ ఆంధ్ర వ్యాపారస్తులను బాధించింది. అందువలన సేల్స్ రిప్రెంజటేటివులకు స్పష్టంగా చెప్పసాగారు – 'మీ సరుకు కొనాలంటే ఆంధ్రలో డీలరుంటే వాళ్ల ద్వారా పంపించండి, హైదరాబాదు డీలరైతే వద్దు, అంతగా కావాలంటే మద్రాసు నుంచైనా తెప్పించుకుంటాం' అని. అందువలన అనేక కంపెనీలు ఆంధ్రలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు, కంపెనీ షోరూములు పెట్టడానికి ప్లాన్లు వేశారు. ఆంధ్ర అంటే సహజంగా రాజధానిలో పెడదామనే చూస్తారు. విజయవాడ సెంటర్లో వుంది, రవాణా సౌకర్యాలు బాగుంటాయి కాబట్టి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో తమ దుకాణాలు పెడదామని అనుకున్నారు.
అలాటివాళ్లంతా యిప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఆంధ్ర రాజధాని మామూలుగా వుండదు, అంతర్జాతీయ నగరమై పోతుంది, దేశవిదేశాల వాళ్లంతా వ్యాపారం కోసం, విహారం కోసం యిక్కడకే వస్తారు అంటూ విపరీతంగా ప్రచారం చేసి, ఇంద్రుడి అమరావతిని తలదన్నేట్లా యీ అమరావతిని కంప్యూటరు గ్రాఫిక్స్‌లో చూపించేసరికి బయటవాళ్లు నమ్మారో లేదో కానీ స్థానికులు నమ్మేసి భూమి ధరలు విపరీతంగా పెంచేసి కూర్చున్నారు. ఇప్పటికే భవంతులు వున్నవాళ్లు అద్దెలు పెంచేశారు. హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో కమ్మర్షియల్ స్థలం అద్దె చ.అ. రూ.150 వుంటే, విజయవాడ బందరు రోడ్డులో కూడా అంతకు మించి రేటు చెప్తున్నారు. విజయవాడ జనాభా హైదరాబాదులో ఆరో వంతు వుంటుందేమో. బంజారా హిల్స్‌లో వున్నంత మార్కెటింగ్ అవకాశాలు విజయవాడలో ఎందుకుంటాయి?
ఒక కారు డీలరు తన షోరూము పెడదామని విజయవాడే కాక 15 కి.మీ.ల పరిధిలో గన్నవరం, పోరంకి, పెనమలూరు, ఉండవల్లి, నున్న వంటి ప్రదేశాలు తిరిగినా వాణిజ్య అవసరాలకని అనగానే ఎక్కడా ఎకరం రూ. 5 కోట్లకు తక్కువకు దొరకలేదట. పెట్టుబడిలో 35-40 శాతం భూమికే పోతే వ్యాపారమెలా నడుస్తుందని అతని బాధ. అది రాబట్టుకోవాలంటే టర్నోవరు విపరీతంగా వుండాలి. వీళ్లు చెపుతున్న మహా నగరం 2025 నాటికి తయారయ్యాక అప్పుడు ఆ టర్నోవరు వస్తుందేమో కానీ యిప్పుడైతే లేదు కదా. 11 వ ప్లాను సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధి రేటు 12% హైదరాబాదు (రంగారెడ్డి, మెదక్ కలిపి) వృద్ధి రేటు 20% కాగా, కృష్ణా జిల్లాది 4%. అంటే హైదరాబాదులో కృష్ణా 5వ వంతు అన్నమాట. విభజన తర్వాత యీ గ్యాప్ పూరించడానికి ఆంధ్ర ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నిస్తోంది. కానీ అలా పూరించడానికి ఎన్నేళ్లు పడుతుందో వాస్తవిక అంచనా వుండాలి. బ్రోషర్లు వేసినంత సులభం కాదు, వృద్ధి సాధించడం!
ఆంధ్ర రాజధాని హైదరాబాదులా వాణిజ్యపరంగా కూడా ఎదగాలంటే హెల్త్‌కేర్, విద్య, వినోదం వగైరా అనేక ఎస్టాబ్లిష్‌మెంట్లు రావాలి. గతంలోనే భూములున్న వాళ్లు వాటిపై ప్రస్తుతం కట్టుకోగలరేమో కానీ, యిప్పుడు భూమి కొని వ్యాపారం చేయాలంటే మాత్రం కిట్టుబాటు అయ్యేట్లా లేదు. 6000 చ.అ.ల రెస్టారెంటు పెడదామనుకున్న ఓ పెద్దమనిషి, 'విజయవాడలో దాని కయ్యే ఖర్చుతో హైదరాబాదులో కాని, వైజాగ్‌లో కాని 10 వేల చ.అ.ల రెస్టారెంటు పెట్టగలను. రెస్టారెంటు ఎంత పెద్దదైతే అంత ఆదాయం. ఇక్కడ ఆ స్కోపు లేదు' అన్నాట్ట. విజయవాడ, గుంటూరులలో స్థలాలు కొని ఆసుపత్రులు కడతామని అనుకున్న అనేక పెద్ద గ్రూపులు వెనుకంజ వేశాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పెట్టాలంటే బెడ్‌కు రూ.5 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టాలని వాళ్లు అంచనా వేశారు.
అంతకంటె నయా రాయపూర్, భువనేశ్వర్‌లలో కడితే చౌకగా వుంటుందని లెక్కలు వేస్తున్నారు. విజయవాడలో గతంలో స్థలం కొన్న స్థానికులు మాత్రమే హాస్పటల్స్ కట్టగలుగుతున్నారు. కట్టినా తర్ఫీదు పొందిన సిబ్బంది కొరత విపరీతంగా వుంది. వారికి అధికజీతాలు యిచ్చి తెప్పించుకోవలసి వస్తోంది. అంత చేసినా ఆక్యుపెన్సీ రేటు తక్కువగానే వుంది. ఎందుకంటే విజయవాడ ప్రాంతానికి జనాభా తరలి రావడం యింకా ప్రారంభం కాలేదు. ఎప్పటికైనా తరలి వస్తారా లేదా అన్నదే సందేహంగా వుంది. ఎందుకంటే నగరం విస్తరించాలంటే చిన్నా, చితకా వ్యాపారస్తులు కూడా బతికే అవకాశం వుండాలి. అందరికీ ప్రభుత్వోద్యోగాలు రావు. కానీ ఒక బ్యూటీ పార్లర్ పెట్టాలన్నా, ఒక టైలరింగ్ షాపు పెట్టాలన్నా, సూపర్ మార్కెట్ పెట్టాలన్నా అద్దెలు హైదరాబాదు, బెంగుళూరులను మించి చెపుతున్నారు. ఏ కొత్త సౌకర్యమూ రాకుండానే, కేవలం ప్రభుత్వం వేస్తున్న బ్రోషర్లు చూపించి ఉత్తి పుణ్యానికి షాపుల అద్దెలు మూడేసి రెట్లు పెంచేశారు. ఇళ్ల అద్దె కూడా దాదాపు రెండు, రెండున్నర రెట్లు పెంచేశారు. సామాన్యుడు బతకడం దుర్భరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాదు యీనాడు యీ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం – అది సామాన్యులకు, పేదలకు కూడా అందుబాటులో వుండడం. ఊళ్లో చదువు పూర్తవగానే బస్సు ఎక్కి వచ్చేసి ఓ వెయ్యి రూపాయల ఉద్యోగం తెచ్చుకుంటే యింటి నుంచి మరో వెయ్యి తెప్పించుకుంటే గెటాన్ అయిపోయేవారు. ఏడాది తిరిగేసరికి జీతం పెరిగేది, ఊరికి దూరంగా ఫ్రెండ్స్‌తో కలిసి రూములో వున్నా సరిపోతుంది. కష్టపడితే ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. మెస్‌లో తినే స్తోమత లేనినాడు రోడ్డు సైడ్ ఇడ్లీ బండిలోనైనా కతికి బతికేయవచ్చు. ఈనాడు హైదరాబాదులోని హోటళ్లలో, షాపుల్లో చూస్తే ఎంతోమంది తూర్పు రాష్ట్రాల వారు (ఒడిశా నుండి ఆసాం వరకు) కనబడతారు. అందరికీ బతికే అవకాశం యీ నగరం కల్పిస్తోంది.
హైదరాబాదు యీ స్థాయికి రావడానికి 50 ఏళ్లు పట్టింది. నగరంలో జూబిలీ హిల్స్, సైబరాబాదు చూసి నగరమంతా యిలాగే వుంటుందనుకోకూడదు. ఇప్పటికీ పెద్దగా ఎదగని, పేదప్రజలు వుండడానికి వీలైన ప్రాంతాలు ఎన్నో వున్నాయి. ఆంధ్ర రాజధానిలో అటువంటి ప్రాంతాలు వున్నపుడే యిళ్లల్లో, ఆఫీసుల్లో, షాపుల్లో, నిర్మాణాల్లో పనిచేసేందుకు పనివాళ్లు దొరుకుతారు. 2050 నాటికి ఆంధ్ర రాజధాని జనాభా కోటీ ముప్ఫయి లక్షలయిపోతుంది అని ప్రభుత్వం చెపుతోంది. అమరావతి చుట్టుపట్ల ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 7.1% వుంది. అన్ని రంగాలవారూ, అన్ని వర్గాల వారూ వచ్చి స్థిరపడితేనే ప్రభుత్వ అంచనా కొంతవరకైనా నిజమౌతుంది. జనాభా పెరిగితే ద్రవ్యవినిమయం, ఆర్థిక చలనం, తద్వారా భవంతుల విలువ పెరగడం జరుగుతాయి. సామాన్యుడికి అందుబాటులో లేని నగరంగా ఎదిగితే మాత్రం ప్రభుత్వ సిబ్బంది వుండే ధనిక నగరంగానే మిగులుతుంది. వాళ్లు కూడా వస్తారో రారో అనుమానమే. ఇప్పటికే హైదరాబాదుతో సమానంగా హౌస్ రెంట్ ఎలవన్స్ యిమ్మనమని అడిగి సాధించుకున్నారు. రేపు అంతకంటె ఎక్కువ యిమ్మనమంటారేమో, యిచ్చినా తమ కుటుంబాలను హైదరాబాదు నుంచి తరలించకుండా తాము మాత్రమే వస్తారేమో.
షాపుల అద్దె పెరగడంతో విజయవాడలో దుకాణదారులు తమ సేవల ధర పెంచేశారు. నెలకో సారైనా ఫేషియల్ చేయించుకుందామంటే గతంలో కంటె మూడు రెట్లు ఎక్కువ పెంచేశారని వాపోయింది ఒకావిడ. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ కంపెనీ నడిపే ఒకాయన పదిమంది స్టాఫ్‌ను విజయవాడకు తరలించి అక్కడ బ్రాంచ్ పెడదామని పెడదామని ప్లాను చేసి, అక్కడి పరిస్థితి చూసి వెనుకంజ వేశాడు. 'హైదరాబాదులో పదివేలు జీతం యిస్తే బోల్డు మంది దొరుకుతారు, ఎందుకంటే వాళ్లకు మూడు, నాలుగు వేల అద్దెలో వూరవతలైనా వసతి దొరుకుతుంది. విజయవాడలో ఏడెనిమిది వేలు అద్దెకే పోయే పరిస్థితి. పదివేల జీతంలో ఎలా బతుకుతాడు? హైదరాబాదు వదిలివెళ్లనంటున్నారు' అంటున్నాడు. ఇన్నాళ్లూ తెలుగువాళ్లకు హైదరాబాదు ఏకైక నగరంగా వుంది కాబట్టి స్కిల్ వున్న వారూ, ప్రొఫెషనల్ ఏటిట్యూడ్ వున్నవారూ అవకాశాలకోసం హైదరాబాదుకే వచ్చారు.
విభజన తర్వాత ఆంధ్ర-తెలంగాణ గొడవలు వస్తాయి కాబట్టి హైదరాబాదులో ఆస్తులు వున్నవాళ్లు తప్ప తక్కిన ఆంధ్ర మూలాలవాళ్లు విజయవాడకు తరలిపోతారని అంచనాలు వేశారు. కానీ హైదరాబాదులో సామాజిక పరిస్థితి ఎప్పటిలాగానే వుంది. నాయకులు అప్పుడప్పుడు ఏవో వ్యాఖ్యలు చేయడం, మళ్లీ వెనక్కి తీసుకోవడం జరుగుతోంది తప్ప జనసామాన్యంలో భేదాలు కనబడటం లేదు. సెక్షన్ 8 అమలు గురించి నాయకులు చింతించినంతగా సాధారణ జనులు చింతించటం లేదు. అర్జంటుగా మూటాముల్లె సర్దుకోవడానికి ఎవరూ తొందర పడటం లేదు. ఆంధ్రలో అంతర్జాతీయ నగరం నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాక ఆ యా రంగాలకు చెందినవారు వెళ్లవచ్చేమో. అదెప్పుడు జరుగుతుందో, కేంద్రం ఎన్ని నిధులు యిస్తుందో, ఎంత వేగంగా పనులు సాగుతాయో వేచి చూడాలి. ఎక్కడికి తరలి వెళ్లాలన్నా అక్కడి కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి లెక్కలోకి తీసుకుంటారు. బొంబాయి, ఢిల్లీ వంటి మహానగరాల్లో పనిచేసే కార్మికులు కుటుంబాలను దగ్గరున్న వూళ్లల్లో పెట్టి తాము స్లమ్స్‌లో వుంటుంటారు. అది అనేక రకాలైన శాంతిభద్రతల సమస్యలు తెచ్చిపెడుతుంది. విజయవాడ, రాజధాని ప్రాంతం అలా కాకుండా వుండాలంటే రెంటు కంట్రోలు చట్టం వంటిది ఏదైనా తెచ్చి ప్రభుత్వం అద్దెలను అదుపులోకి తేవాలి. సామాన్యుడు సైతం బతకగలిగే పరిస్థితి నెలకొల్పాలి. అక్కడ జీవనవ్యయం అదుపులో పెట్టలేకపోతే బయట నుంచి జనాలు రాకపోగా ఎప్పణ్నుంచో వున్నవాళ్లు కూడా తమ యిళ్లను అద్దెలకు యిచ్చేసి పక్క జిల్లాలకు తరలిపోతారు. అదే జరిగితే యిళ్లు, షాపులకు డిమాండు లేక రేట్లు పడిపోయి, పెట్టుబడి పెట్టినవారందరూ తీవ్రంగా నష్టపోతారు.
ప్రభుత్వం గాలిమేడలు చూపించడం మానేసి వాస్తవానికి దగ్గరగా వస్తే, రాజధాని ప్రాంతాల ధరలు నేలమీద వుంటాయి. సామాన్యుడు బతకగలుగుతాడు. కాదు, రాజధానిని ఇస్తాంబుల్‌లా చేస్తానని బాబు పట్టుబడితే ఆయన యిష్టం. ఇదే సందర్భంలో యింకో విషయం కూడా ప్రస్తావించాలి. బాబు టర్కీ వెళ్లినపుడు అక్కడి రాజకీయ పరిస్థితి గురించి కూడా తెలుసుకుని వుంటారు. జూన్ 8 న జరిగిన ఎన్నికలలో దేశాధ్య్ష పదవికి పోటీ చేసిన ఎర్గోదాన్ ఓటమి పాలయ్యాడు. సొంతంగా పార్టీ పెట్టి మూడు సార్లుగా నెగ్గుతూ వచ్చి, ప్రధానమంత్రిగా పని చేసి, సగం కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటూ వచ్చిన అతను యీసారి యువ నాయకుడు దెమిర్తాస్ చేతిలో భంగపడ్డాడు. కారణం సింపుల్‌గా చెప్పాలంటే – దెెమిర్తాస్ అన్ని వర్గాలకూ తన పార్టీలో చోటిచ్చాడు. కుర్ద్ మైనారిటీలకు, మతపరమైన మైనారిటీలకు మహిళలకు, అనేక రకాల ఆలోచనావిధానాలున్న వారికీ అందరినీ కలుపుకు పోయాడు.
ఎర్గోదాన్ తరహా అది కాదు, తను చెప్పినదే వేదం అనే రకం. రెండేళ్ల క్రితం అతని పరిపాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగితే వాళ్లను అతను రిఫ్‌రాఫ్ గాళ్లని, టెర్రరిస్టులని, విదేశీ ఏజంట్లని నిందించాడు తప్ప వారిని పిలిచి వాళ్ల కష్టాలేమిటని అడగలేదు. అతను మీడియాను చక్కగా మేనేజ్ చేశాడు కాబట్టి మీడియా కూడా ఆందోళన కారులను టెర్రరిస్టులుగానే చూపించింది. తనతో విభేదించినవారందరూ మతిమాలిన వాళ్లే అని అనుకోవడం వలననే ఎర్గోదాన్ వంటి సీనియర్ నేత మట్టి కరిచాడు. ఆంధ్ర రాజధాని స్థలనిర్ధారణ గురించి, రూపకల్పన గురించి, బడ్జెట్ గురించి శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను కాని, ప్రతిపక్షాల సలహాలను కానీ పట్టించుకోకుండా ముందు కెళుతున్న, ఏ సమస్య పైన అఖిలపక్షం పిలవకుండా, విమర్శకులను శత్రువులుగా, అభివృద్ధినిరోధకులుగా చూస్తున్న చంద్రబాబు ఒక్కసారి ఎర్గోదాన్ సంగతి తెలుసుకుంటే మంచిది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)