సాధారణంగా ఒకే భావజాలం గల పార్టీలు కూటమిగా ఏర్పడి, తమను వ్యతిరేకించేవారితో పోరాడుతూ వుంటాయి. ఇప్పటిదాకా బిజెపికి నాయకత్వం వహించినవారు శివసేన, అకాలీదళ్ వంటి మతరాజకీయాలు చేసేవారితో చేతులు కలిపి రాజకీయాలు సాగిస్తూ వచ్చారు. ప్రస్తుత నాయకత్వం స్ట్రాటజీ మార్చింది. మతరాజకీయాలను అభిమానించేవారి ఏకైక పార్టీగా ఎదగడానికై భాగస్వాముల ప్రాధాన్యత తగ్గించి వారి స్పేస్ ఆక్రమిస్తోంది. మహారాష్ట్ర ఎసెంబ్లీ ఎన్నికలు జరిగేదాకా కూటమిలో శివసేన ప్రధాన పార్టీ, బిజెపి తోక పార్టీ. పొత్తు తెంపేసి, బిజెపి పరిస్థితి తారుమారు చేసింది. పంజాబ్‌లో 2017లో ఎసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ తన చిరకాల భాగస్వామి అకాలీదళ్‌పై యిలాటి చిట్కాయే వేస్తోంది బిజెపి. పంజాబ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అకాలీదళ్‌కు చెందిన తండ్రీ కొడుకులు ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్. సుఖ్‌బీర్ బావమరిది విక్రమ్ సింగ్ మంజీతియా రెవెన్యూ మంత్రి.
సుఖ్‌బీర్ భార్య హర్‌సిమ్రత్ కౌర్‌ను కేంద్ర కాబినెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యిండస్ట్రీస్‌కు మంత్రిగా తీసుకున్నా వారి కుటుంబానికే ఎసరు పెట్టడానికి నిశ్చయించుకుంది బిజెపి. దానికి వారు ఎంచుకున్న లక్ష్యం – విక్రమ్ సింగ్. దానికి కారణం వుంది. మోదీకి అత్యంత సన్నిహితుడైన అరుణ్ జైట్లీని బిజెపి అమృత్‌సర్ నుండి నిలబెట్టి అతన్ని గెలిపించే బాధ్యతను నవజ్యోత్ సింగ్ సిద్దూకు అప్పగించింది. తనకు టిక్కెట్టు రాలేదన్న అలకతో వున్న సిద్దూ ప్రచారం చేయననడంతో అకాలీదళ్‌కు చెందిన విక్రమ్ సింగ్‌కు జైట్లీని గెలిపించే బాధ్యత అప్పగించారు. అంతిమంగా జైట్లీ ఓడిపోవడంతో విక్రమ్‌పై బిజెపి కినుక వహించింది. నిజానికి విక్రమ్ చాలా హడావుడి చేశాడు. శిఖ్కుల పవిత్రగ్రంథమైన గ్రంథసాహెబ్‌లోని కీర్తనలు తీసుకుని వాటిలో గురు గోబింద్ సింగ్ పేరుకు బదులు అరుణ్ జైట్లీ పేరు పెట్టి, ప్యారడీలు తయారు చేయించి ప్రచారంలో వాడాడు. ఇది అకాల్ తఖ్త్ వాళ్లకు కోపం తెప్పించింది. విక్రమ్‌ను క్షమాపణ చెప్పమంది. అతను చెప్పాడు. కానీ యీ ఓవరాక్షన్ వలన శిఖ్కుల ఓట్లు పడలేదు కాబోలు జైట్లీ ఓడిపోయాడు.
విక్రమ్‌కు, అతనితో బాటు అతని బంధుగణానికి, అనగా అకాలీదళ్ అగ్రనాయకత్వానికి బుద్ధి చెప్పడానికి బిజెపికి అనువుగా 2013 మార్చి నాటి డ్రగ్ స్మగ్లింగ్ కేసు దొరికింది. ఔషధాల తయారీలో ఉపయోగించే కెటామైన్, ఎఫిడ్రిన్‌లను హిమాచల్ ప్రదేశ్‌లోని ఫార్మా యూనిట్ల ద్వారా సేకరించిన స్మగ్లర్లు వాటిని కెనడాకు దొంగతనంగా పంపిస్తే చైనా, వియత్నాం నిపుణులు వాటితో సింథటిక్ మాదకద్రవ్యాలు తయారుచేసి యిస్తున్నారు. వాటిని దొంగతనంగా పంజాబ్‌కు తెచ్చి అమ్ముతున్నారు. ఈ రూ.6000 కోట్ల కేసులో అనూప్ సింగ్ కెహ్లాన్ అనే ఎన్నారై అరెస్టయ్యాడు. అతని ద్వారా జగదీశ్ సింగ్ భోలా అనే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కూడా అరెస్టయ్యాడు. విచారణలో భోలా తమకు హిమాచల్ ప్రదేశ్ నుండి ముడిసరుకులు తెప్పించి పెడుతున్నదీ, కెనడా స్మగ్లర్లకు బులెట్ ప్రూఫ్ కార్లు యిచ్చి రక్షణ కల్పిస్తున్నదీ విక్రమే అని చెప్పాడు. అతనితో బాటు బంజాబ్ జైళ్ల మంత్రి స్వరణ్ సింగ్ ఫిల్లౌర్ కుమారుడు ధర్మవీర్ సింగ్ కూడా వున్నాడన్నాడు. ''విక్రమ్‌కు 2009లో పెళ్లయినపుడు మేమంతా హాజరయ్యాం కూడా'' అన్నాడతను.
యుపిఏకు, అకాలీదళ్‌కు ఏ బేరసారాలు కుదిరాయో కానీ యీ కేసు ఏడాదిన్నర దాటినా ముందుకు సాగలేదు. డిసెంబరు రెండో వారంలో బిజెపి సర్కారు దీన్ని పైకి తీసి దుమ్ముదులుపుతోందని తెలిసిన విక్రమ్ సోదరి, కేంద్రమంత్రి అయిన హర్‌సిమ్రత్ భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అతనికీ ఏం చేయాలో తెలియలేదు.
అంతకుముందే మోదీ ఆకాశవాణిలో నిర్వహించే ''మన్‌కీ బాత్'' కార్యక్రమంలో డిసెంబరు 14 కార్యక్రమంలో పంజాబ్‌లో సాగుతున్న మాదకద్రవ్యాల వ్యాపారం గురించి ఎవరో ప్రశ్న అడిగారు. దాన్ని అణచివేస్తామని మోదీ జవాబిచ్చారు. దానికి తగ్గట్టుగా అమిత్ షా బిజెపి తరఫున మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాన్ని అమృత్‌సర్‌లో జనవరి 12న ప్రారంభిస్తామని ప్రకటించారు. తర్వాత 22కు వాయిదా వేశారు. పాపం రాహుల్ గాంధీ 2014 అక్టోబరులోనే యీ అంశం లేవనెత్తి పంజాబ్ యువతలో 70% మంది డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, కాంగ్రెసు స్టూడెంట్స్ యూనియన్ ఎన్‌ఎస్‌యుఐ దీనిపై ఉద్యమించాలని పిలుపు నిచ్చాడు. అప్పుడింత ప్రచారం రాలేదు. ఇప్పుడు బిజెపి 'కాంగ్రెస్ ముక్త్ భారత్' తరహాలో 'నశా ముక్త్ పంజాబ్ జాగరణ్ యాత్ర' పేరుతో ఉద్యమం మొదలుపెట్టి దానిలో అకాలీ దళ్‌కు పాత్ర యివ్వనంటోంది. డిసెంబరు 26న విక్రమ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేటు వారు పిలిచి మనీలాండరింగ్ కేసులో నాలుగున్నర గంటల పాటు విచారణ జరిపారు! వెంటనే రాష్ట్ర బిజెపి అధ్యకక్షుడు, యితర బిజెపి నాయకులు మంత్రివర్గం నుండి విక్రమ్‌ను తొలగించాలని డిమాండ్లు మొదలుపెట్టారు.
ఇదంతా తమను బలహీన పరచడానికే అని అకాలీదళ్ అనుకుంటోంది. ఇప్పటివరకు గ్రామీణప్రాంతాల్లో అకాలీదళ్, నగరప్రాంతాల్లో బిజెపి బలంగా వుండేవి. వారి పొత్తువలన యిబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు అమిత్ షా గ్రామీణప్రాంతాల్లో బిజెపి సభ్యత్వం పెంచాలని ఆదేశించడంతో 2 లక్షల మంది గ్రామీణులు బిజెపిలో చేరారట. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరు చెప్పి తమ ప్రతిష్ట దెబ్బ తీయడానికే బిజెపి పన్నాగం పన్నుతోందన్న అనుమానంతో అకాలీ దళ్ బిజెపి కార్యక్రమాని కంటె ముందుగా జనవరి 5 న అదే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే అది అమృత్‌సర్‌లో కాదు, పాకిస్తాన్‌తో సరిహద్దులున్న గ్రామాలలో చేపట్టింది. 'ఈ డ్రగ్స్ పాకిస్తాన్ నుండి సరఫరా అవుతున్నాయి. స్థానిక నాయకులకు సంబంధం లేదు. ఇది విదేశాలతో ముడిపడిన అంశం కాబట్టి దీన్ని నివారించవలసిన బాధ్యత కేంద్రసర్కారు అనగా బిజెపిదే..' అని వారి థీమ్.
అంతర్జాతీయ సరిహద్దుల్లో యిలాటి కార్యక్రమం నిర్వహించడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు అభ్యంతర పెడితే కేంద్ర హోం శాఖ ఆ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది. వారు ముందులో అనుకున్న ప్రాంతాలు మార్చి సరిహద్దులకు కొన్ని చోట్ల 3 కి.మీ.ల లోపలగా, మరి కొన్ని చోట్ల 13 కి.మీ. లోపల జరిపింది. ఆ సందర్భంగా అకాలీదళ్ అధ్యకక్షుడు కూడా అయిన సుఖ్‌బీర్ యీ డ్రగ్స్ అన్నీ బిజెపి పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుండి దొంగతనంగా సరఫరా అవుతున్నాయని ఆరోపించాడు. అంతేకాదు, పంజాబ్‌లోకి అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, రాజస్థాన్‌ల నుండి వచ్చిపడుతున్న మాదకద్రవ్యాలకు బానిసలు కాకండి అని పంజాబీ యువతను హెచ్చరిస్తూ ప్రభుత్వం తరఫున యాడ్ కాంపెయిన్ కూడా మొదలుపెట్టాడు. జనవరి 22న అమిత్ షా వచ్చాక కథ మరింత రసకందాయకంలో పడవచ్చు.
ఎమ్బీయస్ ప్రసాద్