ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు కార్మికచట్టాల నుండి రక్షణ లేదు. కర్ణాటకలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించడానికి 2000 సం||రం నుండి కార్మిక చట్టం (ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ చట్టం, 1946 నుండి వారికి మినహాయింపు యిచ్చారు. దాన్ని ఐటీ కంపెనీ విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నాయి. ఉద్యోగుల పనితీరును బేరీజు వేయడంలో వ్యక్తిగతమైన యిష్టాయిష్టాలు ప్రదర్శిస్తున్నారు. ఒకే క్యాడర్లో వున్నవారికి ఒకే జీతం యివ్వడం లేదు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లూ వాళ్ల యిష్టమే. ఇవన్నీ కేవలం ప్రతిభ ఆధారంగానే నిర్ణయిస్తున్నారని చెప్పడానికి లేదు. తాము చెప్పిన మాట వినలేదనో, ఆడవాళ్లు తమకు లొంగలేదనో, యిలాటి వ్యక్తిగత కారణాలపై కూడా వివక్షత చూపుతున్నారు. గ్రేడింగ్‌లు తగ్గిస్తున్నారు. అంతేకాదు, చిన్న చిన్న సాకులు చెప్పి ఏ నోటీసు లేకుండా నిమిషాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఆఫీసుకి వచ్చాక తెలుస్తోంది – ఉద్యోగం వూడిందని. ఇదెక్కడి ఘోరమని అడగబోతే సర్వీసు సర్టిఫికెట్టు యివ్వం అనీ, యిచ్చినా వ్యతిరేక రిమార్కులు రాస్తామనీ బెదిరిస్తున్నారు. సాంకేతిక శాఖల్లో అవసరానికి మించి రిక్రూట్ చేసుకుని, మార్కెటింగ్ శాఖ వైఫల్యం వలన తగినంత బిజినెస్ రాకపోతే ఆ దండన సాంకేతిక శాఖలకు పడుతోంది. అంతా యాజమాన్యం యిష్టం. పనిచేసేవారికి హక్కులు వుండనే వుండవు.
ఐటీ పరిశ్రమ అంటేనే యింత, యిచ్చినంత కాలం విపరీతంగా జీతం యిస్తారు, తలచుకుంటే తీసిపారేస్తారు. నోరెత్తడానికి లేదు అనుకునే అందరూ భరిస్తున్నారు. పోనుపోను ప్రాజెక్టు మేనేజర్ల ఆగడాలు మితిమీరడంతో బెంగుళూరులోని ఐటీ వుద్యోగులు లేబర్ డిపార్టుమెంటుకి ఫిర్యాదులు చేయసాగారు. రోజుకి సగటున 15 ఫిర్యాదులు వస్తున్నాయి. సెక్సువల్ హెరాస్మెంట్ కేసులైతే ఏడాదికి 700 వస్తున్నాయి. ఈ ఫిర్యాదులు నిజమో కాదో తెలుసుకుందామని లేబరు డిపార్టుమెంటు ఆ యా కంపెనీలను సంప్రదించి సంబంధిత డాక్యుమెంట్లు పంపమంటే వాళ్లు పంపడం లేదు. మాకు మినహాయింపు వుంది అంటున్నారు. ఇలా ఒత్తిడి చేస్తే ఇక్కణ్నుంచి తరలి వెళ్లిపోతాం అని బెదిరించారు. ఒక లాబీగా ఏర్పడి ఐటీ మంత్రి ఎస్ కె పాటిల్‌ని కలిసి ఆ మినహాయింపు మరో ఐదేళ్లు పొడిగించాలని కోరారు. ఆ మంత్రిగారు ''ఐటీ లేకుండా బెంగుళూరును ఊహించలేం. అది 9 లక్షల మంది ప్రత్యక్షంగా, 27 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించింది. ఈ ఏడాది రూ.1.69 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు చేశాం. ఏటా రూ. 4 లక్షల కోట్లు పెరుగుతోంది. ఇలాటి పరిస్థితుల్లో వారిని యిబ్బంది పెట్టకూడదు.'' అని వాదించారు.
''కావాలంటే మీరు ఆ పరిశ్రమకు పన్ను రాయితీలు యిచ్చుకోండి, స్థలాలు యిచ్చుకోండి. కానీ ఉద్యోగులను హింసిస్తూంటే వూరుకోమంటే ఎలా?'' అని కార్మిక మంత్రి వాదించారు. ఈ వ్యవహారం శ్రుతి మించడంతో కర్ణాటక కాబినెట్ జనవరి 25 న సమావేశమై రాజీ కుదిర్చింది. మినహాయింపును ఐదేళ్ల వరకు పొడిగిస్తూనే ఐటీ కంపెనీలకు నాలుగు షరతులు పెట్టింది. సెక్సువల్ హెరాస్మెంట్ ఫిర్యాదుల పరిశీలనకు ఒక కమిటీ, యితర విధాలైన కష్టాల గురించి చేసే ఫిర్యాదుల పరిశీలనకు మరో కమిటీ కంపెనీ ఉద్యోగులతోనే వేయాలి, ఏ ఉద్యోగిమీదైనా డిసిప్లినరీ యాక్షన్ (క్రమశిక్షణ చర్య) తీసుకుంటే లేబరు కమిషనర్‌కు తెలియపరచాలి, ఫిర్యాదులందిన కేసుల్లో లేబరు కమిషనర్ ఆయా ఐటీ కంపెనీల నుండి సమాచారం అడిగితే యివ్వాల్సిందే.
– ఎమ్బీయస్ ప్రసాద్