రాజకీయాల్లోకి వచ్చే సినిమా తారలు సాధారణంగా పదవులు ఆశించే వస్తారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలవాలని, వీలైతే ఏదైనా మంత్రి పదవి సంపాదించాలని అనుకుంటారు. గెలిచిన తారలకు ఒక్కోసారి లక్కీగా పదవులు లభిస్తాయి కూడా. పట్టుదలగా రాజకీయాల్లో కొనసాగే తారలు తక్కువ. రాజకీయాల్లోకి వచ్చేముందు ‘ప్రజాసేవ’ చేయడానికే వస్తున్నామని మాటలు చెప్పినా చేతల్లో దాన్ని చూపించరు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయరు. ప్రజల్లో తిరగరు. వారితో మమేకం కారు. ఎవరో వేళ్ల మీద లెక్కపెట్టగలిగేవారు తప్ప ఎక్కువమంది తారలు రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగలేరు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి, ‘జనసేన’ అనే పార్టీని స్థాపించానని చెప్పి, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ`టీడీపీ కూటమి తరపున ప్రచారం చేసి, ఆ రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి కారకుడయ్యాడని అనుకుంటున్న హీరో పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ నాయకుడో తెలిసే సమయం త్వరలో రాబోతోంది. ప్రస్తుతం సగం హీరోగా, సగం నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న పవన్ అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా మారతాడా? అనేది ఆసక్తి కరంగా మారింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉంటే తాను నిలదీస్తానని, ప్రశ్నిస్తానని బహిరంగంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ పని సమర్థంగా చేయగలడా అనే విషయంలోనూ ప్రజలు ఆసక్తిగానే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జనసేన’ ఇంకా వాస్తవరూపం ధరించలేదు. ప్రస్తుతం దాని ఉనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. దానికో నిర్మాణం, వ్యవస్థ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘జనసేన’కు రంగు, రుచి, వాసనా లేవు. ఇప్పటివరకూ ఏమీ లేకపోయినా ఈ ఏడాదిలోనే జరగబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘జనసేన’ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారతాడా? అనే విషయమై స్పష్టత ఇవ్వాల్సిన అవసరముంది. జనసేన పార్టీని ప్రకటించినప్పుడు, ఆ తరువాత ఎన్నికల ప్రచారంలోనూ పవన్ ఎంతో గొప్పగా, ఆవేశంగా మాట్లాడాడు. ఆయన తీరు చూస్తే ప్రజల తరపున నిరంతరం పోరాడే ఓ యోధుడు కనిపించాడు. కాని..ఆ యోధుడు ఎప్పుడు ప్రజల మధ్యకు వస్తాడో తెలియదు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకునే పెద్ద హీరోలు సినిమాలను అంత త్వరగా వదులుకోలేరు. కెరీర్ ముగిసినవారైతే సినిమా రంగానికి దూరంగా ఉంటారేమోగాని పవన్ వంటి ‘ఇమేజ్’ ఉన్నవారు, కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేయగల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారు ఉన్నట్లుండి సినిమా రంగాన్ని త్యాగం చేయడం కష్టం.
మొన్నటి ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచిన నందమూరి బాలకృష్ణ మంత్రి పదవి ఇస్తానంటే కూడా వద్దన్నారట..! తనకు సినిమాలే ముఖ్యమని, సగం సమయం సినిమాలకు, మరో సగం సమయం రాజకీయాలకు కేటాయిస్తానని చెప్పారు. ఆయన ఇంకో రెండు సినిమాల్లో నటిస్తే వంద సినిమాలవుతాయి. రౌండ్ ఫిగర్ పూర్తి చేస్తే ఓ పనైపోతుందని ఆయన ఆలోచన. దీన్ని బట్టి ఆయన పూర్తిగా ప్రజాసేవకు అంకితం కాలేదని అర్థమవుతోంది. మంత్రి పదవిలో ఉంటే మరింతగా ప్రజలకు మేలు చేయవచ్చనే ఆలోచన బాలయ్యకు కలిగినా సినిమా మోజు దాన్ని డామినేట్ చేసింది. ఇలాంటి మోజుకు పవన్ కళ్యాణ్ కూడా అతీతుడు కాదు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేశాక కొత్త సినిమాలు అంగీకరించకుండా ఉంటే ఆయన రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాడనే అనుకోవాలి. ముందు కమిటైన సినిమాలు పూర్తయితేగాని ఆయన ఆలోచనా విధానం ఏమిటనేది తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తనకు తానై సొంతంగా రాజకీయాల్లోకి వచ్చాడో, ఎవరైనా ప్లాన్డ్గా తెచ్చారో చెప్పలేంగాని ఆయన ఇప్పుడు నరేంద్ర మోడీకి, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైపోయాడు. వారిద్దరూ ఈ హీరోపై పొగడ్తల వర్షం ఇంకా కురిపిస్తూనే ఉన్నారు. పవన్ అడగాలేగాని కొండ మీద కోతిని కూడా తెచ్చిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియదుగాని పవన్ బీజేపీలో చేరిపోతాడని, ఆయనకు ముందుగా రాజ్యసభ సభ్యత్వమిచ్చి, తరువాత మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని వినిపిస్తోంది. దీనిపై పవన్‌తో చర్చలు కూడా జరుగుతున్నాయని వినవస్తోంది. అదే జరిగితే ఆయన్ని మరో ‘చిరంజీవి’లా భావించాల్సి వస్తుంది. అలాకాకుండా ‘జనసేన’ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, సీరియస్‌గా రాజకీయాల్లోకి దిగి, మోడీ, బాబు ప్రభుత్వాలను నిలదీస్తే వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ప్రజల అభిమానం, ఆదరణ పొందడానికి, ఓ నాయకుడిగా ఎదగడానికి అవకాశం కలుగుతంది. మరి ఈ పని పవన్ చేయగలడా? మాటలను చేతలుగా మార్చగలడా?