ఎమ్బీయస్‌ : మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 01

మోదీని ప్రధానిని చేయడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి. ఇవన్నీ రైటిస్టు మేధావులు నిర్వహిస్తున్న సంస్థలే. ప్రపంచం మొత్తం మీద రెండు వాదాలే ప్రధానంగా వున్నాయి. వామపక్షం, దక్షిణపక్షం (ఈ పదం ఎక్కువగా…

మోదీని ప్రధానిని చేయడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి. ఇవన్నీ రైటిస్టు మేధావులు నిర్వహిస్తున్న సంస్థలే. ప్రపంచం మొత్తం మీద రెండు వాదాలే ప్రధానంగా వున్నాయి. వామపక్షం, దక్షిణపక్షం (ఈ పదం ఎక్కువగా వాడరు, రైటిస్టులు అనేస్తారు). ప్రగతి ఫలాలు ప్రజలందరికీ అందేట్లా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదనీ, అందువలన పరిశ్రమల్లో, వ్యాపారాల్లో ప్రభుత్వజోక్యం వుండాలని, వాణిజ్యంపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోతే పెట్టుబడిదారులు గుత్తాధిపత్యం సంపాదించి, ధరలు పెంచి, పేదప్రజలను పీడిస్తారని వామపక్షవాదులు అంటారు. మౌలిక పరిశ్రమలు ప్రభుత్వ అజమాయిషీలో వుండాలని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లాభనష్టాల ప్రమేయం లేకుండా వాటిని నడపాలని వారి వాదన. ప్రభుత్వం వీటిలో కలగచేసుకోనక్కరలేదని, మార్కెట్‌ దారిన మార్కెట్‌ను వదిలేస్తే ధరలు వాటంతట అవే అదుపులోకి వస్తాయని, ప్రభుత్వం అన్నీ తన నెత్తిన వేసుకుంటే అవినీతి, అసమర్థతలకు నిలయాలై ఆ సంస్థలు కుప్పకూలతాయని రైటిస్టులు వాదిస్తారు. వీరినే కాపిటలిస్టులు అని కూడా అంటారు. ప్రయివేటు ఆస్తి అనేది లేకుండా మొత్తమంతా ప్రభుత్వం చేతిలో వుండే వ్యవస్థ కమ్యూనిస్టు వ్యవస్థ. అది యిప్పటిదాకా ప్రపంచంలో ఏర్పడలేదు. దాని దారిలో కొంతవరకు నడిచినది – సోషలిస్టు వ్యవస్థ. రష్యాలో ఏర్పడినది కూడా సోషలిస్టు వ్యవస్థే. ఆంగ్లప్రభుత్వం హయాంలో మనదేశంలో నడిచినవి సామ్రాజ్యవాదం, కాపిటలిజం. 

స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారిలో కొందరు స్వతంత్రభారతానికి కాపిటలిస్టు వ్యవస్థ మంచిదని భావిస్తే, మరి కొందరు సోషలిస్టు వ్యవస్థ మంచిదని భావించారు. కాంగ్రెసు పార్టీ రెండిటి మధ్య వూగిసలాడింది. చివరకు సోషలిజాన్ని సమర్థించింది. కానీ ఆచరణలో కాంగ్రెసు కాపిటలిజాన్నే సమర్థిస్తోందని భావించిన కొందరు కాంగ్రెసు నాయకులు విడిగా వెళ్లిపోయి కాంగ్రెసు సోషలిస్టు పార్టీ పెట్టారు. ఇంకా కొందరు సోషలిస్టు పార్టీ పెట్టారు. కానీ ఆ పార్టీలు చీలిపోయాయి. చివరకు స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వచ్చింది. పటేల్‌కి కాపిటలిజం అంటే యిష్టం. ఆయన మద్దతుదారులందరూ పెట్టుబడిదారులే. నెహ్రూకు సోషలిజం అంటే గౌరవం. ప్రజలు సోషలిస్టు భావాలకు ఆకర్షితులయ్యారు. అంతకంటె తీవ్రమైన భావాలున్న కమ్యూనిస్టులను ఒక స్థాయికి మించి ఆదరించలేదు. అందువలన నెహ్రూ పూర్తి పెట్టుబడిదారీ విధానం, పూర్తి సోషలిజం కాకుండా మధ్యేమార్గంగా మిక్సెడ్‌ ఎకానమీని రూపొందించాడు. ఎక్కువ పెట్టుబడి అవసరమైన భారీ పరిశ్రమల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టేటట్టు పబ్లిక్‌ సెక్టార్‌ను, తక్కువ పెట్టుబడితో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేందుకు ప్రయివేటు సెక్టార్‌ను అనుమతించి, రెండూ పోటీ పడాలన్నాడు. పబ్లిక్‌ సెక్టార్‌ ఉత్పాదనల ధరలను ప్రభుత్వం నియంత్రించేది. ప్రయివేటు సెక్టార్‌పై కూడా కొంతమేరకు అదుపు వుండేది. విదేశాలనుండి దిగుమతులపై ఆంక్షలు విధించి భారతీయ పరిశ్రమలను రక్షిస్తూ వచ్చారు. ఇది కొద్దికాలం పాటు సత్ఫలితాల నిచ్చింది. పబ్లిక్‌ సెక్టార్‌ ఎన్నో అద్భుతాలను సాధించింది. ప్రయివేటు సెక్టార్‌ సొంత కాళ్లపై నిలబడింది.

పోనుపోను ప్రయివేటు సెక్టార్‌ ప్రభుత్వాలను నడిపే రాజకీయనాయకులను లొంగదీసుకుంది. పాలకులు పబ్లిక్‌ సెక్టార్‌ను దిగజార్చి నష్టాలపాలు చేశారు. దానికి తోడు ఉద్యోగులు, యూనియన్లు పబ్లిక్‌ సెక్టార్‌లో బాధ్యతారహితంగా పనిచేసేవారు. ప్రతిభతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు వంటివి వాటిల్లోనే అమలు చేసి ప్రయివేటు సెక్టార్‌తో పోటీ పడమన్నారు. అదే ప్రయివేటు సెక్టార్‌లో అయితే ఉద్యోగం పోతుందనే భయంతో పనిచేసేవారు. కాలక్రమంలో అనేక పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు మూతపడేట్లు చేశారు. ప్రజలకు సోషలిజంపై నమ్మకం సడలసాగింది. ప్రయివేటు సెక్టార్‌ విజృంభించింది. వాళ్లు తమ యూనిట్లలో కార్మికసంక్షేమ చట్టాలు అమలు చేసేవారు కారు. అంతా యాజమాన్యం తలచుకున్నట్లే జరిగేది. తాము ఎన్ని రూల్సు అధిగమించినా ప్రభుత్వం చూసీ చూడనట్లు వూరుకోవాలని వీరి వాదన. కాంగ్రెసు సోషలిజం పేరునే జపిస్తోందని, దానికి ప్రతిగా వీళ్లు కొన్ని రాజకీయపక్షాలకు మద్దతు యిచ్చేవారు. అవి రాజాజీ నాయకత్వంలోని స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్‌. కానీ ప్రజలు వాటిని ఆదరించలేదు. సోషలిస్టు విధానాలైన బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటివి చేపట్టిన ఇందిరా గాంధీనే ఆదరించారు. ఇందిర మరణం తర్వాత రాజీవ్‌ శకం వచ్చింది. అతను తల్లి విధానాలకు పూర్తిగా విరుద్ధంగా లిబరలైజేషన్‌ (సరళీకరణ) చేపట్టి విచ్చలవిడిగా విదేశీ దిగుమతులు అనుమతించాడు. దానితో పబ్లిక్‌ సెక్టార్‌తో బాటు, ప్రయివేటు సెక్టార్‌ కూడా కుదేలైంది. తర్వాత వచ్చిన పివి గ్లోబలైజేషన్‌ అంటూ మరింతగా తలుపులు తెరిచారు. గ్లోబలైజేషన్‌ అంటే ప్రపంచంలో అన్ని దేశాల మధ్య స్వేచ్ఛగా వస్తువులు రవాణా అవుతుందని, మన భారతీయ వస్తువులు విదేశీ మార్కెట్లో అమ్ముడుపోయి మనం ఎదిగిపోతామని అనుకున్నారు. అంతేకాదు, విదేశీ సంస్థలు మనదేశంలో భారీ పెట్టుబడులు పెట్టి మన యిన్‌ఫ్రాస్ట్రక్టర్‌ పెంచుతాయని, భారీ పరిశ్రమలు పెడతాయని ఆశించారు.

అయితే గ్లోబలైజేషన్‌ అంతా హంబగ్‌ అని తేలింది.  ఆంక్షలు లేవని చెప్పిన అగ్రదేశాలు వాటిని పాక్షికంగా అమలు చేశారు. అమెరికా, యూరోప్‌ వాళ్ల వస్తువులు మనకు అమ్ముతున్నాయి కానీ మన వస్తువులన్నీ వాళ్ల దగ్గర అమ్మనీయటం లేదు. ఇండియన్‌ మార్కెట్‌ అంతా విదేశీ వస్తువులతో నిండిపోయింది. స్వదేశీ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. బ్యాలన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌లో మనం విపరీతంగా నష్టపోతున్నాం. విదేశీ కంపెనీలు మనకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ చేయలేదు. మౌలిక పరిశ్రమల్లో పెట్టుబడులు చాలా తక్కువ పెట్టారు. కన్స్యూమర్‌ గూడ్స్‌ మార్కెట్లోనే పెట్టుబడులు పెట్టి, మనను ఒక పెద్ద మార్కెట్‌గా మాత్రమే చూస్తున్నారు. షేర్‌మార్కెట్‌లో ఒక్కసారిగా పెట్టుబడులు పెట్టి, రేటు పెంచేసి, మళ్లీ ఒక్కసారిగా విత్‌డ్రా చేసేసి, రేటు పడగొట్టి, మధ్యతరగతి ప్రజల సేవింగ్స్‌తో ఆటలాడుకుంటున్నారు. గ్లోబలైజేషన్‌ వలన జరిగిన ఏకైక మేలు – సేవారంగంలో భారతీయులకు అవకాశాలు రావడం! అవి ఎంతకాలం వుంటాయో ఎవరికీ తెలియదు. మనకంటె తక్కువ జీతానికి కొరియన్లు, చైనీయులు రంగంలోకి దిగినపుడు మనకి కూడా ఉద్వాసనలు తప్పవు. యుపిఏ ప్రభుత్వం పూర్తిగా రైటిస్టు విధానాలనే అవలంబించి ఔషధరంగంతో సహా అనేక కీలకరంగాలలో 100% ఎఫ్‌డిఐ (ఫారిన్‌ డైరక్ట్‌ యిన్వెస్ట్‌మెంట్‌) అనుమతించింది. దాంతో విదేశీ కంపెనీలు భారతీయ కంపెనీలను కొనేసి, మందుల రేట్లు పెంచేశాయి. మన కంపెనీలు వారి దేశాలలో వారితో పోటీకి దిగకుండా చూసుకున్నాయి.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]