ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 8

ఓ స్త్రీ ఒక యువరాజుతో ఛాలెంజ్‌ చేసి యుక్తితో లక్ష్యం సాధించిన సినిమా – 'స్త్రీ సాహసం!' నాగేశ్వరరావు యువరాజు. పెళ్లి చేసుకోవాలంటే మూడు షరతులు పెట్టాడు. తనను పెళ్లాడగోరే స్త్రీ మూడు అసాధ్యమైన…

ఓ స్త్రీ ఒక యువరాజుతో ఛాలెంజ్‌ చేసి యుక్తితో లక్ష్యం సాధించిన సినిమా – 'స్త్రీ సాహసం!' నాగేశ్వరరావు యువరాజు. పెళ్లి చేసుకోవాలంటే మూడు షరతులు పెట్టాడు. తనను పెళ్లాడగోరే స్త్రీ మూడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయాలి. పుట్టింటి సొమ్ము, అత్తింటి సొమ్ము ఖర్చు పెట్టకుండా ఓ మహల్‌ కట్టించాలి, భర్తకు తెలియకుండా పిల్లవాణ్ని కనాలి.. ఏవో యిలాటివి. స్వయంవరానికి వచ్చిన ఆడాళ్లందరూ వెనక్కి వెళ్లిపోయినా అంజలి మాత్రం మిగులుతుంది. చేసి చూపిస్తానని చెప్పి పందెం ఒప్పుకుంటుంది. పక్కరాజ్యంలో రాజుగారిని మెప్పించి ఆయన ఖర్చుతో మహల్‌ కట్టిస్తుంది. మారు వేషంలో వచ్చి ఈ యువరాజుని మెప్పించి గర్భవతి అవుతుంది. చివరకు యువరాజు ఆమె సాహసానికి, యుక్తికి మెచ్చి ఆమెను పదిమంది ఎదుటా పెళ్లాడతాడు. ఈ సినిమాలో ముఖ్యపాత్ర అంజలిది. యువరాజు పాత్ర నాగేశ్వరరావు వేశారు. దర్శకత్వం వేదాంతం రాఘవయ్య. దరిమిలా దేవదాసు, కన్యాశుల్కం, చిరంజీవులు మొదలైన గొప్ప సినిమాలు తీసిన వినోదావారి తొలిచిత్రం యిది. ఈ సినిమా స్త్రీ ప్రేక్షకులనే కాదు, పురుష ప్రేక్షకులను కూడా మెప్పించింది. లాభాలు ఆర్జించింది. ఆర్జించింది కాబట్టే వినోదా సంస్థ నిలబడింది. మరిన్ని మంచి సినిమాలు తీసింది. 

ఇలా ఓ మహిళ పంతం పట్టి సాధించిన సినిమా గురించి కాస్త వివరంగా చెప్పుకుంటే యుక్తి ప్రధానమైన జానపద చిత్రాల మచ్చు ఎలా వుంటుందో తెలిసిపోతుంది. ఆ సినిమా 'మంగమ్మ శపథం'. పేరు బట్టే తెలుస్తోంది కదా మంగమ్మ అనే ఆమె పట్టిన శపథం కథ అని. మూలకథ జనపదంలో వున్నట్టు వుంది. జెమినీ స్టోరీ డిపార్టుమెంటువాళ్లు దీన్ని మరింత అందంగా చెక్కి 1942లో తమిళంలో తీశారు. టి.జి. రాఘవాచారి డైరక్షన్‌. హీరోయిన్‌ – వసుంధరా దేవి, వైజయంతి మాల తల్లి! ద్విపాత్రాభినయం చేసిన హీరో రంజన్‌.  'చంద్రలేఖ', 'కొండవీటి దొంగ' వంటి సినిమాల్లో వేసిన స్టంట్‌ హీరో.  సినిమా హిట్టయింది. 1951లో మళ్లీ దీన్నే 'మంగళ' పేరుతో తెలుగు, తమిళం, హిందీల్లో తీశారు.  మూడు వెర్షన్లలోనూ హీరో రంజన్‌. హీరోయిన్‌ భానుమతి. హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వాసన్‌. తెలుగులో చంద్రు. ఈ సినిమా కూడా హిట్‌.  ఎన్‌ఏటి సంస్థలో భాగస్వామిగా తోడుదొంగలు, జయసింహ, పాండురంగ మహాత్మ్యం, గులేబకావళి కథ, యితరులతో కలిసి బాలనాగమ్మ, మా బాబు – సినిమాలు తీశాక డివియస్‌ రాజు సొంతంగా తన పేర డివియస్‌ ప్రొడక్షన్స్‌ 1964లో స్థాపించి తీసిన మొదటి సినిమాగా దీన్ని పునర్నిర్మాద్దామనుకున్నారు. 

అప్పటికే రామారావుగారు ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం రాముడు-భీముడు విడుదలై పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వేస్తే అదే ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద సినిమా అవుతుంది. పైగా 'రాముడు-భీముడు'లో ఇద్దరిదీ ఒకే వయసు. ఈ సినిమాలో ఒకడు తండ్రి, మరొకడు కొడుకు. ఒకడు జల్సా పురుషుడు, కాస్త విలన్‌ టైప్‌. రెండోవాడు బుద్ధిమంతుడు. హీరో లక్షణాలు వున్నవాడు. అందుకే దీనిలో నటించడానికి రామారావుగారికి ఎక్కువ స్కోప్‌ వుంటుంది అనుకున్నారు రాజు. జానపదాలకు మారుపేరుగా నిలిచిన విఠలాచార్యగారిని దర్శకుడిగా పెట్టుకున్నారు. జనరంజకంగా సినిమా ఎలా తీయాలో, అందునా తక్కువ ఖర్చులో క్రమశిక్షణతో ఎలా తీయాలో తెలుసుకోవాలంటే విఠలాచార్య గారిని స్టడీ చేయాలి. విఠలాచార్య-రామారావు కాంబినేషన్‌లో 1963లో 'బందిపోటు' వచ్చి దుమ్ము దులిపేసింది. ఇలాటి ప్రూవెన్‌ సక్సెస్‌ కథ దొరికితే సినిమా షూర్‌-ఫైర్‌ హిట్టే! అందుకే రాజుగారు ఈ కథ ఎంచుకున్నారు.

పొగరుబోతు, అందగాడు, విలాసపురుషుడైన ఓ రాజు చూపు మంగమ్మ అనే మంచి వయసు మీదున్న పల్లెటూరి అమ్మాయిమీద పడింది. రాజు తనపై చెయ్యి వేస్తే ఆమె విదిలించి కొట్టింది. ఎవరైనా కోడెగాడిని పెళ్లాడి హాయిగా పిల్లా, పాపలతో ఓ శ్రామిక గృహిణిగా కాలం గడుపుదామనుకునే  ఆ రైతు కూతురు దృష్టిలో రాజు ఉంపుడుగత్తెగా పొందే రాజభోగాలు తుచ్ఛం. అందుకే రాజుగారిని నెట్టేసింది. అతనికి అప్పటిదాకా యిలా ఎదురుతిరిగిన అమ్మాయి తారసిల్లలేదు. దీనికింత పొగరా అనుకుని పటాటోపం చూపిస్తూ దూకుడుగా వెళ్లాడు. ఆమె బోల్తా కొట్టించి, వెక్కిరించింది. రాజు అవమానకరంగా ఫీలయ్యాడు. ఆమె పట్ల వాంఛ స్థానంలో కసి పుట్టుకొచ్చింది. పగ బట్టాడు. 'నాకు దక్కలేదు కదూ, నిన్ను ఎవరికీ దక్కకుండా చేస్తాను. నిన్నే పెళ్లాడి, యావజ్జీవ పర్యంతం కన్నెగా కారాగారంలో వుంచి నీ యవ్వనం, అందం అడవిని గాచిన వెన్నెల చేస్తాను.' అనేశాడు. 

ఆర్థికపరంగా తక్కువే అయినా కానీ పౌరుషంలో తీసిపోని ఆమె ఆవేశంగా, అనాలోచితంగా, సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా సవాల్‌ విసిరింది – 'అదే జరిగితే మీకు తెలియకుండా మీ వల్లనే ఓ కొడుకుని కని, వాడిచేత మీకు కొరడా దెబ్బలు కొట్టిస్తాను. అప్పుడుగాని ఆడదాని శీలం విలువ మీకు తెలిసిరాదు' అని మంగమ్మ శపథం చేసింది. రాజుగా రామారావు, మంగమ్మగా జమున సై అంటే సై అనుకున్నారు. కోటకొచ్చినా రాజు తన పంతం మర్చిపోలేదు. పోన్లే అని వదిలిపెట్టలేదు. ఈ పాత్రలో రామారావు విలనిక్‌గానే నటించారు. ఎటొచ్చీ రామారావు వేసిన ఇంకో పాత్ర పాజిటివ్‌గా, హీరోయిక్‌ గా వుంటుంది కాబట్టి ఆయన ఇమేజికి భంగం కలగలేదు. 

రాజు తన మంత్రిని మంగమ్మ తండ్రి వద్దకు దూతగా కానుకలిచ్చి పంపాడు. వివాహానికి ఒప్పుకోకపోతే తల ఎగురుతుందన్నాడు. తండ్రి తటపటాయిస్తూంటే మంగమ్మ నేను పెళ్లికి రెడీ అంది. నా కారణంగా నువ్వు బాధపడడం ఎందుంది. తొలిరేయి జమున అనునయంగా చెప్పింది – 'ఏదో అభిమానానికి పోయి మీరూ నేనూ ఏవేవో అనుకున్నాం. అవన్నీ మర్చిపోదాం. దంపతులుగా అన్యోన్యంగా బతుకుదాం' అంది. కానీ రాజు కాంప్రమైజింగ్‌ మూడ్‌లో లేడు. 'నిన్ను కన్యగానే ఉంచడానికి ఓ బంగారు పంజరం రెడీగా వుంది. అక్కడే పడి వుండు' అని వెళ్లిపోయాడు. ఇక అప్పణ్నుంచి ఆమెకు చెలికత్తె చంచల ఒక్కత్తే తోడు. తన కుటుంబసభ్యులను కలుసుకోవచ్చు కానీ బయటకు వెళ్లడానికి వీలులేదు. ప్రాక్టికల్‌గా ఖైదే నన్నమాట! ఇలాటి పరిస్థితిలో మంగమ్మలో తన శపథం నెరవేర్చుకోవాలన్న కోరిక మళ్లీ బలంగా కలిగింది. దానికి ఉద్యమించింది.

తనను చూడడానికి వచ్చిన తండ్రికి ఓ ఐడియా చెప్పింది. సొరంగం వుంటే తను ఎవరికీ తెలియకుండా వస్తూ పోతూ వుండడానికి తమ యింటినుంచి ఈ కోటకు ఓ సొరంగం తవ్వించమంది. పెళ్లికి రాజు యిచ్చిన డబ్బుతో సొరంగం తవ్వించాడు తండ్రి. ఇక జమున చెలికత్తెను మంచి చేసుకుని అప్పుడప్పుడు యింటికి పోయి, తన వాళ్లమధ్య గడిపి వస్తూండవచ్చు. ఇంతవరకు బాగానే వుంది. రాజుగారి వల్ల పిల్లవాణ్ని కంటానని ప్రతిజ్ఞ చేసిందే! అది తీరడం ఎలా? రాజుగారికి తెలియకుండా అతనికి చేరువ కావడానికి మారువేషంలో వెళ్లాలి. అతన్ని మెప్పించి, శయ్యాగారానికి పిలిపించుకోవాలి. రాజుగారికి చేరువ కావాలంటే పొరుగు దేశపు రాణిగారిలా వేషం వేయాలంటే కుదిరే పని కాదు. పాత కథల్లో కూడా చూడండి. రాజుగారు ఈజీ యాక్సెస్‌ వుండేది ఎప్పుడూ నర్తకీమణులకే! అర్జంటుగా భరతనాట్యం నేర్చుకున్నా లాభం లేదు. మొహం గుర్తు తెలిసిపోతుంది. వాళ్లు మామూలు మొహంతోనే, మామూలు భాషతోనే వుంటారు కదా. అందువల్ల జిప్సీలా వేషం కడితే మొహాన్ని కెమోఫ్లోజ్‌ చేయవచ్చు. కట్టూ, జుట్టూ, భాషా అంతా మార్చేయవచ్చు. పల్లెటూరి పిల్లగా తనను చూసిన రాజాగారు జిప్సీగా ఊహించలేడు, ఛస్తే గుర్తు పట్టలేడు. పైగా ఎంత వాడికైనా విదేశీ మోజు వుంటుందిగా. మామూలు స్త్రీలను అనేకమందిని అనుభవించిన రాజుకి ఇదో కొత్తరకం స్త్రీ అనగానే హుషారు లుగుతుంది కదా! (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]

Click Here For Archives