ఓ రాజుగారు, రాణీగారు రాజోద్యానవనంలో కూచుని దీపనృత్యం తిలకిస్తున్నారు. చుట్టూ ఆయన పరివారం వుంది. మహామంత్రి ఆయనంటే విశ్వాసం గలవాడే! సేనాపతి ప్రచండుడు మాత్రం ఆయనపై కుట్ర పన్నుతున్నాడు. అతను మహారాజుగారికి స్వయానా తమ్ముడు. భార్య పోయింది. ఒక్కడే కొడుకు భజరంగుడని. మహారాజు కుటుంబాన్ని మట్టుపెట్టి, తన కొడుకు తలమీద కిరీటం పెట్టాలని అతని దూరాలోచన, దురాలోచన. సేనాపతి హోదాలో అంతపురమంతా తనకు నమ్మకమైనవారితో నింపేశాడు. తన అనుచరుణ్ని ఒకణ్ని నియోగించి డాన్సు చూస్తున్న రాజుగారిపైకి కత్తి విసిరేయించాడు. ఛాతీలో కత్తి గుచ్చుకుని రాజుగారు కడదేరిపోయారు. ఆయన తలమీద కిరీటం మెట్లమీదుగా దొర్లి కింద పడింది.
దానిమీదనే 'రాజమకుటం' అనే సినిమా టైటిల్ పడుతుంది. ఆ కిరీటం కోసమే ఈ హత్యలూ, దుర్మార్గాలూ అని చెబుతుంది సినిమా. ఈ సినిమాలో ప్రచండుడిగా గుమ్మడి నటన అపూర్వం. ఆయన్ను శాంతమూర్తిగానే గుర్తుపెట్టుకునేవాళ్లు ఆయన నటనలో ఎంత వైవిధ్యం వుందో తెలియాలంటే యిది చూసి తీరాలి. ''ఇద్దరుమిత్రులు'' వంటి సినిమాలో పయోముఖ విషకుంభం వంటి పాత్రలు వేశారు. దీనిలో కూడా రాణిగారి వద్ద నక్కవినయం చూపిస్తూనే విడిగా పక్కా విలన్‌గా వేశారు. హీరోతో కత్తియుద్ధాలు ఏ లోటూ లేకుండా చేశారు. ఇక రాణిగా వేసినది కన్నాంబగారు. ఆవిడ వాయిస్ ఖంగుమని మోగుతుంది. అన్ని రసాలూ పలుకుతాయి. విగ్రహంలో కానీ, వాచికంలో గానీ ఆ తరహా పాత్రలకు ఆవిడతో పోటీపడ్డవారు లేరు, ఇది ముమ్మాటికీ నిజం. రాజుమీద కుట్ర జరిగిందన్న నెపంతో ప్రచండుడు సిబ్బందిలో పాతరాజుగారి నమ్మకస్తులందరినీ బంధించాడు. యువరాజు రాగానే వాళ్లను శిక్షిద్దామని మహారాణితో అన్నాడు. కానీ మహామంత్రి అడ్డుకున్నాడు. అతనికి ప్రచండుడి మీదనే అనుమానం. కానీ రాచకుటుంబీకుడు కాబట్టి రాణిగారితో గట్టిగా చెప్పలేడు. అందువల్ల 'విచక్షణ చూపించాలి' అని వూరుకున్నాడు. అక్కడికే ప్రచండుడికి అనుమానం వచ్చింది. యువరాజు వచ్చాక వీడేమైనా చెవిలో ఊదుతాడా అని. రాత్రికి రాత్రే అతన్ని చంపించేశాడు.
రాజుగారు పోయిన వార్త గురుకులంలో వున్న యువరాజుకి చేరింది. యువరాజు ఎన్టీ రామారావు. పేరు ప్రతాపసింహుడు. తండ్రి హత్యకు కుమిలిపోతున్నాడు. కానీ అది సహజమరణమైతే అదో దారి. యుద్ధంలోనైనా ఫర్వాలేదు. కానీ రాజుగారి అంత:పురంలోనే ఆయనను హత్య చేసేరంటే కుట్రదారులు గట్టివారని తెలుస్తోంది. గురువుగారు హితవచనాలు చెప్పి పంపించారు. రాజధానికి బయలుదేరి వెళుతూ రాత్రి ఓ ప్రదేశంలో విశ్రమించాడు. సేనాపతి అక్కడకు తన మనుష్యులను పంపాడు. వాళ్లు కాపలావాళ్లను చంపేసి యువరాజుపై హత్యాయత్నం చేశారు. కానీ అతను మెలకువగా వుండడంతో ప్రమాదం తప్పించుకున్నాడు. దెబ్బలు బాగా తగిలాయి. రోడ్డుపక్కన పడిపోయాడు. ఆ దారిన ఓ అమ్మాయి వస్తోంది. పేరు ప్రమీల. రాజసులోచన వేశారా పాత్ర. ఆమె ఓ గ్రామీణ యువతి. అన్నగారు రాజధానిలో వున్నాడు. రాజుగారంటే భక్తి విశ్వాసాలు కలవాడు. అతన్ని చూడడానికి తమ పల్లెనుండి ఎడ్లబండిలో బయలుదేరింది.పెళ్లికాని యువతి కాబట్టి 'ఏడ నున్నాడో ఎక్కడున్నాడో' అంటూ తన ఊహాసుందరుడి గురించి పాడుకుంటూ వెళ్తోంది. దారిలో ప్రతాపుడు పడివుండగా చూసింది. అతను గురుకులం నుండి వస్తున్నాడు కాబట్టి రాజలాంఛనాలు లేవు. పరివారం లేదు. పైగా రాత్రి పడుక్కునే బట్టల్లో వున్నాడు కాబట్టి సామాన్యుడిలాగానే వున్నాడు. అతనికి కట్టుకట్టి సేద తీర్చింది. నువ్వెవరివంటే 'పరదేశిని' అన్నాడు. 'అయితే రాజధానిలో మా అన్న యింటికి రా, తీసుకెళతాను' అంది. 'ఇప్పుడు పనిలో వున్నాను. రాజధానికి చేర్చు చాలు' అన్నాడు. ఆమె బండిలో రాజధానికి చేరి, విడిగా కోటకు చేరాడు.
అతన్ని చూడగానే మహారాణి ఊరడిల్లింది. సేనాపతి జాలి కురిపించాడు. ఇంతలోనే ఓ భటుడు వచ్చి మహామంత్రిని ఎవరో చంపారని, అతని ఛాతీలో ఈ కత్తి దొరికిందని చూపించాడు. ప్రతాపుడు తన మీద హత్యాప్రయత్నంలో వాడిన కత్తిని, దీన్ని పక్కన పక్కన పెట్టి పరీక్షించాడు. రెండింటిపై పడగెత్తిన పాము చిహ్నం వుంది. పాము గుర్తు గల విద్రోహుల ముఠాయే యిదంతా చేస్తోందన్నమాట అనుకున్నాడు. ఇంతలో ప్రచండుడు 'నాయనా, రాజద్రోహులందరినీ బంధించి వుంచాను. నువ్వు వచ్చి విచారణ చేసి శిక్ష విధించు' అన్నాడు. ఇక్కడ యువరాజు ప్రతాపుడు పెద్ద తప్పు చేశాడు. తండ్రి, మహామంత్రి పోయారన్న ఆక్రోశం, తనపై కూడా హత్యాయత్నం చేశారన్న ఉక్రోషం – వీటితో యుక్తాయుక్త విచక్షణ మరచి, రాజధర్మం విస్మరించి, 'విచారణ లేదు, ఏమీ లేదు, రాజద్రోహానికి దండన మరణశిక్షే! అందర్నీ చంపిపారేయండి' అన్నాడు.
అమ్మయ్య అనుకున్నాడు ప్రచండుడు. రాజుగారి విధేయులందరినీ ఒక్క దెబ్బతో చంపించేశాడు. ఆ పాపం యువరాజు నెత్తిన పడేట్లా చేశాడు. సింహాసనం ఎక్కకుండానే యువరాజు ప్రజల్లో అన్‌పాప్యులర్ అయిపోయాడు. ఇకపై ఏ దౌర్జన్యం చేసినా అన్నీ అతని పేరనే చేయవచ్చు. అతన్ని చంపి పారేసినా ప్రజలు సంతోషిస్తారు కానీ అయ్యోపాపం అనరు. ఇదీ అతని మాస్టర్ ప్లాన్. దీనిలో యువరాజు అనుకోకుండా చిక్కుకున్నాడు. అతను ప్రజల దగ్గరికి వెళితే నిజానిజాలు, మంచి చెడ్డలూ తెలిసేవేమో! కానీ ఆంతరంగిక భద్రత పేరుతో అతన్ని కోట కదలనీయకుండా చేశాడు ప్రచండుడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)