5. 'మాకు విద్యుత్ రాకుండా ఆంధ్ర అడ్డుపడుతోంది' – యీ మాటలకు ఆధారమేమిటో చూపాలి. ఒకవేళ నిజంగా అడ్డుపడుతూ వుంటే అలా ఎందుకు జరుగుతోందో, దాన్ని నివారించడానికి మార్గాలేమిటో అన్వేషించాలి, అమలు చేయాలి. నచ్చినా నచ్చకపోయినా అది పొరుగు రాష్ట్రం, యిచ్చిపుచ్చుకోవడాలు తప్పవు. 'చంద్రబాబు గొప్పేముంది, కర్ణాటక సిఎంలా, మహారాష్ట్ర సిఎంలా ఆయనా ఓ పొరుగు రాష్ట్రం సిఎం, అంతేకంటె మరేం కాడు' అని కెసియార్ తేలిగ్గా మాట్లాడారు. ఆయన విస్మరిస్తున్నదేమిటంటే కర్ణాటక, మహారాష్ట్రలతో మనకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని కాపురం లేదు. ఆంధ్రులతో వుంది. తెల్లవారి లేస్తే ఆంధ్రుల్ని ఆడిపోసుకుంటూ వుంటే, వాళ్లను ఎలా అణచాలా, ఎలా తరిమివేయాలా అని చూస్తూ వుంటే పనులెలా సాగుతాయి? ఫాస్ట్ పథకం పేర తెలంగాణేతరులపై వివక్షత చూపిస్తున్నారు. సమగ్రసర్వే లక్ష్యం కూడా ఆంధ్రులను హడలగొట్టడానికే అనే నమ్మకం ప్రజల్లో కలిగేట్లా ప్రవర్తించారు.
వాహనాల రిజిస్ట్రేషన్‌కై యింత పట్టుదల ఎందుకు చెప్పండి. కోర్టులు యిది పద్ధతి కాదని చెపుతున్నా యింకా యింకా లాగదీస్తున్నారు. నెంబర్ల మార్పు వలన అయ్యే ఖర్చు, శ్రమ ఎవరికి శిక్ష ? తెలంగాణ పౌరులకే కదా! వాహనాన్ని తీసుకుని ఆంధ్ర వెళ్లిపోయినవాడికి ఏ బాధా, లేదు. చేయాల్సిన పనులు బోల్డు వుండగా యీ నాన్-యిస్యూపై యింత రగడ ఎందుకు? తెలంగాణలో తిరిగే ఏ వాహనంపైన 'ఎపి' అని కనబడకూడదన్న పంతమా? ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయాక చాలా ఏళ్ల పాటు ఆంధ్రలో మద్రాసు రాష్ట్రపు రిజిస్ట్రేషన్ వాహనాలు కనబడ్డాయి. బొంబాయినుండి గుజరాత్ విడిపోయాక కూడా అంతే..! అదో పెద్ద అపచారం ఏమీ కాదు. కొత్తగా రిజిస్టర్ చేసేవి టిఎస్‌తో చేస్తారు. కొన్నేళ్లు పోయాక ఎపి కనుమరుగవుతుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. రీ రిజిస్ట్రేషన్ చట్టవిరుద్ధం అని కోర్టు చెపితే 'అయితే నెంబరు మార్చనక్కరలేదు కానీ, ఎపి తీసి టియస్ పెడితే చాలు' అంటూ మళ్లీ కోర్టు గుమ్మం ఎక్కుతోంది తెలంగాణ ప్రభుత్వం. అంటే పెయింటింగ్‌కైనా మనకు తైలం వదలాలన్నమాట!
ఆంధ్రద్వేషం వలన తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేదేముంది? ఉన్న గొడవలు చాలనట్లు విగ్రహాల గురించి మొదలుపెట్టారు. కొత్త విగ్రహాలు పెడదామనుకుంటే హుస్సేన్‌సాగర్‌కు నాలుగు వైపులా చాలా స్థలముంది. వాటిని వినియోగంలోకి తెచ్చి ఎన్టీయార్ మార్గ్‌తో మొదలుపెట్టి వరుసగా విగ్రహాలు వేసుకుంటూ పోవచ్చు. అబ్బే కాదు, ఆంధ్ర విగ్రహాలను పార్శిల్ చేసి పంపేస్తాను అంటే అదేమైనా పద్ధతా? అక్కడ విగ్రహరూపంలో వున్నవారందరూ తెలుగు భాషకు, సంస్కృతికి సేవ చేసినవారే! ఇప్పుడు వారి మూలాలు వెతికి అక్కడకు తరలించేస్తాను అంటే త్యాగరాజును తమిళనాడు పంపాలా? కృష్ణదేవరాయల్ని, బళ్లారి రాఘవని కర్ణాటకకు పంపాలా? ఆరో నిజాం విగ్రహాన్ని అరేబియాకు పంపుతారా? అదే లెక్కన కాళోజీ విగ్రహం ఎక్కడున్నా తీసేసి మహారాష్ట్ర పంపుతారా? గుజరాత్ విడిపోయిన తర్వాత బరోడా మహారాజు విగ్రహాలను, మ్యూజియాన్ని మహారాష్ట్రకు తరలించలేదు. దేశంలో గాంధీ విగ్రహాలన్నిటినీ ఆయా రాష్ట్రాలు గుజరాత్‌కు పంపడం మొదలెడితే అక్కడ జనం వుండేటందుకు చోటు చాలదు.
అసలు విగ్రహాల విషయంలో యీయన పాలసీ ఏమిటో నాకు అర్థం కాదు. సెప్టెంబరు 17 న ఏడో నిజాంను కీర్తించారు, మూడు వారాలు తిరక్కుండా నిజాంను ఎదిరించి బలైన కొమురం భీమ్‌ను కీర్తించారు. టాంక్ బండ్ మీద వీళ్లిద్దరి విగ్రహాలు పెడితే పక్కపక్కన పెడతారా? లేక ఒకరినొకరు కోరగా చూసుకుంటే ఎదురుబొదురుగానా..? ఈయన అలా అనగానే బాబు ఆంధ్రలో తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెడతాం అన్నారు, ఆ తర్వాత అమరవీరులు కాదు, త్యాగధనుల.. అన్నారు. అమరవీరులు అనే పదానికి యీ మధ్య కాలంలో అర్థం మారింది కాబట్టి గందరగోళపడ్డాను. తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెడతారని అనుకుందాం. మంచిదే. ఈ విగ్రహాలు రోడ్డు కూడలిలో కాకుండా ఏవైౖనా పార్కుల్లో పెడితే వాళ్ల పేర్లు చదవడానికైనా వీలుపడుతుంది. ఇక్కడ 'పనికిమాలిన'వని కెసియార్ ఫీలైన విగ్రహాలు కూడా హుస్సేన్‌సాగర్‌లో తోసేయకుండా వేరే ఏదో పార్కుకి తరలిస్తే పెద్ద సమస్యగా పరిణమించదు. కానీ యీయనకు కావలసినదే సమస్య! వారానికి ఇలాటి సమస్య ఓటి సృష్టించనిదే ఆయనకు నిద్ర పట్టదు.
రాజకీయంగా కూడా టిడిపితో ఆయన పేచీ పెట్టుకుంటున్నాడు. సొంత పార్టీ ఎమ్మేల్యేలకు ఎపాయింట్‌మెంట్ యివ్వడానికి టైముండదు కానీ పరపక్షం నుండి అయితే మాత్రం 'మీ నియోజకవర్గంలో ఆ పని చేస్తా, యీ పని చేస్తా' అంటూ చెప్పి పార్టీ తీర్థం యిస్తున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఏ మేరకు పనులయ్యాయో చూసుకోకుండానే పాపం యీ ప్రతిపక్ష ప్రజాప్రతినిథులు 'తమ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం' కారు ఎక్కేస్తున్నారు. ఏ పని చేయాలన్నా నిధులు లేవని, ప్రణాళికలే తప్ప పాలన యింకా ప్రారంభమే కాలేదని ప్రభుత్వమే చెప్తోంది. అలాటప్పుడు తమ నియోజకవర్గంలో పనులై పోతాయని వీళ్లెలా నమ్ముతున్నారో! ఏమైనా, ఆంధ్రలో టిడిపి చేస్తున్న పనే తెలంగాణలో తెరాస చేస్తోంది. దొందూ దొందే. రాజకీయంగా చూస్తే యీ విధానాన్ని తప్పుపట్టలేం, కానీ అది పరోక్షంగా యిరు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బతీస్తోందన్నది వాస్తవం. విద్యుత్ కోసం ఆంధ్రపై ఆధారపడుతూనే అక్కడి అధికారపక్షానికి చికాకులు కలిగిస్తూండడం, నిరంతరం వాళ్లను తిడుతూ వుండడం, వాళ్ల ఆఫీసులకు కరంటు బంద్ చేస్తామని బెదిరించడం చూస్తే 'నీ పెళ్లి నా మొహంలా వుంది. నా పెళ్లికి వచ్చి కాగడా పట్టు' అనే సామెత గుర్తుకు వస్తోంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఎగుమతులు చేసుకునేందుకు వీలుగా పోర్టుకోసం ఆంధ్రతో ఒప్పందం చేసుకుందట. తెలంగాణకూ ఆ అవసరం పడుతుందని గ్రహించాలి. ప్రజలకు తక్షణావసరం విద్యుత్. బిజెపి ప్రభుత్వం ఢిల్లీని పాలిస్తున్న చివరి రోజుల్లో 1997లో వెళ్లాను. ఊరి పరిస్థితి ఘోరం. కరంటు పరిస్థితి చెప్పనలవి కాదు. నానా అవస్థలూ పడ్డాం. పిల్లల్ని డాల్స్ మ్యూజియంకు తీసుకెళితే కరంటు ఎప్పుడొస్తుందో తెలీదంటూ మెట్లమీద కూర్చోబెట్టారు. నాలుగు గంటలు వేచి చూసి వచ్చేశాం. అప్పుడే అనిపించింది – బిజెపి అంటే ఢిల్లీ వాసులకు ఎంత ప్రేమున్నా మళ్లీ ఎన్నుకోరురా అని. అదే జరిగింది. బిజెపిని దింపేసి 15 ఏళ్లపాటు కాంగ్రెసుకు పట్టం కట్టారు. ఆ తర్వాత కూడా బిజెపికి ఫుల్ పవర్ యివ్వలేదు. ఆప్‌ను ఆదరించారు. హైదరాబాదుకి దుర్గతి పట్టిందంటే తెరాసకు నష్టం తప్పదు. ప్రజలకు కావలసినది సుఖసంతోషాలు, శాంతిభద్రతలు. 'సమైక్యపాలకుల విలనీ గురించి, బాబు దుర్మార్గం గురించి మాకు తెలుసుకోవలసిన అవసరం లేదు, నువ్వేం చేస్తావో చేసి చూపించు. డబ్బులుంటే విరజిమ్మి విద్యుత్ వేరే చోట నుండి కొనుక్కు రావాలి, లేవు కాబట్టి పరిస్థితి మెరుగు పడేదాకానైనా లౌక్యంగా ఆంధ్ర ప్రభుత్వంతో, ఆంధ్రులతో, కేంద్రంతో సఖ్యతతో మెలగి విద్యుత్ సంక్షోభం అధిగమించాలి. చీకట్లోంచి బయటకు రావడానికి మూడేళ్ల దాకా ఆగమంటే అంత ఓపిక లేదు' అని ప్రజలు ఫీలవుతున్నారు. ఆ భావాలే ప్రతిపక్ష నాయకులు చెప్పబోతే కెసియార్ వారిని కుక్కల్లా మొరుగుతున్నారంటున్నారు. ఇలా ఇంటా బయటా అందరితో కలహిస్తే ఎలా? కలహం నుంచి విద్యుత్ పుడుతుందా స్వామీ?
– (సమాప్తం) ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)