ఎమ్బీయస్‌: కన్నయ్యను హీరో చేసేస్తున్నారు – 5/5

ఇంతకీ కేసులు నిలుస్తాయా? కన్నయ్యే ఆ నాటి ప్రదర్శనను నిర్వహించాడన్న ప్రాసిక్యూషన్‌ వాదన వీగిపోయింది. అతను నినాదాలిచ్చాడనడానికి పోలీసులు సాక్ష్యాలేమీ చూపించలేకపోయారు. అప్పుడు 'ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారతప్రభుత్వంపై ద్వేషాన్ని రగిలించడానికి కన్నయ్య ప్రయత్నించాడని, అది…

ఇంతకీ కేసులు నిలుస్తాయా? కన్నయ్యే ఆ నాటి ప్రదర్శనను నిర్వహించాడన్న ప్రాసిక్యూషన్‌ వాదన వీగిపోయింది. అతను నినాదాలిచ్చాడనడానికి పోలీసులు సాక్ష్యాలేమీ చూపించలేకపోయారు. అప్పుడు 'ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారతప్రభుత్వంపై ద్వేషాన్ని రగిలించడానికి కన్నయ్య ప్రయత్నించాడని, అది దేశద్రోహమేనని వాదించాడు పబ్లిక్‌ ప్రాసిక్యూటరు. ఈ లెక్కన ప్రతిపక్షాలన్నీ దేశద్రోహం కింద జైల్లో కూర్చోవాల్సిందే! తక్కిన కుర్రవాళ్లు కూడా తాము దేశవ్యతిరేక నినాదాలివ్వలేదన్నారు. వీడియోలన్నీ డాక్టర్‌డ్‌ అన్నారు. వీడియోల మాట ఎలా వున్నా పదిమంది ప్రత్యక్షసాక్షులున్నారన్నారు పోలీసులు. బెయిల్‌ అప్లికేషన్లను ప్రతిఘటించారు. అయినా మార్చి 18 న కోర్టు అందరికీ ఆరేసి నెలల బెయిలు యిచ్చింది. వీరి నేపథ్యాలేమిటో తెలిస్తే, వీరు దేశభక్తి లేక దేశద్రోహపు పోకడల గురించి ఒక అంచనాకు రావచ్చు. 

229 ఏళ్ల కన్నయ్యకుమార్‌ భూమిహార్‌ కులానికి చెందినవాడు. వాళ్ల కుటుంబసభ్యులందరూ సిపిఐ పార్టీ సభ్యులే. వాళ్ల కుటుంబాదాయం నెలకు రూ.3 వేలు. అతను ప్రస్తుతం జెఎన్‌యులోని స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో ఆఫ్రికన్‌ స్టడీస్‌ పై డాక్టరేటు చేస్తున్నాడు. ఇక కశ్మీర్‌ ఉగ్రవాది ఆరోపణలు ఎదుర్కుంటున్న 28 ఏళ్ల ఉమర్‌ ఖాలిద్‌ కశ్మీరీ కాదు. అతని కుటుంబం మహారాష్ట్రలోని అమరావతికి చెందినది. 30 ఏళ్ల క్రితం ఢిల్లీ వచ్చేశారు. తండ్రి ఇలియాస్‌ 'సిమి' (స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా)లో ఒకప్పుడు సభ్యుడు. దాన్ని బహిష్కరించడానికి ముందే బయటకు వచ్చేసి వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పేర పార్టీ పెట్టాడు. ఉమర్‌ నాస్తికుడు. మార్క్సిస్ట్‌-లెనినిస్టు భావాలు కలిగి, ఆ రాజకీయాలపై రిసెర్చి చేయడానికి 2009లో క్యాంపస్‌కు వచ్చాడు. అమెరికాలోని యేల్‌ యూనివర్శిటీ నుండి వచ్చిన ఎడ్మిషన్‌ను తిరస్కరించి యిక్కడ చేరాడు. ఝార్‌ఖండ్‌, సింగ్‌భూమ్‌లలో ఆదివాసీల నుంచి భూమి లాక్కోవడం సబ్జక్ట్‌పై రిసెర్చి స్కాలర్‌. ఫిబ్రవరి 18న యంగ్‌ హిస్టోరియన్స్‌ కాన్ఫరెన్సులో ప్రసంగించవలసినవాడు కానీ అంతకు ముందుగానే అరెస్టయ్యాడు. అతన్ని కుట్రకు మాస్టర్‌మైండ్‌గా చూపించడానికి టీవీ న్యూస్‌ ఛానెళ్లు చాలా శ్రమపడ్డాయి. ఫిబ్రవరి 9 నాటి సంఘటనకు ఏడు రోజుల ముందునుంచి అతను ఢిల్లీ విడిచి 14 సార్లు బయటకు వెళ్లాడని, కశ్మీర్‌కు, గల్ఫ్‌కు, బంగ్లాదేశ్‌కు 800 ఫోన్‌కాల్స్‌ చేశాడని లేదా రిసీవ్‌ చేసుకున్నాడని ఆరోపించారు. నిజానికి ఆ సమయంలో ఉమర్‌ జెఎన్‌యులోనే అనేకమందితో కలిసి నిరాహార దీక్ష చేశాడు, అంతేకాదు, శాస్త్రి భవన్‌ బయట కూడా దీక్ష చేశాడు. ఇక 7 రోజుల్లో 800 కాల్స్‌ చేయడం లేదా రిసీవ్‌ చేసుకోవడమంటే రాత్రీ పగలూ నిద్రలేకుండా గంటకు 9 కాల్స్‌ చేయడమన్నమాట! 

మరో 'మాస్టర్‌మైండ్‌' అనిర్వాణ్‌ భట్టాచార్య గురించి చెప్పాలంటే – కలకత్తాలోని కళ్యాణి యూనివర్శిటీలో ఒకప్పటి జెనెటిక్స్‌ ప్రొఫెసరు కుమారుడైన 29 ఏళ్ల అనిర్వాణ్‌ ఐసిఎచ్‌ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌) స్కాలర్‌షిప్‌లో పరీక్షలో టాప్‌. కులానికి బ్రాహ్మణుడు. ఈ ఏడాది హిస్టరీలో రిసెర్చి పూర్తయిపోతోంది. ఢిల్లీలో స్టీఫెన్సు కాలేజీలో చదివి జెఎన్‌యుకు వచ్చిన అనిర్వాణ్‌ ఏ పార్టీకి చెందిన కేంద్రప్రభుత్వమైనా సరే ఛత్తీస్‌గఢ్‌, కశ్మీర్‌, ఈశాన్యప్రాంతాల్లో ప్రజల ఆకాంక్షలను అణవివేస్తోందని వాదిస్తాడు.  స్టూడెంట్స్‌ యూనియన్‌కు జనరల్‌ సెక్రటరీగా వున్న రామా నాగా మరో నిందితుడు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలోని రామగిరి గ్రామానికి, ఘాసీ అనే షెడ్యూల్డ్‌ కులానికి చెందిన 24 ఏళ్ల నాగా సిపిఐ(ఎమ్‌ఎల్‌)కు అనుబంధంగా వుండే ఏఐఎస్‌ఏ (ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌)కు చెందినవాడు. అతని తండ్రి గాజులమ్ముతాడు. వాళ్లకు బీడుపడి వున్న 2 ఎకరాల భూమి వుంది. చిన్నప్పణ్నుంచి కష్టపడి చదివి, స్కాలర్‌షిప్పులు సంపాదించి, జెఎన్‌యు సీటు సంపాదించాడు. ఢిల్లీకి రావడానికి టీచర్లు టిక్కెట్టు కొని యిచ్చారు. సాధారణంగా యూనివర్శిటీ విద్యార్థి యూనియన్‌ ఎన్నికలలో డబ్బు, కులం, గూండాగిరీ రాజ్యమేలుతాయి. కానీ జెఎన్‌యులో తెలివికి, వక్తృత్వానికే పెద్ద పీట కాబట్టి యీ పేదదళితుడు జనరల్‌ సెక్రటరీ అయ్యాడు. 

నాలుగోవాడైన 30 ఏళ్ల అనంత్‌ ప్రకాశ్‌ నారాయణ్‌ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంలోని చందోలీ జిల్లాలో తహసీల్‌ ఆఫీసులో అటెండరు కొడుకు. అతని తండ్రి బెనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి ఎమ్మె బిఇడి చేసినా చాలాకాలం ఉద్యోగాలు దొరకలేదు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూండగా మధ్యవయసులో అటెండరు ఉద్యోగం వచ్చింది. రామా నాగా లాగే యితనూ దళితుడు, ఏఐఎస్‌ఏ యూనియన్‌కు చెందినవాడు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతూనే హిస్టరీలో బిఏ చేసి, న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశాడు. జెఎన్‌యులో సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ గవర్నెన్స్‌లో ఎంఫిల్‌ చేయడానికి నాలుగేళ్ల క్రితం వచ్చాడు. వివక్షత లేని సమాజం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆఖరివాడైన అశుతోష్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఏఐఎస్‌ఐకు చెందినవాడే. ఒబిసి వర్గానికి చెందినవాడు. స్టూడెంట్స్‌ యూనియన్‌కు మాజీ అధ్యక్షుడు. అతని తాత ఆరెస్సెస్‌ ప్రచారకుడు. బాబ్రీ మసీదు విధ్వంసంలో పాలు పంచుకున్నాడు. తండ్రి లాయరు. కానీ కుటుంబభారం ఎక్కువ. ఇతను పట్నాకు దగ్గర వున్న బాఢ్‌ పట్టణంలో ఆరెస్సెస్‌ వాళ్లు నడిపే సరస్వతీ శిశుమందిర్‌లో చదువుకున్నాడు. ఇతను బిఎచ్‌యులో గ్రాజువేషన్‌ చేసి, రష్యన్‌ స్టడీస్‌లో పిఎచ్‌డి చేయడానికి జెఎన్‌యుకు వచ్చాడు. 'బిఎచ్‌యులో వున్న సంకుచిత, వివక్షాపూరిత వాతావరణానికి భిన్నంగా జెఎన్‌యులోని స్వేచ్ఛావాతావరణం నాకు నచ్చింది. వామపక్షవిద్యార్థి నాయకులు చెప్పే సిద్ధాంతాలు నన్ను ఆకర్షించాయి.' అని చెప్పుకున్నాడు. ఇప్పుడు బిఎచ్‌యు విసి గారు 'నేను మా యూనివర్శిటీని కాపాడుకున్నాను కాబట్టి కానీ లేకపోతే అదీ జెఎన్‌యులా అయిపోయేది' అని చెప్పుకుంటున్నాడు.

వీళ్ల నేపథ్యాలు చదివితే వీరంతా పాకిస్తాన్‌తో చేతులు కలిపి దేశంలో ప్రభుత్వాన్ని కూలగొట్టే పనిలో వున్నారని తోచదు. ఆ మేరకు సాక్ష్యాలు దొరికితే అప్పుడే ఆలోచించవచ్చు. ఎవరి దగ్గరైనా నిషేధిక సాహిత్యం కాని, మారణాయుధాలు కాని దొరికితే, వాళ్ల సెల్‌ఫోన్లలో, ఈ మెయిళ్లలో విదేశీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు కాని దొరికితే అది వేరే సంగతి. కానీ ప్రస్తుతానికి తోచేదేమంటే – వీళ్లను అడ్డు పెట్టుకుని ఎబివిపి బలపడదామని చూస్తోంది. దేశభక్తికి తామొక్కరే ఏకైక చిరునామా అన్న బిల్డప్‌ యిస్తూ, తమతో విరోధించినవారందరికీ దేశద్రోహుల ముద్ర కొడుతోంది. అయితే ఆ దూకుడులో కన్నయ్య లాటి వాణ్ని హీరో చేసింది. చూడబోతే కన్నయ్య చేసిన ఘనకార్యం కాని, ఘోరకార్యం కాని ఏమీ లేదు. అతనిపై కేసులు మోపించి, అందరికీ అతనిపై జాలి కలిగించారు. ఇదే అదనని లెఫ్ట్‌, కాంగ్రెసు అతన్ని భుజాన వేసుకుని మోస్తున్నాయి. ''హిందూ''లో సురేంద్ర మంచి కార్టూన్‌ వేశారు. హోం మంత్రితో సహా అందరూ జెఎన్‌యు విద్యార్థులపై రాళ్లు వేస్తే అవి గుట్టగా ఏర్పడి, వాటి మీద విద్యార్థులు కూర్చుని జండా ఎగరేస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌ కవిత కూడా వుందిగా – నువ్వు విసిరిన రాళ్లతోనే యిల్లు కట్టుకుంటా అంటూ!

ఎబివిపి ఆగడాలకు బిజెపి ప్రభుత్వం యింత చేటుగా ఎందుకు మద్దతివ్వాలి అని ఆలోచిస్తే, అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి యిది మంచి సాధనంగా తోచింది వారికి. ఓటర్లలో ఎన్నో ఆశలు రేకెత్తించిన మోదీ అనేక రంగాల్లో అసంతృప్తి మిగులుస్తున్నారు. కాంగ్రెసుకు నకలుగా మారే ప్రమాదం అనుక్షణం పొంచి చూస్తోంది. పాప్యులారిటీ తగ్గితే వచ్చే ఎన్నికలలో విజయం సందేహంలో పడుతుంది. అందువలన జాతిని వర్గాలుగా విడగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.  జాతీయవాదం పేర తమ ఆలోచనాధోరణితో నడిచేవారు మాత్రమే దేశభక్తి కలవారని, భిన్నమైన ధోరణి వుంటే దేశద్రోహులని ముద్ర కొట్టడం మొదలుపెట్టారు. ఇది ఫాసిజానికి తొలిమెట్టని ఆలోచనాపరులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఆర్థికపరమైన ప్రగతి కలిగి, అది అన్ని వర్గాలకు అందుబాటులోకి వస్తే సమాజంలో అసమానతలు తగ్గి శాంతి నెలకొంటుంది. పాలకులు దానిపై దృష్టి పెట్టాలి తప్ప గోరంత విద్యార్థుల గొడవలను కొండంత చేసి దానిద్వారా లబ్ధి పొందాలని చూడకూడదు. – (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Archives