ఎమ్బీయస్‌: కర్ణుడికే దానం!

మద్రాసు హైకోర్టు జడ్జి సిఎస్‌ కర్ణన్‌గారికి 'హిందూ మక్కల్‌ కచ్చి' అనే హిందూ సంస్థ లక్ష రూపాయల చెక్కు దానంగా పంపించింది. 'ఇక్కడ కులవివక్షత భరించలేకపోతున్నాను. న్యాయవ్యవస్థలో కులం పేర నా జన్మహక్కు హరిస్తున్నారు.…

మద్రాసు హైకోర్టు జడ్జి సిఎస్‌ కర్ణన్‌గారికి 'హిందూ మక్కల్‌ కచ్చి' అనే హిందూ సంస్థ లక్ష రూపాయల చెక్కు దానంగా పంపించింది. 'ఇక్కడ కులవివక్షత భరించలేకపోతున్నాను. న్యాయవ్యవస్థలో కులం పేర నా జన్మహక్కు హరిస్తున్నారు. కులం గురించి పట్టించుకోని దేశానికి వలస పోదామనుకుంటున్నాను' అని ఆయన ప్రకటించాడు కాబట్టి దారి ఖర్చుల నిమిత్తం యీ లక్ష రూపాయల ఆఫర్‌ వచ్చి పడింది. దానికి చిన్న షరతు మాత్రం చేర్చారు. చెక్కు ఎన్‌క్యాష్‌ చేసుకుంటే దేశం విడిచి వెళ్లి తీరాలిట, వెళ్లే ముందు ఎక్కడకి దయచేస్తున్నారో చెప్పాలట. ఎలాటి అభ్యంతరాలు లేవనెత్తకుండా కర్ణన్‌గారి వలస సాగేట్లు చూడమని మోదీగారికి యీ సంస్థ సిఫార్సు చేసింది. 

కర్ణన్‌ పేరు గతంలో విన్నా వినకపోయినా యిప్పుడు మాత్రం కర్ణభేరి పగిలేటేట్లు ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. హైకోర్టు జడ్జి అయి వుండి ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కే ఫిబ్రవరి 15 న ఆదేశాలిచ్చి చరిత్ర సృష్టించిన మహనీయుడాయన. చీఫ్‌ జస్టిస్‌ చేసిన పాపం ఏమిటంటే ఆయన్ను కలకత్తా హైకోర్టుకి బదిలీ చేశాడు. ఈయన తన బదిలీ ఆర్డరుపై తనే స్టే యిచ్చేసుకున్నాడు. ఫిబ్రవరి 12 నాటి బదిలీ ఆర్డరు జారీ వేసిన జడ్జిలపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు దాఖలు చేయమని యీయన తమిళనాడు పోలీసులకు ఆర్డరు పాస్‌ చేశాడు కూడా. బదిలీ చేసినా అత్యాచారం చేసినట్లే అనే యీయన యిచ్చిన నిర్వచనం అమలైతే దేశంలో ఏ ఎస్సీ,ఎస్టీ కాండిడేటు ట్రాన్స్‌ఫర్‌ కానక్కరలేదు. ఉన్నచోటే వుండిపోవచ్చు. ఈయన సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు 'ప్రజాప్రయోజనాలుంటేనే బదిలీ చేయాలనే 1993 నాటి జడ్జిమెంటు తీర్పు చూడండి' అని సలహా యిస్తూ, యీ ఆర్డర్‌పై రాతపూర్వకంగా సంజాయిషీ యివ్వమని అడిగాడు. మీరే డైరక్టుగా యివ్వనక్కరలేదు, మీ సబార్డినేట్ల ద్వారా యివ్వండి అంటూ పోనీ కదాని ఏప్రిల్‌ 29 దాకా టైమిచ్చాడు, అది ఎందుకంటే అప్పటిదాకా తను యిచ్చిన మధ్యంతర ఆదేశం అమల్లో వుంటుందిట. అంటే తను కదల నక్కరలేదు. 'అయినా నా బదిలీ నాకు సంబంధించిన అంశం. నా పరిధిలోకి వచ్చే అంశంలో తల దూర్చకండి' అని కూడా నిష్కర్షగా చెప్పేశాడు. చీఫ్‌ జస్టిస్‌కు తను యిచ్చిన ఆదేశాలు ఆయన ఎక్కడైనా పారేసుకుంటాడేమోనని కాబోలు రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర న్యాయమంత్రికి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు కాపీలు పంపాడు. అంతటితో ఆగలేదు, రాజకీయనాయకులను కూడా దీనిలోకి లాక్కుని వచ్చాడు. సోనియా గాంధీ, మాయావతి, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌లకు కూడా కాపీ పంపాడు. చివరి యిద్దరికి ఎందుకంటే వాళ్లూ దళితులట, ఆయనా దళితుడట. తనపై దళిత వివక్షత జరుగుతోంది కాబట్టి దాన్ని వారి దృష్టికి తెస్తున్నాడన్నమాట. 

కర్ణన్‌గారు విచ్చలవిడిగా దళిత కార్డు వాడడం ఎప్పుడో మొదలుపెట్టాడు. 2009 మార్చిలో మద్రాసు హైకోర్టులో జడ్జిగా వేసిన దగ్గర్నుంచి ఆయన తీర్పుల ద్వారానో, ఆరోపణల ద్వారానో ఎప్పుడూ వార్తల్లో వుంటున్నాడు. తను దళితుడు కాబట్టి సాటి జడ్జిలు తన పట్ల వివక్షత చూపుతున్నారంటూ 2011 నవంబరులో షెడ్యూల్‌ కాస్ట్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఓ పెళ్లి ఫంక్షన్‌లో పక్క కుర్చీలో కూర్చున్న ఒక దళితేతర జడ్జి తన కాలుకి తగిలేట్లు కాలు మీద కాలు వేసుకున్నాడట! 2009 నుంచి నలుగురు జడ్జిలు తనను అవమానిస్తున్నారట. 2014 జనవరిలో జడ్జి పదవులకై సూచించిన 12 పేర్ల గురించి వేసిన ఒక ప్రజాహిత వ్యాజ్యం గురించి  డివిజన్‌ బెంచి విచారిస్తూండగా యీయన ఆ హాల్లోకి వెళ్లి ''సెలక్షన్‌ అన్యాయంగా జరిగింది. దాని గురించి అఫిడవిట్‌ వేస్తా'' అంటూ అరిచాడు. న్యాయమూర్తి మరొక కోర్టు విచారణలోకి యిలా చొరబడడం ఎక్కడా జరగదు, అందరూ విస్తుపోయారు. దీనిని సుప్రీం కోర్టు మార్చి నెలలో ఖండించింది. ''ఇలా జరగడం మమ్మల్ని తీవ్రంగా బాధించింది, కర్ణన్‌ ప్రవర్తన అనుచితం. ఇది ఏ మాత్రం హుందాగా లేదు.'' అని వ్యాఖ్యానించింది. దీనితో బాటు కొందరు లాయర్లు ఆందోళన చేపట్టి మద్రాసు హైకోర్టుని బహిష్కరించినప్పుడు కర్ణన్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌కె అగర్వాల్‌ గదిలోకి దూసుకెళ్లి యిష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు. ఆయన 'నేనే కాదు, సాటి జడ్జిలందరూ యీయన్ని చూసి బెదురుతున్నారు. న్యాయమూర్తులందరికీ తలవంపులు తెస్తున్న ఈయన్ని యిక్కణ్నుంచి బదిలీ చేసేయండి' అంటూ అప్పటి సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సదాశివంకు రాశారు. సుప్రీం కోర్టు దానిపై వెంటనే చర్య తీసుకోలేదు కానీ కర్ణన్‌ తన వంతుగా అగర్వాల్‌పై షెడ్యూల్‌ కాస్ట్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. 

అయినా తనకు బదిలీ తప్పదని గ్రహించాక ''నేను కొందరు జడ్జిలపై ఆరోపణలు చేశాను. వాటిని నిరూపించే ఆధారాలు నేను సేకరించడం పూర్తయ్యేవరకు నన్ను యిక్కణ్నుంచి బదిలీ చేయకూడదు'' అంటూ అగర్వాల్‌కు, సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖలు రాశాడు. ఆ ఆరోపణలేమిట్రా అంటే 2015 మేలో సాటి జడ్జి ఒకాయన ఒక మహిళా ఇంటెర్న్‌పై తన ఛాంబర్స్‌లో అత్యాచారం చేశాడని ఆరోపించాడు. మరో జడ్జి విద్యార్హతలను ప్రశ్నిస్తూ కేంద్రానికి లేఖ రాశాడు.  అగర్వాల్‌ తర్వాత ఆ స్థానంలో వచ్చిన ఎస్‌కె కౌల్‌ కూడా కర్ణన్‌ దెబ్బ తప్పించుకోలేక పోయాడు. సివిల్‌ జడ్జిల నియామకంలో ఆయన దళితులకు అన్యాయం చేశాడంటూ ఆరోపణ చేసి తనంతట తానే (సుమోటో) నియామకాలను మధ్యంతర ఉత్తర్వు ద్వారా నిలిపివేసి, ఆయనపై కూడా యథావిధిగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసు బనాయించాడు. ఈ దశలో సుప్రీం కోర్టు కలగచేసుకుని అతని మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. కర్ణన్‌ యిది సహించలేకపోయాడు. జడ్జిల నియామకం చూసే కొలీజియం వ్యవస్థ నియంతలా వ్యవహరిస్తోందంటే ధ్వజమెత్తాడు. తనకు ప్రాధాన్యత కలిగిన పోస్టు యివ్వటం లేదని అలిగి 2015 నవంబరులో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాడు. ఇవన్నీ చాలనట్లు కౌల్‌కు కులవివక్షత వుందంటూ ఆరోపణలు గుప్పించడంతో యిక మద్రాసు హైకోర్టు వ్యవస్థ సుప్రీం కోర్టుకి మొర పెట్టుకుంది – యీయన్ని యిక్కణ్నుంచి ఎక్కడికైనా పంపించి వేయండని. 

మద్రాసు చీఫ్‌ జస్టిస్‌లందరూ కర్ణన్‌పై ఫిర్యాదు చేస్తూ రావడంతో బాటు తాజాగా మరో రెండు కేసులు వచ్చాయి. పీటర్‌ రమేష్‌ కుమార్‌ అనే అడ్వకేట్‌ మద్రాసు హైకోర్టు యొక్క మధురై బెంచ్‌ కోర్టులోకి చొచ్చుకుని వెళ్లి అక్కడ కార్యకలాపాలను భగ్నం చేసినందుకు అతనిపై హైకోర్టు కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్టు కేసు పెట్టింది. ఆ కేసు ప్రిన్సిపల్‌ బెంచ్‌కు బదిలీ అయినపుడు కర్ణన్‌ కలగజేసుకుని ఆ లాయరుకు మద్దతుగా నిలిచాడు. అతని పోలీసు రక్షణ కల్పించాలని, అతన్ని కేసులోంచి తప్పించేందుకు యిది వుపకరిస్తుందని స్టేట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాశాడు. తమిళనాడు స్టేట్‌ జ్యుడిషయల్‌ ఎకాడమీ రాష్ట్రంలో కొత్త సెంటర్లు తెరుద్దామనుకుంటోంది.  ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడడానికి వెనుకబడిన వర్గాల నుంచి వక్తలుగా ఎవర్నీ పిలవలేదని, తనను ఎకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ నుంచి తప్పించేశారని కర్ణన్‌ ఆరోపించాడు. దానికి సమాధానంగా హై కోర్టు కర్ణన్‌ ఎకాడమీ బోర్డులో ఎన్నడూ సభ్యుడు కాదని స్పష్టం చేసింది. వక్తల్లో యిద్దరు సుప్రీం కోర్టు జడ్జిలుకాగా, యిద్దరు మద్రాసు హై కోర్టు జడ్జిలని, దీనిలో కులప్రసక్తి లేదని కూడా చెప్పింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీం కోర్టు కొలోజియం ఫిబ్రవరి 11 న సమావేశమై అనేక మంది జడ్జిలను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ వారితో బాటు కర్ణన్‌ను కలకత్తాకు వేసింది. ఆ ఆర్డరునే యిప్పుడీయన ఆపేసుకున్నాడు. ప్రతిగా ఫిబ్రవరి 12 తర్వాత నుంచి కర్ణన్‌ యిచ్చే ఆదేశాలపై ఏ చర్యా తీసుకోనక్కరలేదని సుప్రీం కోర్టు మద్రాసు హైకోర్టును ఆదేశించింది. కర్ణన్‌కు ఏదైనా పని యివ్వాలో అక్కరలేదో చూసుకునే బాధ్యత కౌల్‌ మీదే పెట్టింది. 

సమాజపు కట్టుబాట్ల గురించి కర్ణన్‌ దృక్పథం ఎలా వుందో చెప్పడానికి ఆయన 2013 జూన్‌లో వెలువరించిన అపూర్వమైన తీర్పు ఒక ఉదాహరణ. ''పెళ్లి అనేదానికి సంఘం లేదా ప్రభుత్వపు గుర్తింపు ఏమీ అక్కరలేదు. ఒక మగాడు, ఒక ఆడది కలిసి రతిలో పాల్గొంటే చాలు అది పెళ్లే. ఇక అప్పణ్నుంచి వాళ్లూ మొగుడూ పెళ్లాలమని చెప్పేసుకోవచ్చు. మామూలు పెళ్లి వలన దఖలు పడే హక్కులన్నీ యీ రకమైన 'పెళ్లి' ద్వారా కూడా సంక్రమిస్తాయి.'' అని తీర్పు యిచ్చాడు. దానిపై దేశమంతా గగ్గోలు పెట్టేసి, మీడియాలో చర్చలు జరిగాయి. రెండు రోజుల తర్వాత ఆయన మరో ఆదేశం యిచ్చాడు – 'తీర్పుకి వ్యతిరేకంగా మీడియాలో ఏ వ్యాఖ్యలూ రావడానికి వీల్లేదు' అని. అలాటాయన యిప్పుడు కొలోజియం వ్యవస్థను నియంతగా వర్ణిస్తున్నాడు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌పై, యితర జడ్జిలపై ఆరోపణలు గుప్పించాడు. ''నేను సుప్రీం కోర్టుకి సబార్డినేటును కాను. నా కంటూ నాకు రాజ్యాంగబద్ధమైన ఆఫీసు వుంది. నా తరఫు వాదన వినకుండా వాళ్లు నా గురించి ఎలా నిర్ణయం తీసుకోగలరు? నేను దళితుణ్ని కాబట్టే నాపై కత్తికట్టారు. ఆ జడ్జిలను పార్లమెంటుకు రమ్మనమనండి. ఎవరు గొప్పో తేల్చే అధికారం దానికే వుంది'' అన్నాడు. న్యాయవ్యవస్థను పార్లమెంటుకు సమాంతర వ్యవస్థగా తీర్చిదిద్దిన మన రాజ్యాంగం గురించి కర్ణన్‌ అవగాహన యిది!

ఇది జరిగాక కర్ణన్‌ ఢిల్లీ వెళ్లి చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌ను కలిసి ఒక అరగంటసేపు మాట్లాడాడు. ఏం జరిగిందో బయటకు రాలేదు. న్యాయశాఖ మాత్రం చీఫ్‌ జస్టిస్‌ బదిలీ ఆదేశాన్ని తదుపరి చర్యలకై ప్రధాని కార్యాలయానికి పంపించినట్లు శుక్రవారం వార్త వచ్చింది. కర్ణన్‌ పక్షాన ప్రముఖులెవ్వరూ యిప్పటివరకు ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు. విపరీతస్వభావం చేత వస్తున్న తన సమస్యలన్నిటికి దళితత్వమే కారణమంటూ కలరింగు యివ్వడం వలన, సమాజంలో దళిత వ్యతిరేక భావాలు బలపడి, నిజంగా బాధితులైన దళితులకు మేలు జరగకపోగా కీడు జరుగుతుందని ఆయన గ్రహించాలి.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016) 

[email protected]