ఎమ్బీయస్‌: పేరుకే ముత్యం…

20 ఏళ్లగా అడ్డగోలు వ్యాపారం చేస్తూ రూ.49,100 కోట్ల స్థాయికి చేరిన పెర్ల్‌ గ్రూపు అధినేత నిర్మల్‌ సింగ్‌ భాంగూ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఎన్నో ఏళ్లగా దాని వ్యవహారశైలిపై విచారణ నడుస్తున్నా, కేసులు వేస్తున్నా,…

20 ఏళ్లగా అడ్డగోలు వ్యాపారం చేస్తూ రూ.49,100 కోట్ల స్థాయికి చేరిన పెర్ల్‌ గ్రూపు అధినేత నిర్మల్‌ సింగ్‌ భాంగూ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఎన్నో ఏళ్లగా దాని వ్యవహారశైలిపై విచారణ నడుస్తున్నా, కేసులు వేస్తున్నా, ప్రభుత్వాధికారుల, రాజకీయనాయకుల సహకారంతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ పోయి నాలుగు రాష్ట్రాలకు చెందిన 5.85 కోట్ల మంది పెట్టుబడిదారుల కొంప ముంచింది. వింత విషయమేమిటంటే కోర్టులు కూడా కరుణ చూపుతూ, ఇది పోంజీ కంపెనీ అవునా కాదా అని తర్జనభర్జన చేస్తూ చర్య తీసుకోకుండా అడ్డుకున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 ఫిబ్రవరిలో విచారణ ప్రారంభించిన సిబిఐ భాంగూపై రెండేళ్ల క్రితమే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినా నత్త స్పీడుతో  విచారణ సాగించి, యిన్నాళ్లకు అతన్ని, సహచరులను అరెస్టు చేసింది. భాంగూ అకాలీ దళ్‌కు, ముఖ్యంగా ఉపముఖ్యమంత్రికి సన్నిహితుడు కాబట్టి, 2017 రాబోయే పంజాబ్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యీ అరెస్టు జరిగిందనే సందేహమూ వ్యక్తమౌతోంది. 

35 సం||రాల క్రితం భాంగూ పంజాబ్‌లోని అట్టారీలో పాలవ్యాపారి. పియర్‌లెస్‌ యిన్వెస్ట్‌మెంట్‌ కంపెనీకి ఇన్సూరెన్సు ఏజంటుగా పనిచేస్తూ ప్రజలతో సంబంధాలు పెంచుకున్నాడు. క్రమంగా పోంజీ స్కీముతో కంపెనీ ఒకటి పెడితే బాగుండునని తోచింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం ఛార్లెస్‌ పోంజీ అనే అతను రూపొందించిన యీ విధానం అంతకుముందు కూడా వున్నా, అతను దానికి ఒక పక్కా స్కీముగా తీర్చిదిద్దాడు. మార్కెట్లో వున్న రేటు కంటె హెచ్చు వడ్డీ యిస్తామని అత్యాశ చూపి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. తమకు వేరే వ్యాపారాలున్నాయని, యీ డబ్బును వాటిలో పెట్టి విపరీతంగా లాభాలు ఆర్జిస్తాం కాబట్టి అందరి కంటె ఎక్కువ వడ్డీ యివ్వగలమని నమ్మబలుకుతారు. అది కాకుండా యింకో లాభం చూపిస్తారు. తనలాటి వాళ్లను మరో పదిమందినో, యిరవై మందినో స్కీములో చేర్పిస్తే కమిషన్‌ వస్తుందంటారు. ఆ యిరవై మంది, మరో యిరవై మందిని చేర్పిస్తే మరి కొంత కమిషన్‌ వస్తుందంటారు. ఇలా గొలుసుకట్టులా సాగిపోతూ స్కీములో చేరినవారి సంఖ్య పెరిగినకొద్దీ, తాము పెట్టుబడి పెట్టిన డబ్బు కమిషన్‌ రూపేణా వెనక్కి వచ్చేస్తుందంటారు. కొన్నాళ్లకు కంపెనీ యిచ్చే డబ్బు అదనంగా వచ్చే బోనసు లాటిదే అంటారు. 

ఇవన్నీ చెప్పి కన్విన్స్‌ చేయడానికై నియమించే ఏజంట్లకు కంపెనీ విపరీతంగా కమిషన్లు యిస్తుంది. ఒకసారి ఎవరినైనా ఏమార్చి సభ్యుడిగా చేర్పించాక, తక్కినవారిని ఏమార్చే పని అతనే చూసుకుంటాడు. అదేదో యాడ్‌లో 'నేను నమ్మాను, మీరూ నమ్మండి' అన్నట్లు 'నేను చేరాను, మీరూ చేరండి' అంటాడు. ఇంటిపక్కవాళ్లు, బంధువులు, స్నేహితులు అంతా ఒకర్ని చూసి మరొకరు చేరతారు. ఈ స్కీముల్లో ప్రధానమైన అంశం ఏమిటంటే కొన్ని బ్యాచ్‌ల వరకు వాళ్లు చెప్పినట్లుగా డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. 'మీరు గతంలో ఎందరినో నమ్మి మోసపోయారు, మేం మాత్రం అలాటి వాళ్లం కాము' అని చెప్పడానికి యిది పనికి వస్తుంది. నిజానికి కంపెనీ చేసే వ్యాపారం పెద్దగా ఏమీ వుండదు, మరి వాళ్లు అంత డబ్బు ఎక్కణ్నుంచి యిస్తున్నారంటే, కొత్త డిపాజిటర్ల నుంచి! కొత్త బ్యాచ్‌లు జోరుగా వస్తున్నంతకాలం పాతవాళ్లకు డబ్బులు తిరిగి వస్తాయి, అది ఎప్పుడైతే ఆగిందో లేదా సన్నబడిందో వీళ్ల కష్టాలు ప్రారంభమవుతాయి. కొత్త బ్యాచ్‌ల నుంచి డబ్బు వచ్చినా కంపెనీ ప్రమోటర్లు ఆ డబ్బును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించేసుకుంటారు, తమ పేర ఆస్తులు కొనుక్కుంటారు. పాత వాళ్లకు దక్కేదేమీ వుండదు – కంపెనీ వాడు పారిపోయినప్పుడు లబోదిబో మనడం తప్ప! ఈ స్కీము మన దగ్గర కూడా 'చెయిన్‌ స్కీము' అని మరోటని అనేక పేర్లతో వర్ధిల్లుతూనే వుంటుంది. సిబిఐ లెక్క ప్రకారం ఒడిశా, బెంగాల్‌లలోనే 200 పోంజీ స్కీములున్నాయట. జనాలు ఎన్నిసార్లు మోసపోయినా, మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా వుంటారు. 

పెర్ల్‌ ఏగ్రిటెక్‌ కార్పోరేషన్‌ లి. (పిఎసిఎల్‌), పెర్ల్‌ గోల్డెన్‌ ఫారెస్ట్‌స్‌ (పిజిఎఫ్‌) అనే పేర్లతో భాంగూ కంపెనీలు పెట్టి అలాఅలా ఎదిగిపోయాడు. అతనికి ప్రస్తుతం 23 లక్షల మంది కమిషన్‌ ఏజంట్లు వున్నారు. వాళ్లకు 40% కమిషను యిస్తాడు. మధ్యతరగతివాళ్లని సభ్యులుగా పెట్టుకుంటే వాళ్లు అవకతవకలను త్వరగా పసిగట్టగలరు. మీడియాకు తెలియపరచగలరు. అందుకని కడుపేద వారిని, గుడిసెల్లో వుండేవారిని, రోజు కూలీలను సభ్యులుగా చేర్పించాడు. దాంతో అతనిపై ఫిర్యాదు చేసేవాళ్లు లేకుండా, మీడియా కంటపడకుండా హాయిగా మోసాలు చేస్తూ పోయాడు, అసంఖ్యాకంగా షెల్‌ కంపెనీలు పెట్టి డబ్బు అటూయిటూ తిప్పాడు. అతని సామ్రాజ్యం హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడులకు విస్తరించింది. తనను పెద్ద పారిశ్రామికవేత్తగా చూపించుకోవడానికి సొంత మీడియాను తయారుచేసుకున్నాడు. సహారా, శారదా గ్రూపు దగ్గర్నుంచి ఇండియాలోని పోంజీ కంపెనీలన్నీ చేసే పనే యిది. మన రాష్ట్రంలో ఆగ్రిగోల్డ్‌ కూడా యిదే విధంగా ఆపరేట్‌ చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి డిపాజిట్లు వసూలు చేస్తూ ''నది'' మాసపత్రిక, ''టాలీవుడ్‌'' అనే టీవీ ఛానెల్‌ పెట్టి, ''హాయ్‌ల్యాండ్‌'' పెట్టి, తనను పెద్ద గ్రూపుగా చూపుకున్న విషయం గుర్తించాలి. భాంగూ కూడా పి7 పేర ఛానెల్‌ పెట్టి దాని ప్రారంభోత్సవానికి సుస్మితా సేన్‌ను పిలిచాడు. పంజాబ్‌ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ బాదల్‌ ప్రపంచ కబాడీ టూర్నమెంటు పెడితే దానికి రూ. 35 కోట్లతో స్పాన్సర్‌షిప్‌ తీసుకున్నాడు. కింగ్స్‌ ఇలెవెన్‌ పంజాబ్‌ ఐపిఎల్‌ టీముకి లీడ్‌ స్పాన్సర్‌గా వుంటూ శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు సన్నిహితుడయ్యాడు. బాడ్మింటన్‌ మ్యాచ్‌లను స్పాన్సర్‌ చేసి దానికి అక్షయ్‌ కుమార్‌ను బ్రాండ్‌ ఎంబాసిడర్‌గా పెట్టుకుని అతనితో కూడా స్నేహం పెంచుకున్నాడు. గ్యాన్‌సాగర్‌ మెడికల్‌ కాలేజి అని ఒకటి పెట్టాడు. ఇవన్నీ ఒక యెత్తు. ఆస్ట్రేలియా వాళ్లను బుట్టలో పడేయడం మరో 'ఎత్తు'. ఇక్కడ దగా చేసిన డబ్బులోంచి 150 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లను (రూ. 650 కోట్లు) తరలించి తన పేర, బంధువుల పేర పెట్టిన కంపెనీల ద్వారా ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టి వారిని ఆకర్షించాడు. 2009లో 62 మిలియన్‌ డాలర్లతో గోల్డ్‌ కోస్ట్‌లో షెరటన్‌ మిరాజ్‌ హోటల్‌ కొన్నాడు. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ బ్రెట్‌ లీని తమ పెర్ల్‌ గ్రూపుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకుని క్వీన్స్‌లాండ్‌, విక్టోరియాలలో వెయ్యి ఎపార్ట్‌మెంట్లు కడతామని ప్రకటిస్తూ అక్కడివారిని బుట్టలో పెడుతున్నాడు. 2012లో ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నాడు. తన కుటుంబసభ్యులలో చాలామందిని అక్కడకి పంపించేశాడు – ఇక్కడ ఏదైనా గొడవ వచ్చినా వాళ్లెవరూ దొరక్కుండా!

భాంగూ ఆస్తులకు మూలం – పేదవాడు చెమటోడ్చి, సంపాదించి, కూడబెట్టిన డబ్బు. దాన్ని ఎలా లాక్కోగలిగాడంటే విపరీతమైన వడ్డీల ఆశ చూపి! రెండు రూపాయల, మూడు రూపాయల వడ్డీ కూడా యిస్తానన్నాడు. అంతెలా యివ్వగలరంటే మేం కంపెనీ తరఫున అనేక భూములు కొంటున్నాం, రియల్‌ ఎస్టేటు బూమ్‌లో వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, అందుకే యివ్వగలం అని జవాబిచ్చాడు. ఆ భూమిని మీకు యిస్తున్నాం అంటూ ఎలాట్‌మెంట్‌ లెటర్లు కూడా యిచ్చేశాడు. నిజానికి కంపెనీ దగ్గర అందరికీ యివ్వగలిగేటంత భూమి లేనే లేదు, కానీ తమ ఎలాట్‌మెంట్‌ లెటర్లపై జనాలకు అనుమానం రాకుండా పెర్ల్‌ అనేది పేద్ద గ్రూపుగా భ్రమింపచేయాడనికి మీడియాను, స్పాన్సర్‌షిప్పులను, రాజకీయనాయకులతో కలిసి తిరగడాలను వుపయోగించుకున్నాడు. వాళ్ల పి7 టీవీ ఛానెల్‌ కార్యక్రమానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ను పిలిచి, దాన్ని ప్రముఖంగా చాటుకున్నాడు. మామూలు ప్రజలు టోకరా తినడంలో ఆశ్చర్యమేముంది? మరి యింత పెద్ద ఎత్తున మోసం జరుగుతూంటే ఎవరూ ఏమీ చేయకుండా ఎలా వున్నారన్న సందేహం కలుగుతుంది.  ఈ కంపెనీ వ్యవహారాలు ఒక ప్రజాహిత వ్యాజ్యం ద్వారా 1998లోనే ఢిల్లీ హైకోర్టు దృష్టికి వచ్చాయి. వాళ్లు నిషేధించిన 478 కంపెనీల్లో యిది కూడా ఒకటి. కస్టమర్ల సంఖ్య 1,941 మాత్రమే వున్నా యీ కంపెనీ ఆ తీర్పును సవాలు చేసింది. పోంజీ సంస్థ అవునా కాదా అనే విషయం తేల్చే బాధ్యతను సెబికి అప్పగించింది కోర్టు. సెబి ఆడిట్‌ చేసి పోంజీయే అంది. ఇది పోంజీ కంపెనీయా, లేక యిన్వెస్ట్‌మెంట్‌ కంపెనీయా అనే విషయంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు రకరకాల తీర్పులు యిచ్చాయి. రాజస్థాన్‌ హైకోర్టు పోంజీ కాదంది. హంజాబ్‌, హరియాణా హైకోర్టు పోంజీయే అంది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు పోంజీ అనడమే కాదు, సిబిఐ విచారణ జరగాలంది. అవునో కాదో తేల్చే భారం ఢిల్లీ హైకోర్టు సెబిపై పెట్టింది. సెబి కూడా పోంజీయే అంది. దానిపై 2003లో కంపెనీ సుప్రీం కోర్టుకి వెళ్లింది. అక్కడే పదేళ్లు పెండింగులో పడిపోయింది. ఇంత ముఖ్యమైన విషయంపై సుప్రీం కోర్టు మౌనంగా వుండడం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఆ పదేళ్లలో కంపెనీ బీభత్సంగా విస్తరించేసి కస్టమర్ల సంఖ్యను 5.85 కోట్లు చేసుకుంది. దానికో కారణం వుంది.

ఇది పోంజీ కంపెనీయే అని సెబి తీర్పు వచ్చాక ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ కె స్వామిదురైను కంపెనీ కస్టమర్లతో కుదుర్చుకుంటున్న సేల్‌ ఎగ్రిమెంట్లు కరక్టా కాదా అని చూడమంది. ఆయన చూసి కరక్టుగానే వున్నాయన్నాడు. అలా అయితే యికపై జరిగే ఒప్పందాలన్నీ ఆయన ఎప్రూవ్‌ చేస్తేనే కస్టమర్లకు భూమి అమ్మవచ్చు అంది. ఆశ్చర్యకరంగా దీనిలో సెబిని పార్టీగా చేయలేదు. ఇక దాంతో కంపెనీ 'మా అగ్రిమెంట్లన్నీ కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నాయి' అంటూ ప్రచారం చేసుకుని బ్రహ్మాండంగా బిజినెస్‌ చేసుకుంది. 2002 నుండి 2013 వరకు స్వామిదురై 19 వేల అగ్రిమెంట్లు వెరిఫై చేసి ఓకే అనేశాడు. సెబి ఆశ్చర్యపోయి శాంపుల్‌గా 500 అగ్రిమెంట్లు తీసుకుని పరీక్షించింది. కంపెనీ అమ్మిన భూమి కంపెనీది కాదని తెలిసింది. అదేమిటని స్వామిదురైని అడిగితే ఆయన ''నేను కంపెనీకి, కస్టమరుకు జరిగిన అగ్రిమెంటు కరక్టా కాదా అని చూశాను తప్ప, అగ్రిమెంటులో రాసిన భూమి కంపెనీది కాదా అని చూడలేదు. అది చూడమని ఎవరూ చెప్పలేదు. అది నా పరిధి కాదు.'' అన్నాడు! ఇది కస్టమర్లపై వేసిన క్రూరమైన జోకు. మేరఠ్‌లో కంపెనీ ఎలాట్‌ చేసిన భూమి స్మశానంలో వుంది, ప్రభుత్వ అడవుల్లో వుంది. చంబల్‌లో కొన్ని భూములు కొన్నారు. రాజస్థాన్‌లో దేశసరిహద్దుల్లో కొంత కొన్నారు. ఇలా ఎన్నోఎన్నో మోసాలు జరిగాయి. 

ఇప్పటికైనా దీన్ని బయటపెట్టడానికి పెర్ల్‌ కస్టమర్ల తరఫున సురుచి అగర్వాల్‌ అనే లాయరు పెర్ల్‌ బాధిత సంఘం ఏర్పాటు చేసి ఆస్తుల వివరాలు, మొత్తం కస్టమర్ల పేర్లు, ఎంతమందికి తిరిగి యిచ్చారు, ఎంతమందికి తిరిగి యివ్వాలి వివరాలు యివ్వమని కంపెనీని అడిగితే కంపెనీ పట్టించుకోవడం లేదు. పైగా బోగస్‌ కస్టమర్ల అసోసియేషన్లు పుట్టించి, మాకేం అభ్యంతరాలు లేవని ప్రచారం చేయిస్తోంది. రూలుకి వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి విషయంలో కూడా యిలాటి వివరణలే యిచ్చారు. 'ఇప్పటిదాకా ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా, కంపెనీ పేర లేకపోయినా మా పేర వేరే చోట ఆస్తులు వున్నాయి కదా' అంటూ కంపెనీ వాదించింది. కోర్టు అధికారులు వచ్చి డిపాజిటర్ల వివరాలు అడిగితే పొడి అక్షరాల పేర్లు, అడ్రసులు లేని పేర్లు చూపారు. సకాలంలో చర్యలు తీసుకున్నారు కాబట్టి  మార్గదర్శిలో పెట్టుబడి పెట్టినవారు బతికిపోయారు. అది ఒక పెద్ద గ్రూపుకి చెందినది కాబట్టి, పరపతి పోతుందన్న భయంతో గ్రూపు వాటాలు రిలయన్సుకి అమ్మి డిపాజిట్లు వెనక్కి యిచ్చారు. పెర్ల్‌ కస్టమర్లకు ఆ భాగ్యం దక్కేట్టు లేదు. వాళ్లకు భూమీ దక్కదు, డబ్బూ వెనక్కి రాకపోవచ్చు. ఇలాటి మోసాలు జరిగినప్పుడే వ్యవస్థలో వున్న ఎన్ని లోపాలు వున్నాయో స్పష్టంగా కళ్లక్కట్టినట్లు కనబడుతుంది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]