ఎమ్బీయస్‍ కథ: అంతరిస్తున్న జాతి

‘’ఏరోయ్‍ ఢిల్లీ నుండి ఎప్పుడు రాక? అక్కడ ఎల్లరు సుఖులే!? ఇక్కడ సుఖాన్న వున్నవాణ్ని దుఃఖాన్న పెట్టడానికి వచ్చి వుంటావ్‍. ఊరకరారు సిబిఐ వారు..’’ అంటూ మేనల్లుడు సుధీర్‍ను పలకరించాడు కమలాకరరావు. Advertisement ‘’నీతిగా…

‘’ఏరోయ్‍ ఢిల్లీ నుండి ఎప్పుడు రాక? అక్కడ ఎల్లరు సుఖులే!? ఇక్కడ సుఖాన్న వున్నవాణ్ని దుఃఖాన్న పెట్టడానికి వచ్చి వుంటావ్‍. ఊరకరారు సిబిఐ వారు..’’ అంటూ మేనల్లుడు సుధీర్‍ను పలకరించాడు కమలాకరరావు.

‘’నీతిగా వుంటే ఎవరి జోలికి మాత్రం ఎందుకొస్తాం? మేం వచ్చేమంటే మీ వూరివాళ్లు ఏదో గోల్‍మాల్‍ చేసి, మాకు పని పెట్టారని అర్థం. అంతదూరం నుండి వచ్చిన కష్టానికి తోడు నీ నిష్టూరాలొకటా?’’

‘’మీరు ఎందుకైనా రావచ్చు బాబూ.. రాజకీయంగా బేరాలు కుదరకపోతే మిమ్మల్ని ఉసిగొల్పుతారు. మీరు ఎవడి మీద ఎంతసేపు అరవమంటే అరుస్తారు, యిక చాలు బేరం కుదిరింది అంటే.. ఆపేస్తారు. కావాలని కేసు సరిగ్గా ఫైలు చేయరు, కోర్టు అక్షింతలు వేస్తే దులిపేసుకుంటారు..’’

సుధీర్‍ చెవులు మూసుకుంటూ ‘’మమ్మల్ని చూస్తే చాలు ప్రతీవాడికీ వెటకారం తన్నుకొచ్చేస్తుంది. అయినా నేను వచ్చింది రాజకీయాల కేసుకోసం కాదు, నీలాటి నాలాటి ఒక ఉద్యోగి కేసు ఒకటి డీల్‍ చేయడానికి వచ్చాను. ఇక నా మీద సెటైర్లు వదిలిపెట్టి అత్తయ్యను పిలు. మంచినీళ్లు కావాలేమో కనుక్కుంటుంది.’’

‘’మంచినీళ్ల భాగ్యానికి అత్తయ్యే రావాలా? అందరి చేత మూడు చెరువుల నీళ్లు తాగించేవాడి చేత ఓ చెంబెడు నీళ్లు నేను తాగించలేనూ..’’ అంటూ నవ్వుతూ కమలాకరం వంటింటి వైపు తిరుగుతూండగానే అతని భార్య మంచినీళ్లు తెచ్చి యిచ్చింది.

భోజనాలవేళ మళ్లీ దేశంలో పెరిగిపోతున్న అవినీతి గురించి చర్చ మొదలైంది. గతం కంటె యిప్పుడు బాగా పెరిగిపోవడానికి కారణం నేరస్తుల్లో పెరిగిపోతున్న తెంపరితనమే, ఈ సమాజంలో అవినీతిపరుడికి వున్న ధీమా నీతిమంతుడికి లేదు అన్నాడు సుధీర్‍. ‘ఓ పట్టాన శిక్ష పడదు, పడినా అప్పీలుకి వెళ్లవచ్చు, కోర్టుకి వెళ్లవచ్చు, ఏదో స్థాయిలో మేనేజ్‍ చేయవచ్చు, వ్యతిరేకంగా తీర్పు వచ్చే లోపున రిటైరయిపోవచ్చు’ అన్న ధీమాయే యీ స్థితికి తెచ్చిందన్నాడు కమలాకరం.

‘అంతకంటె యింకో పాయింటు చెప్పనా? గతంలో లంచగొండి అంటే సమాజం హీనంగా చూస్తుందన్న భయం వుండేది. ఇటీవలి కాలంలో అవినీతి కార్యకలాపాలకు మీడియాలో విపరీతంగా పబ్లిసిటీ వచ్చి ‘అందరూ చేస్తున్నారు, నేను చేస్తే వేలెత్తి చూపడం దేనికి? ఒకవేళ ఎవరైనా చూపినా పట్టించుకోనక్కరలేదు. నాలుగు రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు.’ అనే భావన ప్రబలింది. అవినీతిపరులను సమాజం వెలి వేయడం లేదు, ఉదాసీనంగా వూరుకుంటోంది. దాంతో వాళ్లు దులిపేసు కుంటున్నారు.’ అన్నాడు సుధీర్‍.

ఆ తర్వాత సంభాషణ భగవంతుడిపైకి మళ్లింది. మంచివాళ్లకు మేలు చేయడంలో, చెడ్డవాళ్లకు శిక్ష వేయడంలో దేవుడు సవ్యంగా, త్వరితంగా పని చేయడం లేదని యిద్దరూ కలిసి తీర్మానించారు. కమలాకరం భార్య ‘దేవుడి లీలల గురించి తెలిసీ తెలియకుండా అలాటి మాటలు మాట్లాడితే కళ్లు పోతాయి. ఇక మీరు లేస్తే, కంచాలెత్తేసి, నేనూ భోజనం చేస్తాను’’ అని గసిరింది.

డ్రాయింగు హాలులో సోఫాలో కూలబడి, సుధీర్‍కు వక్కపొడి అందిస్తూ కమలాకరం మొదలుపెట్టాడు – ‘’ఒరేయ్‍ మీ అత్తయ్య మాటలు వింటూ వుంటే మా తిరపతి సంగతి గుర్తుకు వస్తోంది. విను, పర్యావరణ సమస్యలను పరిశీలించి, పరిశ్రమలకు అనుమతి యిచ్చే ఓ కేంద్ర సంస్థలో మా తిరపతి పెద్ద ఆఫీసరు. నాకు హైస్కూలులో క్లాస్‍మేట్‍. నా కాలేజీ క్లాస్‍మేట్‍ ఒకతను అనుకోకుండా జబ్బుపడి ఉద్యోగం పోతే ‘మీ వాడికి చెప్పి వాళ్ల డిపార్టుమెంటులో టెంపరరీగానైనా మా అబ్బాయికి ఉద్యోగం యిప్పించమ‘ని బతిమాలాడు. ఆ అబ్బాయిని వెంటపెట్టుకుని వీడి దగ్గరకు వెళ్లి సంగతిదీ అని చెప్పాను.

అంతా విని ఆ అబ్బాయితో ‘’నువ్వు వెళ్లి రావోయ్‍, మా కమలాకరం నేనూ మా స్కూలు కబుర్లు చెప్పుకోవాలి.’’ అన్నాడు తిరపతి. అతను దణ్ణం పెట్టి వెళ్లిపోయాక, మన కబుర్లకేంగానీ యితని సంగతి ఏమంటావన్నాను. ఎంతో కొంత లంచం తప్పదన్నాడు. ‘’ఒరేయ్‍, నీకు తండ్రి చిన్నపుడే పోయాడు. ఉద్యోగం చేసి తల్లీ, తమ్ముళ్లు, చెల్లెలు సంసారభారం మోశావు. ఇప్పుడు అతనిదీ అదే స్థితి. అతని తండ్రి బతికున్నాడు. మందులకు డబ్బు కావాలి. నువ్వు కూడా జాలి చూపించకపోతే ఎలారా?’’ అని అడిగాను.

‘’జాలి వుంది కాబట్టే నా వాటా వదులుకుని చెపుతున్నాను. తక్కినవాళ్లు వదలరు కదా. ఏదో సామెత చెప్తారు చూడు కమిషన్‍కి అలవాటు పడినవాడు కన్నతల్లి దగ్గర కూడా కమిషన్‍ వదులుకోడని. లోకం అలా ఏడ్చింది. మీ లెక్చరర్ల పోస్టులకు కూడా లంచాలడుగు తున్నారని తెలుసుగా. వైస్‍ ఛాన్సెలర్‍ పోస్టుకి రెండు కోట్లు లంచం యివ్వాల్సి వస్తోందట. పవిత్రమైన ఉపాధ్యాయ వ•త్తే యిలా తగలడితే…’’ తిరపతి మొదలెట్టాడు.

నాకు ఒళ్లు మండింది. ‘’నీ జాలి ఆపు. నువ్వు బాగా ముదిరిపోయావు. డిపార్టుమెంటులో నువ్వే రింగు లీడరువి. రెండు చేతులా సంపాదిస్తున్నావ్‍. నాకేం ఏడుపు లేదొరేయ్‍. కానీ అమావాస్యకీ, పున్నమికీనైనా యిలాటివాడికి సాయపడి కాస్త పుణ్యం కట్టుకోరా, పరానికి పనికొస్తుంది.’’ అన్నాను కసిగా. వాడు కోపం తెచ్చుకోలేదు. ఫెళ్లున నవ్వాడు. ‘’బాల్యమిత్రుడివి, అనే హక్కు నీకుంది, పడే విధాయకం నాకుంది. నువ్వు చెప్పావు కాబట్టే అంత తక్కువ చెప్పాను. నాకిందులో పైసా దక్కదు. తక్కినవాళ్ల కోసమే.. రక్తం రుచి మరిగిన పులిరా, ఒక్కరోజైనా ఉపవాసం వుండమంటే ఎలా వుంటుంది?’’

‘’నేను నమ్మను. నువ్వు చెపితే వాళ్లెవరికీ కాదనే ధైర్యం లేదు. నీకు వుద్యోగం రావడానికి మీ దూరపుబంధువు విశ్వనాథంగారు హెల్ప్ చేశాడు. ఇప్పుడు యీ స్థితికి వచ్చాక కూడా నువ్వు యింకోడికి చేయలేవా?’’ ‘’’ఆయన సంగతే చెప్పావ్‍… ఒట్టి సత్తెకాలపు మనిషి. అందుకే ముసలితనంలో నానా అవస్థా పడ్డాడు. కొడుకులపై ఆధారపడవలసి వస్తే ‘కామధేనువు లాటి ఉద్యోగంలో వుండి కూడా కాసు సంపాదించలేద’ని వాళ్లు యీసడించారు. మాటలు పడలేక మందులు మానేసి, చావు కొని తెచ్చుకున్నాడు. నీకు పుణ్యం వుంటుంది. ఆయనలా వుండమని ఆశీర్వదించకురా బాబూ..’

‘మొదట్లో తమ్ముళ్ల కోసం అంటూ దుకాణం మొదలుపెట్టావు. పదేళ్లు పోయాక, ఇప్పటిదాకా మా అమ్మ సంతానం కోసం సంపాదించాను, నా పెళ్లాం బిడ్డలసంగతి కోసం ఏమీ చేసుకోలేదుకదా, యికపై వాళ్లకు అన్నావు. ఇప్పుడు బాగా దిట్టంగా సెటిలయినా యిదేం బుద్ధి? వదిలిపెట్టు.’ అంటూ నేనెంత తిట్టినా తిరపతికి రోషం రాలేదు. ‘రావల్సిన చెడ్డపేరు ఎలాగూ వచ్చింది. ఇప్పుడు మానేస్తే వ•ద్ధనారీ పతివ్రతా అని వెక్కిరిస్తారు. కాకుల మధ్య హంసలా వుండడం కష్టం. ఎదురీదడం ఎందుకు? ప్రవాహంలో పడి-పోవడం మంచిది’ వంటి మాటలేవో చెప్పాడు.

ఇక నాకు విసుగెత్తి ‘’ఈ అబ్బాయి సంగతి వదిలేయ్‍. నీకు కడుపు నిండింది కదా, పుచ్చుకునేదేదో తగ్గించి పుచ్చుకో. ఇవ్వలేని చోట వదిలేయ్‍.’’ అంటూ హితబోధ చేయబోయాను. ‘రేటు పడగొట్టుకుంటే మళ్లీ పెంచుకోలేం. ఆ తగ్గిద్దామనుకున్నదేదో దేవుడి హుండీలోనే వేస్తే మంచిది. దేవుడి ద్వారా లక్షలాది పేదలకు ఉపకారం జరుగుతుంది కదా’ అంటూ వాదించాడు.నిన్ను కాదురా, నిన్నిలా పుట్టించిన ఆ దేవుణ్ని అనాలి అని మనసులో అనుకుని వాడికీ, పై వాడికీ దణ్ణం పెట్టి వచ్చేశాను.

‘’ఇది జరిగిన మూణ్నాలుగు ఏళ్లకు మా వాడు సస్పెండ్‍ అయ్యాడు. వారం రోజుల తర్వాత నాకు తెలిసింది. హమ్మయ్య, దేవుడు యిప్పటికైనా మేల్కొని పని చేయడం మొదలెడుతున్నాడు అనుకున్నాను. ఏవైనా మంచిమాటలు చెప్పాలంటే యీ టైములో చెప్తేనే బుర్ర కెక్కుతాయి అనుకుని వాళ్లింటికి వెళ్లాను. ఓదార్చడానికి నేను సిద్ధంగా వున్నా, ఓదార్చబడడానికి వాడు రెడీగా లేడు. హుషారుగా మర్నాటి ప్రయాణానికి బట్టలు సర్దుకుంటున్నాడు. ఉద్యోగంలో గ్యాప్‍ వచ్చింది కదాని పెళ్లాంతో తీర్థయాత్రలు పెట్టుకున్నాడట. సస్పెన్షన్‍ మాట ఎత్తుదామా వద్దా? అని ఆలోచిస్తూ వుండగానే వాడే నా భుజం తట్టి ‘వినే వుంటావ్‍. ఏమీ గాభరా పడక్కరలేదు. అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. చిన్న డిపార్ట్మెంటల్‍ ఎంక్వయిరీ చేస్తారు. రిపోర్టు యిచ్చిన పది రోజులకి సస్పెన్షన్‍ రివోక్‍ చేస్తారు. మన పనులు యథావిధిగా చేసుకోవచ్చు.’’ అంటూ నవ్వాడు.

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇలాటివాడికి యిప్పటికైనా బుద్ధి రాకపోతే యింకెప్పుడు వస్తుంది? నేను నోరు తెరిచి చూస్తూ వుంటే వాడే అన్నాడు – ‘’అప్పుడోసారి ఆదాయం తగ్గించుకో, కన్సెషన్‍ యియ్యి లాటి సలహాలిచ్చావు. నీ మాట విని వుంటే యిప్పుడు యీ యిన్వెస్టిగేటింగ్‍ ఆఫీసరుకి యిచ్చుకోగలిగే వాణ్నా? తస్సదియ్య, ఎంత ఆశో తెలుసా దుర్మార్గుడికి! నాది నాలుగేళ్ల సంపాదన ఒక్క దెబ్బకి హుళక్కి అయిపోతోంది…’’ వాళ్లావిడ కాఫీ యిచ్చి లోపలకి వెళ్లాక నేను నోరు విప్పాను – ‘’ఒరేయ్‍, యిది విషవలయంలా అయిపోతోందిరా, సంపాదించినది పోయిందని నువ్వు మళ్లీ కతికితే, దాని మీద యింకో ఎంక్వయిరీ వచ్చి, వాడికి మళ్లీ..’’

‘’నీలా కథలు రాసేవాళ్లకు యిదో పెద్ద జబ్బు. లోకంలో న్యాయం ఎలాగూ జరగటం లేదు కదాని, కథల్లో పొయెటిక్‍ జస్టిస్‍ పేర మీ యిష్టం వచ్చినట్టు పాత్రలను రక్షిస్తూ, శిక్షిస్తూ వుంటారు. నన్ను ఓ పాత్రగా పెట్టి నవల రాసేవనుకో, నా పిల్లలకు అవకరాలతో పుట్టి నాకు బుద్ధి వచ్చిందని రాసేస్తావు. నేను అనుమతి యిచ్చిన ఫ్యాక్టరీలో తయారైన నకిలీ మందు కారణంగా నా ఆత్మీయుల ప్రాణాలు పోయాయని ట్విస్టు కల్పిస్తావు. ఫర్‍ యువర్‍ ఇన్ఫర్మేషన్‍ –  నేను మరీ అంత అన్యాయంగా, నెత్తి మీదకు వచ్చేట్టు చేయను…’’ వాడి అతితెలివికి మెచ్చుకోవాలో, మందలించాలో నాకు తెలియలేదు. అదే అనబోతే వాడు వినిపించుకోకుండా తన ధోరణిలో యింకా చెప్పుకుపోయాడు –

‘’నీ కథలో యీ సస్పెన్షన్‍ ఘట్టం రాస్తావ్‍. వాల్మీకి కథలోలా నేను మా తమ్ముళ్ల వద్దకు వెళ్లి సాయపడమని అడిగినట్టు, మాకోసమైతే మాత్రం యివన్నీ ఎవడు చేయమన్నాడని  వాళ్లు నాకు గడ్డి పెట్టినట్టూ రాస్తావ్‍. నీకు తెలుసా? నేను వెళ్లి అడగనూ లేదు. వాళ్లు ఓదార్చనూ లేదు. అసలు ఎవరికీ ఏమీ తెలియదు. మీడియాలో రాకుండా మేనేజ్‍ చేశాను. నా భార్య కూడా ‘నీ కర్మం, నీ పాపం నువ్వే భరించు’ అనలేదు. తను డబ్బున్నవాళ్లమ్మాయి. నన్ను ప్రేమించి నాతో వచ్చేసింది. తను అప్పటిదాకా అనుభవించిన స్టాండర్డ్ మేన్‍టేన్‍ చేద్దామని చూశాను. అది తనకూ తెలుసు. నన్ను పూర్తిగా అర్థం చేసుకుని అండగా నిలిచింది. ఇక మా పిల్లలంటావా? వాళ్లకు ఏది ఏమైందో తెలుసుకునే తీరికే లేదు. మాతో ఊళ్లకు వస్తారా అంటే టైము లేదన్నారు.’’

చెప్పి వాడి అలసిపోయాడు, విని నేను అలిసిపోయాను. చివరగా ఏదో ఒకటి అనాలనుకుని ‘’పుణ్యక్షేత్రాలకు వెళ్లి చేసిన పాపం కడుక్కుంటున్నావు. కొత్తవి చేయకుండా వుండాలంటే యిప్పటికైనా యిది మానేయాలి. మానేస్తావా?’’ అని చూశాను. ‘’ఇది పులి స్వారీ. దిగితే కుదరదు. ఇది సాగిస్తూనే ప్రతీ నెలా వెంకటేశ్వరస్వామికి యింత అని పంపించేయడమే తప్ప…’’ ‘’మీలాటి వాళ్లందరూ కలిసి దేవుణ్ని కూడా లంచగొండి చేసి పడేశార్రా..’’ నవ్వుతూ అన్నట్టే అన్నా ఉక్రోషం కనబడింది. తిరపతి కూడా నవ్వుతూనే ‘’అది చూసి మీలాటి వాళ్లందరూ నన్ను విలన్ను చేసి కథలు రాసుకుని తృప్తిపడండి.’’ అని వెక్కిరించాడు.

‘’ఇది పదేళ్ల కితం మాట. ఆ మధ్య అతని భార్య పోయిందంటే పలకరించడానికి వెళ్లాను. చార్‍ధామ్‍ యాత్రకు పెళ్లంతో వెళ్లాడు. కేదార్‍నాథ్‍ చూసుకుని వచ్చేస్తూ వుంటే తనున్న గెస్ట్ హౌస్‍ కూలిపోయిందట. సామాన్లు పోయి, మనుష్యులు మిగిలారు. కొంతమందితో కలిసి నడిచి వస్తూన్నారు. కుండపోతగా వర్షం. నది పొంగుతోంది. అవతలి గట్టు చేరాలంటే పడవలో ఆరుగుర్ని మించి తీసుకెళ్లనన్నాడు పడవవాడు. ఇవతల మరీ రిస్కు. నేల క్రుంగిపోతోంది. పైనుంచి ఏ కొండ చరియ ఎప్పుడు విరిగిపడుతుందో తెలియకుండా వుంది. పై నుండి బురదనీళ్లు కురుస్తున్నాయి. ఎత్తు వలన ఊపిరి అందటం లేదు. బురద వలన ఉక్కిరిబిక్కిరి. అటువెళ్లిన పడవ తిరిగి యిటు ఎప్పుడు వస్తుందో తెలియదు.

‘నువ్వు వెళ్లు. నేను తరువాతి ట్రిప్పులో వస్తాను’ అన్నాడు తిరపతి భార్యతో. ‘వద్దు, యిద్దరం కలిసే వుందాం’ అంటుంది భార్య. ‘ఇద్దరిలో ఒక్కరమైనా బతకాలి. పిల్లల బాగోగులు చూసుకోవాలి కదా’ అంటాడు వీడు. ‘అలా అయితే మీరే వెళ్లాలి. ఎవళ్లెవరి పేర ఎక్కడెక్కడ ఆస్తులు పెట్టారో మీకు తప్ప నాకు తెలియదు’ అని వాదించింది ఆవిడ. వీడికి భార్య మీద అమితప్రేమ. తనను ఎలాగైనా బతికించుకోవాలనుకుని కోప్పడి, కసిరి పడవ ఎక్కించాడు. తీరా చూస్తే పడవ మునిగిపోయి ఆవిడ పోయింది. వీడు మిగిలిపోయాడు.

బతికాడన్న మాటే కానీ చచ్చినట్టే లెక్క అనుకో. భార్య మీద పిచ్చివ్యామోహంతో తనను అందలంలో ఊరేగించాలంటూ అడ్డూ, అదుపూ లేకుండా సంపాదించాడు. రిటైరయ్యాక విదేశాలలో స్థిరపడి ప్రపంచమంతా తిరుగుతాం, నన్ను కట్టుకున్నందుకు తను గర్వపడాలి అనేవాడు. ఏదీ యిప్పుడు ఆవిడే లేదు. ఇంకోటేమైందంటే – వీడు అన్యాయంగా ఆర్జించినదంతా ఆ ఉత్తరాఖండ్‍లోనే పెట్టుబడి పెట్టాడు. ఈ రాష్ట్రంలో పెడితే అందరి కంటా పడుతుందని,  అక్కడ ప్రాజెక్టులు కట్టే మనవాళ్లను పట్టుకుని చార్‍ధామ్‍ దారిలోనే హోటళ్లు, రిసార్టులు కట్టించాడు. ఆనాటి బీభత్సానికి అవన్నీ పేకమేడల్లా కూలిపోయాయి. వాటికి నష్టపరిహారం యిస్తారన్న నమ్మకం లేదు. ఇస్తారనుకున్నా వీడు బినామీలుగా పెట్టినవాళ్లందరూ వరదల్లో కొట్టుకుపోయారు. మామూలుగా అయితే వీడు దేవాంతకుడు. అక్కడి అధికారులు, రాజకీయనాయకులు అందరూ బాగా తెలుసు కాబట్టి ఏదోలా మేనేజ్‍ చేసేవాడే. కానీ వాడికి యీ గారడీలు చేయాలన్న ఉత్సాహమే పోయింది. పోయింది పొల్లు అంటున్నాడు.

‘’మనం ఏదో మొనగాళ్లం అనుకుంటాం గానీ ప్రకృతి ముందు పిపీలకాలంరా. పర్యావరణాన్ని రక్షించవలసిన అధికారిని, ధ్వంసం చేయడంలో నాకూ పాలుంది. దేవుడు ఒక్కసారి తన తడాఖా చూపించాడు. అక్కడ మినిస్టర్ల నుండి సెక్రటరీల దాకా అందరూ మనవాళ్లే! ఏం లాభం? పలకరించి అడుగుదామంటే సెల్‍ పలకలేదు. సిగ్నల్సా పాడా? కొండలు కూలిపడుతూ వుంటే కాలి కింద భూమి కదిలిపోతూ వుంటే, మనం ఏట్లో పడి కొట్టుకుపోతూ వుంటే నోట్లూ, క్రెడిట్‍ కార్డులూ ఏం చేయగలవురా? అసలు అవి మాత్రం  వుంటే కదా, సర్వం జలమయం. శివుడు మూడోకన్ను తెరిస్తే అంతా స్మశానమేగా. ఏదో సాధించాననుకున్నాను. చాలా విద్యలు వచ్చనుకున్నాను. ఇన్నేళ్లగా దాచిన ధనాన్ని రక్షించుకోలేకపోయాను, ప్రాణానికంటె ఎక్కువగా ప్రేమించిన భార్యనూ రక్షించలేకపోయాను. ఇక ఎవరికోసం సంపాదించాలి చెప్పు.’’ అంటూ భోరున  ఏడ్చాడు తిరపతి.

మామయ్య చెప్పిన కథ పూర్తయిందని గ్రహించిన సుధీర్‍ ‘’..అంటే మీ తిరపతిలో యిప్పుడు పరివర్తన వచ్చిందంటావ్‍..’’ అన్నాడు. ‘’..అనే అనుకుంటున్నాను. ఇకపై నీతి తప్పనని గట్టిగా చెప్పాడు.’’ ‘’ప్రసూతి వైరాగ్యం, స్మశానవైరాగ్యం అంటారు. తిరపతిది రుద్రభూమి వైరాగ్యం అనాలేమో! అయినా యింత కన్విక్షన్‍తో అవినీతి చేసేవాడు ఓ పట్టాన మారడు, చాలామందిని చూశాను, ఒకసారి ఆ రుచి మరిగితే వదలలేరు…మామయ్యా, టైమైంది వెళ్లొస్తా. నేను యిలా అన్నట్టు అత్తయ్యకు చెప్పకు. దైవలీలల్ని శంకించానన్చెప్పి వచ్చేసారి తిండి పెట్టదు.’’ అన్నాడు సుధీర్‍ లేస్తూ.

తన ఎదురుగా కూర్చున్న చలపతి ఢక్కామొక్కీలు తిన్న రకంగానే కనబడ్డాడు – సుధీర్‍కు. అంతకు ముందు వున్న రికార్డుల ప్రకారం చూస్తే లంచగొండిలాగానే వున్నాడు. తప్పించుకున్నాడు. ఈ సారి కేసు మరీ గట్టిగా వుంది. కానీ ఎక్కడో తేడా కనబడుతోంది. కేసులో ఇరికించినట్టు వుంది. ఇలాటి సమాచారం కొలీగ్స్ తప్ప వేరెవరూ యివ్వలేరు. విడిగా కూర్చోబెట్టి అదే అడిగాడు. ‘’మీ స్టాఫ్‍లోనే మీకు శత్రువులున్నట్టు తోస్తోంది.’’ అని. ‘’కాగితం మీద కనబడేదాన్ని బట్టే కదా మీరు యాక్షన్‍ తీసుకునేది, కానీయండి’’ అన్నాడు చలపతి దేనికైనా సిద్ధపడ్డట్టు!

లంచ్‍ టైములో చలపతిని సుధీర్‍ బయట హోటల్‍కు తీసుకెళ్లి అడిగాడు. ‘’ఆఫ్‍ ద రికార్డ్ అడుగుతున్నాను. మీరు ఇంత తెలివైనవారు, సీనియర్‍. ఆ ఫైల్‍మీద నోట్‍ అలా రాసారేం?’ అని. ‘’అది దురుద్దేశంతో చేయలేదు. దురుద్దేశాలుండే రోజుల్లో అతిజాగ్రత్తలు తీసుకున్నాను. ఇప్పుడు నిజాయితీగా వున్నాను కదాని నిర్లక్ష్యంగా వున్నాను. నేను మారడం యిష్టం లేని కొలీగ్స్ యిరికించారు’’ నిర్లిప్తంగా చెప్పాడు చలపతి.

‘’బయటపడడం తెలియనివారేం కారుగా!’’ ‘’ఫిర్యాదుపై నా రిప్లయి ఎంత బాగా యిచ్చానో చూశారుగా’’ ‘’అది చూసే నాకు అనుమానం వచ్చింది. ఇది దొంగ ఆరోపణ అని. కానీ పై వాళ్లను నమ్మించాలంటే నాకూ కొన్ని కష్టాలుంటాయిగా…’’ సుధీర్‍ నాన్చాడు. ‘’..దానికోసం నేను దారి తప్పమంటే తప్పను.’’ చలపతి సూటిగా చెప్పాడు. సుధీర్‍ నిలదీశాడు – ‘’మీ గురించి వాకబు చేసి వచ్చాను. మీరు పత్తిత్తేమీ కాదు. ఓ ట్రస్టు పెట్టి విరాళాలు వసూలు చేశారు. ఆస్తులు పోగేశారు. గతంలో గొడవలు వచ్చినప్పుడల్లా తమాషాలు చేసి బయటపడ్డారు…’’ చలపతి తొణకలేదు. ‘’అదంతా గతం. ఇప్పుడు ఆ ట్రస్టు బోగస్‍ది కాదు. నిజంగా ధర్మకార్యాలకే డబ్బు వినియోగిస్తోంది. కావాలంటే చెక్‍ చేసుకోండి. నా పేర వున్న ఆస్తులన్నీ డిక్లేర్‍ చేశాను. పెనాల్టీలు కట్టేశాను.’’

సుధీర్‍ అతని కేసి దీర్ఘంగా చూస్తూ వుండిపోయాడు. ‘’ఓహో, యికపై గొడవ లేదన్నమాట. మంచిదే. సాటి గృహస్తుగా సలహా యిస్తున్నాను. మీరూ నేనూ లోకరీతి తెలియనివాళ్లం కాము. ఈ ఒక్కసారీ మేనేజ్‍ చేసి మీ డబ్బును, పేరుప్రతిష్టలను, భార్యాబిడ్డల్ని రక్షించుకోండి.’’ ‘’అయ్యా, నన్ను నేను రక్షించుకుంటే చాలు. నేను, అంటే నాలో మనిషిని… దానికే దిక్కు లేదు. ఇంకోర్నేం రక్షిస్తాను? కళ్లెదురుగా భార్య గంగానదిలో కొట్టుకుపోతూ వుంటే ఏ డబ్బు రక్షించగలిగింది? జైలు కెళితే పిల్లలకు అప్రతిష్ట అంటారా, నా ధనాన్ని అనుభవించినపుడు, యిదీ అనుభవించాల్సిందే. జరగాల్సింది జరుగుతుంది. మీ ధర్మం మీరు నిర్వర్తించండి.’’ విరాగిలా నోరు చప్పరించాడు చలపతి.

సుధీర్‍ కమలాకరరావుకి ఫోన్‍ చేశాడు. ‘’ఏరోయ్‍, మళ్లీ భోజనానికి వస్తానన్నవాడివి, వారం రోజులైనా పత్తా లేవు. ఊళ్లో వున్నావా? ఢిల్లీ చెక్కేశావా?’’ సమాధానంగా సుధీర్‍ ఒకే మాట అన్నాడు – ‘’మావయ్యా, మీ తిరపతిని కలిశా.’’ అని. ఆయన నవ్వాడు – ‘’ఆ పేరుతో ఎవరూ లేరురా, ఊరికే కథ అల్లాను. కథ రాస్తే మెలోడ్రామా పండుతుందో లేదో అని రెస్పాన్సు కోసం నీకు చెప్పాను.’’

‘’పోలీసువాడి దగ్గర పరాచికాలు వద్దు మావయ్యా, తిరపతి అసలు పేరు చలపతి!’’ ‘’హార్నీ.. భలే పట్టేశావురా! నువ్వు నీ డ్యూటీ గుట్టుగా వుంచావు కదాని, నేనూ పేరు గుట్టుగా వుంచాను.’’ ‘’..నాకు తెలిసేది కాదు, కానీ రుద్రభూమి హింట్‍ పట్టిచ్చింది.’’ కమలాకరం ఆశ్చర్యపడ్డాడు. ‘’మనిషి నిజంగా మారాడనుకున్నానే! నీకు తారసిల్లాడంటే మళ్లీ మొదలెట్టాడన్నమాట!. నువ్వే కరక్టురా అబ్బాయ్‍, చిరతపులి మచ్చలు మాన్చుకోదు.’’

‘’సామెత కరెక్టే కానీ ఒక్కోప్పుడు తప్పుతుంది మావయ్యా. ఇది తక్కినవాళ్లు అక్కసుతో బనాయించిన కేసు. మీ వాడిది స్మశాన వైరాగ్యం కాదు. నాకేదైనా యిస్తే వదిలేస్తానని ట్రాప్‍ చేయబోయినా పడలేదు.’’

‘’అవునా!? అప్పుడేం చేశావ్‍?’’

‘’ఆ మాట మీదే నిలబడండి, మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పాను.’’

‘’ధర్మం డ్యూటీ చేస్తుందో మాన్తుందో, నువ్వు గండం గట్టెక్కిస్తావా?’’

‘’ఛస్తామా? అంతరిస్తున్న జాతులను కాపాడుకోవాలంటారు. ఇప్పుడు చలపతీ అలాటి జాతుల్లో చేరారు. భద్రపరుచుకుని భావితరాలకు చూపుకోవాలి మరి.’’ అన్నాడు సుధీర్‍ చిరునవ్వుతో.

– ఎమ్బీయస్‍ ప్రసాద్‍ (మార్చి 2022)

[email protected]