జగన్ అలా అన్నారు గానీ.. ఆల్రెడీ లిస్టు రెడీ!

‘రాబోయే రెండేళ్లు పరీక్ష సమయం. ఇంటింటికీ తిరగండి. ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కనీసం మూడు సార్లయినా తిరగాలి. లేకపోతే గెలవడం కష్టం. సర్వేల్లో ఎవరి పనితీరు బాగా లేకపోయినా వారికి టికెట్లు…

‘రాబోయే రెండేళ్లు పరీక్ష సమయం. ఇంటింటికీ తిరగండి. ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కనీసం మూడు సార్లయినా తిరగాలి. లేకపోతే గెలవడం కష్టం. సర్వేల్లో ఎవరి పనితీరు బాగా లేకపోయినా వారికి టికెట్లు ఇచ్చేది లేదు’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరికీ తేల్చి చెప్పేశారు. 

నిజానికి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడం అనేది కొత్త సంగతేమీ కాదు. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మరింత నిర్మొగమాటంగా కూడా వ్యవహరించగలరు. కానీ.. తాజాగా శాసనసభా పక్ష సమావేశంలో సీఎం చెప్పిన మాటల అర్థం.. ‘రాబోయే రెండేళ్లలో బాగా కష్టపడండి.. చేయబోయే సర్వేల్లో తేలబోయే ఫలితాల్ని బట్టి, వారి పనితీరును బట్టి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది’ అన్నట్టుగా తెలుస్తోంది. 

కానీ విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఎవరెవరికి టికెట్లు నిరాకరించాలో ఆల్రెడీ జగన్ వద్ద లిస్టు రెడీగా ఉన్నదని తెలుస్తోంది. ఎంతోకాలంగా సర్వేలు జరుగుతూనే ఉన్నాయని, పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల లిస్టు రెడీ అయిపోయిందని.. కాకపోతే.. ఈ రెండేళ్లలో కొందరైనా పనితీరు మార్చుకుని కష్టపడగలరేమో అనే ఉద్దేశంతోనే జగన్ ఈ రకంగా చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

కనీసం యాభై మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదు అనే మాట వైసీపీలో చాలాకాలంగా వినిపిస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, ఇష్టారాజ్యంగా స్థానికంగా దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. 

ఎవరికి వారు.. తాము గుట్టుచప్పుడు కాకుండా స్థానికంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నాం అని అనుకుంటూనే ఉండవచ్చు గానీ.. అందరి తప్పుల చిట్టాలు జగన్ వద్ద నమోదు అవుతూనే ఉన్నాయని సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు జగన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూనే ఉన్నారని.. వాటి ఆధారంగా ఇప్పటికే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ మూడేళ్లలో చేసిన సర్వేల పలితంగా అచ్చంగా పక్కన పెట్టేసినట్టు కాకుండా.. పనితీరుపై శ్రద్ధలేని ఎమ్మెల్యేలు అందరికీ ఒక చివరి అవకాశం ఇస్తున్న తరహాలోనే జగన్ చేసిన తాజా ప్రకటనను పరిగణించాల్సిఉంది. ఏతావతా ఎమ్మెల్యేలు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎవరి మీద జగన్ వేటు వేయబోతున్నారో ఆ పేర్లు ఇప్పటికే నిర్ణయొం అయిపోయాయి. 

జగన్ అందించిన సంకేతాలతో జాగ్రత్తపడి.. కనీసం రాబోయే రెండేళ్ల వ్యవధిలోనైనా తమ పనితీరును మార్చుకుని.. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల దృష్టిలో మంచిపేరు తెచ్చుకోగలిగిన వారు.. ఆ లిస్టునుంచి బయటకు రాగలుగుతారు. అంటే మళ్లీ టికెట్ పొందగలుగుతారు. ఇప్పటికీ మేలుకోకుండా.. నేను అద్భుతంగానే చేస్తున్నా.. నాకేం భయంలేదు అని విర్రవీగే వారు.. చివరి నిమిషంలో షాక్ తింటారు.