జనసైనికులు కాస్త చంద్ర సైన్యం కానున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ కామెంట్స్ ఈ ప్రచారానికి తెరలేపాయి. జనసేన కాదు, ఇక అంతా చంద్రన్న సేన, లోకేశ్ సేన, తెలుగుదేశం సైన్యమే అనే వ్యంగ్య కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఇంతే కాదు, పవన్ ప్రసంగంపై అనేక చలోక్తులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కావాలని పవన్ కోరడాన్ని కూడా నెటిజన్లు విడిచిపెట్టలేదు.
రోడ్ మ్యాపా తొక్కా… రూపీ నోటు కోసం వెయిటింగ్ అంటూ దిమ్మతిరిగే సెటైర్స్‌తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ ఓట్లను చీల్చకుండా ఉండేందుకు ఈయన నాయకత్వం వహిస్తారట, అలాగే లోకేశ్‌ను సీఎం చేసే బాధ్యత కూడా తీసుకుంటున్న చెప్పకనే చెప్పారని… రాష్ట్ర బాధ్యతపై పవన్ కామెంట్స్‌కు సోషల్ మీడియాలో తమదైన భాష్యం చెబుతుండడం విశేషం.
సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ….ఇద్దరు పరాజితులు కలిస్తే ఏమవుతుంది బూడిద తప్ప అని నెటిజన్లు చంద్రబాబు, పవన్ కలయికలపై విరుచుకుపడుతున్నారు. ఔను, నేనొస్తున్నా, నేనొస్తున్నా అని ఆవిర్భావ సభకు రెండురోజుల ముందు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేసిన పవన్ భక్తుడు బండ్ల గణేష్ ఎక్కడ అని ప్రశ్నిస్తూ… ఓహో భక్తుడు లేని లోటును కూడా జనసేనానే భర్తీ చేశారా? అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు.
అలాగే అమరావతిలోనే రాజధాని వుంటుందని స్పష్టం చేసిన పవన్‌కల్యాణ్‌ను నెటిజన్లు విడిచిపెట్టలేదు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి? పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబుకు, అమరావతికి వ్యతిరేకంగా పవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడాన్ని గమనించొచ్చు.