ఈ కథ తమిళనాడులో నడిచిన ద్రవిడ రాజకీయాల గురించి రాసినది. ‘‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ తమిళనాడు ఎడిషన్స్‌లో 1990 ఏప్రిల్ 21 సంచికలో ముద్రితమైంది. అక్కడివాళ్ల వ్యవహారాలు మన తెలుగువాళ్లకు సరిగ్గా తెలియకపోవచ్చని క్లుప్తంగా చెపుతున్నాను. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తమిళ ప్రాంతాలలో ఇవి రామస్వామి నాయకర్ (పెరియార్ అని ఆయనకు బిరుదు) బ్రిటిషు వాళ్ల మద్దతుతో కాంగ్రెసు వాళ్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిపాడు. తమిళ, తెలుగు ప్రాంతాల్లో ఆ రోజుల్లో కాంగ్రెసు నాయకత్వం బ్రాహ్మణుల చేతిలో ఉండేది కాబట్టి, దాన్ని బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా, హిందూమత వ్యతిరేక ఉద్యమంగా మలిచాడు. ద్రవిడ జాతి ఆర్యజాతి కంటె భిన్నమైనదని, తమిళులే ఐనా సరే తమిళ బ్రాహ్మణులు ఆర్యులనీ, శూద్రజాతులు ద్రవిడులని, వారంతా ఏకమై ఆర్యులను అణగదొక్కాలని పిలుపు నిచ్చాడు. ద్రవిడ కళగం (డికె) అనే పేర సంస్థ పెట్టి, ఉద్యమానికి ద్రవిడ స్వయంమర్యాద (ఆత్మగౌరవం) ఉద్యమమని పేరు పెట్టాడు.
ఇలా ద్రవిడ నాయకులు ఒక రకమైన మతరాజకీయం, స్పష్టంగా చెప్పాలంటే మతవ్యతిరేక, మరీ స్పష్టంగా చెప్పాలంటే అగ్రకుల వ్యతిరేక రాజకీయంతో జనాభాలో అధికసంఖ్యలో ఉన్న బిసిలను కూడగట్టారు. నాస్తికత్వాన్ని ప్రబోధిస్తూనే హిందూమతానికి చెందిన దేవుళ్లను అవమానించే రాతలు రాశారు, చేష్టలు చేశారు. గుళ్లకు వెళ్లేవారి దారికి అడ్డుగా పడుక్కోవడం, భక్తుల పిలకలను కోయడం… యిలా నానా రకాల బీభత్సాలను చేశారు. ఇదంతా హిందూమతానికి వ్యతిరేకంగా మాత్రమే చేశారు. క్రైస్తవం, ఇస్లాం జోలికి వెళ్లలేదు. చిత్రమేమిటంటే యిలాటి అడ్డగోలు వాదనలు తమిళ మేధావులను, యువకులనే కాక సామాన్య ప్రజలను కూడా ఆకర్షించాయి. ఈ ద్రవిడోద్యమ నాయకులు మంచి వక్తలు. శక్తివంతమైన రచయితలు. ఉపన్యాసాల ద్వారా, నాటకాల ద్వారా, తర్వాతి రోజుల్లో సినిమాల ద్వారా ప్రజలను ఆకట్టుకుని వారి ఆలోచనలను ప్రభావితం చేయగలిగారు.
దీని కారణంగా ఎందరో అతి సామాన్యులు కూడా తాము నాస్తికుల మంటూ కలవరించారు. నాయకులు చెప్పినది తుచ తప్పకుండా ఆచరించారు. బిసిలను బాగా ఆకట్టుకుని, ఓటు బ్యాంకుగా మలచుకుంది యీ ఉద్యమం. ఆ పాప్యులారిటీని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి డికెను రాజకీయపార్టీగా మార్చాలని పెరియార్ శిష్యులు అణ్నాదురై, కరుణానిధి యిత్యాదులు భావించారు. కానీ పెరియార్ వారించాడు. సాంఘిక సంస్కర్తనని చెప్పుకునే పెరియార్ 1948లో తన 70వ ఏట, 32 ఏళ్ల మణియమ్మను పెళ్లాడడంతో నిరసన తెలిపి, విడిపోవడానికి అదే అదనని యీ అనుయాయులు విడిగా వచ్చేసి 1949లో డిఎంకె (ద్రవిడ మున్నేట్ర కళగం) అనే పార్టీ పెట్టి ఎన్నికల రంగంలోకి దిగారు. 1967లో ఎన్నికలలో గెలిచి, అణ్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిన్నర పాలించాడో లేదో అనారోగ్యం పాలై మరణించాడు. అతన వారసుడిగా కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. అతని పాలన సామర్థ్యానికి, అవినీతికి పేరుపడింది. సిద్ధాంతాలు వట్టి నినాదాలుగానే మిగిలాయి. అప్పటికి తమిళ రాజకీయాల్లో బ్రాహ్మణాధిక్యత నశించడంతో, బ్రాహ్మణవ్యతిరేకత, నాస్తికత్వం ఓట్లు రాల్చడం మానేశాయి.
క్రమేపీ ద్రవిడ నాయకులు గుళ్లకు వెళ్ల నారంభించారు. దైవకార్యాలు నిర్వహించారు. కరుణానిధి కూడా తన ఊళ్లో గుడికి కొత్త రథం బహూకరించాడు. మాటల గారడీతో తన చర్యలను సమర్థించుకునేవాడు. దరిమిలా ప్రతికక్షులు నీ నాస్తికత్వం ఏమైందని ఎద్దేవా చేస్తే, రాముడి గురించో, మరో హిందూ దేవుడి గురించో ఏవో పిచ్చికూతలు కూసేవాడు. అతనొక వైరుధ్యాల పుట్ట, రాజకీయపక్షి. ఈ కథలో సారంగన్ పాత్ర అతనిదే. దండపాణి కారెక్టరు అణ్నాదురైది. ఉన్నవాళ్లలో నిజాయితీపరుడైన అణ్నాదురై, డిఎంకె యిలా పిల్లిమొగ్గలు వేసినపుడు బతికి వుంటే ఏం చేసేవాడు అనే ఊహతో రాసినదే యీ కథ. దీనిలో వేలన్ దండపాణి ఎదురుగా ఉన్నపుడు కూడా ‘మీరిలా అన్నారు’ అని నేరుగా అనకుండా ఆయనెవరో వేరే వాడన్నట్లు ‘అన్న ఇలా అన్నాడు’ అంటూ మాట్లాడతాడు. కేరళలో, దక్షిణ తమిళనాడులో అలా మాట్లాడే పద్ధతి ఉంది. ఈ కథకు నేను ‘‘ఏన్ ఐడియలాగ్స్ డైలమా’’ అని, ‘‘ఎన్‌కౌంటర్ విత్ ఇమేజి’’ అని రెండు పేర్లు సూచించాను. కానీ ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ సబ్ ఎడిటరు దాన్ని ‘‘యువర్స్ ట్రూలీ, దండపాణి’’గా మార్చారు. ఇక కథలోకి వెళదాం.
కథ 13: నీడ నిలదీస్తే…
వేలన్ చిన్న దగ్గు దగ్గి ‘‘అన్న యింట్లో ఉన్నారా?’’ అని సంకోచంగా అడిగాడు. ఆ యింటి అరుగుమీద పోస్టరు డిజైన్ గురించి ఘాటుగా చర్చించుకుంటున్న తలకాయల్లో మూడు, నాలుగు యిటు తిరిగాయి.
‘‘ఏ ఊరు?’’ అని అడిగాడొకతను.
‘‘అచ్చంపట్టి… దండపాణి అన్నను చూడాలి… వీలు పడితే.’’ అన్నాడు వేలన్ చిన్న గొంతుకతో.
‘‘ఫర్వాలేదులే, లోపలకి వెళ్లు.’’ అంటూ గుమ్మం కేసి చేయి చూపించాడతను.
ఆ అరుగునిండా తెల్లకాగితాల రీములు, కరపత్రాల గుట్టలు, వాల్‌పోస్టర్లు, వాలంటీరు బాడ్జీలు, బెలూన్లు.. ఒక పెద్ద ఫంక్షన్‌కి కావలసిన సామగ్రితో అడుగు పెట్టడానికి వీల్లేనంతగా ఉంది. పెట్టే చోటు కాస్త మిగిలితే దానిలో వాలంటీర్లు కూర్చుని రిబ్బన్లు అందంగా చుడుతున్నారు. వేలన్ దేన్నీ తొక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ గుమ్మం గడప దగ్గరకి వెళ్లి అక్కడ ఆగాడు. లోపలకి అడుగుపెట్టడానికి జంకుతున్నాడు. ‘‘వెళ్లు ముసలోడా, అన్న పేపరు చదువుకుంటున్నాడులే’’ అన్నాడు ఓ వాలంటీరు.
మొదటి గ్రూపులో ఉన్న ఒకతను ‘‘అచ్చంపట్టి అంటే తిరుచ్చి జిల్లానా?’’ అని అడిగాడు.
‘‘తిరునల్వేలి.’’ అన్నాడు ఓ ముసలతను.
‘‘ఏదో చిన్న పల్లెటూరై ఉంటుంది. ఎప్పుడూ వినలేదు. ఇతని వాలకం చూస్తూంటేనే అదెంత మారుమూల గ్రామమో తెలుస్తుంది.’’ అని ఓ కుర్ర వాలంటీరు జోక్ చేశాడు. ‘‘అతని బెరుకు చూడు, ఇక్కడ హంగామా చూసి తికమకపడిపోయాడు. దండపాణిగార్ని కలవడమంటే తిరుపతిలో వెంకటేశ్వరస్వామి దర్శనం అనుకుంటున్నాడు.’’ అంటూ పగలబడి నవ్వాడు. దండపాణి అంటే తేలికభావం కనబరచిన కుర్రాణ్ని చూసి ముసలతనికి మండుకొచ్చింది. ‘‘మీ కుర్రకారుకి దండపాణి గారంటే తెలియకపోవచ్చు కానీ మా తరం వాళ్లకు ఆయన్ని చూడడమంటే వెంకటేశ్వరస్వామిని చూడడం కంటె ఎక్కువని తెలుసుకో. సంఘసంస్కరణ గురించి, ఆత్మగౌరవం గురించి, నాస్తికత్వం గురించి, ఒకటేమిటి అన్ని రకాల సబ్జక్టుల మీద అన్న యిచ్చిన ఉపన్యాసాలైతేనేం, రాసిన వ్యాసాలైతేనేం లక్షలాది మంది యువకులను కదిలించింది. వారిని పార్టీ వైపు మళ్లించింది. మన పార్టీకి పునాదిరాళ్లు వేసిందే ఆయన. ఆయన లేకపోతే పార్టీ యీ స్థితికి వచ్చేదే కాదు.’’ అన్నాడు కాస్త ఆవేశంగా.
మధ్యలో యింకొకతను కలగజేసుకుని ‘‘నువ్వు చెప్పింది నిజమే కానీ, సారంగన్‌తో పోలిస్తే ఆయన చాలడు. దండపాణి గారి ఉపన్యాసాలు ప్రజల్ని ఆలోచింపచేస్తే, సారంగన్ ఉపన్యాసాలు జనాల్ని కిర్రెక్కించాయి. ఎన్నికల్లో పార్టీకి ఓట్లు కురిపించాయి. అందుకే పార్టీ సారంగన్‌ని ముఖ్యమంత్రి చేసింది. దండపాణి గార్ని జనాలు మర్చిపోయారు. ఆ కుర్రాడు ఏదో తమాషాకి అంటే నువ్వెందుకంత ఉడుక్కోవడం పెద్దాయనా?’’ అన్నాడు. ముసలాయన తగ్గలేదు. ‘‘దండపాణి గారు సారంగన్‌కు తీసిపోతాడంటే నేనొప్పను. సారంగన్ శరీరమైతే, దండపాణి మెదడు. పార్టీకి ఒక సిద్ధాంతమనీ, ఆదర్శాలనీ కలగజేసిందే దండపాణి! సారంగన్ వాటిని నాటకీయంగా వేదికల మీద వల్లించాడంతే. అందుకే పదవి కట్టబెట్టారు. అయితే గద్దె నెక్కాక ఏం చేశాడు? తనకే కాదు, పార్టీకి కూడా చెడ్డపేరు తెచ్చిపెట్టాడు. అందుకే అధికారం పోగొట్టుకుని కూలబడ్డాడు. ఇప్పుడు దండపాణి గారు కావలసి వచ్చాడు. ఎందుకంటే దండపాణి మచ్చలేని చంద్రుళ్లా, ఎప్పుడూ వెలుగుతూనే ఉన్నారు.’’
ఆ గ్రూపు నాయకుడికి యీ చర్చంతా వృథా అనిపించింది. దీన్ని ఆపించి, పని మీదకు దృష్టి మరలించాలనుకుని మధ్యేమార్గంగా మాట్లాడాడు. ‘‘..ఆ సంగతి సారంగన్‌కూ తెలుసు. అందుకే దండపాణి సార్ షష్టిపూర్తి ఘనంగా తలపెట్టాడు. మీటింగులు, సెమినార్లు, ఆయన సిద్ధాంతాలపై వక్తృత్వపోటీలు, రాష్ట్రంలో అన్ని గుళ్లల్లో పూజలు, రాష్ట్రమంతటా హోమాలు, ఆయన పాత పుస్తకాల పునర్ముద్రణ.. ఒకటా రెండా? వీటితో దండపాణిగారు కొత్త తరానికి కూడా తెలుస్తారు. మన పార్టీ ఆదర్శాల గురించి చర్చ జరుగుతుంది. యువత మళ్లీ మనవైపుకి వస్తారు. మన ఓటుబ్యాంకు విస్తరిస్తుంది. అధికారంలో ఉండగా మనం చేసిన రాజకీయ తప్పిదాలు ప్రజలు మర్చిపోతారు. మన పార్టీ అంటే సిద్ధాంతాల మీద ఆధారపడిన పార్టీ అని అందరూ గుర్తిస్తారు. మనం మళ్లీ అధికారంలోకి వచ్చే రోజు దూరంలో లేదు. అన్నిటికీ మూలం యీ షష్టిపూర్తి సంబరం! ఎక్కువ సమయం లేదు. ఏర్పాట్లు చూస్తే బోలెడున్నాయి. కబుర్లలో పడితే పని సాగదు. ముందు యీ పోస్టరు వ్యవహారం ముగించాలి. రఘూ, నువ్వు వెళ్లి ప్రింటర్ని పిలుచుకుని రా.’’ అంటూ యువ వాలంటీరును బయటకి పంపించేశాడు.
చదువుతున్న పేపరు లోంచి దండపాణి తలెత్తి చూస్తే గుమ్మంలో ఓ పెద్దాయన కనబడ్డాడు. ‘‘ఏం కావాలి?’’ అని అడిగాడు. వేలన్ కాస్త ముందుకు అడుగేసి, ‘‘నా పేరు వేలన్. మాది అచ్చంపట్టి. మిమ్మల్ని చూడాలని…’’ అన్నాడు. దండపాణి తల వూపాడు. వేలన్ బట్టల కేసి చూసి ‘‘వ్యవసాయమా?’’ అని అడిగాడు. ‘‘కాదు, కూలిపని చేసుకుంటాను. మొన్న సంక్రాంతికి మా ఆవిడ పోయింది. ప్రసవంలో మా అమ్మాయి పోయింది. మనవడు నా దగ్గరే పెరుగుతున్నాడు…’’ అన్నాడు వేలన్. అసలు సంగతి కనుక్కోకపోతే యితను తన జీవితగాథ చెప్పేట్లు ఉన్నాడని భయపడి దండపాణి ‘‘ఇంతకీ నా దగ్గరకి ఎందుకు వచ్చినట్లు?’’ అని సాధ్యమైనంత మృదువుగా అడుగుతూ, పేపరు మడిచి పక్కనున్న బల్ల మీద పెట్టాడు.
దండపాణి తన మాటల్ని వినడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించి వేలన్ పరమానంద భరితుడయ్యాడు. గట్టిగా ఊపిరి పిలిచి, తల వంచుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘అన్న అరవై ఏళ్లు చల్లగా బతికినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఇంకా చాలాకాలం బతకాలి. చాలా రోజుల తర్వాత అందరూ అన్న గురించి మాట్లాడుతూండడం చూస్తే గర్వంగా ఉంది. కానీ… నాలో ఒక సందేహం కదులుతోంది. చదువురాని యీ శుంఠ నన్ను ప్రశ్నించడమా అని అన్న అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను. ఇలాటివి నేను అన్నని కాకపోతే ఎవర్ని అడుగుతాను. మాకు దారి చూపించిన మార్గదర్శకుడాయన. మా నాయకుడు. మాకూ ఆత్మగౌరవం కల్పించి, ఆలోచించడం నేర్పినది అన్నే…’’
మధ్యలో తల యెత్తి దండపాణి కేసి చూసి ఆయన మౌనంగా వింటూండడం చూసి వేలన్ ధారాళంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట్లో ఉన్న బిడియం యిప్పుడు లేదు. మాటలకు తడుముకోవడం లేదు. ఎందుకంటే తన మనసులో నాటుకుపోయిన దండపాణి రచనల్లోని వాక్యాలే అతను వల్లిస్తున్నాడు. ‘‘కష్టపడే శ్రామికులు తమ హక్కుల కోసం అడగడం అన్నే నేర్పించాడు. అగ్రవర్ణాలను చూసి హడిలిపోవద్దని, మతం పేరుతో వాళ్లు చలాయించే అధికారాన్ని, అహంకారాన్ని, పైకి కనబడకుండా చేసే దోపిడీని ఎదిరించమని, దానికి మొదటి మెట్టుగా మూఢనమ్మకాల్ని వదుల్చుకోమని అన్నే బోధించాడు. దేవుడనే వాడే లేడని, కనబడని ఆ పదార్థాన్ని మూర్ఖులు మాత్రమే పూజిస్తారని, కొందరు మోసగాళ్లు ఆ పేరు చెప్పి ప్రజల్ని అణగదొక్కుతారని నిరూపించాడు. మా తరం వాళ్లందరం అన్నను చెప్పిన మాటల్ని నెత్తిన పెట్టుకున్నాం. ఆయన చెప్పినది తుచ తప్పకుండా పాటించాం. మా జీవితాలు అలాగే గడిచిపోయాయి. కానీ యిప్పుడు అన్నే…’’ వేలన్ హఠాత్తుగా ఆగిపోయాడు. కాస్సేపాగి వాక్యాన్ని లోగొంతుతో పూరించాడు. ‘‘.. అన్నే యిప్పుడు వేరేలా ప్రవర్తిస్తూ ఉంటే నాకు మతిపోతోంది. ఏమీ తెలియటం లేదు.’’
వేలన్ చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న దండపాణికి వేలన్ చివర్లో చెప్పినది అర్థం కాలేదు. ‘‘ఏం చెప్పదలచుకున్నావో స్పష్టంగా చెప్పు.’’ అన్నాడు. వేలన్ పెదాలు తడుపుకున్నాడు. ‘‘మీ షష్టిపూర్తికై మీరు గుళ్లల్లో పూజలు, యాగాలు, హోమాలు ఏర్పాటు చేస్తున్నారట కదా! దేవుడే లేనప్పుడు యివన్నీ ఎవరి కోసం? లేకపోతే దేవుడున్నాడని అన్నకు నమ్మకం కుదిరిందా? కుదిరితే ఆ మాట మాకు చెప్పేవాడు కదా!’’ ఇక్కడిదాకా ధైర్యంగా మాట్లాడిన తర్వాత వేలన్‌కు హఠాత్తుగా భయం వేసింది. చటుక్కున ఆగిపోయాడు. ఏం సమాధానం చెప్పాలో దండపాణికి అర్థం కాలేదు. ‘‘ఆ ఏర్పాట్లు చేస్తున్నది నేను కాదు. పార్టీ చేస్తోంది.’’ అని నసిగాడు. వెంటనే ఆయనకే తట్టింది, తన సమాధానం పేలవంగా ఉందని!
ఆయన మనసులో ఆలోచనలు సుళ్లు తిరిగాయి. నిజానికి తన విశ్వాసాలు చెక్కు చెదరలేదు. అప్పుడూ, యిప్పుడూ ఎప్పుడూ తను దేవుడికి దణ్ణం పెట్టుకోలేదు. గుళ్లలో హోమాల ప్రస్తావన రాగానే తను తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ సారంగన్, యితరులు కలిసి ‘దేవుడు ఉన్నాడా లేడా అనేది యిప్పడు యిస్యూయే కాదు. గతంలో అయితే అగ్రవర్ణాల వాళ్లు అధికారపీఠంపై ఉండేవారు. ఇప్పుడు వాళ్లంతా మూలపడ్డారు. వాళ్లపై దాడి చేయడానికి నాస్తికత్వాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. దేవుణ్ని నమ్మమని చెప్పి మనం బావుకునేది లేదు. ఆ అంశంమీద మనకు ఒక్క ఓటు కూడా రాదు, ఒక్క ఓటు కూడా పోదు.’ అని వాదించారు.
ఆ మాట నిజమని తనకూ తెలుసు. తామంతా ఎంత యిదిగా నాస్తికవాద ప్రచారం చేసినా, ప్రజలు మరింతగా దేవుడి వైపు మొగ్గారు. మతఛాందసం పెంచుకున్నారు. వారిని సంతృప్తి పరచడానికి అన్ని రాజకీయ పార్టీల వాళ్లూ గుళ్లకు వెళ్లసాగారు. ఇలాటి పరిస్థితుల్లో షష్టిపూర్తి మహోత్సవంలో పూజాపునస్కారాలు లేకుండా చేస్తే జనాలు పార్టీ పట్ల విముఖత ప్రదర్శించి, రాబోయే ఎన్నికలలో ఓట్లేయరని సారంగన్ వాదన. ‘మీ నాస్తిక యిమేజి వలన ఒక్క ఓటు అదనంగా పడదు సరి కదా, ఉన్న ఓట్లు ఊడతాయి. పార్టీని విస్తరిద్దామన్న నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ గంగలో కలుస్తాయి.’ అన్నాడు. ఇక తనకి ఒప్పుకోక తప్పలేదు. కానీ ఇలాటి వాడొకడు వచ్చి నిలదీస్తాడని కలలో కూడా అనుకోలేదు.
దండపాణి ఆలోచనల్లో ములిగిపోవడం చూసి వేలన్ గిల్టీగా ఫీలయ్యాడు. తన కారణంగా నాయకుడికి మానసిక వేదన కలిగిందని గ్రహించి సిగ్గుపడి, మరింత వివరణ యివ్వబోయాడు – ‘అది కాదు అన్నా, మీ బోధలు విన్నాక నేను ఎప్పుడూ దేవుడికి దణ్ణం పెట్టుకోలేదు. అంతేకాదు, యింట్లో కూడా పూజాగీజా చేయడానికి వీల్లేదన్నాను. మా ఆవిడ, పిల్లలూ కూడా నేను చెప్పిన మాట విన్నారు. కానీ మా ఆవిడకి ముసలితనంలో చాదస్తం పట్టుకుంది. ‘నేను చచ్చిపోయాక శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేయండి’ అని కోరింది. నీ మీద ఎంత ప్రేమున్నా అది మాత్రం చేయనన్నాను. ఏడ్చింది పాపం. కానీ నేను బెసకలేదు. ఆర్నెల్ల తర్వాత పోనే పోయింది. ఏ కర్మకాండా చేయకుండా శవాన్ని తగలేశాను. ఇప్పుడు గందరగోళంలో పడ్డాను. నా నాయకుడు దేవుడున్నాడని నమ్మితే, దేవుడున్నట్టే కదా! అప్పుడు నా భార్య ఆత్మకు ఏమవుతుంది? నా సంగతేమిటి? నాకు డబ్భయి దాటాయి. ఎప్పుడైనా రాలిపోతాను. అప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లాల్సి వస్తే, ఆయన ఏవిట్రా యిలా చేశావు? ఇన్నాళ్లూ నన్ను పట్టించుకోలేదేమిట్రా అని కోపగించుకుంటే జవాబేం చెప్పను? నా కొడుకులు యిప్పటికే గుళ్లకు వెళుతున్నారు, మొక్కులు మొక్కుతున్నారు. నాకేం చేయాలో పాలుపోవడం లేదు సామీ’’ అంటూ నేల మీద కూలబడి నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు.
దండపాణి మౌనంగా విన్నాడు, కళ్లజోడు తీసి తుడుచుకున్నాడు, తల గోక్కున్నాడు. చాలా కాలం తర్వాత ఒక నిజాయితీపరుడైన అనుచరుడు తారసిల్లాడు. ‘మీ శకం అయిపోయింది, జనాలు మిమ్మల్ని మర్చిపోయారు, మీరేం చేసినా పట్టించుకునేవారు లేరు’ అని పార్టీ సహచరులు చెప్తూంటే అది నిజమని తనూ నమ్మాడు. కానీ చూడబోతే కొంతమంది మనసుల్లో తను తిష్ట వేసుకుని ఉండిపోయినట్లు తెలుస్తోంది. దానికి సంతోషించాలా? బాధపడాలా?
తన వాచీ కేసి చూసుకుని, వేలన్‌తో ‘‘నేను కాస్త బిజీగా ఉన్నాను. నీకు ఉత్తరం రాస్తాను. బయట రామన్ ఉంటాడు. అతనికి నీ అడ్రసు యిచ్చి వెళ్లు.’’ అన్నాడు. తన రాక అతనికి మనస్తాపం కలిగించినట్లు గ్రహించిన వేలన్ మౌనంగా లేచి, చేతులతో నమస్కారం పెట్టి ‘వెళ్లి వస్తా’ అని గొణిగాడు.
సాయంత్రానికి కూడా దండపాణి సమాధానపడలేదు. తన మెదడులోంచి, మనసులోంచి వేలన్‌ను తరిమివేయడం సాధ్యపడలేదు. తను నాయకుడిగా వెలిగిన రోజుల్లో ఆచారవ్యవహారాల పట్ల అతను చాలా నిర్దయగా ఉండేవాడు. ముసలి తలిదండ్రులు బతిమాలినా, భార్య మొత్తుకున్నా, బంధువులు కోపగించుకున్నా పూజాపునస్కారాలంటే యింతెత్తున ఎగిరిపడేవాడు. ఎవర్నీ చేయనిచ్చేవాడు కాడు. ఏళ్లు గడిచేకొద్దీ మెత్తబడ్డాడు. ఇంట్లో తక్కినవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటే చూసీచూడనట్లు ఉండసాగాడు. ‘నా దారి నాది, మీ దారి మీది. మన మధ్య తగాదా అనవసరం.’ అనేవాడు. తను నాస్తికుడిగానే కొనసాగాడు కానీ, దేశదేశాలలోని ప్రజలందరూ భగవంతుణ్ని ఎందుకు నమ్ముతారో అర్థం చేసుకోవడంలో పరిణతి సాధించాడు. ఇలా చాలా ఏళ్లు సాగింది కానీ అతని కూతురి పెళ్లి విషయంలో చిక్కు వచ్చిపడింది. ఆ అమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించింది. అబ్బాయి తలిదండ్రులు కూడా ఒప్పుకున్నారు కానీ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలన్నారు. ‘నేను పీటల మీద కూర్చుని కన్యాదానం చేయడమేమిటి, నాన్సెన్స్’ అన్నాడు దండపాణి. కానీ అవతలి వాళ్లు పట్టుబట్టారు. అబ్బాయి కూడా వాళ్ల పక్షమే. దాంతో పెళ్లి ఆగిపోయింది.
కానీ కూతురు ఊరుకోలేదు. ‘సమాజం పట్ల నీ బాధ్యతల గురించి లెక్చర్లు దంచుతావు. కుటుంబం పట్ల ఏ బాధ్యతా లేదా? కుటుంబం సమాజంలో భాగం కాదా? మాట్లాడితే ప్రజల మనోభావాలు అంటూ సాగదీస్తావు. కుటుంబసభ్యులకు ఏ మనోభావాలూ ఉండవా? నీ ఆదర్శాల కోసం నా సంతోషాన్ని బలి యిస్తావా?’ అని కడిగి పారేసింది. సరిగ్గా అదే సమయంలో కేరళలో ఓ నాస్తిక కమ్యూనిస్టు మంత్రి కూతురి పెళ్లి నిశ్చయమైంది. అతను జన్మతః క్రైస్తవుడైనా చర్చి మొహం చూడడం మానేసి దశాబ్దాలైంది. చర్చి యిదే అదననుకుని ‘నువ్వు చర్చిని అడ్డమైన తిట్లూ తిట్టావు. నీ కూతురు పెళ్లి సోలమ్నయిజ్ చేయం’ పొమ్మంది. కూతురు, కాబోయే అల్లుడు మొత్తుకున్నారు. చాలా తర్జనభర్జనల తర్వాత ఆ మంత్రి చర్చి మెట్లెక్కాడు. వాళ్లు మళ్లీ బాప్టిజం యిచ్చి, క్రైస్తవుడిగా ప్రకటించి, అప్పుడు అతని కూతురి పెళ్లి నిర్వహించారు. ‘తన కూతురి పట్ల ఆయనకున్న అభిమానం, వాత్సల్యం నీకు నా పట్ల లేదా?’ అని కూతురు చెరిగేసింది.
నెల్లాళ్ల పాటు మథన పడ్డాక, దండపాణి సరేనన్నాడు. తన గారాబు కూతురు తన కారణంగా నష్టపోవడం భరించలేక పోయాడతను. అదృష్టవశాత్తూ తను అప్పటికి లైమ్‌లైట్‌లో లేకపోవడం చేత ఎవరూ తన కన్యాదాన క్రతువును పట్టించుకోలేదు. న్యూస్ పేపర్లో దాని గురించి ఫోటో కాదు కదా, వార్తయినా రాలేదు. ఏ వేలనూ రాలేదు. కానీ యిప్పుడు పరిస్థితి మారింది. పార్టీ యిప్పుడు అతన్ని గొప్ప మహానుభావుడిగా ప్రొజెక్టు చేయడంతో చేస్తున్న ప్రతీ పనీ హైలైట్ అవుతోంది. షష్టిపూర్తి జరుపుదామని పార్టీ నిశ్చయించగానే అతని భార్య గుడికి వెళ్లి హోమాలు చేద్దామంది. తనతో పాటు వచ్చి పీటల మీద కూర్చోవాలంది. అతను కుదరదనడంతో కన్యాదానం సంగతి ఎత్తింది. కూతురి కోసం అప్పుడు రాజీ పడ్డారు కదా, యిన్నాళ్లు మీతో కాపురం చేసిన భార్య కోసం యీ మాత్రం చేయలేరా? అంది. సారంగన్ చేసేది నచ్చకపోయినా పార్టీ కోసం మొహమాట పడినప్పుడు కుటుంబసభ్యుల కోసం కాస్త మొహమాట పడితే తప్పేముంది అని సర్దిచెప్పుకున్నాడు.
వేలన్ వచ్చి వెళ్లిన తర్వాత మరొక కోణం వచ్చి చేరింది. పార్టీ పట్ల, కుటుంబం పట్ల బాధ్యత సరే, వేలన్ వంటి సిన్సియర్ శిష్యుల మాటేమిటి? వాళ్ల పట్ల తనకు ఏ బాధ్యతా లేదా? తనైతే విద్యావంతుడు, తెలివైనవాడు, లోకం కోసం పూజా అదీ చేసినా, మనసులో తన నాస్తికత్వాన్ని భద్రంగా కాపాడుకోగలడు. వేలన్ వంటి అమాయకుల సంగతేమిటి? తనలోని యీ ద్వైదీభావాన్ని అర్థం చేసుకోలేరు కదా. వాళ్లు అయోమయంలో పడతారు కదా. ఇన్నాళ్లూ వాళ్లని మానసికంగా నడిపిస్తూ వచ్చి యీనాడు వాళ్ల మానాన వాళ్లను గందరగోళంలో వదిలేయడం సబబేనా? తను గొప్పవాడు కాదని తనకి తెలుసు. కానీ తనో మహానుభావుడని, ఓ ప్రవక్త అని భావించే వేలన్లు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ల పట్ల తన కర్తవ్యం నిర్వర్తించకపోతే ఎలా? వాళ్లలో విశ్వాసం నిలిపి ఉంచడం ఎలా?
హాల్లో పచార్లు ఆపి దండపాణి కిచెన్‌లోకి వెళ్లాడు. భార్య వంట చేస్తోంది. ‘‘ఇదిగో, షష్టిపూర్తి ఫంక్షన్ గురించి.. ఓ మాట, పార్టీ వాళ్లు ఇంగ్లీషు లెక్క ప్రకారం జూన్ 18న చేస్తున్నారు. నువ్వు పంచాంగం ప్రకారం ఎప్పుడు పడుతుందో చూసి చెప్పు. అవేళ ఆ ఆయుర్వృద్ధి హోమమేదో యింట్లోనే చేసుకుందాం. పబ్లిసిటీ ఏమీ అక్కరలేదు. చుట్టాలూ రానక్కరలేదు. నేను నా భార్య కోసం చేస్తున్నాను తప్ప, ఊళ్లో వాళ్ల కోసం కాదు…’’ అని చెప్పాడు. ఆవిడేదో అనబోయింది కానీ ఆయన కంఠంలో దృఢత్వం చూసి మానేసి, తల ఊపింది.
ఆ తర్వాత తన టేబుల్ వద్ద కూర్చుని సారంగన్‌కు ఒక ఉత్తరం రాశాడు. షష్టిపూర్తి ఉత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మతపరమైన ఫంక్షన్లన్నీ నిలిపివేయమని దానిలో ఆదేశించాడు. తర్వాతి ఉత్తరం వేలన్‌కు! మై డియర్ వేలన్, ‘‘నువ్వు మా యింటికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈ జూన్ 18న నేను నా పుట్టినరోజు పండగను మీ యింట్లో జరుపుకుందా మనుకుంటున్నాను. నీ బోటి మిత్రులందరితో కలిసి గత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుందా మనుకుంటున్నాను. నా రాకకు నీకెలాటి అభ్యంతరం ఉండదని నా నమ్మకం.’’ – ఇట్లు, భవదీయుడు, దండపాణి.
(ఈ కథలో ముఖ్యపాత్రల పేర్లు రెండూ కుమారస్వామి పేర్లే అని గుర్తిస్తే, టైటిల్‌లో ఉన్న ‘నీడ’ ప్రయోగంలోని స్వారస్యం బోధపడుతుంది. నిజానికి రచయిత పాఠకుడి ఊహకు కొంత వదిలేయాలి. కానీ యీ రోజుల్లో కథలు చదివేవాళ్లే తక్కువ. చదివేవారికి తీరికా, ఓపికా తక్కువ. వారిపై భారం మోపడం యిష్టం లేక నేనే చెప్పేశాను. మరొక స్వీయానువాద కథ వచ్చే నెల నాలుగో బుధవారం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)