లౌకికవాదం వర్ధిల్లాలి
ఘనత వహించిన రాజకీయవేత్తగారిని అంతకుముందు రెండుసార్లు కలిసివున్నా, ఈసారి మాత్రం ఆయన చాలా బిజీగా ఉన్నట్టు మొహం పెట్టి నేనెవరో అపరిచితుడన్నట్టు ఎగాదిగా చూశారు. నేను నమస్కరించిన తర్వాతనే ఓ చిరునవ్వూ, దాంతోపాటు ఓ షేక్హేండూ పారేశారు.
''ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు'' అన్నాను ఏదో ఒకటి అనాలని.
''భలే కనిపెట్టాశారే! నేను నిజంగా దీర్ఘాలోచనలో మునిగివున్నాను. దేశపరిస్థితి ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఎవడు మాత్రం ఊరికే ఉండగలడు చెప్పండి?'' ఆయన నుదుటిమీది ముడతలు ఆయన చెప్పినదానికి సాక్ష్యం పలికాయి.
ఆయనను చింతలపాలు చేస్తున్న దొంగను కనిపెట్టిన తృప్తిని మందహాసంతో తెలియబరుస్తూ ''నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక వ్యత్యాసాల గురించేకదా మీ అందోళన?'' అని అడిగాను. నికార్సైన సోషలిస్టు అయిన కారణంగా ఆర్థిక అసమానతలుండకూడదని నేను గాఢంగా విశ్వసిస్తాను. నేను ఇంకా కలర్ టీవీ కూడా కొనకుండానే మా ఇంటిపక్కాయన వి.సి.ఆర్.కొనేయడంతో ఈ అసమానతలు దినదినానికి పెరిగిపోతున్న విషయం సులభంగా కనుక్కోగలిగాను.
ఘరావేత్తగారు మెచ్చుకోలుగా నా భుజం తట్టేరు. ''కీలకం పట్టేశారు. గొప్పా, బీదా తేడాలు ఎక్కువైపోతున్నాయి. మనం ఏదో ఒకటి, అదీ వెంటనే చేసితీరాలి. కానీ దీని కంటే మించిన సమస్య మరొకటి ఉంది, గమనించారూ?''
''ఓ, అదా? ఇప్పుడు తెలిసింది! మీ మనస్సు బాధపడుతూండడానికి కారణం దేశంలో స్వైరవిహారం చేస్తున్న మతవాదం. అవునా? అలా చెప్పండి. ఈ ఛాందసవాదులు, ముఖ్యంగా హిందూ ఛాందసవాదులు, రామజన్మభూమి గురించో, కాశ్మీరు పండిట్ల గురించో చేసే హడావుడి చూస్తే ఎవరికైనా మండుకొస్తుంది.''
సామ్యవాదినీ, ప్రగతివాదినీ కావడంచేత నాకు మతఛాందసం అంటే పడదు.., ముఖ్యంగా హిందూ మతఛాందసం. నా దృష్టిలో అది సమాజానికి పట్టిన చీడ.
ఘరావేత్తగారు నా భుజాలు రెండు చేతులా పట్టుకొని కళ్ళు విప్పార్చి, నాకేసి చాలాసేపు చూస్తూనే ఉండిపోయారు. ''అద్భుతం! దేశ సమస్యల గురించి మీకున్న నిశితదృష్టి అమోఘం. మతవాదానికి వ్యతిరేకంగా నేను సాగించే పోరాటంలో ఒక మిత్రుడు దొరికినందుకు నేను ధన్యుణ్ణి'' అన్నారు ఆనందం ప్రకటిస్తూ.
నేనూ పొంగిపోయాను. ''అటువంటి పోరాటంలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తాను సార్. నిజానికి నా దగ్గిర దాని గురించి బ్రహ్మండమైన పథకం ఒకటి రెడీగా ఉంది.'' ఎవరో వెనకనుంచి నా చొక్కా కొసలు లాగి నా వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేయబోయారు. తిరిగి చూస్తే మా అవిడ.
''వెళ్ళి పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకునీ చూసి పలకరిద్దామా?'' అంటోంది.
కాస్సేపు ఆగమని ఆవిడకి చెప్పి ఘరావేెత్తగారికి నేను పకడ్బందీగా రూపొందించిన వ్యూహం గురించి వివరించబోయాను. కానీ ఆయనే నన్నాపేడు. ''మనం ఎప్పుడైనా కలిసి తీరిగ్గా మాట్లాడుకొందాం. ఓ పని చేస్తా. మిమ్మల్ని ప్రత్యేకంగా మతవాదంపై చర్చకు ఆహ్వానిస్తాను. అప్పుడు అన్ని విషయాలూ విశదీకరిద్దురుగాని. ప్రసుత్తం నేను ఎలక్షన్ ప్రచారం ఆరంభించడానికి రాష్ట్రమంతా పర్యటించవలసి వుంది. నేను ఎంచుకొన్న ఏకైక అంశమేమిటో తెలుసా? లౌకికవాదం. మిస్టర్ గోడ్బోలే, మీలాంటి వారి సహకారం లేనిదే…''
''క్షమించాలి, నా పేరు గాడ్గీళ్'' సరిచేశాను.
''భలేవారు. మీ పేరు తెలియకపోవడమేమిటి? ఏదో నాలిక మెలతబడింది, ఎందుకైనా మంచిది మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. అవసరం పడ్డప్పుడు, మీ సహకారం కోసం పిలుస్తాం. ఈ లోపున మీ పరిధిలో మీరు లౌకికవాదం గురించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూండండి. మీ ఆఫీసులో, ఇంటిపక్కల, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడైనా సరే మీ ప్రచారాన్ని ఆపకండి''.
ఈ ప్రబోధంతో నన్ను ఉత్తేజపరిచాక మిగతావారి సంగతి చూడడానికి వేత్తగారు సాగిపోయారు.
''ఏమిటి ఆయనతో ముచ్చట్లు, రాజకీయాలేనా?'' అంది మా ఆవిడ సంశయంగా.
''ఇంకేమిటనుకొన్నావ్? చూస్తూండు రేపట్నుంచి మొదలుపెట్టి మతవాద భూతాన్ని భూస్థాపితం చేసేదాకా పోరాటం సాగిస్తాను'' అన్నాను ఉత్సాహంగా, నొక్కి వక్కాణించకపోతే ఇటువంటి శల్యసారథ్యం చేసేవాళ్ళ తిక్క కుదరదు.
''అది చెయ్యడానికి మీరే దొరికారా? పోనీ మరీ అంత ముచ్చటగా ఉంటే గడప దాటకుండా మీ రాజకీయాలు కానివ్వండి. నా వంతు త్యాగం నేను చేస్తాను. మీరు పాలిటిక్స్, సోషలిజం, సెక్యులరిజం ఏది మాట్లాడినా సరే కిమ్మనకుండా వింటా. పనుందన్చెప్పి వంటింట్లోకి జారుకోను. ఎదురుప్రశ్నలు వేయను. సరేనా? మీరు మాత్రం…'' అంది మా ఆవిడ దిగొచ్చి.
''చూడు మహాతల్లీ! ఇది నీకూ, నాకూ మాత్రమే సంబంధించిన సమస్య కాదు. సిద్ధాంతాలకు సంబంధించినది. ఒక సిద్ధాంతానికి బద్ధుడనయిన తర్వాత ఎవరు నొచ్చినా, ఎవరు మెచ్చినా మడమ తిప్పేది లేదు''
తెచ్చి పెట్టుకున్న అణకువ ఇగిరిపోయి, ''మీ సిద్ధాంతాలూ చట్టుబండలూనూ'' అంటూ బుసకొట్టి విసవిసా వెళ్ళిపోయిందావిడ.
xxxxxxxxxxxxx
మర్నాడు పొద్దున్న నా పాలబడ్డవాడు మా కొలీగ్ హసన్భాయ్. ''హసన్భాయ్, హసన్భాయ్, దేశంలో పెచ్చరిల్లుతున్న మతవాదం గురించి నీకు చింతలేదా?'' అనడిగేను.
''సవాలక్ష గొడవలతో నేను సతమతమవుతూంటే అది చాలనట్టు ఇదొకటా?'' అన్నాడు హసన్భాయ్.
''మరి దేశం గురించి పట్టించుకొనేదెవడు చెప్పు'' అన్నాను అనునయంగా.
''నేను మాత్రం కాదు. కావలిస్తే నువ్వు మహరాజులాగా పట్టించుకో, నా కభ్యంతరంలేదు''
''కానీ నీ సహకారం లేనిదే అది సాగదు''
''సహకారమా? అంటే?'' అనుమానం తొంగిచూసింది అతని ముఖంనుండి.
''మరేమీ లేదు. మనం ముస్లిం సోదరులకు లౌకికవాదం గురించి వివరించి చెప్పాలి. దానికోసం పేటవరకూ మీటింగులు పెడదాం. మొదట మీ బస్తీలో ఓ సమావేశం పెట్టి నువ్వూ, నేనూ ఉపన్యాసాలిద్దాం. షాబానో కేసు గురించి, ముస్లిమ్ పర్సనల్ లా గురించీ..''
''నీకేం మతిపోలేదుకదా? అటువంటివి మాట్లాడితే పళ్ళు రాలతాయి. పళ్ళు రాలగొట్టించుకోవడం కథారంభం మాత్రమే. ఆ తర్వాత కథ కంచికీ, మన మింటికీ ఎలా వెళ్తామో నాకు తెలీదు'' భవిష్యత్తు గురించి ఆలోచన ఒళ్ళు జలదరింపజేసిందేమో, టోపీ జారిపోబోయింది. దాన్ని సరిచేసుకుంటూ అదే పరుగు.
ముస్లిమ్ జనాలతో నాకు పెద్దగా పరిచయం లేకపోవడంవలన హిందువుల పైనే నా దృష్టిని కేంద్రీకరించాను. అదొక్కటే కారణం కాదు. జనాభాలో ఎక్కువశాతం వారే కాబట్టి మతవాదుల్లో కూడా వారే ఎక్కువ ఉండాలని తర్కం చెబుతుంది. పైగా ఏ అభ్యుదయవాది వ్యాసాలు, ఉపన్యాసాలు చదివినా, వినినా ముస్లిములు, క్రిష్టియన్లు, పార్శీలు ఇత్యాది అల్ససంఖ్యాక వర్గాలంతటి సహనశీలురు, శాంతస్వభావులు ఎవరూ లేరని తెలుస్తుంది.
అందువల్ల హిందువులమీదే పడాలి. ఇరుగూ, పొరుగూ హిందువులకామాటే చెబితే వారికి రుచించలేదు. మతవాదులనిపించుకోవడం ఇష్టం లేనట్టుంది. సల్మాన్ రుష్దీ గొడవ గురించి, ఫామిలీ ప్లానింగ్‌పై పోప్ అభిప్రాయాల గురించీ, కాశ్మీర్‌నుంచి పండిట్లను తరిమివేయడం గురించి అదీ ఇదీ మాట్లాడారు.
లౌకికవాదంలో నాకున్న అచంచల విశ్వాసంవలన వాటన్నింటినీ తిప్పికొడుతూ వాదించేవాణ్ణి. వీధిలో నిలేసి కూడా నచ్చచెప్పబోయేవాణ్ణి కానీ వాళ్ళు పాపం బిజీగా ఉండడంవల్ల ఎక్కువసేపు నా వాదనలు వినలేకపోయేవారు. ఇంటి దగ్గరైతే విశదంగా మాట్లాడుకొవచ్చుకదాని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాణ్ని. కానీ అదేం చిత్రమో, నే వెళ్ళగానే వాళ్ళ భార్యలు నాకెదురొచ్చి భర్తలు ఇంట్లో లేరని చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు భర్తలు నా కంటబడినా, ముందు అవీ ఇవీ మాట్లాడి లౌకికవాదం చర్చ రసపట్టులోకి వచ్చే సమయానికి బజార్లో పనుందంటూ జారుకొనేవారు.
అంతగా చదువుకోని ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వంటివారిని వివేకవంతులుగా చేసే బాధ్యత కూడా మనదేకదాని వాళ్ళకీ లౌకికవాదం గురించి చెప్పబోతే వాళ్ళు అదోలా చూసి వెళ్ళిపోయారు.
తరువాత కాకతాళీయమో, ఎగతాళీయమో గానీ మా ఇంట్లో కరెంటుపోయింది. ఎన్ని కబుర్లు పంపినా రెండురోజులైనా ఎలక్ట్రీషియన్ జాడలేదు. నేను చికాకు పడుతూంటే మా ఆవిడ వెటకారం మిళాయించి '' ఇలా ఎందుకు జరిగిందో మీకు తెలియదనే అంటారా?'' అనడిగింది.
''ఏమో, వైరింగులో ఏదైనా లోపం ఉందేమో'' అన్నాను.
''లోపం వైరింగులో కాదు, మరోచోటుంది'' అంది అర్థవంతమైన చూపుల బరపుతూ.
నాకేం బోధపడలేదు. ''ఎక్కడ?'' అన్నా.
''అబ్బబ్బ? అఘోరించినట్టే ఉంది మీ తెలివి. మిమ్మల్ని చూస్తేనే జనం పారిపోతున్నారని తెలియటంలేదూ?''
''నిజంగానా?''
''కాకపోతే? మీ ఉపన్యాసాలు ఆపకపోతే ఇంతకంటే అఘాయిత్యాలు జరుగుతాయి. అసలే ఎలక్ట్రీషియన్ ఇటువంటి విషయాల్లో గట్టి అభిప్రాయాలున్నవాడని వినికిడి. అతని దగ్గిర మీ ధోరణిలో మీరు మాట్లాడితే కొంప మునుగుతుంది'' పెడసరంగా మాట్లాడటంలో ఆవిడని మించిన వాళులేరు.
''మైగాడ్! కరంటు అందుకే పోయిందంటావా? మనుషులు ఇంత సంకుచితంగా ప్రవర్తిస్తారంటావా?'' అనుమానం తీరక అడిగాను.
''దివ్యంగా. గట్టిగా మాట్లాడితే సంకుచితంన్నరగా ప్రవర్తించగలరు. రేప్పొద్దున్న మీ స్కూటర్ టైర్లలో గాలి తీసేసినా, నాకేం వింతగా తోచదు. అందుకని ఇప్పటికైనా మీ పోరాటానికి స్వస్తి పలకండి'' మా ఆవిడ కుండబద్దలు కొట్టి నిజం చెప్పే ప్రయత్నంలో స్టీలు బిందెను వంటింటి గడపమీద బాదింది.
''కానీ నా సిద్ధాంతాలు నాకున్నాయి'' నేనూ ఉద్ఘాటించాను.
''సంతోషం. వాటన్నిటినీ భోషాణంలో పెట్టి తాళం వేయండి లేదా వాటిని చాటుకోవాలని మరీ అంత ఇదిగా ఉంటే ఏ కోయంబత్తూరో, గౌహతియో వెళ్ళి అక్కడి జనాలకి ఉద్భోధించి వాళ్ళు కర్రలు తిరగేసేలోగా చప్పున తిరిగొచ్చెయ్యండి. అంతేగానీ మన పేటలో మాత్రం ప్రయోగాలు కట్టిపెట్టండి''
నేను సిద్ధాంతాలకు నిబద్ధుడనయినవాడినే గానీ, గాలి తీసేసిన స్కూటర్ని అరమైలు దూరంలో ఉన్న పెట్రోలు బంకుకు తోసుకెళ్తున్న దృశ్యం కళ్ళముందు కదలాడుతూండడంతో ఉత్సాహం కాస్తా చప్పబడింది. అందువల్ల సెక్యులరిజం విషయం పక్కనబెట్టి జనాలతో క్రికెట్టు గురించీ, వర్షాల గురించీ, పెరిగేధరల గురించీ మాట్లాడడం పునఃప్రారంభించాను.
xxxxxxxxxxx
కొన్నిరోజుల తర్వాత ఘరావేత్తగారు మళ్ళీ కలిశారు. నన్ను చూడగానే మొఖమంతా నవ్వు చేసుకొని ''ఈసారి పొరబాటు చేయనండోయ్. మీ పేరు గాడ్గీిళ్. మీకు సోషలిజం, సెక్యులరిజం అంటే మహా అభిమానం. కరక్ట్? ఆఁ ఇప్పుడు చెప్పండి- మీ ఉద్యమం ఎలా నడుస్తోంది?''
కాస్త విషాదంగానే, ''ఏం చెప్పమంటారు? సరిగ్గా నడవటంలేదు. కుంటడం కూడా లేదు. నన్నడిగితే జనాలకి మతవాదం తప్ప లౌకికవాదం తలకెక్కదంటాను. మీ అనుభవమూ ఇంతేకదా?''
''నో, నో. నా ఎలక్షన్ టూర్లో లౌకికవాదంవైపు ప్రజలు మొగ్గుతున్నారని స్వయంగా గమనించాను. నిజానికి వారెంతో ఉత్సాహం చూపుతున్నారు కూడా' అన్నారు వేత్త నవ్వుతూ.
నాకు కూతూహలం పెరిగింది. ''మీరు కాస్త వివరంగా చెప్పాలి'' అని కోరాను.
''చెప్తా వినండి! నా ఎన్నికల ప్రచారం ప్రతాప్‌గఢ్‌లో భవానీ మందిరం వద్ద పూజతో ఆరంభించానండి. మాత కుంకుమ చేతబట్టి ప్రజల్ని సూటిగా అడిగాను. ''భవానీమాత శివాజీ మహరాజ్‌కి స్వయంగా నేర్పిన లౌకికవాదం సమర్థిస్తారా లేక బ్రాహ్మణుల తిరోగమన మతవాదాన్ని సమర్థిస్తారా'' అని. 'జై భవాని' అని ప్రజలరిచిన కేకలతో దిక్కులు పిక్కటిల్లాయంటే నమ్మండి. అప్పటికప్పుడు లౌకికవాదాన్ని సమర్థిస్తూ పెద్ద ఊరేగింపు కూడా బయలుదేరతీశాను. తెలుసా?''
''భేష్, భేష్'' అన్నాను నేను.
''అది ఆరంభం మాత్రమే నండోయ్. ఆ తర్వాతి ఊళ్ళో వెనకబడ్డ జాతులవారి ఊరేగింపును ఉద్దేశించి ప్రసంగించా. ఏమనో తెలుసా? మీరు వెనకబడి ఉన్నారంటే కారణం ఎవరు? మీ అవకాశాలు అణగదొక్కిన అగ్రజాతులవారు కారూ? ఇటువంటి మతవాదం కొనసాగాలా? మీ జనాభా నిష్పత్తి కనుగుణంగా ఉద్యోగాల రిజర్వేషన్లు కావాలా? మీ కులాలకు చెందిన మంత్రులు ఒకరు… ఒకరే ఎందుకు? ముగ్గురు… కాబినేట్ ర్యాంకు మంత్రులు.. మంత్రివర్గంలో ఉండి లౌకికవాదాన్ని నిలబెట్టాలా? అక్కర్లేదా'' అని అడిగాను. వాళ్ళు ఆకాశం దద్దరిల్లేలా సింహధ్వానాలు చేసి లౌకికవాదానికి సమ్మతి ప్రకటిస్తూ అప్పటికప్పుడు పెద్ద ఊరేగింపు ఏర్పాటు చేశారు''
''భలే, భలే''
''అంతటితో ఆగలేదండోయ్! తర్వాత ఊళ్ళో ముస్లిముల సభనొకటి ఏర్పాటుచేసి నా ప్రసంగంలో లౌకికవాదం ప్రకారం మీరు కొరాన్ బోధనలననుసరించి మీ మతాన్ని ఆచరించాలి. అటువంటి లౌకికవాదం కావాలో లేక మీ పర్సనల్ లా లో జోక్యం చేసుకొనే కరడుకట్టిన మతఛాందసం కావాలా? అని అడిగేసేను. వాళ్ళందరూ 'అల్లా హో అక్బర్' అని ఒక్కుమ్మడిగా అరిచి లౌకికవాదానికి వత్తాసు పలికారు.
నాకు ఆనందంతో కన్నీరు ఉబికింది. ''మీరు నిజానికి దేశాన్ని మతవాదుల బారి నుండి రక్షించారు. లౌకికవాదం మనదేశంలో మనగలదంటే అది మీలాంటివారి చలవే'' అనేశాను.
''ఏదో మీలాంటివారి ఆశీస్సులవల్ల అలాటివెన్నో చేస్తున్నాననుకోండి. మీవంతు సహాయంగా మీరు కూడా ఈ నా కృషి గురించి పత్రికలవాళ్ళకి ఒక స్టేటుమెంటు మిగతా వారిచేత కూడా సంతకాలు పెట్టించి ముప్ఫైమంది మేధావుల ప్రకటన అని ఇస్తే బాగుంటుందనుకొంటాను''
'' తప్పకుండా! దానికేం భాగ్యం! ప్రకటనలు ఇవ్వడానికి మా మేధావులు ఎప్పుడూ ముందుంటారు'' అంటూ ఉప్పొంగిపోతూ హామీ ఇచ్చాను.
గంగాధర్ గాడ్గీళ్ మరాఠీ రచనకు అనువాదం
– ఎమ్బీయస్ ప్రసాద్
(విపుల ఏప్రిల్ 1997లో ప్రచురితం)