ఆ రోజు సాయంత్రం క్లబ్బులో జరగబోయే పార్టీ గురించి తలుచుకొంటేనే పొద్దుట్నుంచీ ఆనందంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరిస్తే ఎలా ఉంటుందాని ఆలోచించి చూస్తే ఇంగ్లీషులో 'ఐయామ్ ఆన్ క్లౌడ్ నైౖన్' అనిపించింది. అద్దానికి తెలుగు మాట ఏమిటాని ఆలోచిస్తే ఏమీ కనబడలేదు. పరభాషా పదాలను, భావాలనూ ఎడాపెడా పుణికి పుచ్చుకునే ప్రక్రియలో మన తెలుగు భాష ఈ మధ్య వెనుకబడిందా అనిపించింది. నాలాటి వాళ్లే పూనుకొని తెలుగు పరిధిని విస్తృతం చేయక తప్పదు. 'అతను ప్రస్తుతం తొమ్మిదో మేఘం మీద ఉన్నాడు, రేపు దశాహం.' అని రాసేస్తే సరి.
ఆనందంగానే అచలపతిని పిలిచేను, ''చూడు, సాయంత్రం క్లబ్బులో పార్టీకీ టైలరు నుండి సూట్ తీసుకొచ్చి రెడీ చెయ్యి'' అన్నాను.
అచలపతి అతివినయంగా ''తప్పకుండా సర్, సూట్ అంటే ఏ కలర్ సూట్ సర్?''
తెలియనట్టు అడుగుతున్నా అతనికంతా తెలుసునని నాకు తెలుసు. ఆ గుడ్డలు కొన్నప్పుడే ఆ నారింజ పండు రంగు కోటుకు, వంగపండు రంగు పాంటుకు పొత్తు కుదరదని అచలపతి సూచించినా, నేను పట్టుపట్టి అవే కొన్నాను. ఆ రంగుల పేర్లు ఉచ్చరించేటప్పుడైనా ఏవగింపు కలిగి ఆ బట్టలు వద్దంటానని అచలపతి దురుద్దేశ్యం కాబోలు.
అచలపతి ఎలాటివాడంటే ఏం చెప్పగలం? ఇంగ్లీషులో ఫాస్టిడియస్ అనవచ్చు. (ఇద్దానికి తెలుగు? నిఘుంటువులో చూస్తే , 'ఒక గుణ విశేషము' అని వుంటుంది కాబోలు. ఈ నిఘంటుకారులు ఈ 'విశేషము' అన్న పదాన్ని విశేషంగా ఉపయోగిస్తారు) కట్టూ, బట్టా, ప్రవర్తనా అన్నీ పక్కాగా ఉండాలంటాడు. అయినా అతను నా బట్టల విషయం దగ్గర్నుండీ శాసించ చూడడం నాకు నచ్చలేదు. అందుకని ఎస్వీరంగారావంత గాంభీర్యంతో ''అచలపతీ, ఆ బట్టల గురించి నీ అభిప్రాయం నాకు తెలుసు. అయినా అవే వేసుకుంటాను. వెంటనే ఏర్పాట్లు చూడు'' అన్నాను.
''సరే , మీ ఇష్టం సార్'' అంది మూర్తీభవించిన వినయం తాలూకు నోరు. కానీ, 'సరే, మీ ఖర్మం సార్' అంది నొసలు.
ఆ మధ్యాహ్నం మా బుచ్చిమావయ్య వస్తూనే ''ఏరోయ్ అనంతశయనం, మర్చిపోయా, పేరు మార్చుకున్నావు కదూ… అనంత్… అలాగేకానీ, మనవాళ్లు పోయింది పొల్లన్నారు కానీ, నీకు ఆ పొల్లు మీదే గురి ఎక్కువలాగుంది. హ్హ హ్హ'' అని నవ్వి ''మా అబ్బాయికి పెద్ద ఇబ్బందొచ్చిపడిందోయ్'' అంటూ కూలబడ్డాడు.
నాకూ, నా పాఠకులకూ నచ్చే విధంగా ఈయన సరాసరి పాయింటులోకి దిగిపోతాడు. ''మన మదన గోపాలుడు లేడూ, మా పెద్దాడు… వాడికి పెళ్లి కుదిరింది.''
''…అవునుమరి, పెళ్లంటే పెద్ద ఇబ్బందే, ..గునిసే భార్య, ..నసిగే అత్తగారూ, పీక్కుతినే పిల్లలూ… ప్చ్'' సంతాపం వెలిబుచ్చాను.
''నువ్వొకడివి. బ్రహ్మచారి దగ్గరికి రావడం నాదే తప్పు. వాడికి పెళ్లి చేసుకోవాలనే ఉందిరా బాబూ. కానీ ఆగిపోయే ప్రమాదం వచ్చిందనే వాడి ఏడుపూ, నా ఏడుపూనూ, అవునూ ఈ వూళ్లో రంగాజమ్మ, పంకజం అనే అక్కాచెల్లెళ్లు ఉన్నారట, నీకు తెలుసా?''
''నాకు తెలీదే! ఎవరు వాళ్లు?''
''నాకు తెలుసులే – నీకు తెలిసివుండదని. వాళ్లు…వాళ్లు అదో బాపతు మనుషుల్లే!''
''అదో బాపతంటే అదే బాపతనా?''
''అదే, అదే… అందులోనూ ఆ చిన్నదుంది చూడు – పంకజం, అదంటే మా వాడికి ఇది. నాక్కాస్త ఆలస్యంగా తెలిసింది. మనస్సంతా ఇదయిపోయింది. మావాణ్ని చివాట్లేసాను. 'ఏమిట్రా ఇది?' అని. వాడూ ఇదయ్యేడు తను చేసినదానికి అంటే…. అదేం లేదుట్రోయ్.. వాళ్ళిద్దరి మధ్యా ఏదో కాస్త ఇదిగా ఉన్నారట అంతే. ఎంత ఇదైనా నలుగురికి తెలిస్తే మనకి ఇదిగా ఉండదూ?''
తెలుగుభాషని సుసంపన్నం చేయడానికి నాకంటె ముందు చాలా మంది కృషి చేశారు. ఎన్టీఆరన్నగారు కూడా తమిళ 'మానాడు' ను పట్టుకొచ్చి 'మహానాడు' చేసి తెలుగుకి అందించేరు. ఎవరెంత చేసినా, ఆ 'ఇది' మాటను తెలుగుకి సమకూర్చిన వారి గురించి ఎంతో ఇదిగా చెప్పుకోకతప్పదు. ఈ టెక్నిక్ తెలిసే మనిళ్లల్లో ఆడవాళ్లు నామవాచకాల జోలికి పోకుండా ఈ సర్వనామంతోనే సరస శృంగార సంభాషణలనుండి దారుణమైన తిట్లదాకా మేనేజ్ చేస్తున్నారు.
''నేను నా సొదేదో చెప్పుకొంటుంటే వేదిక మీద పీవీ నరసింహారావులా ఆ దీర్ఘాలోచనేమిట్రా? నేను చెప్పినదేమైనా విన్నావా?''
''వినకపోవడమేం? కానీ ఇందులో నా పాత్ర ఎప్పుడు రంగప్రవేశం చేస్తుందాని స్టేజి కళ్ల కద్దుకొని రెడీగా నిలుచున్నాను''.
''సరే, సరే. మా వాడికి పెళ్లి కుదిరిందన్నాను కదా. జమీందార్ల సంబంధం. ఈ పంకజం విషయాలు బయటకొస్తే ఇక ఆ సంగతి హుళక్కి. మా వాడు ఏవో ఉత్తరాలు మాత్రం ఏడ్చాట్ట. వెళ్లి దాని మొహాన డబ్బు కొట్టి, ఆ ఉత్తరాలు పట్టుకొచ్చెయ్ .. చాలు..''
''భలేవాడివి మామయ్యా, నే వెళ్తానని ఎలా అనుకొన్నావ్? నా వల్లకాదు బాబూ''
మామయ్య బ్రతిమాలేడు. గడ్డం పట్టుకొన్నాడు, చచ్చి నా కడుపున పుడతానన్నాడు (సైన్సు చేసే అద్భుతాలపై తనకి బాగా గురిఉంది, క్లోనింగులు మగకడుపులేగా!) నా ఋణం ఉంచుకోనన్నాడు. రేప్పొద్దున్న నేను ఎటువంటి ఆడాళ్లతో తిరిగినా తను వచ్చి చక్రం అడ్డువేస్తానన్నాడు.
''ఆ చక్రం ఇప్పుడే ఎందుకు వేయకూడదు?'' అని అడిగేను.
ఆయన విశదీకరించేడు – ఇలాటి సందర్భాల్లో డబ్బు తీసుకొని వెళ్లిన వాళ్లు రేటు తగ్గించడానికై తాము పరువూ ప్రతిష్ఠా బొత్తిగా లేని వాళ్లమనీ, తమని బ్లాక్‌మెయిల్ చేసినా పోయేదీ, రాలేదీ ఏమీ లేదనీ నచ్చచెప్పాలట. ఆయన నోటితో అది అనలేడట. నేను అంటే ఫర్వాలేదుట. అందుకని నేనే వెళ్లాలట! 'పరోపకారార్థం ఇదో శరీరం' అనుకొని సరేనన్నాను.
అతను వెళ్లాక నేను అచలపతిని కదిలించేను. బట్టల విషయంలో గాయపడ్డ అతని హృదయానికి పలాస్త్రీ వేయాలి కదా! ఇంగ్లీషులో అయితే మంచు పగుల గొట్టేనని అనేవాడిని.
''అవునూ, అచలపతీ, ఈ పేర్ల తమాషా చూసావ్? ఇటువంటివాళ్లంతా పంకజం అని పేరెందుకు పెట్టుకుంటారోయ్?''
''పంకజం అంటే బురద నుండి పుట్టినదని అర్థం సార్ – బురద నుండి ఇతర పదార్థాలు కూడా పుట్టినా 'కమలం' అనే అర్థంలోనే రూఢి అయిపోయింది సర్''.
''అబ్బ, అది తెలుసులేవోయ్, నేను ఇన్నాళ్లూ మోహన్లు. సరోజలు, పరంధామయ్యలు, శాంతమ్మలు, భూషణాలు సాంఘిక కథల్లోనూ, దుష్టబుద్ధి, జగదేకసుందరి, మంజరి, వీరప్రతాపుడు గట్రాలు చందమామ కథల్లో మాత్రమే ఉంటారనుకొన్నాను. అంతేగాని వాళ్లు మనిషి వేషాలేసుకుని మామూలు జనాల్లో తిరుగుతారని అనుకోలేదు.
''అయినా రంగాజమ్మ .. పేరు ఎక్కడో విన్నట్టుందే! ఆగాగు.. రంగాజమ్మ ఒక స్త్రీ, పేరు గుర్తుకు రావటం లేదు కానీ ఆ ఊరి రాజుగారికి భార్యో, తత్సమానమో, మరొహటో! నాలుక చివర ఆడుతున్న పేరున్న ఆ రాజుగారు ఆ ఊరిని, ఏదో ఒక శతాబ్దంలో పాలించేడనుకొంటాను. ఈవిడ పద్యాల్లో, పదాలో, ..యక్షగానాలో, కీర్తనలో.. ఏదో నోట్లో ఆడుతోంది… రాసిందో… అంకితం పుచ్చుకొందో !? చూసావా! పేరు చెప్పగానే డొంకంతా ఎలా కదిలించేసేనో!''
''రంగాజమ్మ పదిహేడవ శతాబ్దంలో 'మన్నారుదాస విలాసము' రాసిన తంజావూరు రచయిత్రి. విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి. బహుభాషావేత్త. ఇంకా ఏమైనా చెప్పాలా సర్?'' అంది నడయాడే విజ్ఞాన సర్వస్వం.
''అదే, అదే.. నే చెప్పానుగా, సరిగ్గా సరిపోయింది. అవునూ, ఈ శతాబ్దపు రంగాజమ్మ సంగతేమిటంటావు?'' యధాలాపంగా అడిగినట్టు అడిగేను.
''మీరు దూరంగా ఉంటేనే మంచిది అనుకొంటాను సర్ !''
నాకు ముందే తెలుసు ఈ సమాధానం. నవ్వుకొన్నాను. ''అచలపతీ, చూస్తుండు ఈ సమస్య నెలా పరిష్కరిస్తానో, ఈసారి నీకిలాటి ప్రాబ్లెమ్ వచ్చినప్పుడే నన్నే 'ఎప్రోచ్' అవుతావు. 'మార్క్ మై వర్డ్స్'! అవునుగానీ నా డ్రెస్ రెడీగా ఉందా?''
''డ్రెస్ రెడీగా ఉంది కానీ వేరే డ్రస్సు సర్! మన్నించాలి. ఆరంజికోటు తయారు కాలేదని టైలరు చెబితే నేను వేరే నల్లపాంటు, తెల్లకోటు ఇస్త్రీ చేసి రెడీగా ఉంచాను'' అచలపతి విజయ గర్వాన్ని నొక్కిపెట్టి ఉంచినా, కుడి మీసపు చివరి కదలిక వల్ల నాకు తెలిసిపోయింది.
''ఇట్సాల్ రైట్, ఇవాళ ఇదే డ్రెస్ వేసుకొంటాను. రేపే టైలర్ వద్ద నుంచి ఆ డ్రస్సు తెచ్చుకొని వచ్చే ఆదివారం జరగబోయే పెద్ద ఫంక్షన్‌కి వేసుకుంటాను''.
అచలపతి ముఖం మాడినట్టు తెలియనివ్వలేదు. కానీ నాకు వాసన తగిలింది.
************
వేశ్య మొఖాన్న డబ్బు పడేసి, మనవాళ్లు రాసిన అప్రాచ్యపు ఉత్తరాలు తీసుకురమ్మని ఎవరైనా మీకెప్పుడైనా చెప్పగానే వెంఠనే బయలుదేరకండి. దీనిలో చాలా చిక్కులున్నాయి. మొదటిది- ఎంత డబ్బు ఇవ్వాలో తెలియదు. అందులో (ఎ) ముందు మనవాడు ఎన్ని ఉత్తరాలు రాశాడో, ఉత్తరానికి ఎంత రేటో కనుక్కోవాలి. (బి) ఆ ఉత్తరాలలోని అప్రాచ్యత డిగ్రీ బట్టి రేటు హెచ్చు తగ్గులు లెక్కవేయాలి. (సి) టోకు చెల్లింపుకు ముదరా ఉందా అని ముందే కనుక్కోవాలి. (డి) ప్రస్తుత సామాజిక పరిస్థితికి అనుగుణంగా (ఈ కాలంలో ఎల్కేజీ కుర్రాడు కూడా ఇంతకంటె ఎక్కువగా రాస్తాడు అనాలి) చెెల్లింపు చేయాలి.
రెండవది.. వేశ్యలు సినిమాస్ట్టయిల్ లో 'మీ డబ్బున్నవాళ్లకు హృదయం విలువ తెలీదు, నా శీలానికి విలువ కట్టగలిగే షరాబు ఇంకా పుట్టలేదు' వంటి డైలాగులు చెబుతూంటే మీ రియాక్షన్ ఎలా ఉండాలో ముందే రిహార్సలు వేసుకొని వెళ్లాలి. సినిమాల్లో ఈ డైలాగులు కొట్టే వాళ్ల ముఖం మీదే కెమెరా ఉంటుంది కాబట్టి అవతలి వాళ్ల ఫీలింగులు మనకు కెమెరాలో కనబడవు. అందుచేత సినిమాల నుండి పెద్దగా నేర్చుకోలేం.
మూడవది – డబ్బు మొహాన్న పడేయమన్నారు కదా నిజంగా పడేయకూడదు. కాయిన్స్ అవీ వుంటే మొహం బద్దలవుతుంది. చెక్కు అయితే పడేయవచ్చు కానీ, అది ఆమె పట్టుకోకుండా ఎగరనిచ్చేస్తే మనమే దాని వెనక పరిగెత్తాలి.
నాలుగవది- ఇటువంటివాళ్లు గూండాలని పోషిస్తుంటారు కాబట్టి, వాళ్లు ఉత్తరాలు ఇవ్వకుండానే మనని తన్ని డబ్బు లాక్కోవచ్చు. మనమూ కనీసం ఒకళ్లనైనా వెంటబెట్టుకుని వెళ్లాలి.
'ఈ ఆలోచలన్నీ రంగాజమ్మ ఇంటికెళ్లే లోపులే రావల్సింది' అని మీరు ఎద్దేవా చేయవచ్చు. నాకు లోపలే వచ్చాయి. దార్లో కార్లో వెళుతూండగా ఆలోచన ఆరంభించడం, పూర్తయ్యేసరికి నేను రంగాజమ్మ ఇంటి బెల్లు నొక్కుతూండడం జరిగింది.
(మామయ్య వర్ణన బట్టి) రంగాజమ్మే తలుపుతీసి ఒకడుగు లోపలికి వేసి కామరాజ్ నాడార్ విగ్రహంలా నడుం మీద చెయ్యేసి, మోకాలు ముందుపెట్టి సెక్సీగా నిలబడింది. 'ఈమె నోరూరించేట్లా ఉంది' అని అంది మెదడు. ఆ సిగ్నల్ వినగానేే ఉద్యోగభయం ఉన్న ప్రొడక్షన్ మేనేజరులా నోరు లాలాజలం తయారు చేయడం మొదలుపెట్టింది. గుటకలు మింగడం ద్వారా స్టాక్ అదుపులో ఉంచుతూ, నేను ఫలానా అనీ, మా మదన గోపాలుడి విషయం మాట్లాడ్డానికి వచ్చేనని అన్నట్టు గుర్తు. ఆవిడ ఒక సోఫాలో కూచుంటూ మరొక దాంట్లో నన్ను కూర్చోమని సైగచేసింది. నేను సోఫాలో జారేను.
''ఏం తీసుకుంటారు, కాఫీ? టీ?? '' అంది లేచి నిలబడుతూ.
''…ఆర్ మీ' లేదా 'మెన్యూ'లో ?'' అన్నాను. పెదాలు తడుపుకుంటూ.
''ఏమో అనుకొన్నాను, చమత్కారులే'' అంటూ నవ్వుతూ దగ్గరకొచ్చి జట్టు చెరిపేసి, భారీగా లంచం పట్టి ఇంటికి తెచ్చిన మొగుడ్ని నుదురు ముద్దాడి అభినందించే భార్య స్టయిల్లో వంగింది. ఆ తరువాత నా కళ్లముందు నక్షత్రాలు మెరిసాయి.
*************
మన వాళ్ళకు మాక్రో- ఆస్ట్రో -ఫిజిక్స్ (ఈ శాస్త్రం ఉందో లేదో నాకు తెలీదు. కానీ ఏ సబ్జక్ట్‌కైనా సరే, ముందు మైక్రోయో, మాక్రోయో తగిలిస్తే హుందాగా, గంభీరంగా ఉంటుందని నాకో గట్టినమ్మకం) ఇంకా సరిగ్గా వంటబట్టలేదు. అందువల్లనే నక్షత్రాల పుట్టుక, వాటి వికాసం, వినాశనం లక్షణాలు ఇంకా అందరికీ తెలీదు. నా అంత కామన్‌సెన్స్ లేని మనిషి, (అంటే నా ఉద్దేశ్యం – 'నా కున్నంత కామన్‌సెన్స్ లేని మనిషి' అని – తెలుగులో సింటాక్స్ బహుజాగ్రత్తగా చూసుకోవాలి సుమండీ!) నక్షత్రాలే నా ఫోటోలు తీశాయని అపోహపడేవాడు. కానీ నాకు మాత్రం అర్థమయిపోయింది – ఆ రోజు నా కళ్లముందు మెరిసినవి నక్షత్రాలు కావనీ, కెమెరా ఫ్లాష్ అనీ- మరుసటి రోజు పోస్టులో వివిధ భంగిమల్లో నేనూ, రంగాజమ్మా ఉన్న ఫోటోలు వచ్చినప్పుడు!
నిజానికి ముందురోజు జరిగినది నాకు పెద్దగా గుర్తులేదు. ఏదో లోకం నుంచి కారు నడుపుకుంటూ ఇంటికి రావడం, మా మామయ్యకు వాళ్లు ఊళ్లో లేరని, తర్వాత కలుస్తాననీ అబద్ధం చెప్పడం గుర్తుంది. పొద్దెక్కి లేచేసరికి బల్ల మీద ఇది సిద్ధం.
''అచలపతీ, ఇలారా'' నా పిలుపు ఆక్రందనలా నాకే అనిపించింది.
అచలపతి గదిలోకి వీచాడు – మెత్తగా, మలయసమీరంలా..
ఫోటోలు అతనికిచ్చి ''చూడు ఎంత దారుణంగా ఉన్నాయో'' అన్నాను- కోపం, కసి, ఉక్రోషం అన్నీ రంగరించి. అచలపతి ఒక్కొక్కటీ శ్రద్ధగా చూశాడు. దగ్గి, ''ఇంచుమించుగా దారుణంగానే ఉన్నాయండి. కొన్నిట్లో లైటింగు సరిగ్గా లేదు. కొన్నిట్లో సబ్జక్ట్‌లు కెమెరాను ఫేవర్ చేయలేదు. కొన్నిటికైనా బాక్‌డ్రాప్ మార్చి ఉండాల్సింది. సబ్జక్ట్‌ల ఆనందానికి అంతరాయం కలగకుండా లాంగ్‌షాట్‌లో తీయాలనుకొన్నప్పుడు జూమ్‌లెన్స్ ఉపయోగించవలసింది. ఇప్పుడు దీనిలో కొన్ని అంగాలు ఎవరెవరివో స్పష్టంగా తెలియటం లేదు. పైగా …''
నేను రెండు చెవులూ మూసుకున్నాను. ''బాబూ, నేను వాటి గుణగుణాలను అంచనా వేయమనలేదు. అసలవి ఎందుకు తీశాడని అడుగుతున్నాను''.
''ఓహ్, మీరు కోరకుండానే చేయకుండానే తీశాడా!? అయితే రెండు కారణాలుండవచ్చు – ఒకటి వాత్సాయన కామసూత్రాల పుస్తక ప్రచురణలో సెల్ఫ్ గైడ్ ఇలస్ట్రేషన్స్‌గా అతను ఉపయోగించవచ్చు. రెండవది, మీ ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకొని మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండవదానికే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని అనుకోవడానికి ఆస్కారం ఉంది సార్''.
''బ్లాక్‌మెయిలంటే వాళ్ల డిమాండెంత? దీన్లో ఉత్తరం ఏదీ లేదు! ఫోనేదైనా వచ్చిందా?''
''లేదు సర్, బహుశా డిమాండ్లు కనుక్కోవడానికి మీరే స్వయంగా వస్తారని వాళ్లు ఎదురు చూస్తూ ఉండవచ్చు''.
''ఎందుకు వెళ్లడం? పంకజంతో కూడా ఫోటోసెషన్‌కా? ఆ ఫోటోగ్రాఫరు దిగులుపడతాడు కదాని నేను వెళ్లి ఫోటోలు దిగను. కావలిస్తే నువ్వెళ్లు'' అన్నాను, ఒళ్లుమండి. అంటూండగానే మనసులో అనిపించింది. అచలపతి సాయం లేకపోతే ఈ ఊబిలోకి ఇంకా కూరుకుపోతానేమోనని. కానీ నా బింకం చెడకుండా అతన్ని ముగ్గులోకి దించాలి. ఎలాగ?
గొంతు తగ్గించి సంభాషణ పునఃప్రారంభించేను. ''అవును అచలపతీ, నిజంగానే నువ్వెళ్లు. నేను డబ్బున్నవాడినని తెలిసిపోవటంతోనే వాళ్లు నన్ను బ్లాక్‌మెయిల్ చెయ్యబోయారు. నువ్వు బీదవాడిలా …కడు పేదవాడిలా వేషం వేసుకువెళ్లి మా రెండు కేసులకూ కలిపి హోల్‌సేల్ బేరం కుదుర్చుకురా. చెక్కు ఇస్తామనీ, వాళ్ల దగ్గరున్నవన్నీ తిరిగి ఇవ్వకపోతే చెక్కు తిరక్కొట్టేస్తామనీ చెప్పు. నేనివాళే ఊరెళ్లిపోతున్నాను. ఊళ్లో వాళ్లంతా వచ్చి ఆ ఫోటో లైటింగు గురించి చర్చిస్త్తూ వుంటే వినేబదులు, మన ఊరెళ్లి మయసభానంతర దుర్యోధనుడి '..బో…బో' డైలాగులు వల్లె వేయడం నయం. పరిస్థితి బాగుపడిందని ఫోన్‌చేస్తే వస్తాను. ఓ.కె.?''
అయిదురోజుల తర్వాత ఫోన్ వచ్చింది – తుఫాన్ ఒరిస్సా తీరం దాటిపోయిందని. తిరిగి వస్తూనే అచలపతిని అడిగేను – ఎలా, ఎంతకు సెటిలయిందని.
''ఖర్చు పెద్దగా కాలేదు సార్. ఏదో నాలుగు పోస్టర్లు ప్రింటింగు – కలర్ పోస్టర్లు కాబట్టి కాస్త ఖర్చు ఎక్కువయింది''.
''పోస్టర్లా!?'' లింకు దొరకలేదు.
అచలపతి చేతిలో పోస్టరు చూపించేడు.
'ఎయిడ్స్ వినాశకరం ' – పెద్ద హెడ్డింగు, పక్కన నాదీ, రంగాజమ్మదీ రసవత్తరమైన పోజులో బొమ్మ. ఇంకో పక్కన మేటరు – 'మద్రాసు నగరవాసి అనంతశయనంగారు ఇలా అంటున్నారు ''నేను పెద్ద రథం వీధిలోని రంగాజమ్మతో సాన్నిహిత్యం కారణంగా 'ఎయిడ్స్'కి బలయి మృత్యుముఖంలో ఉన్నాను. యువతరాన్ని మేల్కొల్పి ఎయిడ్స్ జోలికి పోకుండా చేసే ఉద్యమానికి నా ఈ జీవితశేషాన్ని అంకితం చేద్దామనుకొంటున్నాను. ఇదే నా సందేశం – 'యువకులారా! మేల్కొనండి, రంగాజమ్మ వంటి వారికి దూరంగా ఉండండి! దగ్గరవదలుచుకుంటే మాత్రం …. బ్రాండ్ కండోమ్స్ పట్టుకెళ్లండి'
ఇది చదువుతున్నకొద్దీ నా కనుబొమ్మలు పై, పైకి వెళ్లి చివరికి పాపిడితో కలిసిపోయేయి. నోరు వెళ్లబెట్టి, బెట్టి మొగమంతా నోరయిపోయింది.
అచలపతి చెప్పుకుపోయేడు. ''రంగాజమ్మకు ఈ పోస్టరు చూపించి మీరు అడ్వర్‌టైజింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పాను. ఊరంతా ఆమె పేరు మార్మ్రోగి ఆమె వ్యాపారం సన్నగిల్లే అవకాశం లేకపోలేదని చెప్పాను. ఆమె బెదిరిపోయింది. ఆమె గదిలో నాలుగు గోడలపై పోస్టర్లు మచ్చుకు తగిలించి చూపేసరికి ఊరంతా ఇవే పోస్టర్లున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొని, గడగడ వణికి, ఫోటోలు, నెగిటివ్‌లు, ఉత్తరాలతోబాటు ఖర్చులకుంచమని ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టింది. ఇదికాక ఆ అడ్వర్‌టైజింగ్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకొనేందుకు కలిగే నష్టాన్ని భరిస్తానంది''.
నా గుండె మీది బండరాయి వెన్నలా కరిగి, పెదాల మధ్యలోంచి ఈల దూసుకువచ్చింది. ''అచలపతీ, నీ జీతం ఈ నెలనుంచి వంద రూపాయలు పెంచా, లెట్‌మీ ఆల్సో ఎంజాయ్! సాయంత్రం క్లబ్బులో పార్టీకి వెళ్లాలి. టైలరు నుండి వచ్చిన సూటు రెడీ చెయ్యి''.
''ఇంక్రిమెంటుకి థ్యాంక్స్ సర్. కానీ చిన్న పొరపాటు జరిగింది. ఆరంజికోటు ఇస్త్రీ చేస్తూంటే జేబుల దగ్గర కాలిపోయింది సార్. మీ కార్యక్రమంలో జరిగిన స్వల్ప అంతరాయానికి క్షంతవ్యుణ్ని సర్!''
తన కిష్టంలేనిది పడనివ్వడు అచలపతి, అలా అని బయటపడడు.రంగాజమ్మ ఉదంతం తర్వాత ఠఠ్ అని అతనిని నేనెలా మందలించగలను?అమ్మో, అఖండుడు అచలపతి!
(రచన 1996 లో ప్రచురితం)
– ఎమ్బీయస్ ప్రసాద్