'అమెరికా అద్భుత వ్యక్తుల గాథలు' చదివిన చదువరులకు క్లేరెన్స్ మెక్‌ఫాడెన్ కథ గుర్తుండే వుంటుంది. సృష్టికర్త అతని పాదాల తయారీలో సహకరించకపోయినా డాన్స్ చేద్దామనే సదుద్దేశంతో అతను ఓ గురువుగార్ని ఆశ్రయించి కోరినంత దక్షిణ ఇస్తానన్నాట్ట!
క్లేరెన్స్ పాదాలు పరకాయించి చూసిన గురువుగారు వాటి సైజు చూసి, బెదిరి తన రేటును రెట్టింపు చేశాడట!
హెన్రీ మిల్స్ కథ విన్నవాళ్లకి అతని కథకీ, క్లేరెన్స్ కథకీ ఉన్న పోలిక కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దాంతోబాటు ఓ తేడా కూడా, క్లేరెన్స్‌ని డ్యాన్స్‌కై పురికొల్పినది ఆశో, అహంభావమో అయితే విధాత అభిమతాన్ని ధిక్కరించి హెన్రీని నర్తనశాలవైపు నడిపించింది ప్రేమ! తన అర్ధాంగిపై అభిమానం! ఓ హాలిడే రిసార్టులో మిన్నీని కలవకపోయివుంటే హెన్రీ తన మానాన తను పుస్తకాలు చదువుకొంటూనే ఉండేవాడు. అంటే న్యూయార్క్ బాంక్‌లో కాష్ డిపార్ట్‌మెంటులో తను పనిచేయాల్సిన టైములో తప్ప అన్నమాట.
xxxxxxxxxxxxxxx
హెన్రీ అనే పుస్తకాల పురుగు నిఘంటువులో 'ఆహ్లాదకరమైన సాయంత్రం' అనే మాటకు అర్థం- తన చిన్న ఫ్లాట్‌కి తిరిగి రాగానే కోటు విప్పి పడేయడం, స్లిప్పర్స్ తొడుక్కుని పైపు ముట్టించి, గడచిన రాత్రి మడిచిపెట్టిన పేజీనుంచి విజ్ఞాన సర్వస్వం కొనసాగించడం. అప్పట్లో అతను చదివేది నాలుగో సంపుటం. అతను చదివే విధానంలో మనకు నచ్చకపోయినా మెచ్చవలసిన అంశం ఒకటుంది.
ఏ మాత్రం ఆవేశకావేషాలకు లోనుకాకుండా, ఆదరాభిమానాలు ప్రదర్శించకుండా, ప్రచురించిన వరుసలోనే పుస్తకాలను చదువుతాడతను. విజ్ఞాన సర్వస్వం సంపుటాలన్నీ చేత చిక్కిన నాబోటి, మీబోటివాళ్లం ఆతృతగా ముందువన్నీ దాటించేసి ఆఖరిపేజీలు చూసేస్తాం చివరి మాటలేమున్నాయో చూసేద్దామని. కానీ హెన్రీలో మాత్రం ఆ తొందరపాటు కనబడదు. వాళ్లిచ్చిన క్రమంలో సంపుటాలన్నీ చదువుతాడు. తొందరపడి ముందరి పేజీల్లోకి తొంగిచూసి సస్పెన్స్ చెడగొట్టుకొనే మనిషి కాడతను.
మనిషన్నవాడు రెండు విధాలా భేషుగ్గా ఉండకూడదన్న సిద్ధాంతం ఒకటుందనుకొంటాను. ఒకతనికి విశాలమైన నుదురు, జ్ఞానతృష్ణ ఉన్నాయనుకోండి. అతని పాదవిన్యాసం చూడబోతే తాగుబోతువాడి తప్పటడుగుల్లా ఉంటుంది. అలా అని మంచి డ్యాన్సర్ని ఎంపిక చేసి చూస్తే అతనికి చెవులకు పైనున్న భాగమంతా మొద్దుబారి ఉంటుంది. ఈ సిద్ధాంత నిరూపణకు నమూనాలు వెతికేవారికి హెన్రీ మిల్స్‌్, సిడ్నీ మెరర్స్‌లను మించిన భేషైన జంట భూలోకమంతా గాలించినా దొరకదు.
పులుల్ని, సింహాల్ని, కోతుల్నీ తదితర జంతుజాలాన్ని జూ బోనుల్లో బంధించి ఉంచినప్పుడు వాటిని జంటలుగా ఉంచడం గమనించే ఉంటారు. న్యూయార్క్ బాంక్ తన కాషియర్ల విషయంలో కూడా ఇదే పాలసీ పాటించడం వలన ఖాతాదారుల జోరు తగ్గినప్పుడు ఓ కాషియరు మానసోల్లాసానికో మరోదానికో కాస్త ముచ్చట్లాడుదామంటే అతనికి తోటి కాషియరే గతి.
హెన్రీకి, సిడ్నీకి ఇద్దరికీ ఉమ్మడిగా తెలిసిన విషయం ఏదీ లేదని త్వరలోనే తేలిపోయింది. విజ్ఞాన సర్వస్వం మొదటి సంపుటాలల్లో కనబడే అలాస్కా, అబ్రహాం, అమీబా…ల గురించి సిడ్నీకి ఓనమాలు కూడా తెలియవు. హెన్రీ సంగతికొస్తే బలిపశువు చుట్టూ ఆదిమ మానవులు వేసిన గంతుల తర్వాత నాట్యకళలో జరిగిన మార్పుల, చేర్పుల గురించి ఏమీ తెలీదు. అందుకనే సిడ్నీ స్థానంలో వచ్చినతను తక్కిన విషయాల్లో అమోఘంగా లేకపోయినా విజ్ఞాన సర్వస్వం మూడో సంపుటంలో ప్రస్తావించిన 312 విషయాల్లో రమారమి ముప్పై విషయాల గురించి కాస్త తెలివితేటలతో మాట్లాడగలగడం ఓపాటి అదృష్టమే.
అదీ హెన్రీ మిల్స్‌గారి సంగతి! రమారమి ముప్పై అయిదేళ్ల వయసు, దృఢసంకల్పం, కష్టపడే భావం కొంతమంది మాటల్లో చెప్పాలంటే ఘోర బ్రహ్మచర్యం. అతని బ్రహ్మచర్యపు కవచం తగిలి మన్మథుని బాణాలు సైతం మెడలు విరిగి తలలు వంచాల్సిందే.
కొత్తగా కాష్‌లోకి వచ్చిన కుర్రాడు ప్రేమా, దోమల గురించి సదభిప్రాయం కలవాడు కావడం చేత ఆడవాళ్ల గురించీ, వాళ్లను పెళ్లి చేసుకోవడంలోని మజా గురించి తరచూ మాట్లాడేవాడు. ఒకటి రెండుసార్లు తెగించి హెన్రీని పెళ్లి గురించి అడిగేశాడు కూడా. బదులుగా హెన్రీ ఆ సందర్భాల్లో చికాకు, ఆశ్చర్యం, అజ్ఞానుల యెడల కనబరచే సానుభూతి వగైరా భావాలు కలగలిపిన చూపు విసరడమేగాక ఒకే ప్రశ్న వేసేవాడు.
''నేనా!? పెళ్లా!!?''
కట్టె, కొట్టె, తెచ్చె అన్న మూడు ముక్కల కంటే తక్కువ మాటల్లో (లెక్కకు రెండే) పెళ్లిని గురించి తనకున్న సమస్త అభిప్రాయాలనూ ఆ చిన్న ప్రశ్న ద్వారా హెన్రీ ఉద్ఘాటించేవాడు.
xxxxxxxxxxxxx
ఆపాటికి సమ్మర్ రిసార్టులో ఒంటరిజీవితం మనుష్యులను ఎలా ప్రభావితం చేయగలుగుతుందో పాపం హెన్రీకి తెలియదు. సాధారణంగా అతనికి కాష్ కాబిన్ నుండి శీతాకాలంలోనే ఆటవిడుపు లభించేది. ఆ పదిరోజులూ అతను ఇంట్లో పడక్కుర్చీలో కాళ్లు రూమ్ హీటరుకు తన్నిపెట్టి, చేత పుస్తకం ధరించి గడిపేసేవాడు. కానీ ఆ ఏడాది వేసవులకే బాంక్‌వాళ్లు తమ ఖర్చుమీద విశ్రాంతి స్థలానికి వెళ్లే సౌకర్యం ఏర్పరచి బోనులోంచి విడిచిపెట్టారు. ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోడానికి గాను హెన్రీ విజ్ఞాన సర్వస్వంకు చెందవలసిన సమయాన్ని అడ్వర్టయిజ్‌మెంట్లమీద వెచ్చించి, క్షుణ్ణంగా చదివి, వాటిని నమ్మి బ్రయర్‌బుష్ ఫార్మ్‌కి వెళదామని నిశ్చయించుకున్నాడు.
బ్రయర్ బుష్‌ఫార్మ్ ఓ మారుమూల పల్లెటూళ్లో అన్నిటికీ దూరంగా తన్ని తగలేసినట్టున్న ఓ పురాతన భవంతి. దాని ఘనత ఏమిటంటే విఫల ప్రేమికులు దూకేందుకు ఉద్దేశించిన ఓ కొండచరియ, ఓ కొలను – సరిగ్గా చెప్పాలంటే అరకొలను, ఎందుకంటే మిగతా సగం ఖాళీడబ్బాలు, పేకేజీ పెట్టెలతోనూ నిండి ఉంటుంది కాబట్టి. ఇవే కాకుండా ఓ గోల్ఫ్ మైదానం అయిదు కన్నాలున్నమాట వాస్తవమే కానీ వాటి మధ్యలో అప్పుడప్పుడు అడ్డువచ్చే మేకల మంద, ఆటగాడు ఎదుర్కోవలసిన అవరోధాలను పెంచుతూ వుంటుంది. హెన్రీ కంటికిదంతా నూతనంగా, ఉత్తేజకరంగా కనబడి, అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కొద్దిపాటి చొరవ అతనిలో చోటుచేసుకొని, ఇటువంటి మనోహర వాతావరణంలో ఏదో విశేషం జరగబోతోందని చాటి చెప్పింది.
అటువంటి ఘట్టంలో మిన్నీ హిల్ రంగప్రవేశం చేసింది. చిన్నగా, సన్నగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ నాజూగ్గా ఉంది. ఆమె పెద్ద కళ్లను చూస్తే అవి విషాదభరితంగా ఉన్నాయనీ, తనెళ్లి ఉద్ధరించకపోతే లాభంలేదనీ హెన్రీకి అనిపించేది. ఏంచేస్తే బాగుంటుందని పరిపరివిధాల ఆలోచించేవాడు.
ఓరోజు చెరువు గట్టున్న మునిమాపువేళ ఇద్దరూ కలిశారు. హెన్రీ దోమల్లాటి జీవాల్ని (ఈ ఫార్మ్ గురించిన ప్రకటనల్లో దోమలు కనుచూపు మేరలో కూడా కానరావని రాసుంది కాబట్టి అవి దోమలయి ఉండవని హెన్రీ నమ్మకం) వేటాడుతూ ఉండగా మిన్నీ అలసిసొలసి వచ్చినట్టుగా కాళ్లీడ్చుకుంటూ వచ్చింది. కాస్త జాలి, కాస్త మరోటి తొణికిసలాడే గొంతుతో హెన్రీ పలకరించేడు.
''గుడ్ ఈవెనింగ్''
ఆమెను అంతకుముందు డైనింగ్ రూమ్‌లో చూసేడుకానీ ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. హెన్రీ కూడా చొరవ తీసుకొని పలకరించలేదు. అందువల్ల పైన రాసిన రెండు పదాలే వారి ప్రేమ సంభాషణలో తొలి పలుకులుగా నమోదు చేయబడ్డాయి.
''గుడ్ ఈవెనింగ్'' అందామె చెల్లు వేస్తూ.
కాసేపు నిశ్శబ్దం.
ఆడవారి పట్ల గల ఔదార్యం అతని సిగ్గును జయించింది. ''బాగా అలిసినట్లు కనబడుతున్నారు'' అన్నాడు.
''అవును అలసటగానే ఉంది. సిటీలో డాన్స్ చేసి, చేసి నీరసపడిపోయాను''
''ఓ డాన్సింగా? అంత ఎక్కువగా డాన్స్ చేస్తారా?''
''ఓ, చచ్చేటంత''
అమ్మాయి వరస చూస్తే ఊసులాడేట్టే ఉంది. కానీ ఆడడానికి ఊసులేవీ? విజ్ఞాన సర్వస్వంను వరసప్రకారమే చదవాలని నిర్ణయం చేసుకున్న ముహూర్తాన్ని నిందించుకొన్నాడు హెన్రీ. నృత్యకళ అనే అంశం ఎనిమిదో సంపుటంలోనే వస్తుంది. కానీ అదృష్టవశాత్తూ 'అర్వాచీన నాట్య రూపకములు' అన్న అంశం అతను చదివేసిన సంపుటాల్లో ఉందని గుర్తుకొచ్చింది.
''నా మట్టుకు నేను డాన్స్ చేయనుగానీ నాట్యకళ గురించి తెలుసుకోవడాన్ని ఇష్టపడతాను. అర్వాచీన నాట్యరూపకాల్లో ఒకటైన బాలే అనే పదం మూడు వేర్వేరు పదాల కలయిక అన్న విషయం మీకు తెలుసా?''
వలలో పడింది. అతని జ్ఞానసంపద ఆమెను ఆకట్టుకుంది. ఆమె అతనికేసి నోరెళ్లబెట్టి చూసింది. ఇక హెన్రీ విజృంభించేడు. బాలే మొదటిసారి ఎక్కడ వేశారో, ఎందుకు వేశారో, ఎంతమంది వేశారో, ఏ సంవత్సరంలో వేశారో (ఆ సంవత్సరం సంఖ్య అతని బాంక్ ఫోన్ నెంబరూ కాకతాళీయంగా ఒకటి కావడం, అతనికి గుర్తు పెట్టుకోడానికి ఉపకరించింది) అప్పచెప్పేశాడు. మిన్నీ కళ్లు వాటికి వీలు పడినంత పెద్దగా అయ్యేయి.
''అమ్మబాబోయ్! మీకెన్ని విషయాలు తెలుసో?''
''అబ్బే మరీ అంత కాదండి! పుస్తకాలు బాగా చదువుతుంటానుకదా! అదీ సంగతి'' అన్నాడు విషయం రంగరించి.
''అన్ని విషయాలు తెల్సుకొంటూంటే భలేగా ఉంటుందికదా! నాకెప్పుడూ చదవాలని ఉంటుంది. కానీ టైమే దొరకదు. మీరు చాలా ఇదైనవారు'' అంది అదోలా రెప్పలార్పుతూ.
హెన్రీ హృదయం కితకితలు పెట్టిన పాపాయిలా కులికింది. జీవితంలో మొట్టమొదటి సారిగా ఓ యువతిచేత మెప్పు పొందడం వలన మనసు మత్తెక్కింది.
కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత, డిన్నర్ బెల్ (దానిలో కూడా ఓ సంగీతం ఉందని అతనికి అప్పుడే తెలిసింది.) వినబడి వాళ్లు భవంతి కేసి నదవడం ఆరంభించేరు. అస్తమించే సూర్యుడు పరిచిన జేగురురంగు తివాచీపై బ్రయర్‌బుష్ ఫార్మ్‌లో ఉండడం చేత జంతుశాస్త్రం చేత దోమలుగా గుర్తింపబడని కీటకాలు ఇతోధికంగా వారిని కాటువేశాయి. వాటిని దోషులుగా అపార్థం చేసుకోని హెన్రీ వాటిని చంపే ప్రయత్నం చేయలేదు. అవి పొట్టల నిండా రక్తం తాగి బంధుమిత్రులక్కూడా ఈ భాగ్యాన్ని కలిగిద్దామని వారిని వెంటబెట్టుకువచ్చినా వాటి ఉనికిని అతడు గుర్తించలేదు. ఆ రాత్రంతా జాగరం చేశాక సూర్యోదయవేళకు జ్ఞానోదయం కలిగింది అతనికి…. తను ప్రేమలో పడినట్లేనని.
ఇక అవాళ్టినుంచీ, ఆ ఊళ్లో ఉన్న మిగతా గంటలన్నీ వారు కలిసే గడిపారు. వనంలో చరించినా, కొలనులో విహరించినా హెన్రీ తన విజ్ఞానాన్నంతా ఆమె ఎదుట ఒలకబోస్తూనే ఉన్నాడు. ఆమె ఊకొడుతూనే ఉంది. మధ్యమధ్య 'నిజంగా!! అబ్బా!' లాటి విరామ చిహ్నాలు ఉపయోగిస్తూ.
xxxxxxxxxxxxxxxx
అతను న్యూయార్క్ తిరిగి వచ్చేక కొద్ది రోజులకే కుర్ర క్యాషియరు రివాజుగా ''పెళ్లి గురించి మీ అనుమానాలు శుద్ధ తప్పు. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే సార్'' అన్నాడు.
''చేసుకొంటున్నాను, పైవారం'' అన్నాడు హెన్రీ ఛట్టున.
ఎదురుచూడని ఈ సమాధానం వినగానే తల దిమ్మెరపోయి, కస్టమర్ దగ్గిర టోకెన్ తీసుకోకుండానే డబ్బులిచ్చేయడం, బాంక్ మూసేవేళకి అది గుర్తించి లబలబలాడుతూ ఆ కస్టమర్‌కి ఫోన్ చేయడం జరిగేయి.
పెళ్లయిన మొదటి సంవత్సరం హెన్రీ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన కాలం. అతను భయపడినట్లు అభిరుచుల వ్యత్యాసాలు, వ్యక్తిత్వ ఘర్షణలు, సర్దుబాట్లకై రాజీలు, ఆ ప్రయత్నాలలో మరిన్ని కలహాలు ఇవేమీ జరగలేదు. ఆమె అతని జీవితంలో ఓ భాగంగా చక్కగా ఇమిడిపోయింది. అతనెప్పటిలాగానే బాంక్‌కు వెళ్లడం, తిరిగి రావడం విజ్ఞాన సర్వస్వం సంపుటం చదవడం (ఇదివరలా లోపల్లోపల కాదు, బిగ్గరగా, స్వెట్టర్ అల్లుతూ ఊకొట్టే మిన్నీకి వినబడేట్లా!) మధ్యమధ్యలో చదవడం ఆపి ఆమె నుదురుపై తూగే ముంగురులకేసి చూసినప్పుడు అతనికి అనిపించేది 'ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలోయ్!' అని.
xxxxxxxxxxxxx
వాళ్ల వెడ్డింగ్ ఏనివర్సరీనాడు రోజంతా సరదాగా గడిపేక టైమ్ స్క్వేర్ రెస్టారెంట్లో డిన్నర్ పూర్తిచేసి సిగార్ కాలుస్తోంటే హెన్రీకి కొండెక్కినట్టనిపించింది. తను పుస్తకాల్లో చదివి, ఊహించిన వాతావరణం కళ్లెదురుగా కనబడుతోంటే చిన్నప్పట్నుంచీ తనకు తెలిసిన లోకం ఇదేననిపించింది తనకి. తన వయస్సు ముప్పై అయిదు కాదేమో, ఇరవై చిల్లరేమోననిపించింది.
ఓ గొంతు వినబడితే హెన్రీ తలతిప్పాడు. సిడ్నీ మెర్సర్.
హెన్రీని వివాహితుణ్ణి చేసిన ఆ సంవత్సర కాలం సిడ్నీని ఓ రంగేళీరాజాగా మార్చేసిననట్టుంది. అతను వేసిన డ్రెస్సు, ఆ షూసు, ఆ ఠీవీ! హెన్రీ నోరెళ్లబెట్టాడు.
''హెన్రీ!! నీకిక్కడేం పనోయ్? ఇలాటివి నీకు కొత్తకదా!'' అని సిడ్నీ అడిగినా కూడా నోరిప్పలేదు.
సిడ్నీ చూపు మిన్నీమీద వాలింది. ఆ రోజు మిన్నీని చూసిన వాళ్లకు అతని తప్పులేదని తోస్తుంది. పెళ్లికి ముందునాటి నీరసజీవి కాదామె. జవం, జీవం ఉట్టిపడుతున్నాయి ఆమెలో ఇప్పుడు.
''ఆమె నా భార్య'' అన్నాడు హెన్రీ నోరు స్వాధీనంలోకి తెచ్చుకొని.
''ఆఖరికి పెళ్లి చేసుకొన్నావన్నమాట, కంగ్రాట్స్, బైదిబై బాంకెలా ఉంది?''
ఉండవలసినట్టుగానే ఉందని హెన్రీ జవాబిచ్చి ''నాటకాలు ఇంకా వేస్తున్నావా?'' అని పరామర్శించేడు.
''అంతకంటే దివ్యమైన పని దొరికిందిక్కడ… ప్రొఫెషనల్ డాన్సర్‌గా… బాగా గిడుతుందిలే. నువ్వేమిటి? డాన్స్ చేయకుండా కూచున్నావ్?''
అపశ్రుతి పలికినట్లయింది. ఆ లైట్లు చూస్తూ సంగీతం వింటూ ఒక విధమైన భ్రమలో పడిపోయేడు. తను డాన్స్ చేయకుండా కూర్చోవడం, డాన్స్ రాకపోవడం వల్ల కాదనీ, డాన్స్ చేసి చేసి అలసిసోవడం వల్లననీ అతను తనని తాను నమ్మించుకొంటున్నాడు. ఈ సూటి ప్రశ్న అతని కఠోర వాస్తవ ప్రపంచంలోకి తెచ్చిపడేసి నిజాన్ని కక్కించింది.
''నాకు డాన్స్ రాదు''
''హారి భగవంతుడా! సరే, మీ సంగతేమిటి మిసెస్ మిల్స్, మీకు డాన్స్ వచ్చే వుంటుంది. నాతో డాన్స్ చేస్తారా?''
''అబ్బే, వద్దండీ''
హెన్రీ తననుతానే నిందించుకొన్నాడు. అందరు ఆడాళ్లలాగా, మిన్నీక్కూడా డాన్స్ చేయాలని ఉండుంటుంది. తనకోసం మొహమాటపడి వద్దంటోంది. ఆమె సంతోషానికి తను అడ్డు నిలవడమా?! ''…నాన్సెన్స్, మిన్నీ, వెళ్లి డాన్స్ చేసిరా''
మిన్నీ సందేహించింది. ''చెప్తున్నాగా, వెళ్లి హాయిగా డాన్స్ చేసిరా! నేనిక్కడ ఇంకో సిగార్ కాలుస్తూ కూచుంటాను''
కాస్సేపట్లోనే సిడ్నీ, మిన్నీ అద్భుతంగా డాన్స్ చేయసాగేరు. ఇవతల హెన్రీకి యవ్వనం ఇగిరిపోయి ఏభయ్యవ పడిలో పడ్డాడాన్న సందేహంలో పడ్డాడు.
ఓ మనిషి యువకుడా, కాదా అని తేల్చుకోవాలంటే ఒక చిన్న పరీక్ష పెట్టేస్తే చాలు. కీళ్లనొప్పులు రాకుండా డాన్స్ చేయగలిగినంతకాలం అతడు యువకుడేనన్నమాట. అసలు డాన్స్ చేయడమే రాకపోతే పుట్టుకతోనే ముదుసలి అన్నమాట! సిడ్నీ బాహువుల్లో మిన్నీని చూస్తూంటే ఈ కఠోర సత్యం హెన్రీకి సాక్షాత్కారం అయింది. మిన్నీ నేర్పు, హుషారు చూస్తూంటే అతనికి హఠాత్తుగా ఆమె తనకంటే వయస్సులో ఎంత చిన్నదో గుర్తుకొచ్చింది. మేరేజి రిజిష్టర్లో మిన్నీ తన వయస్సు ఇరవై అయిదుగా నమోదు చేయడం గుర్తుకొచ్చింది. అప్పుడనిపించలేదు కానీ ఇప్పుడు తెలిసొచ్చింది. తమ మధ్య తొ… మ్మి… ది… సంవత్సరాల వ్యత్యాసం ఉందని. పాపం మిన్నీ తనకంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దయైన ముదుసలి వగ్గుతో మగ్గుతోందన్నమాట. రెస్టారెంటు అద్దంలోని ప్రతిబింబంలో తన జట్టు ఇంకా నల్లగానే ఉండడం చూసి హెన్రీ ఆశ్చర్యపడ్డాడు.
డాన్స్‌మ్యూజిక్ ఆగేక మిన్నీ తిరిగొచ్చింది. శరీరం అలిసినా, డాన్సిచ్చిన ఆనందం, మొహం మీద వెల్లివిరియడం వల్ల ఆమె అందం ఇనుమడించింది. పెళ్లి సమయంలో కలిసి అడుగులు వేయడమే కాదు, డాన్సింగ్ ఫ్లోర్‌లో కలిసి అడుగులు వేయగలిగినవాడే భర్త అనిపించింది హెన్రీకి. చలాకీగా తనతో అడుగులేసే చెలికాడు బదులు విజ్ఞాన సర్వస్వం చదివి విసిగించే ముసలాడు మొగుడయినందుకు మిన్నీ ఎంత ఖేదపడుతోందోనని హెన్రీ తలచుకొని బాధపడ్డాడు. ఇంటికెళ్లే దారిలో టాక్సీలో కునికిపాట్లు పడుతున్న మిన్నీ తన నడుమును చుట్టిన భర్త చెయ్యి బిగుసుకోవడం గమనించింది. డాన్స్ నేర్చుకోవాలని హెన్రీ ఆ క్షణంలో నిర్ణయం తీసుకోవడం వలన కలిగిన పరిణామం అది అని ఆమెకు తెలియదు పాపం!
xxxxxxxxxxxxxxxx
జ్ఞానోపార్జనకు మొదటి మెట్టు పుస్తకాలే అని నమ్మిన హెన్రీ ఆధునిక నాట్యంలో ఓనమాలు అనే పుస్తకం కొనడంతో తన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టేడు. కొద్ది రోజుల్లో రాబోయే మిన్నీ పుట్టినరోజుకు ఆమెకు సర్‌ప్రైజు కానుకగా డాన్స్ చేద్దామని అతని ఆశ. అంటే అప్పటివరకూ తను డాన్స్ నేర్చుకొంటున్న విషయం ఆమె నుండి దాచాలి. అందువల్ల డాన్స్ క్లాసుల కెళ్లటం కుదరదు. పుస్తకం ద్వారా నేర్చుకొంటే సూక్ష్మంలో మోక్షం కూడాను. కానీ హెన్రీకి త్వరలోనే ఓ విషయం బోధపడింది. పుస్తకంలో ఎబి అనే చుక్కలగీత మీదుగా ఎడమకాలు, సిడి అనే అర్ధవృత్తాకారంలో కుడికాలు కదపడానికి వీలుగా బాంక్‌వాళ్లు కాషియర్ బోనులు కట్టలేదు.
పోనీ మిన్నీ వంటింట్లో ఉండగా బెడ్‌రూమ్‌లో ప్రాక్టీసు చేద్దామన్నా మాటలు కాదు. 'వేపుడు చేయమంటారా? కూర చేసేయమంటారా?' అని అడగడానికి తలుపు తోసుకొచ్చేసిన మిన్నీ మొహం మీది సందేహాన్ని తుడిచేయడానికి కాలు బెణికితే విదిలిస్తున్నానని అబద్ధం చెప్పాల్సి వచ్చింది, హెన్రీకి ఓ సారి.
ఇక ట్యూటర్ ద్వారా డాన్స్ నేర్చుకోక తప్పదని అర్థమయి ట్యూటర్ని ఎంచుకొన్నా హెన్రీ కష్టాలు తీరలేదు. ఠంచన్‌గా టైముకి ఇల్లుచేరే మనిషికి సాయంత్రం ఓ గంటసేపు ఏం చేస్తున్నావంటే జవాబు చెప్పడం ఇబ్బందేకదా! ఒళ్లు తగ్గించడానికి ఇంటికి నడిచొస్తున్నానని భార్యతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది.
డాన్సు టీచరమ్మ హామీ ఇచ్చింది. ''రోజుకో గంట వస్తే చాలు. నా దగ్గరకొచ్చిన వాళ్లందరూ నెల్లాళ్లలో బ్రహ్మాండమైన డాన్సర్లయ్యేరు, ఒక్కడు తప్ప. నీకు ''జోడు ఎడమ పాదాలుండకపోతే చాలు. నువ్వు డాన్స్‌లో పేరు తెచ్చుకోవచ్చు''
డాన్సులో అడుగులు బొత్తిగా వేయడం రానివాడిని జోడు ఎడమ పాదాలవాడంటారు. ఆ విషయం తెలియని హెన్రీ అమాయకంగా అడిగేడు ''మీరన్నతను, అతనికి రెండు ఎడమ పాదాలుండేవా?''
''అబ్బే, ఆ మాటకొస్తే ఒక్కటీ ఉండేది కాదు. ఇరవై రోజుల ప్రాక్టీసు తర్వాత పైకప్పు నుంచి పడిపోయి కాలు విరగొట్టుకున్నాడు. పాదాలు తీసేయాల్సివచ్చింది. చెక్కపాదాలు పెట్టుకొని వచ్చినా నేను నేర్పిస్తానన్నాను. కానీ అతనే వద్దనేశాడు''
తన స్మృతులు రాసేటప్పుడు 'నా జీవితంలో అత్యంత క్లిష్టఘట్టం' చాప్టర్‌లో హెన్రీ వర్ణించవలసిన ఘట్టం ఇక ఆరంభమయింది. భౌతికంగా అతన్ని కొన్ని కండరాలు మహా ఇబ్బంది పెట్టాయి. వాటి ఉనికిని అతను అంతకుముందు గుర్తించకపోయినా, నెప్పి పుట్టడానికే వాటిని దేవుడు సృష్టించాడని అతను నమ్మసాగేడు. మానసికమైన బాధ ఇంకా ఘాెరమైనది.
డాన్స్ ఎలా చెయ్యాలో టీచరమ్మ నోటితో చెప్పి, ప్రాక్టీసుకి మాత్రం తన మేనకోడల్ని పిలిచి హెన్రీతో డాన్స్ చేయమనేది. ఆమె సన్నటి నడుమును పట్టుకొని అడుగులు వేసినప్పుడల్లా మిన్నీని వెన్నుపోటు పొడుస్తున్నట్లు గిల్టీగా ఫీలయ్యేవాడు హెన్రీ. పైగా టీచరమ్మ ఓ మూల నిలబడి చూయింగ్ గమ్ నములుతూ చేసే వ్యాఖ్యానాల కారణంగా హెన్రీ తనకి కీళ్లవాతం ఉందనీ, తనొక నాలుగుకాళ్ల వింత ప్రాణిననీ నమ్మసాగేడు.
ఒక్కొక్కప్పుడు హెన్రీ ఎదురుగానే అత్తకీ, మేనకోడలుకీ మధ్య వాదోపవాదాలు చెలరేగేవి. ఆ కాలు విరక్కొట్టుకొన్నతను మూడవ పాఠం తర్వాత చేరిన స్థాయికి హెన్రీ అయిదో పాఠం తర్వాత చేరాడనేది మేనకోడలు. అవిటివాడు అంతఘాెరం కాదనేది అత్తయ్య. అతనెలా బోర్లబొక్కల పడేవాడో గుర్తుచేసుకోమనేది మేనకోడలు. హెన్రీకంటే అతనే మాత్రం మెరుగుకాదనేది అత్తయ్య… పాపం హెన్రీ! చెమట్లు కక్కుతూ, నోరు మూసుకొని ఈ వాదనన్నీ వినేవాడు.
హెన్రీ చదువు మందకొడిగా సాగిందంటే తప్పు మేనకోడలిది మాత్రం కాదు. పాపం ఎంత శ్రద్ధ తీసుకొనేదంటే క్లాసయిపోయేక అతను వెళ్లిపోయేటప్పుడు అతని తప్పులు సరిచేయడానికి వెంటబడి సందు మలుపు తిరిగేటంతవరకు పాఠాలు చెప్తూనే ఉండేది. ఆ అవిటివాడికంటే ఇతన్ని మిన్నగా చేయాలని ఆమె తాపత్రయం. నాలుగ్గోడల మధ్య ఆమె నడుము వాటేసుకోవడం ఇంకా కష్టంగా తోచేది హెన్రీకి.
కానీ హెన్రీ పట్టుదల వదలకుండా పాఠాలు సాగించేడు. చివరికి ఓ శుభముహూర్తాన అతని విల్‌పవర్ ప్రమేయం లేకుండా పాదాలు, వాటంత అవే స్వబుద్ధితో కదలనారంభించేయి. తనకి బాంక్‌లో మొట్టమొదటి ఇంక్రిమెంటు ఇచ్చినప్పుడు కలిగిన గర్వం మళ్లీ ఇన్నాళ్లకి తొంగిచూసింది హెన్రీకి. టీచరమ్మ కూడా పొగిడింది. ''అదీ డాన్సంటే'' అని.
డాన్స్ చేసే నేర్పు రోజురోజుకీ పెరుగుతున్న కొద్దీ హెన్రీకి తను తీసుకొన్న నిర్ణయం ఎంత మహత్తరమైనదో అర్ధమవసాగింది. కాస్తలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి తన పెళ్లి పెటాకులయివుండును. ఇప్పుడు మిన్నీని చూస్తున్నకొద్దీ అతనికి అర్థమవుతోంది, తనంటే ఆమెకు ఎంత విసుగో. తను విజ్ఞాన సర్వస్వం తీయగానే తలనొప్పి అనో, వంటపని అనో చెప్పి జారుకుంటుంది. రెస్టారెంటు నాటి సంఘటన తర్వాత వాళ్లిద్దరి మధ్య ఎక్కువగా మౌనమే రాజ్యమేలుతోంది. డాన్స్‌రాని మొగుడితో గడిపే జీవితంలోని కష్టాలు చరమావస్థకు చేరుకొంటున్నాయని హెన్రీ గ్రహించుకొన్నాడు.
డాన్స్ వచ్చిన మొగుడితో గడపబోయే జీవితంలో మాధుర్యాన్ని గ్రోలాలంటే ఈ దశ అవసరమని కూడా సర్దిచెప్పుకొన్నాడు. ఇప్పుడెంత కష్టపడితే పరిస్థితి మారేక అంటే తనకు డాన్స్ వచ్చని తెలుసుకొన్నాక, అంత సుఖపడుతుందని అతని నమ్మకం. పిప్పిపన్ను అసలు లేకపోయిన సుఖంకంటే, అది పీకించుకున్నాక కలిగే హాయి ఉత్కృష్టమని నమ్మే ప్రజల్లో అతనొకడు.
అందుకనే మిన్నీ పుట్టిన రోజునాడు ఆమెకు నచ్చిన పర్సు బహూకరించినప్పుడు ఆమె ఏమీ మాట్లాడక పోయినా తప్పుబట్టలేదు. 'ఇంకెంతసేపులే ఈ ముభావం' అనుకొన్నాడు.
''సాయంత్రం బాంక్‌నుండే డ్రామా థియేటర్‌కు బుక్‌చేస్తాను. అక్కణ్ణుంచి ఆ మధ్య వెళ్లిన రెస్టారెంటుకి భోజనానికి వెళదాం'' అన్నాడు.
''అబ్బే అదంతా ఎందుకు?'' అంది మిన్నీ నిర్లిప్తంగానే. ''నో, నో, వెళ్లాల్సిందే'' హెన్రీ పట్టుదల.
''కానీ మీ వాకింగ్'' – ''ఇవాళ్టికి లేకపోతే ఫర్వాలేదులే''
''అయితే రోజూ మూడుమైళ్లు నడిచి వస్తున్నానంటారు!''
''నిక్షేపంలా, అవన్నీ పక్కకిపెట్టు. నువ్వు థియేటరుకి తిన్నగా వచ్చేయి. నేను అట్నుంచి అటే వస్తాను''
రెస్టారెంటులో డిన్నర్ తినేటప్పుడు ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ప్రియురాలి విముక్తి కోసం మాంత్రికుడి ప్రాణం ఉన్న చిలకను తెచ్చి దాచి ఉంచిన జగదేకవీరునిలా ఫీలవడం వలన ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు హెన్రీ. ''ఎందుకొచ్చిన సంత! ఇంటికిపోతే పోలా?'' అంది మిన్నీ ఒకటికి రెండుసార్లు. కానీ హెన్రీని ఆ రోజు అడ్డగించే శక్తి ఎవరికీ లేదు.
రాబోయే దృశ్యాలను అతను ముందే ఆలోచించి పెట్టుకొన్నాడు. దిక్కుమాలిన సిడ్నీ గాడు రావడం, మిన్నీని అడగడం, అప్పుడు తను లేచి, 'నో ఇవాళ నేను డాన్స్ చేస్తా'నని అనడం, మిన్నీ సంతోషంతో గుమ్మైపోవడం, కాస్సేపటికి మంచి ప్రాక్టీసున్న డాన్సర్లా అలుపు సొలుపెరుగని తనూ, ఆనందాతిరేకంతో అలిసిపోయిన మిన్నీ టేబుల్ తిరిగివచ్చి, తన భుజం మీద తలవాల్చి కొత్త జీవితం ఎంత బాగుందో అని మిన్నీ చెప్పడం!
ఈ పగటికల కనేటప్పుడు, సిడ్నీ వచ్చి తన భూమిక నభియిస్తాడో లేదోనన్న సందేహం హెన్రీని పీడించేది. అతను రాకపోతే కథ రక్తికట్టదు. కానీ అందమైన అమ్మాయి దగ్గిర్లో ఉంటే వీపుకి కళ్ళు మొలిచే దొంగపీనుగ కాబట్టి సిడ్నీకి తనలాటివాడు ఎప్పుడు రంగప్రవేశం చేయాలో బాగా తెలుసును. డాన్సింగ్ హల్లో కూర్చోగానే చరచర వచ్చి, ''హాయ్ హెన్రీ! ఏం గిరాకీ'' అనేసేడు.
''మా ఆవిడ పుట్టినరోజు''
''ఓఁ మెనీ హేపీ రిటర్స్స్ ఆఫ్ ది డే మిసెస్ హాల్స్, కమాన్, డాన్స్ చేద్దాం రండి కాస్సేపు''
బాండ్‌వాళ్లు కొత్త ట్యూన్ అందుకోతున్నారు. హెన్రీకది బాగా తెలిసున్నదే. పని చేయడాని కిచ్చగించని పాత పియానోను బాదిబాది టీచరమ్మ ఆ పాటను తన చేత ప్రాక్టీసు చేయించింది.
''మిస్టర్ మెర్సర్! మా ఆవిడతో ఇవాళ డాన్స్ చేయబోయేది నేను''
అతని అంచనా తప్పలేదు. మిన్నీ కళ్ళు పత్తికాయలయిపోయేయి. సిడ్నీ ఉలిక్కిపడ్డాడు. ''నీకు డాన్స్ రాదనుకొంటాను'' అన్నాడు తత్తరపడుతూ.
''దానికేముంది? ఓసారి చేసి చూస్తే సరి, అదే తెలిసిపోతుంది'' అంటూ మిన్నీని దగ్గరగా తీసుకొనేసరికి ఆమె 'హెన్రీ!' అని అరిచింది. ఇటువంటి అరుపేదో తను అరుస్తుందని అతని పగటికలల్లో ముందే ఊహించేడు. కానీ అరచిన విధానమే అతన్ని తికమక పెట్టింది. అది ఆనందాశ్చర్యాలతో వెలువడిన ప్రశంసకాదు. తాగుడు నిషా మొగుడి తలకెక్కిందేమోనన్న భయం ఆ పిలుపులో తొంగిచూసింది. కానీ ఈ శబ్దవిశేషాలన్నీ గమనించే స్థితిలో లేడతను. ఆపాటికే డాన్సింగ్ ఫ్లోర్ మీద కొచ్చేయడం, తనూహించుకొన్నదానికి భిన్నంగా స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నట్టు గ్రహింపు కొస్తూండడం జరిగింది.
మొదలెట్టడం పాపం బాగానే మొదలుపెట్టాడు. ఏబి చుక్కలగీతపైన ఎడమకాలు కదల్చడం జరిగింది. కానీ కుడికాలు కుదుపుతుండగానే ఏదో అదృశ్య శక్తి అతన్ని గుంపు మధ్యకి తీసుకొచ్చేసింది. అదీ ఎలాటి గుంపు? వెర్రెక్కినట్టు గెంతుతూ, అతని దారికి అడ్డుపడకుండా ఎలా నడుచుకోవాలో తెలీని మూక. నెలల తరబడి నేర్చుకొన్న విద్య తోడు నిలిచి, అతన్ని నిలబెట్టింది. కాస్సేపే… అంతలోనే మిన్నీ ఆర్తనాదం, ఎవర్నో గుద్దుకోవడం జరిగేయి. దాంతో ఖాళీ డాన్స్ రూములో మాత్రమే పనికి వచ్చే అతని డాన్స్ పరిజ్ఞానం అతనికి వీడ్కోలు చెప్పి వెళ్లిపోయింది. కాళ్లు గడగడ వణికేయి.
ఎవడో వీపుమీద చరిచి, 'ఏంటి గురూ! ఏంటి సంగతి!' అన్నాడు. అతనికి క్షమాపణ చెప్పుకోడానికి గిర్రున తిరిగేటంతలో మరొక వైపు నుండి ఇంకోడు డొక్కలో పొడిచేడు. ఎవరో తనను పీపాలో పెట్టేసి నయాగరా జలపాతంలోనికి నెట్టేసినట్టనిపించింది అతనికి. మరో నిమిషంలో అతను నేలమీద, మిన్నీ అతని మీద, ఎవరో అతని తలను తన్నేసి బోర్లపడ్డారు కూడా!
ఎవరో లేపారు. చూస్తే సిడ్నీ ''వన్స్‌మోర్ హెన్రీ! చూడడానికి బ్రహ్మాండంగా ఉంది. పాపం చాలామంది మిస్ అయిపోయేరు. మళ్లీ ఓసారి డాన్స్ చేయకూడదూ?'' అన్నాడు ఇకిలిస్తూ. హాలంతా వెకిలి నవ్వులతో దద్దరిల్లింది.
xxxxxxxxxxxxx
''మిన్నీ'' అన్నాడు హెన్రీ. వాళ్ళిద్దరూ అప్పుడు వాళ్ల ఇంటి బాల్కనీలో ఉన్నారు. మిన్నీ బదులివ్వలేదు. రెస్టారెంటునుండి ఇంటికొచ్చేదాకా ఉలుకులూ, పలుకులూ లేవు.
''మిన్నీ అయాం సారీ'' – నిశ్శబ్దం.
హెన్రీలో దుఃఖం పొంగుకొచ్చింది. ''నాకూ డాన్స్ వస్తుందనుకొన్నాను. ఆ టీచరమ్మ చెప్పినట్టు నాకు రెండు ఎడమ పాదాలున్నట్టున్నాయి. మనం ఆ రోజు రెస్టారెంటుకెళ్లిన తర్వాత నుండి డాన్స్ పాఠాలు నేర్చుకొన్నాను, నీకు చెప్పకుండా! నిన్ను ఆశ్చర్యపరుద్దామని. డాన్స్ రాని కారణంగా నిన్ను హోటల్స్‌కి తీసుకెళ్లలేని మొగుడి మీద నీకెంత చిరాకో నాకు తెలియనది కాదు. అందుకే నా ప్రయత్నం నేను చేశాను. కానీ…''
ఆమె ఇప్పుడు అతనికేసి తిరిగింది. కళ్లల్లో ఆనందం వెల్లి విరుస్తూండగా – ''హెన్రీ, మీరా ఇంటికి వెళ్లేది డాన్స్ నేర్చుకోవడానికా?''
హెన్రీ తెల్లబోయి చూశాడు.
మిన్నీ దగ్గరకి వచ్చి హెన్రీ చెవి పట్టుకొని లాగింది. ''నడిచొస్తున్నావని చెప్పి మీరు చేసేది ఇదా?''
''అయితే నీకంతా తెలుసన్నమాట!''
''అంతాకాదు, నేనోసారి బజారుకెళ్లి వస్తూంటే ఆ ఇంటిముందు నీలికళ్ల అమ్మాయి ఎడంచేయి మీ భుజం మీద, మీ కుడిచేయి ఆమె నడుంమీదా ఉంది. మీరు ఆమెను దగ్గరకు తీసుకొంటున్నారు.''
హెన్రీ పెదాలు తడుపుకొన్నాడు. ''మిన్నీ, నువ్వు నమ్ముతావో లేదో అది కౌగలింత కాదు. జెల్లీ రోల్ అనే డాన్సులో నాల్గవ స్టెప్పు, ఆమె నేర్పుతోంది.''
''నాకు ఇప్పుడర్థమయ్యింది. కానీ ఆ రోజు మాత్రం మీ రామెతో కులాసాగా గడిపి వీధిలోకి వచ్చి గుడ్‌నైట్ కిస్ ఇస్తున్నారనుకొన్నాను. మీ ప్లానేమిటో నాకు ముందే చెప్పి ఉండవచ్చు. ఓ.కే. నా పుట్టిన రోజుకి సర్‌ప్రైజుగా డాన్స్ చేద్దామనుకొన్నారు. కానీ నేను అపార్థం చేసుకొని ఉంటానని మీ కనుమానం రాలేదా? నాలో ఈ మధ్య మార్పేమీ కనబడలేదా?''
''కనబడింది. నీకు నేనరటే విసుగు పుట్టడం చేత అలా ఉన్నావనుకొన్నాను''
''మీరంటే నాకు విసుగా? ఛ, ఛ''
''ఆ రోజు సిడ్నీ తో డాన్స్ చూశాక నాకు తెలిసొచ్చింది. నువ్వు నాకంటే ఎంత చిన్నదానివో, నేను పుస్తకాలు చదువుతూ ఉంటే వింటూ కూర్చోడం నీకెంత బోరో కదా!''
''కానీ నాకు అలాగే బావుంది కదా!''
''కానీ నువ్వు డాన్స్ చేయాలి. నాకు తెలుసు. ప్రతీ అమ్మాయి డాన్సంటే పడి ఛస్తుందని''
''కానీ 'ఈ' అమ్మాయి మాత్రం హడిలి ఛస్తుంది. నా మాట వినండి. మనం మొదటిసారి కలిసినప్పుడు నేనెంత నిస్త్రాణగా ఉండేదాన్నో గుర్తుందా? ఎందుకో తెలుసా? నేను ఏళ్ల తరబడి డాన్సింగ్ స్కూల్లో టీచరుగా పనిచేసేదాన్ని కనుక. ఓ అయిదు రూపాయలిస్తే గంటసేపు ఓ అమ్మాయితో కలిసి డాన్స్ నేర్చుకోవచ్చు చూశారా, అటువంటి స్కూలన్నమాట.
''అదెంత చావో మీరూహించలేరు. పిప్పళ్ల బస్తాల్లాటి మగాళ్లను రోజుకి వందమందిని పెద్ద హాల్లో ఈడ్చుకొంటూ తిరగాలి. వాళ్లతో పోలిస్తే మీరు చాలా నయం. వాళ్లు నా కాళ్లు తొక్కేసేవారు. దబ్బున మీదపడిపోయేవారు, ఉక్కిరిబిక్కిరి చేసేసేవారు. ఇప్పుడర్థమైందా నాకు డాన్సంటే ఎందుచేత ఒళ్లుమంటో! జీవితంలో ఎన్నడూ డాన్సు చేసే అవసరం రాదని హామీ ఇవ్వడమే మీరు నాకు చేసే మహోపకారం…''
హెన్రీకి మాటలు రాలేదు. ''నువ్వు… నువ్వు… అంటే నీకు ఈ జీవితం నిజంగా బోరుకొట్టడం లేదంటావా? ఈ బతుకు నిస్పారంగా అనిపించటం లేదంటావా?''
''నిస్సారమా?''
ఆమె బుక్ షెల్ప్ దగ్గరికి పరిగెత్తుకెళ్లి ఓ లావాటి పుస్తకం తెచ్చి అతని చేతికిచ్చింది. ''మైడియర్, ఇది చదువు. ఇది కాకపోతే మరోటి… ఏదో ఒకటి… ఎన్నాళ్లయిందో నువ్వు చదవగా విని…''
హెన్రీ పుస్తకం అటూ ఇటూ తిరగేసి చూసేడు. ఉక్కిరిబిక్కిరి చేసే ఆనందంతో కూడా క్రమశిక్షణకు మారుపేరైన అతని మెదడు ఏదో పొరపాటును గమనించింది.
''ఇది ఎనిమిదో సంపుటం, మిన్నీ, 'నార్వే దేశం' నుండి ప్రష్యన్ చిత్రకళ వరకు…''
''మరీ మంచిది. 'నార్వే దేశం' చదవండి''
ఒక క్షణం ఆగి, తెగించి నిర్ణయం చేసేశాడు. గొంతు సవరించుకొని మొదలెట్టాడు. ''నార్వే దేశం స్కాండినేవియా ద్వీపకల్పములో పశ్చిమభాగం. ముఖ్యపట్టణములు – ఓస్లో…''
(పి.జి.ఉడ్‌హవుస్ రాసిన 'ఎ మ్యాన్ విత్ టూ లెఫ్ట్ ఫీట్' కథకు స్వేచ్ఛానువాదం,
– ఎమ్బీయస్ ప్రసాద్