నమ్మకం అవసరమే..కానీ మూఢ నమ్మకం అనర్థదాయకం. తెలుగు నాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది..డ్రయినేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది అన్నాడు కవి పురిపండా..తన పులిపంజా కవితా సంకలనంలో. నిజమే ఇప్పుడు సోకాల్డ్ స్వామీజీలు, పంచాంగకర్తలు, అరకొర జ్ఞానంతో హడావుడి చేసేవారు ప్రజల నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు లాజికల్ గా ఆలోచించడం మాని, ఇలాంటి వారిని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఏడాదికి ఓ సారి సముద్రస్నానం, మహానదుల స్నానం ఆరోగ్యదాయకం అన్నది పెద్దల మాట. పూర్వం జనం లీజర్ గా వుండేవారు కాబట్టి, ఏడాదికి ఓ మహానదిలో స్నానం చేయాలన్నారు. అలా చేయాలి అని చెబితే వినరు కాబట్టి, ఏడాదికి ఓ మహానదికి పుష్కర యోగం కలిగించారు. దేశంలో పలు నదులు వాటికి పుష్కరాలు.
నిజానికి నదీస్నానం, సముద్ర స్నానం ఎప్పుడు చేసినా ఆరోగ్యమే. అయితే ఫలానా తేదీల్లోనే చేయాలి..ఫలానా ఘడియల్లోనే చేయాలి..అంటూ ఇష్టం వచ్చినట్లు జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాదంటే నాస్తికుడంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రారంభమై, తెలంగాణ మీదుగా ఆంధ్రలోని యానాం వరకు పారుతోంది గోదావరి. ఎక్కడ చేస్తే గోదావరి కాదు. రాజమండ్రిలోనే గోదావరి వుందా? మిగిలిన చోట నీరు మారిపోతుందా? లక్షలాది మంది ఒకేసారి మునిగితే ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుంది. ఈ మాత్రం లాజిక్ జనం పట్టించుకోవడం లేదు. సాములోరు చెప్పారు. పంతులుగారు చెప్పారు అంటూ అదే పోక పోతున్నారు.
జనాల అజ్ఞానం ఆధారంగా లక్షలు, కోట్ల వ్యాపారం సాగిపోతోంది. పుష్కరం అంటే ఇక రైళ్లు, బస్సలు, ఇతరత్రా వ్యవహారాలు, వ్యాపారమే వ్యాపారం. పులిని చూసి వాతలు పెట్టుకన్నట్లు, కాశీలో ఎలా అయితే హారతి ఇస్తారో, అదే విధంగా, రాజమండ్రిలో కూడా. అదే గెటప్, అదే సెటప్, అచ్చం అలాగే. ఎందుకు అలాగే, ఇక్కడ వేరేగా చేయకూడదా అన్న ఆలోచన రాదు. వుండదు. ఇప్పుడేమంయింది. తేడా వచ్చేసరికి,. సన్నాయినొక్కులు మొదలు. ముహుర్తం తేడావచ్చిందని ఒకరు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టారని మరొకరు. నిజమేమిటి? లక్షలాది మందిని ఒకేసారి ఒకేచోట పోగేయడం. అదీ అసలు తప్పు.
టీవీలో ఈ యంత్రం కట్టుకోండి..ఈ రాయి తగిలించుకోండి అంటేనే నమ్మేసి, వేలు ఇస్తున్న జనం, గోదావరిలో ఇప్పుడు స్నానం చేస్తే పుణ్యమట అన్న ప్రచారానికి కూడా అమాంతం పడిపోయారు. అసలే తెల్లారి లేచిందగ్గర నుంచి పాపాలు తప్ప, పుణ్యాలు లేని బతుకులైపోయాయి. అందుకే ఒక్క మునకతో పాపాలు పోతాయి అనేసరికి ఇంకేం అంటూ ఎగరేసుకువెళ్తున్నారు. ఎన్నివేల మంది పోలీసులు వుంటేనేం..ఎన్ని వందల మంది అధికారులు వుంటేనేం..లక్షలుగా వచ్చిన జనాన్ని ఎక్కడ నియంత్రించగలరు?
ఇప్పటికైనా పండితులు చెప్పాల్సింది..గోదావరి స్నానం మంచిదే. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చేయచ్చు..గోదారి ఎక్కడుంటుందో అక్కడ చేయచ్చు..అని. అంతేకానీ సందట్లో సడేమియా అని తప్పులు వెదకడం కాదు.