ఎమ్బీయస్‌ కథలు: రాంపండూ – శునకదానమూ

అనంత్‌కు అత్తయ్యలంటే ఏనాడూ ప్రేమ లేదు. మాంకాళి అత్తయ్య అంటే మరీ లేదు. ఆవిడ కూడా మేనల్లుడి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదనడానికి తాజా ఉదాహరణ – తన ఆల్సేషియన్‌ డాగ్‌ జాకీని…

అనంత్‌కు అత్తయ్యలంటే ఏనాడూ ప్రేమ లేదు. మాంకాళి అత్తయ్య అంటే మరీ లేదు. ఆవిడ కూడా మేనల్లుడి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదనడానికి తాజా ఉదాహరణ – తన ఆల్సేషియన్‌ డాగ్‌ జాకీని అతని సంరక్షణలో వదలడమే.

అప్పటికీ అనంత్‌ చెప్పిచూశాడు. –  ''కుక్కలకి కొత్తా – పాతా వుంటాయి. నేనంటే దానికి కాస్త పరిచయముండేది కానీ మా ఇంటికి వచ్చేవాళ్లతో తల ఊపే పరిచయం కూడా లేదు. మీద పడి రక్కి వదిలి పెట్టవచ్చు. నీతో పాటు దాన్ని తీర్థయాత్రలకు వెంటబెట్టుకు వెళ్లు. వచ్చే జన్మలోనైనా మనిషి జన్మ వస్తుందేమో'' అని.

అత్తయ్య వినలేదు. తన జాకీకి కొత్తా పాతా లేవంది. సర్దుకుపోతుందంది. నిజంగానే అనంత్‌కీ, దానికీ చాలా వాటిల్లో సర్దుబాటు కుదిరింది – పొద్దున్నే లేవడం విషయంలో తప్ప. అది తెల్లవారు ఝామున (అనంత్‌ దృష్టిలో) పది గంటలకే లేచి, తలుపు గీరి, గీరి అనంత్‌ను నిద్రలేపి, అతని మంచం మీదకు ఉరికి, మొహం అంతా నాకి, అతని ఒళ్లో నిద్రపోయేది.

మళ్లీ నిద్రపోయేకాడికి పది గంటలకు నిద్రాభంగం చేయడమెందుకని అనంత్‌ ఫిర్యాదు. కానీ వినేవాళ్లెవరు? తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చి మాంకాళి అత్తయ్య ఎప్పుడు తీసుకుపోతుందాని రోజులు లెక్కపెట్టుకుంటూండగానే రాంపండు రంగ ప్రవేశం చేసాడు.

************

సుమనోహరిపై అనంత్‌కు మోజు తీరిపోయినా రాంపండుకి తీరనట్టే ఉంది.  ఐసుదిండు ఐడియా వల్ల నష్టపోయింది అనంత్‌ కానీ రాంపండు కాదుగా! ఎంత తుంటరి బుద్ధులున్నా సుమనోహరి గొప్ప కవయిత్రి అని, ఆమె కవితా పుస్తకానికి అంతర్జాతీయ ఖ్యాతి రావలసినదేననీ – అదీ తన ద్వారా – అతని ప్రగాఢ నమ్మిక. అందుకే పబ్లిషరు పరంధామ్‌ని విందుకు పిలిచాడు. రాంపండు విందుకు పిలిచాడు అంటే ఆ భారం అనంత్‌దేనని వాళ్లని తెలిసున్న వాళ్లందరికీ తెలుసు. ముఖ్యంగా అచలపతికి. అందుకని రాంపండు రాగానే వెనక్కాలే వచ్చి నిలబడ్డాడు. రాంపండు వస్తూనే అనంత్‌ను అభినందించాడు.

''ఒరేయ్‌, నీ మంచీమర్యాదలకు జోహార్‌. ఇలా అడపాదడపా అందరిని పిలిచి భోజనం పెట్టడం – ఓహో! వచ్చే కాలంలో స్కూలు పిల్లలు శిబిదధీచి పాఠంతో బాటు నీగురించి పాఠం కూడా చదువు కుంటారనుకో. ముఖ్యంగా గెస్‌ క్వశ్చన్స్‌లో ఒకటి నీ పాఠంలో తప్పకుండా ఉండి తీరుతుంది''

అనంత్‌ విషాదంగా ఓ నవ్వు నవ్వి 'ఇంతకీ ఈసారి నేను ఎవర్ని ఆహ్వానించబోతున్నాను'' అని అడిగాడు.

''పబ్లిషరు పరంధామ్‌ని''

''ఆయనతో  నీకేం పనిట?''

''ఆయన నీ ఫ్రెండు మరియు క్లాసుమేటు రాంపండు ముచ్చట తీర్చబోతున్నాడు''

''రాంపండు ముచ్చట ఏమిటట?''

''సుమనోహరిని ప్రేమించడం''

ఈ పాటికే అనంత్‌ సహనం కోల్పోయాడు. ఇదివరకు ఇలాగే ప్రేమ పేరు చెప్పి రాంపండు 'తింటా' అనే అమ్మాయి ముఠాను తోలు కొచ్చాడు. వాళ్లు తిన్నంత తిని, తిట్టినంత తిట్టి పోయారు.

''ఒరేయ్‌, డొంక తిరుగుడు మాన్తావా? అచలపతికి సెలవిచ్చి పంపేయమన్నావా?'' అని అడిగాడు కోపంగా.

''ఇందులో తిరుగుడేం లేదురా. సుమనోహరి రాసిన కవిత్వం పుస్తక రూపంలో అచ్చేయడానికి ఆయనకు నచ్చచెప్పాలి. ఆ పుస్తకం బయట వెలువడి, అమ్ముడుపోతే పరంధామునికి పైసా, రాంపండుకి ప్యార్‌, సుమనోహరికి పేరు దక్కుతాయ్‌''.

''సరే, ఏడు. అచలపతీ, వీడికేదో లంచ్‌ కావాలట. ఏర్పాట్లు చూడు'' అని  పేపరు చూడసాగేడు అనంత్‌.

కానీ రాంపండు చెప్పినవన్నీ వింటూంటే పేపరు మీద దృష్టి నిలవలేదు. ''ఒరేయ్‌ రాంపండూ, మీ పరంధామానికి ఏదైనా అజీర్తా? పిచ్చా? చిన్న పిల్లాళ్ల ఐటమ్సన్నీ చెప్తావేంట్రా?'' అని అడిగాడు ఆశ్చర్యంగా.

''ఓహ్‌, నీకు చెప్పలేదు కదా, పరంధామానికి తోడుగా పదేళ్ల వాళ్ల అబ్బాయి టింకూ వస్తున్నాడు. వాడి మాట అంటే ఆయనకు మహా గురిలే. ఏవరేజి రీడరుకి వాడికంటె ఎక్కువ స్టాండర్డ్‌ ఉండదని ఆయన నమ్మకం. వాడు తలకాయ ఊపితేనే ఆయన చెక్కు చింపేది.  లేకపోతే మన పరీక్ష  ఫెయిల్‌ '' .

అనంత్‌బుర్రలో సినిమాహాల్లో ఇంటర్వల్‌ టైమ్‌లోలా టపటపా లైట్లు వెలిగాయి. 'టింకూ అంటే లావుగా, బంతిలా  పడుతూ అరుస్తూ, అల్లరి చేస్తుండేవాడేనా? తండ్రి అంటే ఆ పంచీ, లాల్చీ, పైన కండువా … చూశాను మహాప్రభో చూశాను. ఓ సారి ఎక్కడో తగిలేరు. ఆ కుర్రాడి కున్నంత వాగుడు భువిలో ఎవరికీ ఉండదు. నోటికి ఎంత మాటపడితే అంత అనేస్తాడు.''

''… ఏం నిన్నేమైనా అన్నాడా?'' రాంపండు ఉత్సుకతతో అడిగాడు.

అనంత్‌ సమాధానం ఇవ్వకుండా ఊరుకునేటంతలో అచలపతి టపీమని అందించాడు.

''సర్‌ బ్రెయిన్‌ను ఉడత పిల్ల బ్రెయిన్‌తో పోల్చాడు సర్‌'' అని.

రాంపండుకు జిజ్ఞాస పెరిగింది. ''దాని కంటె ఎక్కువంటాడా? తక్కువంటాడా?''

అచలపతి జాగ్రత్తగా సమాధానమిచ్చాడు. ''ఉడతకే ఎక్కువ మార్కులు పడ్డాయి''.

అనంత్‌ ఓర్పు నశించింది. ''ఒరేయ్‌ అవన్నీ అనవసరం. వాడి నోటికి హద్దూ  పద్దూ లేదు. రేపొచ్చి నా మొహం కుళ్లిన చేప మొహంలా ఉందనవచ్చు.'' అనబోతుండగానే అచలపతి ధైర్యం చెప్పబోయేడు-

''డైనింగు హాల్లో  లైటింగు తగ్గిస్తే పోలిక గుర్తు పట్టలేక పోవచ్చు సర్‌''.

''నేనొప్పుకోను. బాటరీ లైటు వేసి చూసైనా పోలికలు పట్టగల సమర్థుడు వాడు. నేను రిస్కు తీసుకోను. వాళ్లు భోజనానికి వచ్చే వేళకి నేను ఇంట్లో ఉండను. నువ్వేమనుకున్నా సరే ఇంట్లోంచి పారిపోతాను. నువ్వే  ఏదో ఒకటి సర్ది చెప్పుకో.''

రాంపండు అడ్డు పడ్డాడు -'' మీ ఇంట్లో లంచ్‌  ఏర్పాటు చేసి నువ్వే వెళ్లిపోతే అసహ్యంగా ఉంటుంది. ఆయనకు కోపం వస్తుందేమో''

''నేనిక్కడే ఉండి ఆ కుర్రాడేదైనా వాగితే వాణ్ని ఒక్క టెంకిజెల్ల పుచ్చుకుంటే కోపంతో బాటు తాపం కూడా వస్తుంది. అది చూసుకో…''

''అదీ కరక్టే గానీ. నువ్వు కవిత్వం వింటూ సరైన చోట్ల ఆహా, ఓహో అని పరంధామ్‌ని ఇంప్రెస్‌ చేస్తావని సుమనోహరికి చెప్పానే!''

''నేను వావాకారాలు చేస్తానో లేదో కానీ ఆ కుర్రాడి చేత మాత్రం హాహాకారాలు చేయిస్తాను. దెబ్బకి సుమనోహరి పుస్తకం అచ్చుకాదు. నీ ప్రేమకు టాటా''.

''ఒరే మరీ అంత ఫాస్టుగా రీలు తిప్పేయకురా. కావలిస్తే వెళ్లి పో నీకు పిచ్చనో, వెర్రనో అమావాస్య పున్నమనో ఏదో చెప్పుకుంటా. నలుగురు మనుష్యులను చూస్తే  ఉక్కిరిబిక్కిరయ్యి పోతావని చెప్పుకుంటా''.

**********

అనంత్‌ లంచ్‌ టైముకి బయటకు వెళ్లిపోయాడు. వెళ్తుండగా గుమ్మంలోనే పరంధామ్‌, అతని కొడుకు టాక్సీ దిగడం ఆ కొడుకు అనంత్‌ను పలకరించడం, అనంత్‌ మొహం తిప్పుకు వెళ్లిపోవడం జరిగింది. హోటల్లో భోజనం చేసి యింటికి తిరిగొచ్చిన తర్వాత విచారిస్తే తన ఐక్యూ లెవెల్స్‌ గురించి ఆ కుర్రకుంక ఏదో అన్నట్టుగా తెలిసింది.

అచలపతి ఆపై ఇకనేమీ చెప్పలేనన్నాడు. 

ఇంతలోనే రాంపండు ఫోన్‌ – ''చాలా థాంక్స్‌రా అనంతూ, అంతా బ్రహ్మాండంగా జరిగింది. కుర్రకుంక గాడికి పీకలమొయ్యా తిండి కూరేశాడు అచలపతి. దాంతో వాడు గుమ్మయిపోయి నేను సుమనోహరి కవిత్వం పాడి వినిపించినప్పుడల్లా ఆహా, ఓహో అనడం మొదలెట్టాడు''.

''అయితే సుమనోహరి పుస్తకం అచ్చుకావడం, నీ ప్రేమ ఫలించడం ఖాయం అన్నమాట. కంగ్రాట్స్‌!''

''థాంక్స్‌. కానీ చిన్న విషయం ఒకటుందిరా. నన్ను ఓ ఇంటివాడిగా చూడడానికి నువ్వు ఏ త్యాగానికైనా రెడీ అని ఓ సారి అన్నావు గుర్తుందా?''

అనంత్‌ మెదడులో అనుమాన పిశాచం మేల్కొంది. ''అన్నానేమో. అలాటి అవకతవక వాగుడు చాలా వాగుతాను. ఇంతకీ దాని సంగతి ఇప్పుడెందుకు?''

''విషయం ఏమిటంటే ఆ టింకుగాడు మీ ఇంట్లో జాకీని చూసి ముచ్చట పడ్డాడు. కాదంటే వాడు చిన్నబుచ్చుకోవడం, ఏతావాతా నీ ప్రతిజ్ఞ ఫలించక పోవడం జరుగుతుందని భయపడి…''

''…భయపడి?''

''… ఆ కుక్కను వాడికి  నీ తరఫున బహుమతిగా ఇచ్చేశాను. ఆ కుర్రాడు, వాడి మొహంలో సంతోషం చూసి ఆ పెద్దాడు ఎంత సంతోషించాడో చెప్ప…''

''ఓరి చవటా, అది నా కుక్క కాదు. మా అత్తయ్యది. అందునా మాంకాళి అత్తయ్యది. వెళ్లి పట్టుకొచ్చేయ్‌''

రాంపండుకీ కొన్ని సిద్ధాంతాలున్నాయి. ''ఓ సారి ఇచ్చినది మళ్లీ వెనక్కి తీసుకోవడం మర్యాద కాదు'' అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

***********

అనంత్‌ అచలపతిని పిలిచాడు. మంతనాలు సాగించాడు. ఈ చిక్కుల్లోంచి బయట పడడం ఎలా? అన్నాడు. ఆలోచించి, ఆలోచించి అచలపతి ఒక అయిడియా చెప్పాడు.

''సర్‌,  భోజనం టైములో మాటల బట్టి పరంధామంగారు, వారి అబ్బాయి మాట్నీ కెళ్లి ఉండాలి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా చూపిస్తే గానీ రాత్రి భోజనం చేయనని ఆ కుర్రాడు ఖరాఖండీగా చెప్పడం మేం విన్నాం సర్‌. వాళ్లు మేట్నీ నుండి తిరిగొచ్చేందుకు ముందే రాంపండుగారిని హోటల్‌ రూమ్‌కి వచ్చి వెయిట్‌ చేయమని పరంధామంగారు అనగా విన్నాను సర్‌''.

''ఎగ్రిమెంటు రాసుకోవడానికి అయి వుంటుందిలే. అయినా దీనికీ, నా కుక్కకీ సంబంధం ఏమిటి?''

''అదే చెప్పబోతున్నాను సర్‌. ప్రస్తుతం మన జాకీ వాళ్ల హోటల్‌ రూమ్‌లో ఒక్కత్తే ఉంది. రాంపండుగారు అయిదున్నరకు వచ్చి రిసెప్షన్‌లో తాళం చెవి తీసుకుని ఆ గదిలో ప్రవేశించి పరంధామం గారి గురించి ఆరు గంటల దాకా వెయిట్‌  చేస్తూండాలి. రాంపండు గారి పద్ధతి మనకు బాగా తెలుసు. ఆయన అంతసేపు ఓపిగ్గా కూచోలేరు. కాలుగాలిన పిల్లిలా రూములోంచి వరండాలోకి, వరండాలోంచి రూములోకి తిరుగుతూ, వెళ్లి  లిఫ్ట్‌కి ఎదురుగా నిలబడుతూ….''

అనంత్‌ ఎగిరి గంతేశాడు. ''ఇహ చెప్పకు. నాకు తెలిసి పోయింది. నేను మెట్ల దారిలోంచి ఆ టైములో అక్కడకు వెళ్లి, వాడు అలా వెళ్లగా చూసి కుక్కను వెంట బెట్టుకు వచ్చేయాలి. అంతేనా?''

''కరక్టుగా చెప్పారు. జాకీ కూడా మారు మాటాడకుండా, అదే, మారు మొరక్కుండా మీ వెంట వచ్చేస్తుంది''.

సరిగ్గా అచలపతి చెప్పినట్టే జరిగింది. సాయంత్రం ఆరు గంటల కల్లా అనంత్‌ జాకీతో సహా ఇంటికి తిరిగి వచ్చి అచలపతి చేతికి దాన్ని అప్పగించి ''వెళ్లి ఓ గదిలో కట్టేసిరా'' అని ఆజ్ఞాపించాడు.

ఆ తర్వాత అతను తెచ్చిన కాఫీ తాగుతూ, హాయిగా వెనక్కి వాలి 'అచలపతీ, నీ బుర్ర అమోఘమోయ్‌, నెపోలియన్‌ నీ దగ్గర కరస్పాండెన్స్‌ కోర్సు తీసుకుని ఉంటే యుద్ధంలో ఓడిపోయే వాడు కాదు. ఇదిగో ఆ టేబులు మీద ఓ వంద రూపాయల నోటుంది. నీకేమైనా పనికొస్తుందంటావా?'' అని అడిగాడు.

''థాంక్యూ సర్‌'' అని  అచలపతి ఆ వందా తీసుకుంటూండగానే అనంత్‌ హఠాత్తుగా ఉలిక్కిపడ్డాడు – ''అవునూ ఈ పబ్లిషరు గాడు తిరిగివచ్చాక కుక్క మాయమయిన సంగతి గుర్తిస్తాడు కదూ. ఆ సమయానికి రాంపండు అక్కడుండడంతో జాకీ అంతర్ధానానికీ, వాడికీ లింకుందని అనుమానిస్తాడు. రాంపండు మీద కోపం, సుమనోహరి పుస్తకం వేయననడం, ఆమెకు రాంపండుపై అలక, ఎంగేజిమెంట్‌ బ్రేక్‌, పశ్చాత్తప్త హృదయంతో సుమనోహరి నన్ను పెళ్లి చేసుకుంటాననడం. అమ్మ బాబోయ్‌! అటు తిరిగి, ఇటు తిరిగి ఇది నా మెడకు చుట్టుకొనేట్టుందే!  ఇదేమిటి అచలపతీ, ఇలా చేశావ్‌? నెపోలియన్‌కి కరస్పాండెన్స్‌ కోర్సు పంపక. అడిగినా కుదరదని చెప్పేయ్‌…'' అచలపతి సమాధానం చెప్పేటంతలో డోరు బెల్లు మోగింది.

''ఎవరు? నెపోలియనా? కరస్పాండెన్స్‌ కోర్సు ఇవ్వనన్నావని డైరెక్టుగా ట్యూషన్‌కి వచ్చేశాడా?'' ఖంగారులో అనంత్‌ ఏదేదో వాగేస్తున్నాడు.

అచలపతి వెళ్లి కిటికీలోంచి చూసివచ్చి ''పరంధామం గారండి. కోపంగా ఉన్నట్లు కనబడుతోంది'' అన్నాడు అతి శాంతంగా.

అనంత్‌ సోఫాలోంచి ఎగిరి వెనక్కి దూకాడు.  అచలపతి తలుపు తీయగానే పరంధామ్‌ దూసుకువచ్చాడు. ''ఎక్కడయ్యా? ఈ అనంత్‌ పెద్దమనిషి?'' అని అరిచాడు.

''ఎక్కడంటే ఏం చెప్పగలం సర్‌? ఎక్కడైనా ఉండవచ్చు'' అన్నాడు అచలపతి వేదాంత ధోరణిలో.

''వాడు నా హోటల్‌ రూమ్‌కొచ్చి మా అబ్బాయి కుక్క ఎత్తుకు పోయాడు..''

''మా అబ్బాయి కుక్కట!'' అనంత్‌ పళ్లు నూరుకున్నాడు సోఫా వెనకనుండి.

''ఆయనేం చేస్తుంటారో పాపం ఆయనకే తెలియదండి'' అని నిట్టూర్చాడు అచలపతి.

పరంధామ్‌ దూకుడు ఆగింది. ''అంటే మనిషి అదోరకమా?'' అని అడిగాడు సందేహిస్తూ.

''అదే రకం'' అచలపతి సందేహనివృత్తి చేశాడు.

''అంటే… అమావాస్యకు, పున్నమికీ…''

''ఆ పట్టింపులు లేవు. తిథి ఏదైనా తీరు ఒక్కటే''

పరంధామ్‌ బెదిరాడు. ''మరి ఎప్పుడు రెచ్చిపోతాడంటావ్‌''

''అలా చెప్పడం కష్టం సర్‌. కాస్త సంప్రదాయబద్ధంగా ఉన్న మనుషులంటే ఆయనకు కాస్త చికాకు''.

''సంప్రదాయం వుందని ఎలా తెలుస్తుందయ్యా?''

''బట్టల బట్టి తెలిసిపోతుంది కదండీ.. ప్యాంటు, షర్టు కాకుండా భారతీయ పద్ధతిలో.. ''.

''నాలా పంచీ, లాల్చీ వేసుకునేవాళ్లంటావా..?!'' అన్నాడు పరంధామ్‌ తనను తాను చూసుకుంటూ. ''అంటే నన్ను చూసి మీద పడతాడంటావా?''

అచలపతి సన్నగా దగ్గాడు. ''కండువా మాట మర్చిపోయారండి.. అయితే అనంత్‌ గారి విషయంలో ఒక సుగుణం ఏమిటంటే ఆయన వీక్నెస్‌ ఆయనకు తెలుసండి. అందుకే మిమ్మల్ని భోజనానికి పిలిచినప్పుడు తనను తాను కంట్రోలు చేసుకోలేమోనన్న భయంతో బయటకు వెళ్లి పోయారు. మీరేమైనా అనుకుంటారేమోనని సందేహిస్తూనే…''

''…అనుకున్నాను. వింతగా ఉందనుకున్నాను. మా టింకూ కూడా వింతగా ఉందనుకున్నాడు. గొప్ప బ్రెయిన్‌లే మా వాడిది. ఇంతకీ ఈ పెద్దమనిషెక్కడ?''

''సోఫా వెనకాల చూస్తే కనబడవచ్చండి''.

''అదేమిటి? సోఫా మీద కూచుంటారు. కానీ సోఫా వెనకాల కూచోడవేమిటి?''

''చెప్పాను కదండీ, ఆయన తరహాయే వేరని''

పరంధామ్‌ వణికేడు. ''కాస్త గేటు దాకా సాయం వస్తావా?'' అన్నాడు.

పరంధామ్‌ వెళ్లాక ఒళ్లు విరుచుకుంటూ అనంత్‌ బయటకు వచ్చాడు.

అచలపతి కనబడగానే అడిగాడు ''అసలు వాడికి కుక్క నా దగ్గర ఉన్నట్టు అనుమానం ఎలా వచ్చిందయ్యా?'' అని.

''మీరు కుక్కతో సహా హోటల్‌ రూములోంచి బయటకు వస్తున్నట్లు చూశానని రాంపండుగారు ఆయనకు చెప్పారు సర్‌''.

''రాంపండు చూశాడా?''

''లేదు సర్‌. అలా చెప్పమని నేనే ఆయనకు ఫోన్‌ చేసి చెప్పా. అలా అయితే ఆయన మీద అనుమానం రాదని నా అంచనా. లేకపోతే మీరిందాక ఊహించినట్టే జరుగుతుందని నాకూ అనిపించింది.''

''వండ్రఫుల్‌. తీసుకో ఇంకో వంద. అదేమిటి? నీ చేతిలో ఆ వంద ఎవరిచ్చారు?''

''పరంధామ్‌గారు కుక్కను తిరిగి ఇచ్చినందుకు సంతోషించి…''

''ఆ …'' అంటూ కొయ్యబారిపోయాడు అనంత్‌. '' ఏ క్షణాన్నైనా అత్తయ్య వచ్చే ఈ సమయంలో…''

''ఖంగారు పడకండి సర్‌. నేను తిరిగిచ్చింది జాకీని కాదు. మీరు హోటల్‌కి వెళ్లిన టైములోనే నేను బజారు కెళ్లి ఇంకో ఆల్సేషియన్‌ డాగ్‌ కొని తెచ్చా. పరంధామం గారికి తేడాలు ఏం తెలుస్తాయి కనక? పైగా జాకీని చూసిందే ఇవాళ. ఇంకా మచ్చిక కూడా కాలేదు..''

''వండ్రఫుల్లెస్ట్‌. అందుకో ఇంకో వంద''

''థాంక్యూ సర్‌'' అన్నాడు అచలపతి తలవంచి..

– పిజి ఉడ్‌హౌస్‌ రాసిన ''Episode of Dog Mackintosh'' కథ ఆధారంగా (''హాసం'' 2002లో ప్రచురితం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]