కోదండరామ్ అంటే నాకెప్పుడూ యిష్టం లేదు. ప్రత్యేక ఉద్యమాన్ని నడిపాడని కాదు, ఆ సందర్భంగా ఆయన చాలా అవకతవకగా మాట్లాడాడని. చరిత్ర గురించి అబద్ధాలు చెప్పాడు, అభాండాలు వేశాడు, అతిశయోక్తులు పలికాడు (తెలంగాణ ప్రజలు బహిష్కరించవలసిన ఆంధ్ర ఉత్పత్తుల జాబితా యింకా తయారు చేస్తూనే వున్నాడనుకుంటా). ఒక ప్రొఫెసరై వుండి యింత గందరగోళంగా మాట్లాడడం నాకు రుచించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు. టి-జాక్ చైర్మన్‌గా వుంటూ తెరాస చెప్పినట్లా ఆడడం మరో ఎత్తు. తెలంగాణ ఏర్పడాలని కోరుకున్న అనేక పార్టీల వారు, సంస్థల వారు టి-జాక్ లో చేరితే తెరాస ఎవర్ని వుంచమంటే వారిని వుంచాడు, ఎవర్ని అవతలికి తోసేయమంటే వారిని తోసేశాడు. చివరకు తెలంగాణ అంటే కెసియార్ తప్ప వేరెవ్వరూ కాదన్న అభిప్రాయం కలిగించాడు. దాని దుష్ఫలితాలే యీ రోజు అనుభవిస్తున్నాం.
తను చెప్పినట్లు ఆడుతున్నా కెసియార్‌కు అది చాలలేదు. కోదండరాంపై కోపం పెంచుకున్నారు. ఒక దశలో కోదండరాంను తెలంగాణ ఉద్యమకారులు ఆకాశానికి ఎత్తివేస్తూ వుంటే ఓ ఆర్టికల్ రాశాను. కోదండరాం ఒట్టి పసుపు విఘ్నేశ్వరుడే అని. పూజ ప్రారంభంలో పసుపుతో విఘ్నేశ్వరుణ్ని చేసి పూజిస్తాం. కాస్సేపటికి మెయిన్ దేవుణ్ని ఆవాహన చేశాక, యీ పసుపు విఘ్నేశ్వరుణ్ని పక్కకు పెట్టేస్తాం. పూజ అయిపోయి పూలూ, పత్రీ ఎత్తివేస్తూంటే వాటి మధ్యలో ఎక్కడో దొరుకుతాడు. తెలంగాణ వచ్చాక కోదండరాం పని కూడా అంతే అని రాశాను. అక్షరాలా అదే జరిగింది. కెసియార్ ఆయన్ను పక్కకు నెట్టేశాడు. ఆపాయింట్‌మెంట్ యివ్వడమే గగనమై పోయింది. మేం కలలు కన్న తెలంగాణ యిది కాదు అంటూ కోదండరాం సన్నాయినొక్కులు నొక్కుతూనే వున్నాడు. ఆయనకు మతి పోయింది అంటూ తెరాస నాయకులు ఆయన్ను, ఆయన మాటలను తీసిపారేశారు. అయినా కోదండరాం తంటాలు పడుతూనే వచ్చాడు. ఈ రోజు నిరుద్యోగుల ర్యాలీ అంటూ పెద్ద కలకలమే రేపాడు.
అందుకే ఆయన యీ రోజు నాకు నచ్చాడు. ఏదో ఒక ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించినందుకు కాదు, కెసియార్ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించే సాహసం చేసినందుకు! భగవద్గీత చెప్పాక శ్రీకృష్ణుడి విశ్వరూపం ప్రదర్శించినట్లు తెలంగాణ వచ్చాక కెసియార్ విశ్వరూపం ఎత్తాడు. నువ్వేముంది నిమిత్తమాత్రుడివి, అన్నీ నేనే, అన్నిటా నేనే, అన్నీ నాలోనే విలీనమవుతాయి అని చెప్పినట్లు తెలంగాణలో ప్రతి నాయకుణ్ని, ప్రతి పార్టీని హరాయించుకున్నాడు. సామదానభేదదండోపాయాల్లో ఎవరి వద్ద ఏం వుపయోగించాడో తెలియదు కానీ అందరూ దాసోహమై పోయారు. బంగారు తెలంగాణ కోసం కెసియార్ చెంత చేరుతున్నాం అంటూ పార్టీ ఫిరాయించేశారు. ఫిరాయించాక పదవులు దక్కక పోయినా నోరెత్తకుండా కూర్చున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి చిన్నదానికి ప్రభుత్వంపై విరుచుకు పడిపోయే వాక్శూరులు యీ రోజు కిమ్మనటం లేదు. ప్రభుత్వపాలన అప్పుడెలా వుందో యిప్పుడూ అలాగే వుంది. తెలంగాణ వస్తే రోజుకి రెండు గంటలు అదనంగా పనిచేస్తాం అని చెప్పిన ఉద్యోగులు చేయాల్సినదాని కంటె రెండు గంటలు తక్కువ పనిచేస్తున్నారు. జీతాలు విపరీతంగా పెంచినా అవినీతి అలాగే వుంది. హైదరాబాదు రోడ్ల స్థితి, ప్రజల అనారోగ్యం, వాతావరణ కాలుష్యం, ఆక్రమణలు, అక్రమ కట్టడాలు, మురికివాడల విస్తరణ.. ఏదీ మారలేదు. అప్పుడు లాభపడిన కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు యిప్పుడూ లాభపడుతున్నారు. నయూమ్ లాటి వాళ్లు మొన్నటిదాకా వర్ధిల్లుతూనే వున్నారు. పట్టుబడని నయూమ్‌లు యింకా ఎంతమంది వున్నారో తెలియదు. ఉద్యమసమయంలో పూర్వపాలకులపై అవినీతి ఆరోపణలు ఆంధ్ర పారిశ్రామికవేత్తలపై, సినిమావారిపై ఆక్రమణల ఆరోపణలు గుప్పించారు, కానీ అధికారం చేజిక్కాక వారెవరినీ జైలుకి పంపలేదు, ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు, కనీసం కేసులు కూడా పెట్టినట్టు లేదు. ఇన్ని జరుగుతున్నా 'మీరూ, చంద్రబాబూ పోటీలు పడి పబ్లిసిటీ ఊదరగొట్టేస్తున్నారు. మరి మీరు తెస్తానన్న మార్పు ఏది? చేసినన వాగ్దానాల సంగతేమిటి?' అని ఎవరూ గట్టిగా అడగలేదు. ప్రింట్ మీడియాకు, టీవీ మీడియాకు ప్రధాన ఆస్తులన్నీ హైదరాబాదులోనే వుండడం చేత కాబోలు మీడియాను కూడా పూర్తిగా కంట్రోలు చేయగలిగినట్లు కనబడుతోంది. కాస్త తలెత్తబోయిన ఆంధ్రజ్యోతి మాడు పగలకొట్టారు.
కెసియార్ ఉధృతి ఎలా వుందో యివాళ్టి తిరుపతి పర్యటన చాటి చెప్తోంది. కెసియార్‌కు అక్కడ అధికారపక్షం, ప్రతిపక్షం పోటీలు పడి ఘనస్వాగతం పలకడమా? ఏదో పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అని వూరుకోవలసిన మనిషి కాడు కెసియార్. ఆంధ్రులను జాతిపరంగా రాక్షసులని, మరోటని నానా తిట్లూ తిట్టాడు. అయినా ఆంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన స్థూపంపై అతని పేరు రాసి సత్కరించారు. ఆ సత్కారం తర్వాతైనా కెసియార్ తన మాటలను వెనక్కి తీసుకున్నాడా? క్షమాపణ చెప్పాడా? లేదే! ఇప్పటికీ తనకు రాజకీయంగా ఏదైనా యిబ్బంది రాగానే ఆంద్రోళ్ల కుట్ర అంటూనే వున్నాడే! నీటి దగ్గర, నిధుల దగ్గర, సంస్థల పంపిణీ దగ్గర ఆంధ్రులను ముప్పుతిప్పలు పెడుతున్నాడే! ఆంధ్ర అధికారులను, ఆంధ్ర వ్యాపారస్తులను, ఆంధ్ర ఉపాధ్యాయులను, ఆఖరికి ఆంధ్ర పురోహితులను కూడా దుమ్మెత్తి పోసిన కెసియార్ మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతి వెళితే ఆంధ్ర మంత్రి భార్యాసమేతంగా వెళ్లి రిసీవ్ చేసుకోవడమా? ఎంత సిగ్గుచేటు!
పదేళ్లపాటు హైదరాబాదులో వుండడానికి అవకాశం వుందని తెలిసి కూడా ఆంధ్ర ముఖ్యమంత్రిని 'మీ రాష్ట్రం మీకు ఏర్పడ్డాక యిక్కడ యింకా ఏం పని?' అంటూ విరుచుకుపడిన హరీశ్ రావు వంటి తెరాస నాయకులకు కూడా తోరణాలు కట్టి ఆహ్వానమా? వాళ్లకు వెంకటేశ్వరుడిపై భక్తి వుంటే వస్తారు, మొక్కులు చెల్లిస్తారు, కానుకలు యిస్తారు. మంత్రులకు, ముఖ్యమంత్రులకు ప్రొటోకాల్ ప్రకారం చేయవలసిన మర్యాదలు ఆలయ అధికారులు, పూజారులు చేస్తారు. రాజకీయంగా యింత హడావుడి ఎందుకు? ఇవాళ అనేక ఛానెళ్లల్లో వాటి ప్రసారాలెందుకు? టిడిపి ఒక్కటి మాత్రమే హంగామా చేస్తే ఓటు-నోటు కేసులో యిరుక్కున్నారు కాబట్టి అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రతిపక్షంలో వున్న వైసిపి నాయకులూ చేస్తున్నారు, టీవీ ఛానెళ్లూ చేస్తున్నాయి. మీడియా కూడా చేస్తోంది. అంటే దీనికి కారణం వేరే వుందన్నమాట. అందరికీ తోచే కారణం ఒక్కటే – వీళ్లందరికీ హైదరాబాదులో, తెలంగాణ జిల్లాల్లో ఆస్తులున్నాయి, వాటిని రక్షించుకోవడాని కోసమే యిదంతా అని. మరి ఆంధ్రులకు చెన్నయిలోను, బెంగుళూరులోను కూడా ఆస్తులున్నాయి. అక్కడి ముఖ్యమంత్రులు వచ్చినా యింత హంగు చేస్తున్నారా? లేదే! చేయకపోయినా వాళ్లు పట్టించుకోరన్నమాట. కానీ కెసియార్ పట్టించుకుని భరతం పడతాడన్నమాట. కనీసం పడతాడన్న భయం ఆంధ్రనాయకులకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు వుందన్నమాట. అందుకే మానాభిమానాలను పక్కకు పెట్టి, మొఖాన ఊసిన ఉమ్మును తుడిచేసుకుని కెసియార్ సేవలో తరించడానికి తపించారన్నమాట!
అక్కడ అంతమంది పొర్లు దండాలు పెట్టే తరుణంలోనే యిక్కడ కోదండరాం కెసియార్‌కు కోపం వస్తుందని తెలిసి కూడా ధైర్యంగా నిలబడినందుకు యివాళ ఆయన నాకు నచ్చాడు. ఉద్యమసమయంలో కీర్తించిన తెరాస నాయకులు యీ రోజు కోదండరాంను బండబూతులు తిడుతున్నారు. హఠాత్తుగా ఆయన కులాన్ని గుర్తు తెచ్చుకుని కోదండరామ రెడ్డి అని పిలవసాగారు. ఎందుకో? తెరాస వెలమ నాయకత్వాన్ని సహించలేని రెడ్ల మద్దతుతో యీయన ఉద్యమిస్తున్నాడని చెప్పడానికా? ఆయన వెనక కాంగ్రెసు వుందంటున్నారు. అబ్బే కొత్త పార్టీ పెడతాడంటున్నారు. ఇన్ని అంటున్నారు తప్ప ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం లేదు. కెసియార్ యిచ్చిన ఇంటికో ఉద్యోగం, లక్షలాది ఉద్యోగాలు నినాదం తెలంగాణ యువతను ఆకర్షించిందన్నమాట పదహారణాల నిజం. రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రులందరూ ఉద్యోగాలు, యిళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతారని, అప్పుడు అవన్నీ తమవే అనీ చాలామంది అమాయకులు నమ్మారు. ప్రయివేటు సంస్థల్లో కూడా తెలంగాణ వారికి ఉద్యోగాలు రిజర్వ్ చేయాలని పట్టుబడతామని తెరాస నాయకులు చెప్పారు. హైదరాబాదు నుంచి ఆంధ్రులను తరిమికొడతామన్నారు. తెలంగాణ వాలే జాగో, ఆంధ్రా వాలే భాగో అని కెసియారే స్వయంగా నినాదమిచ్చాడు.
'చట్టాల ప్రకారం యివన్నీ జరిగే వ్యవహారం కాదు, తెలంగాణ వచ్చినా పరిస్థితిలో మార్పు రాదు' అని కొందరు చెప్పబోతే వాళ్లను తెలంగాణ ద్రోహులుగా ముద్ర కొట్టారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు వస్తాయా రాదా అని భయపడే విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించి విద్యార్థులనే కేంద్రంగా పెట్టుకుని, వాళ్ల ఆత్మహత్యలే పెట్టుబడిగా పెట్టుకుని ఉద్యమం సాగించారు. తెలంగాణ వచ్చింది. కెసియార్ యింట్లో అందరికీ ఉద్యోగాలు దొరికాయి కానీ బయటి జనాలకు దొరకలేదు. 2014లో ప్రకటించిన 1.07 లక్షల ఉద్యోగాలేవీ అంటూ విద్యార్థులు ఉద్యమించబోతే 'మీరు చక్కగా చదువుకోవాలి తప్ప మీకీ ఉద్యమాలు దేనికి?' అంటూ మంత్రులు సుద్దులు చెప్పసాగారు. ప్రతిపక్షంలో వుండగా వ్యవహరించిన తీరుకు, అధికారంలోకి వచ్చాక వ్యవహరిస్తున్న తీరుకు ఎక్కడా పోలిక లేదు.
తెరాస అధికారంలోకి వచ్చి సగకాలం దాటింది. మొదట్లో ఏమడిగినా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 60 ఏళ్ల దుష్పరిపాలన ఫలితం అంత చప్పున పోతుందా అనసాగారు. ఆ 60 ఏళ్ల 'దుష్పరి'పాలన వలననే హైదరాబాదు వంటి కామధేనువు తయారైందని, అనేక ప్రభుత్వసంస్థలు యిక్కడ ఏర్పడ్డాయని, జీవనప్రమాణాలు పెరిగాయని మర్చిపోతారు వీళ్లు. సరే, యిక పదవీకాలం సగం కూడా లేదు, పరిస్థితి ఏమిటి అని అడిగితే యిప్పటికి అయిదున్నర వేల ఉద్యోగాలు యిచ్చారట. ఇంకా 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ యిచ్చారట. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమేనా అని హరీశ్ కోప్పడుతున్నారు. ప్రయివేటు ఉద్యోగాలు తెలంగాణ ఏర్పడ్డానికి ముందు వుంటాయి, తర్వాత వుంటాయి. ప్రతిభ కలవారిని వాళ్లు ఎప్పుడూ తీసుకుంటూనే వుంటారు. మధ్యలో మీరు చేసిన ఉద్ధరింపు ఏముంది? పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనే కబుర్లు మీ పూర్వీకులు, మీ సమకాలీనులు, యిరుగుపొరుగువారు చెప్తూనే వున్నారు. ఎప్పుడో కావలసిన మెట్రో యింకా కాలేదు, ఎంఎంటిఎస్ రెండో ఫేజ్ ఏనాటిదో అదీ కాలేదు, కేంద్రం నుంచి ఏ ప్రాజెక్టులు తెచ్చుకోలేక పోతున్నారు. ఇంకా ఏం ఆశలు పెడతారు మీరు? అయినా మిమ్మల్ని నమ్మే జనాభా వుండవచ్చు. నమ్మని జనాభా కోదండరామ్‌కు జై కొడుతున్నారు. నమ్మీనమ్మని జనాభా కోదండరాం ఏం చెప్తాడో విందామని చూస్తున్నారు. చెప్పనీయకపోతే ఎలా? 'మేం ఉద్యోగాలు యిచ్చేస్తున్నాం కాబట్టి కోదండరాం ర్యాలీ పెట్టనవసరం లేదు, ఏమీ చెప్పనవసరం లేదు' అంటున్నారు కొందరు తెరాస నాయకులు. 'ఆయన ఏం చెప్తాడో చెప్పనీ, తర్వాత ఆయన్ని ఖండిస్తూ మీరు చెప్దురుగాని. చెప్పడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టడమేమిటి?' అని ప్రజాస్వామ్యవాదులు అడుగుతుంటే దానికి తెరాస వద్ద సమాధానం లేదు.
నగరం నడిబొడ్డునే ర్యాలీ ఎందుకు? వర్కింగ్ రోజునే ఎందుకు? అంటూ న్యాయమూర్తి ప్రశ్నలడిగారు. ఏదో సెలవు రోజున, ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా నగరానికి ఓ మూల పెట్టుకోవచ్చుగా అని సలహా యిచ్చారు. భేషుగ్గా వుంది. కానీ యిలాటి సలహాలు గతంలో వినబడలేదేం? సమైక్యరాష్ట్రంలో ఎన్నాళ్లు, ఎన్ని రకాలుగా యీ ఉద్యమ నాయకులు ర్యాలీలు, ఊరేగింపులు, సభలు చేశారు? రైళ్లు ఆపారు, రహదారులను మూసేశారు, సకల జన సమ్మె అంటూ నెలల తరబడి పనులు మాన్పించారు. కొన్నేళ్ల పాటు హైదరాబాదును అశాంతికి చిరునామాగా మార్చి దాని ఆర్థిక ప్రగతికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. అప్పుడు కోర్టులు ఏం చేశాయి? ఉస్మానియాలో ప్రదర్శనకు అనుమతి యివ్వవద్దు అని ప్రభుత్వం వేడుకుంటున్నా కోర్టులు యిచ్చాయి. నిరసన తెలపడం ప్రజల హక్కు. శాంతిభద్రతలు కాపాడడం మీ బాధ్యత. ఎలా కాపాడుతారో మీరే చూసుకోండి అని పోలీసులకు చెప్పాయి. ఇప్పుడు బాణీ మారింది. ఆందోళనకారులకు హితవు చెప్తున్నారు. ఇకపై ఏ ఆందోళనైనా సరే, సంబరమైనా సరే, పండగైనా సరే, సెలవు రోజు నాడు ట్రాఫిక్ లేని శివార్లలో మాత్రమే జరుపుకోవాలి అని చట్టం పాస్ చేయమనండి. న్యాయమూర్తులు అందరికీ అదే చెప్పమనండి చాలు. ఇక పోలీసులు – కోదండరాం ర్యాలీలో తీవ్రవాదులు చొరబడతారన్న ఇంటెలిజెన్సు రిపోర్టు వచ్చింది కాబట్టి అనుమతి యివ్వవద్దని కోర్టులో వాదించారు. తెలంగాణ ఏర్పడితే తీవ్రవాదులు పెచ్చుమీరుతారని శ్రీకృష్ణ కమిషన్ చెపితే ఠాఠ్ అలా ఎన్నటికీ జరగదు అని వాదించినది వీరే. ఇప్పుడు నగరం నడిబొడ్డులో జరిగే ర్యాలీలో కూడా చొరబడేటంత సాహసం చేసే స్థాయికి వచ్చారని యిప్పటికైనా ఒప్పుకుంటారా? ఇంకో విషయం – నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదం ఆటకట్టయిందని, మావోయిస్టులు లొంగిపోతున్నారని మోదీ చెప్పుకుంటున్నారు. అవును భళా అంటున్నారు కెసియార్. మరి కోదండరాం కోసం వాళ్లంతా జీవం పోసుకుని వచ్చేశారా?
అవునూ, తీవ్రవాదులను ఎక్కడో అడవుల్లోకి వెళ్లి, రిస్కు తీసుకుని పట్టుకునే బదులు కోదండరాం ర్యాలీకి వచ్చిన సమయంలో పట్టేసుకుంటే హాయి కదా! కోర్టులో పిటిషన్ వాపసు తీసుకుని ర్యాలీ అనుకున్న చోటే నిర్వహించి తీరతాం అని కోదండరాం అనగానే అదే జరుగుతుంది అనుకున్నా. తీరా చూస్తే పోలీసులు కోదండరాంను, యితర జెఎసి నాయకులను, విద్యార్థులను పట్టుకుని అరెస్టు చేశారు తప్ప ఏ సాయుధ తీవ్రవాదినీ, విద్రోహిని, విచ్ఛిన్నకారుణ్నీ అదుపులో తీసుకోలేదు. ఏం యింటెలిజెన్సో ఏమో! తెలంగాణ ఉద్యమసమయంలో ఎందరో విద్యావేత్తలు, మేధావులు అనేక ప్రజాసమస్యలపై స్పందిస్తూ సమైక్యరాష్ట్రమే అన్ని అనర్థాలకూ మూలం అంటూ తీర్మానించేవారు. ఆంధ్రుల పెత్తందారీ పోకడలు అనేవారు. ఆంధ్రులను తరిమివేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పరుచుకున్నాక అన్ని పార్టీల, అన్ని భావజాలాల ప్రజలు కలిసికట్టుగా ప్రజా తెలంగాణ సిద్ధింపచేసుకుంటామని అనేవారు. ఏ సభ జరిగినా అన్ని పార్టీలవారూ, కలిసి చేతులెత్తి కలుపుకుని గ్రూపు ఫోటోకి పోజిచ్చేవారు. ఆ సమస్యలన్నీ యిప్పుడూ అలానే వున్నాయి. అవేళ చేతులు కలిపినవారు యీనాడు టీవీ చర్చల్లో బాహాబాహీ తలపడుతున్నారు. అందరూ తెలంగాణ వారే అయినా ఒకరిపై మరొకరు అరుచుకుంటున్నారు, విరుచుకు పడుతున్నారు. పాలకులను ప్రతిక్షకుల నోరు మూయిస్తున్నారు. ప్రజాహక్కులను కాలరాస్తున్నారు. కెసియార్ సొంత నమ్మకాలతో ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నారు. మాది పోరాటాల గడ్డ అని చెప్పుకునే ప్రజావాదులు, హేతువాదులు ఎక్కడికి పోయారో తెలియదు. ఇన్నాళ్లకు కోదండరాం ధైర్యంగా ముందుకు వచ్చారు. ప్రాజెక్టు నిర్వాసితుల వంటి సమస్య కాదు, యువతను రెచ్చగొట్టే సమస్య చేపట్టారు. అదీ నగరం నడిబొడ్డున. దీన్ని ప్రభుత్వం అణచివేస్తున్న తీరు చూసైనా తెలంగాణ మేధావులలో కదలిక వస్తుందేమో చూడాలి.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2017)