దీనితో బాటు అతను వసుంధర తరఫున రాజకీయ దళారిగా పని చేస్తూ ఆమెతో తన సాన్నిహిత్యాన్ని చాటుకునేవాడు. తన సెల్‌లో ఆమె 'వసూ ఆంటీ' పేర పెట్టుకున్న పర్శనల్ నెంబరు చూపించేవాడు. అందరూ అతన్ని సూపర్ చీఫ్ మినిస్టర్ అనేవారు. ఉన్నత ప్రభుత్వోద్యోగులు అతని హోటల్‌కి వచ్చి ఫైళ్లు క్లియర్ చేయించుకునేవారు. ఈ పరిచయాన్ని రియల్ ఎస్టేటు వ్యాపారం కూడా చేయడానికి ఉపయోగించుకున్నాడు. బొంబాయి నుంచి పెద్ద పెద్ద బిల్డర్లను తెచ్చి రాజస్థాన్‌లో స్థలాలు కట్టబెట్టించేవాడు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ఉపయోగానికి మార్చడానికి రాజే చేత రూల్సును సులభతరం చేయించాడు. దీనివలన బొంబాయి బిల్డర్లు విపరీతంగా లాభపడ్డారు. వాళ్లు ఆకాశ హర్మ్యాలు కడతామంటూ రేట్లు పెంచేసి, స్థానికంగా వున్న రియల్టర్ల పొట్ట కొట్టారు. దీనితో బాటు లిక్కర్ పాలసీ మార్పించి, మద్యం షాపులను పెంచేట్లు చేశాడు. రాజస్థాన్‌లోని పెద్ద పెద్ద రాజమహళ్లను సొంతం చేసుకునేట్లా చట్టాలు మార్పించాడు. లలిత్ భార్య డైరక్టరుగా వున్న అమేర్ హెరిటేజ్ సిటీ కనస్ట్రక్షన్స్ లి.కు అమేర్ కోట పక్కన వున్న రెండు హవేలీలను ఆర్కియాలజీ శాఖ నియమాలకు వ్యతిరేకంగా ఎలాట్ చేయించుకున్నాడు. దానిపై ఒక మహంత్ కోర్టుకి వెళ్లాడు. వేయేల, వసుంధర అవినీతికి సింగిల్ విండో లలిత్ అంటారు పరిశీలకులు. అతను క్రికెట్ స్టేడియంను సొంత ఆస్తిగా భావించి అనేకమంది పెద్దలను అవమానించాడు. ఇష్టం లేనివాళ్లు టిక్కెట్లు కొనుక్కుని వచ్చినా చింపి పారేసి, బయటకు పంపేసేవాడు. ఓ సారి ఒక కానిస్టేబుల్‌ను ఉత్తిపుణ్యాన చెంప మీద కొట్టాడు. ఇవన్నీ రాజెకు యిబ్బంది తెచ్చిపెట్టాయి. 2008 అసెంబ్లీ ఎన్నికలలో యిది వసుంధరకు వ్యతిరేకాంశంగా మారి ఆమె ఓటమికి ఒక కారణమైంది. 2009 లో ఆర్‌సిఏ ఎన్నికలలో అతని వర్గం ఓడిపోయింది.
వసుంధరతో కుటుంబస్నేహమే కాక వ్యాపారబంధం కూడా ఏర్పరచుకున్నాడు. వసుంధర పెళ్లయిన ఏడాదికే భర్త హేమంత్ సింగ్ నుంచి విడాకులు తీసుకుంది. వారికి పుట్టిన కుమారుడు దుష్యంత్ సింగ్. అతని వ్యాపారంలో లలిత్ పెట్టిన పెట్టుబడుల గురించి యిప్పుడు వసుంధర సంజాయిషీ చెప్పుకోవలసి వస్తోంది. 2005లో దుష్యంత్ అతని భార్య కలిసి తలా రూ.50 వేలు పెట్టి నియంత్ హెరిటేజ్ హోటల్స్ లి. పెట్టి షేరు విలువ రూ.10లతో తలా 5 వేల షేర్లు తీసుకున్నారు. 2008 ఏప్రిల్‌లో లలిత్ మోదీ ఆనందా హెరిటేజ్ హోటల్స్ ఆ కంపెనీలోని 395 షేర్లను రూ.3.80 కోట్లకు కొంది. అంటే 10 రూ.ల షేరుకు రూ.96 వేల ప్రీమియం అన్నమాట. అదే కాకుండా ఆ కంపెనీకి గ్యారంటీ లేకుండా రూ.3.80 కోట్ల ఋణం యిచ్చాడు. 2009 సెప్టెంబరులో మరో 420 షేర్లను 7.80 కోట్లు పెట్టి కొన్నాడు. అంటే షేరు విలువ రూ. 1.85 లక్షలన్నమాట! ఈ కంపెనీ వసుంధరకు ఉత్తి పుణ్యాన 3280 షేర్లు యిచ్చింది. కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి లలిత్‌కు 2007 మార్చిలో మారిషస్ కంపెనీ ద్వారా రూ. 21 కోట్లు వచ్చిపడ్డాయి. ఈ వలయం చూసి వసుంధర-లలిత్‌ల అక్రమార్జనే యీ కంపెనీగా రూపెత్తిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ యీ కేసులో యింకా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదు.
వసుంధర 2013 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నియత్ హెరిటేజ్ హోటల్ లి. కంపెనీలో రాజేకు 3280 షేర్లు, దుష్యంత్‌కు 3225, కోడలికి 3225 లలిత్‌కు చెందిన ఆనంద హెరిటేజ్ హోటల్స్ లి.కు 815 షేర్లు వున్నారు. రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన ధోల్‌పూర్ రాజసౌధాన్ని లలిత్-దుష్యంత్‌ల కంపెనీకి అప్పగించారని జయరాం రమేశ్ ఆరోపించారు. 1954-2010 నాటి పత్రాలు అవి రాష్ట్రప్రభుత్వం ఆస్తి అని చూపుతున్నాయట. హేమంత్ సింగ్ కూడా ఆ మేరకు కోర్టులో అంగీకరించారుట. దీన్ని ఖండిస్తూ బిజెపి ప్రతినిథి 2007లో భరత్‌పూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ధోల్‌పూర్ ప్యాలెస్‌ను దుష్యంత్‌కు దఖలు పరిచిందని, ఆ మేరకు హేమంత్ సింగ్‌కు డిక్రీ యిచ్చిందని అన్నారు. అది రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని జైరాం రమేశ్ యిలాటి దబాయింపుకి దిగారట. ఏది ఏమైనా నియత్ కంపెనీ రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని లగ్జరీ హోటల్‌గా మార్చింది. ఇది 2009లో రాజస్థాన్‌లో కాంగ్రెసు ప్రభుత్వం వున్నపుడు జరిగింది.
రాజస్థాన్ క్రికెట్ క్లబ్బుకు బిసిసిఐలో సభ్యత్వం వుంది కాబట్టి లలిత్ ఆ దారిలో బిసిసిఐలో చేరాడు. 2005లో అతను బిసిసిఐకు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2006 ఎన్నికలలో జగ్‌మోహన్ దాల్మియాను ప్యానెల్‌ను ఓడించడానికి శరద్ పవార్‌కు సాయపడ్డాడు. బిసిసిఐకు సెక్రటరీగా వుండి తర్వాత అధ్యక్షుడిగా అయిన శ్రీనివాసన్ దురుసుతనాన్ని యిష్టపడని వారందరూ లలిత్‌ను ప్రోత్సహించారు. బిసిసిఐ ఆదాయం పెంచడానికి కొత్త ఐడియాలు చెప్పే అతని చాకచక్యం చూసి బిసిసిఐ వాణిజ్యపరమైన డీల్సన్నీ యితన్నే డీల్ చేయమన్నారు. ఆ ఏడాది దాని ఆదాయం బిలియన్ డాలర్లు వచ్చేట్లు చేశాడు. తన 1993 ఐడియాకు ట్వంటీట్వంటీ వెర్షన్ తయారుచేసి ఐపియల్ ఐడియా చెపితే బిసిసిఐ వాళ్లు జరగదు పొమ్మన్నారు. కానీ రకరకాల హంగులు, సినీగ్లామర్ కలిపి అతను ఐపియల్ సృష్టించి హిట్ చేశాడు. 2008లో మొదటి ఐపియల్ జరిగింది. 8 ఫ్రాంచైజీలు 720 మిలియన్ డాలర్లు సంపాదించాయి. 2008లో వసుంధర ముఖ్యమంత్రిగా వుండగా రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు ఐపియల్ తరఫున రూ.6 కోట్లు విరాళం యిచ్చాడు. రెండవ ఐపియల్ 2009లో జరపాలి.
ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు చేయలేమని అప్పటి హోం మంత్రి చిదంబరం అంటే ఐపియల్‌ను అతి తక్కువ వ్యవధిలో సౌత్ ఆఫ్రికాకు తీసుకెళ్లిపోయి నిర్వహించి దాన్ని 4 బిలియన్ డాలర్ల స్థాయికి తెచ్చి విజయవంతం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఐపియల్‌కు పేరు వచ్చింది. ఐపియల్ ద్వారా చేసిన అక్రమాలే మెడకు చుట్టుకున్నాయి. బంధుప్రీతి విషయానికి వస్తే – ఐపియల్ ద్వారా తోడల్లుడు సురేశ్ చెల్లారామ్‌కు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజ్‌లో మెజారిటీ వాటా కల్పించాడు. సవతి కూతురు మొగుడు గౌరవ్ బర్మన్‌కు వాటాలున్న గ్లోబల్ క్రికెట్ వెంచర్స్‌కు ఐపియల్ యొక్క డిజిటల్, మొబైల్, యింటర్నెట్ హక్కులు కట్టబెట్టాడు. గౌరవ్ సోదరుడు మోహిత్ కింగ్స్ పంజాబ్ ఎలెవెన్‌లో భాగస్వామి. కలకత్తా నైట్ రైడర్స్ భాగస్వాముల్లో ఒకడైన జయ్ మెహతా లలిత్ బాల్యస్నేహితుడు. పంజాబ్ ఎలెవెన్, కలకత్తా నైట్ రైడర్స్‌కు లలిత్ లోపాయికారీగా రేట్ల గురించి సమాచారం అందించి తక్కువ ధరలకే వాళ్లకు హక్కులు లభించేట్లు చేశాడని అనుమానం. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)