ఎమ్బీయస్‌: ప్రచార ఆర్భాట ఫలం- పుష్కర విషాదం-1

మన రాష్ట్రాలలో గోదావరి పుష్కరాలలో నాకు తెలిసి పిల్లలు తప్పిపోవడాలే తప్ప చావులెప్పుడూ సంభవించలేదు. 2004 కృష్ణా పుష్కరాలలో పోయిన వారు కూడా పుష్కర సమయానికి ముందే, సిబ్బంది రాకుండానే ముందుగానే స్నానం చేయాలన్న…

మన రాష్ట్రాలలో గోదావరి పుష్కరాలలో నాకు తెలిసి పిల్లలు తప్పిపోవడాలే తప్ప చావులెప్పుడూ సంభవించలేదు. 2004 కృష్ణా పుష్కరాలలో పోయిన వారు కూడా పుష్కర సమయానికి ముందే, సిబ్బంది రాకుండానే ముందుగానే స్నానం చేయాలన్న అత్యుత్సాహంతో మారుమూల ఘాట్‌లకు వెళ్లి అసువులు బాసిన వారే.  అంతకంటె ఆరు రెట్ల మంది యిప్పుడు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఎంతో విస్తరించిన యీ రోజుల్లో, పుష్కరాలు ప్రారంభమై బందోబస్తు అంతా వుండగా, సిబ్బంది కళ్లెదురుగా చనిపోయారంటే ఎంత ఘోరం! దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం, యంత్రాంగ వైఫల్యం అని రొటీన్‌గా చెప్పేసి వూరుకోవడం సరి కాదు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకుని వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలైనా సరిగా నిర్వహించుకోవాలి. ముందుగా నేర్చుకోవలసినది ప్రచారం అదుపు తప్పకూడదని. బంగారు పళ్లెరానికైనా గోడ చేర్పు కావాలి అన్నట్టు మంచి పనికి కూడా పబ్లిసిటీ అనేది కావాలి. కానీ యిప్పుడు అసలుది వదిలేసి, పబ్లిసిటీ మీదే యావత్తు ధ్యాస పెడుతున్నారు. సరుకు తక్కువ, అరుపు ఎక్కువ అన్నట్టు అయింది. పుష్కరాల పబ్లిసిటీ గురించి ముందుగా ఆలోచిద్దాం. 

2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నపుడు గోదావరి పుష్కరాలు వచ్చాయి. అసలు అప్పట్లో ఆయన పబ్లిసిటీ మీదే బోల్డు ఖర్చు పెట్టేవారు. జన్మభూమి, యింకుడు గుంతలు, నీరు-మీరు, రైతు బజారు.. కాదు ఏ స్కీమూ పబ్లిసిటీకి అనర్హం అన్నట్టు ప్రతీ దానికీ ఊరంతా హోర్డింగులు, వాటిపై యీయన ఫోటోలు. ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చు కంటె ప్రచారానికి పెట్టినది ఎక్కువ వుండేది. పుష్కరాలను కూడా వదిలిపెట్టలేదు. పుష్కరాలను కూడా యీ విధంగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చని అప్పుడే అందరికీ తట్టింది. అప్పటిదాకా అది ఒక మతపరమైన కార్యక్రమం. వచ్చినవాళ్లను అదుపు చేయడానికి ప్రభుత్వోద్యోగులు శ్రమించవలసిన యీవెంట్‌. గోదావరి పుష్కరాలు అనగానే రాజమండ్రి పరిసర ప్రాంతాలకే వెళతారు కాబట్టి ఆ వూరికి కొందరు వ్యాపారస్తులు వచ్చి కుస్తీ పోటీ వంటి యీవెంట్స్‌ పెట్టడం,  విమానం తెచ్చి తిప్పడం, ఎగ్జిబిషన్‌, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం చేసి డబ్బులు గడించేవారు. గోదావరిలో మునగడం కాస్సేపే కాబట్టి యాత్రికులు తక్కిన సమయంలో వినోదం కోసం యిలాటివాటిని ఆదరించేవారు. వీటిలో ప్రభుత్వానికి పాత్ర ఏమీ వుండేది కాదు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్లారు, ఎక్కువమంది వస్తే మంచిది అనే ధ్యాస ప్రభుత్వానికి ఎందుకు? తిరుపతి దేవుడి దగ్గరకు వెళ్లండి, మంచి జరుగుతుంది అని ప్రభుత్వం ఎప్పుడైనా ప్రోత్సహిస్తుందా? అది మతౖప్రచారం కాదా? తమంతట తాము అక్కడకు వెళ్లిన వారికి సౌకర్యాలు సమకూరుస్తుందంతే. పుష్కరాల సమయంలో బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయడం తప్ప, అంతకు ముందు ప్రభుత్వాలు పుష్కర స్నానం చేయండి అంటూ ఊదర గొట్టలేదు. కానీ 2003లో బాబు ప్రభుత్వం అదే చేసింది.

రాజమండ్రి ఒక్క చోటే కాకుండా తెలంగాణలో కూడా పుష్కరతీర్థాలను డెవలప్‌ చేసి, అక్కడకు కూడా వెళ్లండి అని ప్రభుత్వ ఖర్చుతో పబ్లిసిటీ యిచ్చింది. ప్రభుత్వం పూనుకుని ప్రచారం చేస్తే జనం స్పందించకుండా వుంటారా? పుష్కర స్నానం చేయకపోతే మహాపాపంట అనుకుంటూ బస్సులు వేసుకుని బయలు దేరారు. ఇంత మంది జనం వస్తున్నారు ఏర్పాట్లు చేయాలి అంటూ రోడ్లు, వంతెనలు, ఘాట్‌ల నిర్మాణం అంటూ టెండర్లు, కాంట్రాక్టులు, అస్మదీయులకు పనులు. వీటిలో పావు వంతైనా నదిని రక్షించడానికి, చెఱువులు కబ్జా కాకుండా, జలవనరులను పరాధీనం కాకుండా కాపాడడానికి, మురికి కాకుండా సీవేజ్‌ ప్లాంట్లు పెట్టడానికి వినియోగిస్తే బాగుండేది. కనీసం రాజమండ్రి మునిసిపాలిటీ, పేపరుమిల్లు మురికినీరు గోదావరిలో వదలకుండా నిరోధించినా బాగుండేది. అవేమీ జరగలేదు. నది కలుషితం అవుతూనే వుంది. ఈ పబ్లిసిటీ వలన ప్రభుత్వానికి ఖర్చు బాగానే అయి వుంటుంది. దానివలన గోదావరీతీరాల్లో యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుపడిందా అన్నది సందేహమే. ఎందుకంటే సమయం దగ్గర పడుతోంది, పనులు త్వరగా ముగించాలి అనే తొందరలో క్వాలిటీ గురించి పట్టించుకోకుండా రోడ్లు అవీ వేస్తారు. పుష్కరాలైన ఆర్నెల్లకు చూస్తే వాటిలో ఎన్ని వుంటాయో, ఎన్ని పోతాయో. 

2015 వచ్చేసరికి బాబుకి ప్రచారప్రీతి మరింత పెరిగింది. అప్పట్లో హైదరాబాదుకి విదేశీ కంపెనీలను రప్పించి అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తానని చెప్పేవారు. ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించి అంతర్జాతీయ స్థాయి నగరాన్ని అమరావతిలో కడతానని చెప్పుకుంటున్నారు. విభజన తర్వాత నిరాశలో మునిగిపోయిన ఆంధ్ర ప్రజల ఆత్మస్థయిర్యాన్ని హుదూద్‌ చావుదెబ్బ కొట్టింది. బంగరు భవిష్యత్తు ముందుంది అనే ఆశల వూయలలో వాళ్లను ఊపి, జోకొట్టడం పాలకులకు ఒక అవసరం అయిపోయింది. రేవంత్‌ వ్యవహారం తర్వాత మసకబారిన ప్రతిష్ఠను మళ్లీ తెచ్చుకుని, సమర్థపాలకుడిగా అనిపించుకోవడానికి గోదావరి పుష్కరాలు ఒక అవకాశాన్ని అందించాయి. అవి పెద్ద స్థాయిలో జరగాలంటే జనాలు బాగా రావాలి. విభజన తర్వాత ఎంతమంది తెలుగువాళ్లు వస్తారో అన్న సందేహం వచ్చింది. 2003లో అయితే హైదరాబాదులో చాలామంది తెలంగాణలో కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన ధర్మపురి, కాళేశ్వరం తీర్థాలకు వెళ్లినా, తృప్తిపడక రాజమండ్రికి కూడా వెళ్లారు. ఎందుకంటే గోదావరి పుష్కరాలు అనగానే అఖండ గౌతమి వున్న రాజమండ్రియే గుర్తుకు వస్తుంది కాబట్టి. ఇప్పుడు విభజన తర్వాత 'తన' ఫీలింగు వచ్చాక ఆ గోదావరి యిక్కణ్నుంచి వెళ్లిందే కదా, ఇక్కడ స్నానం చేస్తే చాలదా అనే భావంతో తెలంగాణ నుంచి వచ్చే జనాభా తగ్గిపోవచ్చనే భయంతో కాబోలు ప్రచార ఉధృతి మరింత పెంచారు. ప్రమాదం జరిగిన తర్వాత సాగిన చర్చల్లో రాజమండ్రి తప్ప యితర చోట్ల జనాలు లేరనీ, రాజమండ్రిలో కూడా పుష్కర ఘాట్‌లో తప్ప యితర ఘాట్లన్నీ ఖాళీగానే వున్నాయనీ చెప్పారు. ఆ పాటి జనానికి యింత ప్రచారం, యింత ఖర్చు అవసరమా? భారీగా ఖర్చు పెట్టదలచుకున్నారు కాబట్టి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి జనాలను రప్పించాలి. రప్పించాలంటే దండోరా గట్టిగా వేయాలి.

దానిలో భాగంగా యిది మహాపుష్కరం అనే ప్రచారం మొదలుపెట్టారు. 144 ఏళ్లకు ఒకసారి వస్తుందట. ఈ లెక్క ఎవరు వేశారు? ఎప్పణ్నుంచి 144 ఏళ్ల వరుస ప్రారంభమైంది? పుష్కరాలు ప్రారంభమైన దగ్గర్నుంచా? నది పుట్టిన దగ్గర్నుంచా? సృష్ట్యాది నుంచా? కలిప్రవేశం నుంచా? దేనికైనా కచ్చితమైన లెక్కలున్నాయా? కలియుగం ప్రారంభమై 5 వేల చిల్లర సంవత్సరాలైందని దాన్ని 144 చేత భాగిస్తే శేషం వస్తోందని అందువలన 2015ను మహాపుష్కరం (దాని అర్థం ఏమిటైనా) అనకూడదని ఒక పండితుడు చెప్పారు. 144 ఏళ్ల క్రితం మహాపుష్కరం జరిపారో లేదో మనకు తెలియదు. మన దగ్గర దేనికీ రికార్డు వుండదు కాబట్టి అవుననీ, కాదనీ ఎవరూ నిరూపించలేరు. వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు కూడా మహాపుష్కరాలా? లేక కృష్ణ, గోదావరి కంటె వయసులో చిన్నదా? ఈ ప్రచారకర్తలే చెప్పాలి. 144 ఏళ్లకు ఒకసారి వస్తోంది కాబట్టి యీ సారి మునిగితీరాలని, లేకపోతే మన పాపాలన్నీ అలాగే వుండిపోతాయనీ ప్రచారం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యిస్తున్న టివి యాడ్స్‌లో 'జన్మకు ఒకసారి వచ్చే అవకాశం – యీ పుష్కరస్నానం' అంటూ వస్తోంది. అంటే ఏమిటి? మన ఆయుర్దాయం పన్నెండేళ్లేనా? లేకపోతే 2027 లోపున ప్రళయం వస్తుందా? వచ్చే ఏడాది మరో నదీపుష్కరం ఎలాగూ వుంది. గోదావరే పుణ్యనది అని కృష్ణ కాదనీ వీళ్లు చెప్పగలరా? చూస్తూండండి, వచ్చే ఏడాది యిదే పబ్లిసిటీ మెటీరియల్‌ను గోదావరి తీసేసి కృష్ణ అని పెట్టి వాడుకుంటారు. (సశేషం)  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]