మొన్నటి వరకూ సినీ నిర్మాతలకు శాటిలైట్ రైట్స్ అనేవి కచ్చితమైన ఆర్థిక వనరులుగా నిలిచాయి. సినిమా తీసి పడేస్తే చాలు ఏదో ఒక చానల్ వారు టెలికాస్ట్ కోసం కొనేసుకొంటారు.. ఎంతో కొంత డబ్బు వచ్చేస్తుంది.. కావల్సినదల్లా సినిమాకు కొంత ప్రచారం కల్పించడం, ఇంటర్నెట్లో కొన్ని రివ్యూలు జనరేట్ చేయడం.. అన్నట్టుగా ఉండేది వ్యవహారం. స్ర్టైట్ సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎలాంటి సమస్యా కాదు.. అనే పరిస్థితి గతం. ఇప్పుడు అంతా మారిపోయింది. స్ర్టైట్ సినిమా శాటిలైట్ రైట్స్‌ను అమ్ముకోవడంకూడా చాలా కష్టం అవుతోంది. ఇక డబ్బింగ్ సినిమాల కథ చెప్పనక్కర్లేదు. వాటిని పట్టించుకొనే నాథుడు లేకుండాపోయాడు. క్రమంగా డౌన్ అయిపోయిన శాటిలైట్ రైట్స్ మార్కెట్‌కు నిదర్శనం ఇది. చిన్న సినిమాలను కొనే నాథుడు లేకుండాపోయాడు.
చిన్న సినిమాలనే కాదు.. అవి పెద్ద సినిమాలు అయినా ప్లాఫ్ టాక్ వచ్చి ఉంటే వాటిని కొనే సాహసం చేయడం లేదు టీవీ చానళ్లు. నందమూరి నటసింహం నటించగా.. బొబ్బిలిపులి దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘పరమవీరచక్ర’ సినిమా రైట్స్‌నే ఇంత వరకూ ఏ టీవీ చానల్ కూడా కొనలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది! సింహాలు, పులుల కాంబినేషన్లో వచ్చిన భారీ అంచనాల ప్లాఫ్ సినిమాలను కొనడానికి కూడా తెలుగు చానళ్లు ముందుకురావడం లేదు. మరి ఇదే సమయంలో తెలుగు సినిమాలు మరో రకమైన శాటిలైట్ రైట్స్ వార్తల్లో మాత్రం ప్రముఖంగా నిలుస్తున్నాయి. మన వాళ్లు రూపొందించిన సినిమాలు హిందీటీవీ చానళ్లలో తెగ ఆడేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. అనునిత్యం ఏదో ఒక హిందీ చానల్లో ఏదో ఒక తెలుగు సినిమా హిందీ వెర్షన్లో టెలికాస్ట్ అవుతూనే ఉందంటే పరిస్థితి ఎంత ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
మన దగ్గర సన్ నెట్ వర్క్ వాళ్లు తొలిసారిగా 24 గంట సినిమా చానల్‌ను ప్రారంభించారు. దాదాపు పది సంవత్సరాల కిందట ‘తేజ టీవీ’లో రోజుకు ఆరు సినిమాలు అంటూ సన్ వాళ్లు ఒకింత సంచలనమే సృష్టించారు. అంతవరకూ ఒక్కో చానల్లో రోజుకు ఒకటీ రెండు సినిమాలు రావడమే గొప్ప అనుకొంటే.. ఏకంగా ఆరు సినిమాలేస్తామని ప్రకటించి.. దిగ్విజయంగా ఇప్పటికీ ఆ ధాటిని కొనసాగిస్తున్నారు సన్ వాళ్లు. తేజ టీవీకి జెమినీమూవీస్ అని పేరు మార్చినా ఆరు సినిమాల పోకడ అయితే నిరాటంకంగా కొనసాగుతోంది. మరి తెలుగులో ఇలా ఆరు సినిమాలు వేసే ప్రక్రియ మొదలు కాక ముందే హిందీలో పగలంతా సినిమాలువేసే చానళ్లు ఉన్నాయి. అప్పట్లో జీ సినిమాలో రోజుకు నాలుగు సినిమాలు వేసే వాళ్లు. ఆ తర్వాత హిందీలో టీవీ చానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
ఒక్కో నెట్ వర్క్ కింద కనీసం నాలుగైదు చానళ్లు ఉన్నాయి. అరడజను వరకూ చానళ్లను కలిగిన నెట్‌వర్క్‌లు ఎన్నో ఉన్నాయి. మరి ఇలాంటి వాటిల్లో వార్తలు, ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్ మ్యూజిక్ చానళ్లు పోనూ.. పగలు, రేయీ తేడా లేకుండా సినిమాలు ప్రసారం చేసే చానళ్లు చాలానే కనిపిస్తాయి. దాదాపు ఏడెనిమిది చానళ్లు ఇదే పనిలో ఉంటాయి. మరి ఇన్ని చానళ్లకు సినిమాలు కావాలి.. ఒక చానల్లో ప్రసారం అయిన సినిమా మరో చానల్లో రాదు. రైట్స్‌ను కొని మాత్రమే సినిమాను ప్రసారం చేయాలి. అది కూడా రోజుకు తక్కువలో తక్కువ నాలుగు. నెలకు 120 సినిమాలు. సంవత్సరాలో 1,420 సినిమాలు! ఈ వ్యవధిలో చాలా సినిమాలను రిపీటియెట్గా వేసుకొంటూ పోయినా రమారమీ ఏడువందల సినిమాల రైట్స్ అయినా ఉంటే తప్ప చానల్‌ను నడపడం కుదరదు.
ఇక హిందీ సినిమాల బడ్జెట్ ఎప్పుడో పెరిగిపోయింది. ఆ ప్రభావం సినిమా శాటిలైట్ రైట్స్ మీద పడింది. ఇప్పుడు కాదు.. ‘‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’’ సినిమా వచ్చినప్పుడే దానికి మూడు కోట్ల రూపాయల మొత్తం ఇచ్చి టెలివిజన్‌లో టెలికాస్ట్ చేసుకొన్న పరిస్థితి హిందీ చానళ్లది. మరి సూపర్ హిట్ సినిమాల శాటిలైట్ రైట్స్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కేజీ కాంబినేషన్ లోని సినిమాలను.. సూపర్ హిట్ సినిమాల రైట్స్‌ను పోటీలు పడి కొంటున్నాయి హిందీ టీవీ చానళ్లు. ప్లాఫ్ టాక్ వస్తే మాత్రం అక్కడి సినిమాల పరిస్థితి కూడా ‘పరమవీరచక్ర’ నే అవుతోంది!
మరి ఇలాంటి నేపథ్యంలో హిందీ టీవీ చానళ్లకు మధ్యే మార్గంగా మారాయి డబ్బింగ్ సినిమాలు. నార్తిండియా జనాలకు సౌతిండియన్ యాక్షన్ పిక్చర్లు అంటే భలే క్రేజ్. ఇవి అద్భుత కళాఖండాలు అని కాదు… ఈ సినిమాలు ఫైట్లను చూసి నవ్వుకోవచ్చు అనేది వారిలో ఒకవర్గం ఫీలింగ్. హీరో కొడితే గోడలు బద్ధలయిపోవడాలు.. విలన్లు బౌన్స్ అవుతూ నెత్తురుకక్కుకోవడాలను అక్కడి వారికి తమాషాగా అనిపిస్తాయి. హిందీ సినిమాల్లోనూ ఈ తరహా ఫైట్లు ఈ మధ్యనే ఎక్కువగా కనిపిస్తూ ఉండటాన్ని కూడా మనం గమనింవచ్చు. మరి జనాల్లో ఉన్న ఇలాంటి క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని టీవీ చానళ్లు ఇప్పటికే చాలా అడుగులు ముందుకేశాయి. ఇప్పుడు ఏ హిందీ చానళ్లో చూసినా డబ్బింగ్ అయిన దక్షిణాది సినిమాల హడావుడే కనిపిస్తోంది.
హిందీ చానళ్లను అప్పుడప్పుడు చూసినా ఈ పరిస్థితి అర్థం అవుతుంది. అసలు హిందీలోకి డబ్ కాని తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయా? అనే సందేహం కలుగుతుంది. మొదట్లో తమ అభిమాన హీరో సినిమా హిందీలోకి డబ్బింగ్ అయ్యిందని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకొనే వాళ్లు. ఈ రోజున చిరంజీవి సినిమాను ఒక హిందీ చానల్ లో హిందీలో చూశామని అంటూ చెప్పుకొనే వాళ్లు.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు హిందీలోకి డబ్ అవుతున్నాయని కూడా గర్వించారు. 2007 వరకూ అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత తెలుగులోని పతి సినిమా హిందీలోకి డబ్ అవుతోంది. ఇక్కడ హిట్టా, ప్లాఫా అనే ఫలితాలతో నిమిత్తం లేకుండా వాటిని డబ్ చేసేశారు. వాటన్నింటి లక్ష్యం ఒకటే… శాటిలైట్ రైట్స్.
ఒక సినిమాను తెలుగు నుంచి తీసుకెళ్లి.. డబ్ చేసి.. నామమాత్రంగా విడుదల చేయడానికి అవుతున్న ఖర్చు దాదాపు ఇరవై నుంచి పాతిక లక్షల రూపాయల వరకూ ఉందని ఒక అంచనా. ఈ మాత్రం ఖర్చు పెట్టేస్తే అక్కడికి వెళ్లిన తర్వాత ఆసినిమా స్థాయిని బట్టి డబ్బు లభిస్తోంది. దీంతో ఈ పనిచేసే వాళ్లు ఎక్కువమంది అయ్యారు. 2000 సంవత్సరం తర్వాత వచ్చిన అనేక తెలుగు సినిమాలు ఈ మధ్యనే హిందీలోకి డబ్ అవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున… వంటి హీరోల సినిమాలతో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రాంచరణ్.. ఇలా రెండోతరం హీరోల సినిమాలు కూడా డబ్ అవుతున్నాయి. వీళ్లవిమాత్రమే కాదు.. ఏ ఒక్క సినిమానూ వదిలిన దాఖలాలు లేవు. జగపతిబాబు నటించిన ‘జగపతి’, ‘పాండు’ వంటి సినిమాలు రవితేజ ‘ఖతార్నాక్’ నాగార్జున ‘శివమణి’ ‘మాస్’, రామ్ హీరోగా నటించిన ‘జగడం’ వంటి సినిమాలు కూడా హిందీ చానళ్లలో పదర్శితం అవుతున్నాయంటే.. వాళ్లు ఎంత డీప్‌గా డబ్బింగులు చేసుకొంటున్నారో తెలుస్తుంది.
కేవలం తెలుగే కాదు.. తమిళ, కన్నడ సినిమాలు కూడా ఈ డబ్బింగ్ పరంపరంలో ఉన్నాయి. అక్కడ వచ్చిన యాక్షన్ సినిమాల్లో కూడా చాలా వరకూ డబ్ అవుతున్నాయి. మరి ఇవి థియేటర్లలో చాటుతున్న సత్తా ఎంత అయినా.. టీవీచానళ్లలో మాత్రం తెగ ప్రదర్శితం అవుతున్నాయి. వీటి శాటిలైట్ రైట్స్ చాలా తక్కవ ధరలో ఉండటం.. టైమ్ పాస్ కోసం అన్నట్టుగా చానళ్లు వీటిని కొనేస్తున్నాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ డబ్బింగులు తెలుగు నిర్మాతలను పెద్దగా ఉద్ధరించకపోవచ్చు. ఎందుకంటే తక్కువ ధరకు దొరికిన సినిమాలు మాత్రమే హిందీలోకి డబ్ చేస్తున్నారు. అయితే హీరోలకు మాత్రం గుర్తింపు దక్కుతోంది. తెలుగులో కూడా సరైన గుర్తింపులేని హీరోల సినిమాలు దేశవ్యాప్తంగా చూసే చానళ్లలో ప్రదర్శితం కావడం ఆ హీరోలకు ఆనందకరమైన అంశమే కదా.
అయితే ఈ డబ్బింగ్ సినిమాల్లో నాణ్యత శూన్యం. మరి నాసిరకంగా ఉంటుంది డబ్బింగ్. లిప్ సింకింగ్ కథ దేవుడెరుగు.. వెనుక వస్తున్న మాటకు, తెరపై కనిపిస్తున్న సీన్ కూ అయినా సంబంధం ఉందా? అనే సందేహాలు కలుగుతాయి. అయితే చానళ్లు మాత్రం భయాలు లేకుండా ఈ తీరును కొనసాగుస్తున్నాయి. మరీ అతి చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. హిందీ జనాలు ఈ డబ్బింగ్ గోలను అనుభవిస్తున్నారబ్బా? అనే సందేహం తెలుగువాళ్లకే వచ్చేలా ఉంది టీవీ చానళ్ల తీరు!