ఎమ్బీయస్‌: మధ్యతరగతి విషాదం – 1/3

లోకసత్తా జెపి నేలకు దిగి వచ్చి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించారు. రాజకీయాలు, ఎన్నికలు వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఎన్నికలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. లోకసత్తా ఉద్యమాన్ని పార్టీగా మార్చిన తరుణంలో కూడా రాజకీయాలు,…

లోకసత్తా జెపి నేలకు దిగి వచ్చి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించారు. రాజకీయాలు, ఎన్నికలు వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఎన్నికలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. లోకసత్తా ఉద్యమాన్ని పార్టీగా మార్చిన తరుణంలో కూడా రాజకీయాలు, ఎన్నికలు వ్యాపారంగానే వున్నాయన్న సంగతి మీలాటి, నాలాటి సామాన్యులకు తెలుసు. మరి జెపి వంటి మేధావికి తెలియకుండా పోయిందా? ఆయనేమీ విదేశాల్లో చదువుకుని, అక్కణ్నుంచి సరాసరి యిక్కడకు రాలేదు. ఐయేయస్‌ అధికారిగా, నిత్యం రాజకీయనాయకుల మధ్యే తిరిగారు.  ఆయన ఎన్టీయార్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వుండగానే వెన్నుపోటు ఘటన జరిగింది. చంద్రబాబు, తను, హరికృష్ణ, బాలకృష్ణ కలిసి ఎన్టీయార్‌పై కుట్ర పన్నినపుడు దుర్గాప్రసాద్‌ (ఐజి), జెపి తన యింట్లోనే వున్నారని, చంద్రబాబు క్యాంపు నిర్వహిస్తున్న వైస్రాయి హోటలుకు వెళ్లవద్దని వారించారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాశారు. ఎన్టీయార్‌ పేరు చెప్పుకుని గెలిచిన పిపీలికాల వంటి ఎమ్మెల్యేలు సైతం ఎందుకు ఎదురు తిరిగారో తెలుసుకోలేనటువంటి అమాయకుడు కాదు జెపి. ఆ తర్వాత ఉద్యోగం మానేసి 1996లో లోకసత్తా ఉద్యమం ప్రారంభించి అనేక మంది రాజకీయవేత్తలతో, అధికారులతో తిరిగి, వారితో పోట్లాడి, వారిని ఒప్పించి సమాచార హక్కు, జాతీయ ఆరోగ్య మిషన్‌, లోక్‌పాల్‌ వంటి అనేక చట్టాల రూపకల్పన చేసిన జెపికి రాజకీయ నాయకుల ఆలోచనాస్థాయి, స్వార్థదృక్పథం, వ్యాపారధోరణి తెలియకుండా ఎలా వుంటుంది? అన్నీ తెలిసే ఆయన ఉద్యమం చేపట్టిన పదేళ్లకు దాన్ని పార్టీగా మార్చారు. పార్టీగా మార్చిన పదేళ్లకు దాన్ని మూసేశారు.

జెపి లోకసత్తా ఉద్యమం మొదలుపెట్టినపుడు మేధావి వర్గాల్లో ఒక సంచలనం రేగింది. ఆయన ఒక రాజకీయ పక్షాన్ని ఉద్దేశించి కాక, మొత్తం సమాజాన్నే సంస్కరించడానికే పూనుకున్నారని అందరూ హర్షించారు. చట్టాలలో వున్న అధికారాలు ఫలానా, వాటిని వినియోగించుకోండి, మీ సత్తా తెలుసుకుని మీ హక్కుల కోసం పోరాడండి అని ఆయన ప్రజలకు ఉద్బోధించేవారు. ఏ దేశంలో ఎలాటి పరిస్థితి వుందో, దేని కారణంగా అక్కడ మార్పు వచ్చిందో సోదాహరణంగా చెప్పేవారు. అతిశయోక్తులు లేకుండా, సూటిగా, స్పష్టమైన ఆలోచనతో వివరించేవారు. మనం గట్టిగా పూనుకుంటే సమాజం బాగుపడుతుందనే నమ్మకం మధ్యతరగతి మేధావుల్లో కలిగించారు. దాంతో ఆయనకు ఎందరో అండగా నిలిచారు. ఎంతోమంది ఆయన ఉద్యమంలో పాలు పంచుకున్నారు. వారు డబ్బు, పదవులు ఆశించి వచ్చినవారు కారు. జెపి వంటి మేధావి నేతృత్వంలో పని చేసి, ఏదైనా సాధిద్దామనే పట్టుదలతోనే తమ సమయాన్ని, డబ్బును ఖర్చు పెట్టుకున్నారు. విదేశాలలో వున్న తెలుగువారనేకమంది ఆయన ఉద్యమానికి విస్తృత ప్రచారం కల్పిస్తూ, తమ జీతాల్లోంచి కొంత భాగాన్ని విరాళంగా పంపేవారు. సాధారణ మనిషి ఎప్పుడూ ఆదర్శాలు కలవరిస్తూ, అద్భుతాల కోసం కలలు ంటూ వుంటాడు. ఏదో ఒక మేజిక్‌ చేసి జెపి అవినీతిరహిత సమాజం ఏర్పరచాలని వాళ్లంతా కోరుకున్నారు. ఆయనకా శక్తి వుందా లేదా అని, ఆయన ప్రవచించే ఆదర్శలోకం ఆచరణసాధ్యమా అని గట్టిగా ఆలోచించినది లేదు. ఆయన చేయగలడనే వారు నమ్మారు.

వారలా నమ్మేట్లు చేయగలిగినది ''ఈనాడు''. జెపికి దన్నుగా నిలిచిన ఈనాడు ఆయన చేత తన ఎడిట్‌ పేజీలో పెద్దపెద్ద వ్యాసాలు రాయించేది. తన టీవీ ఛానెల్‌లో సామాజిక సమస్యలపై చర్చావేదిక నిర్వహించే అవకాశం కల్పించింది. ఆయన లోకసత్తా తరఫున ప్రచురించే ''జనబలం'' పత్రికను తన మార్గదర్శి మార్కెటింగ్‌ ద్వారా పంపిణీ చేసేది. నిజానికి ఈనాడు ఎన్నో ఆర్థిక అక్రమాల కేసుల్లో యిరుక్కుంది. తన ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయంగా ఎన్ని మొగ్గలు వేస్తోందో యిటీవల మరీ స్పష్టంగా కనబడుతోంది. జెపి చెప్పే సమాజం నిజంగా అవతరిస్తే ఈనాడుకే యిబ్బంది.  అయినా జెపిని త్రివిక్రమావతారంలో చూపి, ప్రజల్లో ఆయన యిమేజిని విపరీతంగా ఎందుకు పెంచింది? ఈనాడు కాంగ్రెసు వ్యతిరేకి అనే విషయం సర్వవిదితం. కానీ లోకసత్తా ఉద్యమం రూపు దిద్దుకున్నపుడు అధికారంలో వున్నది 'ఈనాడు' మద్దతిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వంలో, సమాజంలో వున్న అవినీతిని, అన్యాయాన్ని ఎత్తి చూపిస్తే టిడిపికే యిబ్బంది. మరి అలాటప్పుడు ఈనాడు జెపిని హైలైట్‌ చేయడం దేనికి? అంతిమంగా బాబుకి మేలు చేయడానికే.. అంటారు కొందరు. 

అదెలా అంటే – రాముడు పెళ్లి చేసుకుని అయోధ్యకు వెళుతూండగా అందర్నీ హడలగొడుతూ పరశురాముడు  వచ్చాడు. 'శివధనస్సు విరిచావుట, విష్ణుధనస్సు కూడా ఎక్కుపెట్టి నీ ప్రతాపం చూపించు' అని ఛాలెంజ్‌ చేశాడు. అవన్నీ ఎందుకు లెండి అని రాముడు తప్పించుకోబోయినా వదల్లేదు. చివరకు రాముడి చేత ఆ ధనస్సు కూడా ఎక్కుపెట్టించి శభాష్‌ అని మెచ్చుకుని, రాముడు గట్టివాడే అని లోకానికి చాటి మరీ వెళ్లాడు. రాముడు జనకుడి అంతఃపురంలో శివధనస్సు ఎక్కుపెట్టబోయి విరక్కొట్టినపుడు కాసిన్నిమంది పరిచారకులు, విశ్వామిత్రుడు, జనకుడు, లక్ష్మణుడు తప్ప పెద్దగా ఎవరూ లేరు. (సీతాస్వయంవరఘట్టం వాల్మీకి రామాయణంలో లేదు) ఈ పరశురాముడి హంగామా వలన రాముడు లెవెల్‌ మరింత పెరిగింది. అయితే జనాలకు యిందులో తెలియని విషయమేమిటంటే రాముడు, పరశురాముడు యిద్దరూ విష్ణువు అవతారాలే! చంద్రబాబు నాలుగేళ్లు పాలన చేసేటప్పటికి పలుకుబడి కాస్త తగ్గింది. ఒంటిచేత్తో నెగ్గే సత్తా ఎన్టీయార్‌తోనే అంతరించింది. 1999లో బిజెపితో చేతులు కలిపి ఆ లోటు పూరించుకుని బాబు మళ్లీ సిఎం అయ్యారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతోంది. ఆ వ్యతిరేకతను యితరులు సొమ్ము చేసుకోకుండా జెపిని దాన్ని కేంద్రంగా చేయడానికి రామోజీరావు ప్లాను చేశారంటారు. ఆయన అందరికీ వ్యతిరేకిగా కనబడుతూనే 'అందరిలోనూ లోపాలున్నా, వున్నవాళ్లలో బాబు బెటరు' అనే అభిప్రాయాన్ని మధ్యతరగతిలో కలిగిస్తారన్నమాట. ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చడానికి పాలకులు యిలాటి ట్రిక్కులు వేస్తూ వుంటారు. చిరంజీవి పార్టీ పెట్టినపుడు వైయస్‌ లోపాయికారీగా సాయపడ్డారని అంటారు. ఆ విధంగా ప్రతిపక్షాలు చీలిపోతాయి. 

ఎన్ని లెక్కలు వేసినా బాబుపై వ్యతిరేకత ఎక్కువై పోయి 2004 ఎన్నికలలో కాంగ్రెసు గెలిచేసింది. ఇక దాంతో ప్రభుత్వ అవినీతిపై బాబు చెప్పేది, జెపి చెప్పేది ఒకటే అయిపోయింది. టిడిపికి వున్నంత వ్యవస్థ లోకసత్తాకు ఎక్కడుంది? బాబు కున్నంత మేనేజిరియల్‌ టెక్నిక్స్‌ జెపికి ఎక్కడున్నాయి? 'సత్తా' ఎందుకు చాటలేదు? అంటూ ''సాక్షి''లో జెపితో సన్నిహితంగా పనిచేసిన నరేశ్‌ అనే ఒక పాత్రికేయుడు జెపి బలాబలాలపై చక్కటి విశ్లేషణ చేశారు. లోకసత్తా వైఫల్యానికి 50% పరిస్థితులు, 50% జెపి స్వయంకృతం కారణమన్నాడాయన. లీడరుగా జెపి చాలా పొరపాట్లు చేశారని, ఎవరికి ఏ పని అప్పగించాలో ఆయనకు తెలియదని, అందర్నీ కలిపి కూర్చోబెట్టి చర్చించేవారు కాదని, మనసులో జనం మీద అంతులేని ప్రేమ వున్నా జనంలో కలవడం అంతగా యిష్టపడేవారు కాదని, చదవడం, రాయడం, చర్చించడంమీద వున్న శ్రద్ధ, ఫీల్డ్‌ మీద వుండదని ఆయన రాశాడు. ఈ లోపాలున్నా జెపి చిత్తశుద్ధిపై, అద్భుతమైన మేధస్సుపై మధ్యతరగతివారికి అపారమైన యిష్టం, వ్యామోహం వుండేది. ఆయనను కలిసి తమ ఆలోచనలు పంచుకోవాలని, ఆయనను అనుసరించాలని తహతహ లాడారు. తర్వాతి కాలంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ సంపాదించుకున్న క్రేజ్‌ ఢిల్లీ కంటె పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో జెపి ఎప్పుడో సంపాదించుకున్నారు. అయితే అరవింద్‌ వెనక్కాల టీము వుంది. వారిలో కొందరు తలకాయనొప్పి తెచ్చేవాళ్లు కూడా వున్నారు. అయినా అతను జయప్రకాశ్‌ గారిలా 'ఏకోనారాయణ' కాదు. నిజానికి జెపి సిఎం అయి వుంటే కాబినెట్‌లో ఆయనతో పాటు మంత్రులుగా ఎవరుంటారో వూహించుకోవడం కష్టం. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో బ్యానర్లపై, టీవీ యాడ్స్‌లో, రేడియో యాడ్స్‌లో జెపియే కనబడేవారు, వినబడేవారు. 

జెపి ఆదర్శబలంతో లోకసత్తా ఉద్యమం కొద్దికొద్దిగా విస్తరిస్తూ పోయింది. దాన్ని బాగా ముందుకు తీసుకుని వెళ్లాలంటే లీడర్‌షిప్‌ గట్టిగా వుండాలి. పట్ణణాలన్నిటిలోను లోకసత్తా శాఖలు ఏర్పడినా గ్రామాల్లో 10% వాటిల్లో మాత్రమే ఏర్పడ్డాయి. అంతకు మించి విస్తరించడానికి జెపి నాయకత్వం చాలలేదు. పైగా అవినీతి వ్యతిరేక వుద్యమంపై లోకసత్తా గుత్తాధిపత్యం పోయింది. వైయస్‌ అవినీతిపై లెఫ్ట్‌, టిడిపి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవరి ఉద్యమాలు వాళ్లు నడిపేస్తున్నారు. వాళ్లకున్నంత క్యాడర్‌ కానీ, రీచ్‌ కానీ లోకసత్తాకు లేక, జెపి పరిస్థితి గుంపులో గోవిందా అయిపోయింది. ఇలాటి పరిస్థితిలో జెపి ఉద్యమాన్ని పార్టీగా మారుద్దామనే అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమమే నగరాలను, పట్టణాలను దాటి వెళ్లలేదు. ఆయనలో నియంత పోకడలు వున్నాయని సన్నిహితంగా చూసినవారు చెప్తారు. మామూలు జనాలకు అది తెలియదు. కానీ వ్యవస్థలో అంతర్గత చర్చ, సంప్రదింపులు లేకుండా తాను నిర్ణయం తీసుకుని పైనుంచి అమలు చేయడానికి చూడడంతో కొన్ని శాఖలు తిరగబడ్డాయి. అయినా జెపి ముందుకు వెళ్లారు. అప్పుడు ఆయనకు అండగా నిలబడినవారు 'మనం ఎన్ని ప్లానులు వేసినా అవి కాగితాలకు, బీరువాలకు అంకితమై పోతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవటం లేదు. ఇంకోరికి నచ్చచెప్పి అమలు చేయించేబదులు, మనమే అధికారం చేపట్టి అమలు చేసి చూపిద్దాం అనే ఉద్దేశంతో జెపి తీసుకున్న నిర్ణయాన్ని మేం సమర్థించాం' అని చెప్పుకున్నారు. మళ్లీ వాళ్లే జెపి ఒక ఉత్తరాది వ్యక్తిని లోకసత్తా అధ్యక్షుడిగా కూర్చోబెట్టడానికి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నపుడు వ్యతిరేకించి విడిగా వచ్చేశారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ఉద్యమించే ఉద్యమసంస్థ అంతర్గత ప్రజాస్వామ్యం పాటించకపోతే ఎలా? మొగ్గ దశలోనే వీరు జెపికి అడ్డు తగిలి వుంటే ఆయన యింత నియంత అయి వుండేవారు కాదేమో! రాజకీయపార్టీగా మారాక లోకసత్తా పంచాయితీ ఎన్నికలలో, మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలలో పోటీ చేస్తూ ఒక్కో మునిసిపాలిటీలో తన సత్తా చూపించుకుంటూ తను ప్రవచించే ఆదర్శాలు ఆచరణీయమే అని నిరూపించి చూపించి వుంటే ప్రజలకు దానిపై నమ్మకం కుదిరేది. కానీ జెపి కుంభస్థలానికే గురి పెట్టారు. ఏకంగా ఎసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తూ 'ఇది సెమిఫైనల్‌, 2014 ఎన్నికలలో లోకసత్తాయే అధికారంలోకి వస్తుంది' అని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో, యితర దేశాల్లో వున్న ప్రవాసాంధ్రులు చాలామంది పులకించిపోయారు. ధారాళంగా విరాళాలు పంపారు. ఇంటర్నెట్‌ ద్వారా చాలా ప్రచారం చేశారు. అంతటితో ఆగలేదు. అలా ప్రచారం చేయనివాళ్లను అవినీతిపరులుగా, అవినీతికి మద్దతుదారులుగా ముద్ర కొట్టారు. అలా ముద్ర కొట్టించుకున్నవారిలో నేనూ వున్నాను. 2009 ఎన్నికల సమయంలో మార్చి నెలలో నేను రాసిన వ్యాసాల్లో కొన్ని భాగాలను చదివితే ఆనాటి మూడ్‌ గురించి, లోకసత్తా సత్తాపై నా అంచనాల గురించి మీకు అవగాహన ఏర్పడుతుంది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]