ఎమ్బీయస్‌ : మధ్యతరగతి విషాదం – 2/3

''జెపికో గుస్సా క్యోం ఆతా హై?'' నుండి – '..జయప్రకాశ్‌ గారికి మీడియాపై కోపం వచ్చింది. 'డబ్బిచ్చి జనాన్ని తెప్పించుకుంటే పోటెత్తిన జనం అని రాస్తారు. వైజాగ్‌ బీచ్‌లో స్వచ్ఛందంగా పదివేలమంది సభకు వస్తే…

''జెపికో గుస్సా క్యోం ఆతా హై?'' నుండి – '..జయప్రకాశ్‌ గారికి మీడియాపై కోపం వచ్చింది. 'డబ్బిచ్చి జనాన్ని తెప్పించుకుంటే పోటెత్తిన జనం అని రాస్తారు. వైజాగ్‌ బీచ్‌లో స్వచ్ఛందంగా పదివేలమంది సభకు వస్తే అది మీకు వార్త కాదా? ఏ ఒక్క పత్రికా, ఏ ఛానెలూ కవర్‌ చేయలేదేం?' అని. 'నేను యిన్ని రోజులూ మనసులో వుంచుకున్నానే కానీ..ఎప్పుడూ బయటపడలేదు. ఈ వ్యాఖ్యానాల పర్యవసానం ఎలా వుంటుందో నాకు తెలుసు.' అంటూ బాధ వెళ్లగక్కారు. ఆయనది ధర్మాగ్రహం అన్నదానిలో ఆవగింజంతైనా అనుమానం లేదు. కానీ యిదేమైనా కొత్తా స్వామీ? మీడియా పక్షపాత ధోరణి ఆయనకు తెలిసే వున్నా, కానీ అది తనకు అన్వయించదని అనుకుని వుంటారు. ఎందుకంటే ఆయన వుద్యమకారుడిగా వున్నపుడు మీడియాయే ఆయనకు అండగా నిలిచింది. లేకపోతే రాష్ట్రంలో ఎంతమంది మేధావులు లేరు! రాజీనామా చేసిన ఐయేయస్‌లు ఎందరు లేరు! జెపి గారి పేరు యింటింటా తెలిసిందంటే కారణం ఆయన లేవనెత్తిన అంశాలకు మీడియా ప్రచారం కల్పించడమే! ఉద్యమం నుండి రాజకీయ పార్టీగా మారినపుడు యిలాటి ఆక్యుపేషనల్‌ హజార్డ్‌స్‌ వుంటాయని ఆయన వూహించనట్టుగా వుంది. గత ఎన్నికలలో ఆయన క్రిమినల్‌ కాండిడేట్లు అంటూ ప్రకటించినపుడు యిచ్చిన కవరేజి యిప్పుడు యిమ్మంటే ఎలా? రాజకీయ నాయకుడిగా ఆయన మనకు వుపయోగపడతారా? లేదా అని బేరీజు వేసుకుని పత్రికలు ఆయనను పట్టించుకోవాలా? లేదా? అన్నది తేల్చుకుంటాయి. దీనిలో ఆయనకు ఛాయిస్‌ ఏమీ లేదు. 

ఆయన చాలా అమాయకంగా ఓ మాట అన్నారు – పత్రికల యాజమాన్యాలు ఎలా వున్నా పాత్రికేయులు ధర్మం పక్షాన వుండాలని! యాజమాన్యమే పాత్రికేయులుగా డబుల్‌ రోల్‌ వేయడం మొదలెట్టి 30 ఏళ్లు దాటిందని ఆయనకు తెలియదా? పత్రిక యాజమాన్యం ఒక పక్కన, పాత్రికేయుడు మరో పక్కన వుండే రోజులా యివి?…జెపి గారిని నేను యీ మాత్రమైనా నేను విమర్శించడం కొందరికి మింగుడుపడటం లేదు. జెపి గారు వ్యవస్థను విమర్శిస్తారు కాబట్టి, నేనూ అందర్నీ విమర్శిస్తాను కాబట్టి, ఆటోమెటిక్‌గా నేను జెపిగారి అభిమాని అనేసుకున్నారు కొందరు. అదేమిటో జనాలకు కొన్ని ప్రీ కన్సీవ్‌డ్‌ నోషన్స్‌ వుంటాయి. కాస్త తెలివిగా మాట్లాడిన వారందరికీ చదరంగం వచ్చేస్తుందనీ.. యిలాటివి. యువతలో  చాలామందికి ఆయన ఆశాదీపం అని నాకు తెలుసు. నాకూ వుండేవి యిలాటి దీపాలు, దివిటీలు. ఇలాటివి చూసి, చూసి ఆశాభంగం చెంది చెంది నేను ముదిరిపోయాను. అంతమాత్రం చేత యీనాటి యువత జెపిని చూసి ఆశ పెట్టుకుంటే నేను తప్పుపట్టను. వాళ్లకీ తెలిసివస్తుంది కొన్నాళ్లకి. అప్పటిదాకా ఒకలాటి అమాయకపు ఆనందం (బ్లిస్‌ఫుల్‌ యిగ్నోరెన్స్‌) అనుభవించనీయనీ అనుకుంటా. ఈలోపున జెపిని విమర్శిస్తున్నందుకు వాళ్లు నిందిస్తే నవ్వేసి వూరుకుంటాను. 

''జెపి గారే ఒప్పుకున్నారు…'' నుండి – జెపి గారు ఎన్నారైలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూ  'పార్టీలో తాను తప్ప మరో నేత లేడనే భావనే యీ రోజు లోకసత్తా ఎదుర్కొంటున్న పెద్ద సవాల్‌' అన్నారు. ఇదేమాట నేనంటే చాలామందికి కోపం వచ్చింది. జెపిగారు ఒక్కరూ 294 స్థానాల్లో నిలబడలేరు కదా. మా నియోజకవర్గంలో నిలబడిన వ్యక్తి గుణగణాలు నాకెలా తెలుస్తాయి? అతని సామర్థ్యం, నిజాయితీ నాకెలా తెలుస్తాయి? జెపిగారు చెప్పేశారు కాబట్టి ఓటేసేయాలా? స్థానిక అభ్యర్థి గుణగణాలు లెక్కలోకి రావా? ఆయనే చెప్తారు కదా – మీ అభ్యర్థి క్రిమినలో కాదో, అంకితభావం కలవాడో లేదో పరిశీలించండి అని. పరిశీలించడానికి యీయన అవకాశం యిస్తే కదా! ఇప్పుడు వచ్చి ఫలానా అతను నంది అందుకే అతను టిక్కెట్టు యిచ్చాను, మరోడు పంది అందుకే యివ్వలేదు అంటే మేం యస్సార్‌ అనాల్సిందేనా? మా కంటూ సొంత అభిప్రాయాలు, ఆలోచనలు వుండనవసరం లేదా? జనాలను జాగృతం చేయడం అంటే యిదేనా?

ఆయన అంచనా మాత్రం కరక్టని గ్యారంటీ ఏమిటి? తను కూచోమంటే కూచుంటారని, నిల్చోమంటే నించుంటారని అనుకుని ఎన్టీయార్‌ వెనకబడినవారిని, అణగారినవారిని, అనామకులను తీసుకొచ్చి నిలబెట్టారు. వాళ్లంతా బాబు పిలవగానే అటు పరిగెట్టారు. అంతేకాదు, తమ్ముళ్లూ రండి, నేను మిమ్మల్నేం చేయను అంటున్న ఎన్టీయార్‌పై చెప్పులు విసిరారు. జెపిగారి సర్టిఫికెట్టు చూసి మనం ఓట్లేసినదాకా వుండి ఆయనకే జెల్లకొట్టి గోడదూకే వారుండవచ్చని మీకూ, నాకూ అనుమానం తగిలితే అది మన తప్పు కాదు, నేటి రాజకీయాల తప్పు. ఇంకొకరైతే తన పార్టీలో లోపాలు చెప్పేవారు కారు. జెపి గారు కాబట్టి చెప్పారు అని మెచ్చుకునేవారున్నారు. నిజమే. అదే ఆయన విలక్షణత. కానీ యిది యిప్పుడు మాత్రమే ఆయన దృష్టికి వచ్చిందా? ఇన్నేళ్లగా ఏం చేశారట? నాయకుడు అన్నవాడు ఫస్ట్‌ ఎమాంగ్‌ యీక్వల్స్‌ – సమానుల్లో ప్రథముడు – గా వుండాలి. అలాటిది యీయనంత సత్తా వున్నవారు కాదు కదా, కనీసం ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని కూడా తయారుచేయలేని బలహీనత ఎవరిది? దానికి దశాబ్దం కూడా చాలలేదంటే ఆయనలో నాయకత్వ లక్షణాలు లోపించినట్టు కాదా?

మంచివాళ్లలో, నిజాయితీపరుల్లో వున్న బలహీనత యిదే! పదిమందినీ చేర్చుకుంటే వాళ్లు తమంత నిజాయితీగా వుండరేమో, ఉద్యమాన్ని నీరుకారుస్తారేమోనని భయం వుంటుంది. ఏయే ప్రయోజనాలు ఆశించి వస్తారో ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాలు సాధించుకుంటారేమోనని భయం. ఆరెస్సెస్‌లో కానీ, కమ్యూనిస్టుల్లో కానీ మొదటిదశలో చాలామంది నిజాయితీపరులను చూస్తాం. పార్టీకోసం సర్వం త్యాగం చేస్తారు వాళ్లు. అతి సింపుల్‌గా జీవిస్తూ  బ్రహ్మచారులుగా మిగిలిపోయి పార్టీ ప్రచారం చేస్తూ వుంటారు. అంత కరడు గట్టిన భావాలు వుంటే పార్టీ విస్తరించటం లేదని అందువలన కాస్త కాంప్రమైజ్‌ అయ్యి అన్ని రకాల వారిని చేర్చుకోవాలని కొంతకాలం పోయాక ఒత్తిడి వస్తుంది. అందర్నీ కలుపుకుని పోవాలని వీళ్లు రాజీపడతారు. అంతే నానారకాల వారు చేరి వీళ్ల ఆశయాలను భ్రష్టు పట్టించేస్తారు. అది మళ్లీ యింకో కాంగ్రెస్‌ పార్టీలా తేలుతుంది. ఈ భయంతోనే కాబోలు జెపి ఎవర్నీ రానీయకుండా తన ఉద్యమాన్ని కంచుకోటలా కాపాడుకున్నారు, ఏ మచ్చా రాకుండా చూసుకున్నారు. కానీ యీ క్రమంలో విస్తరించలేకపోయారు. పార్టీ మొత్తం తన చుట్టూనే పరిభ్రమిస్తోందన్న విషయానికి విరుగుడు కనిపెట్టలేకపోయారు. ఉద్యమాన్ని పార్టీగా మార్చాలన్న నిర్ణయం సొంతంగా తీసుకున్నారు. ఎదిరించిన యూనిట్లను వదుల్చుకున్నారు. ఉద్యమంగా వున్నంతకాలం వున్న సానుభూతిపరులు పార్టీ అనేసరికి తగ్గారు. పెదవి విరిచారు. అయినా అంత త్వరగా యింత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? 

రాజకీయాల్లో నెగ్గడం అంటే మాటలా? ఎంత హడావుడి చేయాలి? ఇతర పార్టీలు రోడ్‌షోలంటూ హంగామా చేస్తూ వుంటే దానికి ప్రతిగా చేస్తూన్నదేమిటి? రైలు ప్రచారం. ఇవాళ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఓ బోగీ బుక్‌ చేసుకున్నారు. సికింద్రాబాద్‌నుండి నెల్లూరు వరకు రైలు ఆగినచోటల్లా మాట్లాడతారుట. ఈ విధంగా 25 నియోజకవర్గాలు కవర్‌ చేసినట్టు లెక్కట. ఈయన సందేశం వినాలనుకున్నవారు 3 రూ.ల ప్లాట్‌ఫాం టిక్కెట్టు కొనుక్కుని స్టేషన్‌కి రావాలన్నమాట. రైలు ఆగిన రెండు, మూడు నిమిషాలలో జైజై నాదాలూ అవీ అయ్యాక యీయన ఏం వివరిస్తారో, వాళ్లు ఏం అర్థం చేసుకుంటారో నాకు అర్థం కావటం లేదు. తక్కిన పార్టీలవాళ్లలా మా నాయకుడి ప్రసంగం విననిదే రైలుని పోనివ్వం అని ఆయన అనుచరులు రైలు ఆపేయరు. ఆపేస్తే యీయన వూరుకోరు. అందుకే సాయంత్రం 7 గంటలకు నెల్లూరులో సభ పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు వచ్చి తర్వాతి స్టేషన్‌వరకు టిక్కెట్టు కొనుక్కుని యీయన బోగీలో కూచుని చర్చించేసి తర్వాతి స్టేషన్‌లో దిగిపోతారు కాబోలు. 

''జెపి అభిమానుల కోపం…'' నుండి జెపిగారి అభిమానులు నాపై విమర్శలు గుప్పించారు – సభ్యమైన భాషలోనే. వీరిలో చాలామంది ఉన్నతవిద్యావంతులు, ఉన్నతోద్యోగులు, నా నుండి జెపిగారిపై విమర్శ ఎదురుచూడనివారు. లోక్‌సత్తాను సమర్థించడం విద్యావంతులందరి బాధ్యత అనీ, నేను సమర్థించకపోగా తప్పులెంచానని వీరి బాధ, ఏవో పొరబాట్లు కనబడినా యీ సమయంలో వాటి గురించి చర్చించాలా అన్న ఆగ్రహం. వీరిలో చాలామంది లోక్‌సత్తాకు నైతిక మద్దతే కాక, ఆర్థికంగా సహాయపడుతున్నవారు కూడా వున్నారు. వీరందిరినీ నేను కోరేది ఒకటే – ఎమోషన్‌ పక్కకు బెట్టి నేను చెప్పేదానిలో లాజిక్‌ వుందో లేదో చూడమని. నేను లేవనెత్తే ప్రశ్నలేమిటి? లోక్‌సత్తా ఉద్యమం సమాజంలో మార్పు ఎంతవరకు కొని తెచ్చిందో సమీక్షించి చూస్తే కనబడేదేమిటి? 2004 ఎన్నికల వాతావరణం కంటె 2009 ఎన్నికల వాతావరణం మరింత అధ్వాన్నంగా వుంది. కులాలగోల ఎక్కువైంది. ప్రచారంలో హుందాతనం మృగ్యమైంది. ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచుతామన్న లోక్‌సత్తా ఈ దిగజారుడుని ఆపలేకపోయిందా? ఎందువలన?

లోక్‌సత్తాలో జెపి తప్ప మరో లీడరు కనబడకపోవడానికి కారణం మీడియా కవరేజి యివ్వకపోవడం వలననే అని తీర్మానించారు చాలామంది లోక్‌సత్తా సానుభూతిపరులు. మీడియా నిలబెడితే నిలబడి, విస్మరిస్తే మూలబడేవారు నాయకులవుతారా? న్యూస్‌వర్దీ పని చేస్తే మీడియా మీ వెంటపడుతుంది. సినిమానటులను మీడియా ఫోకస్‌ చేస్తోందనేవారు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఈ నటీనటులందరూ కోన్‌కిస్కాలుగా వుండగా మీడియా పట్టించుకోలేదు. వాళ్లు కష్టపడి స్టూడియోల వెంబడి తిరిగి, వేషాలు సంపాదించి, ప్రజామోదం పొందాకనే మీడియా కెమెరాను అటు తిప్పింది. మా ఉద్దేశాలు మంచివి కాబట్టి మీడియా మేము చెప్పినవి కవర్‌ చేయాలంటే ఒప్పదు. జన్మభూమి లాటి కార్యక్రమం చేస్తే లోకల్‌ పేపర్లోనైనా పడుతుంది.

జెపి చిన్నస్థాయి విజయాలు పొందాక అసెంబ్లీని లక్ష్యం చేసుకుంటే బాగుండేది అన్నదానిలో తప్పుందా? జనసంఘ్‌ (బిజెపి పూర్వరూపం) చాలాకాలం ఆందోళనల పార్టీగానే వుండేది. అలాటిది ఢిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో నెగ్గి కార్పోరేషన్‌ను చక్కగా అవినీతి లేకుండా, సమర్థవంతంగా పాలించడంతో అందరి కళ్లల్లో పడింది. అప్పటినుండే అది పార్టీగా ఎదిగింది. అదేవిధంగా జెపి కొన్ని పంచాయితీల్లో పోటీ చేసి, గెలిచి ఆయన ఆదర్శాలు ఆచరణయోగ్యమేనని చూపిస్తే తప్పా? కమ్యూనిస్టులు, సోషలిస్టులు అందరూ అరచేతిలో స్వర్గాలు చూపించినవారే. జెపి చూపించే యుటోపియాకూడా యించుమించు అలాటిదే. కొందరు పూనుకుంటే యిది జరుగుతుంది అని నిరూపించవలసిన అవసరం ఆయనకుంది. ఆయన పార్టీ ఓ పంచాయితీలోనో, ఓ టౌనులోనో గెలిచి ఓ ఏడాదిలో 0% క్రైమ్‌రేట్‌ సాధిస్తే మీడియా కళ్లల్లో తప్పక పడుతుంది. ఆ కౌన్సిలర్‌ ఇంగ్లీషులో మాట్లాడలేకపోయినా తప్పక ప్రొజెక్షన్‌ వస్తుంది. తరువాతి ఎలక్షన్‌లో అతనే లోక్‌సత్తా తరఫున ఎంఎల్‌ఏ కాండిడేట్‌ కావచ్చు.  – (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2016)

[email protected]

Click Here For Archives