తెలుగు నాట ఏ జోనర్ సినిమాలకైనా ఎదురుదెబ్బ తగులుతుందేమో కానీ.. సింగిల్ గా వచ్చే బూతు జోనర్, అడాల్ట్ కంటెంట్ సినిమాలకు మాత్రం తిరుగుండదు. ఇప్పటి వరకూ ఈ తరహా కంటెంట్ తో వచ్చిన సినిమాలెన్నో విజయాలు సాధించాయి. ప్రత్యేకించి గత నాలుగైదేళ్లలో సంపత్ నంది, దాసరి మారుతి వంటి దర్శకులు రూపొందించగా దిగువ శ్రేణి చిత్రాలుగా విమర్శల పాలైన సినిమాలు, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన బోల్డ్ సినిమా 'కుమారి'.. ఇలాంటి వారి స్ఫూర్తితో వచ్చిన ఇతర సినిమాలన్నీ దాదాపుగా పెట్టుబడులను తిరిగి రాబట్టుకున్నాయి.
మరికొన్ని కోట్ల రూపాయల లాభాలను కూడా తెచ్చి పెట్టాయి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించగా రూపొందిన 'రొమాంటిక్ క్రైమ్ కథ' వంటి సినిమాకు ఎన్ని విమర్శలు వచ్చాయో..అంతే స్థాయిలో కలెక్షన్ల వర్షం కూడా కురిసింది. మరి వాటి సంగతలా ఉంటే.. ఇదే తరహా సినిమాగా విమర్శలను ఎదుర్కొన్న 'గుంటూరు టాకీస్' కూడా బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మూడు కోట్లకు పై స్థాయి వసూళ్లను సంపాదించికున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడితో పోలిస్తే.. నిర్మాతలకు లాభాలు సంపాదించి పెట్టినట్టే. ఎలాగూ ఈ సినిమా శాటిలైట్ రైట్ష్ పై చానళ్ల వారి నుంచి ఎనలేని ఆసక్తి నెలకొనే ఉంది. ఈ నేపథ్యంలో 'గుంటూరు టాకీస్' హిట్ బొమ్మగానే నిలిచినట్టవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు ప్రవీణ్ దశ కూడా తిరిగింది. తమిళ హీరో సిద్ధార్థ్ తో సినిమా చేసే అవకాశాన్ని సంపాదించాడట ప్రవీణ్. మొత్తానికి 'గుంటూరు టాకీస్ ' నిర్మాత, దర్శకుల దశను తిప్పినట్టుగానే ఉంది.