ఎన్నికల సమయంలో గత ప్రభుత్వంలోని కాంగ్రెసు-ఎన్‌సిపి నాయకులపై ఆరోపణలు చేసిన ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే రాజీ పడలేదు. విచారణలు జరపడానికి ఎసిబి (అవినీతి నిరోధక బ్యూరో)కు ఎడాపెడా అనుమతులు యిచ్చేస్తున్నాడు. ఆరోపణల్లో మొదటి వరుసలో వున్న ముగ్గురు ఎన్‌సిపి లీడర్లపై విచారణకు ఎసిబికి నవంబరు ఆఖరివారంలోనే అనుమతి యిచ్చి ఆ విషయాన్ని అతను బహిరంగపరచలేదు. సరైన సమయం చూసి ప్రకటన చేస్తానులే అని అధికారులకు చెప్పాడు. అన్నట్టుగానే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12 న యిది ప్రకటించాడు. అప్పటికే ఆసుపత్రిలో వున్న శరద్‌కు యిది మరో దెబ్బ. అతని సోదరుని కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్, మాజీ జలవనరుల మంత్రి సునీల్ తత్కారే యిద్దరూ రూ. 70 వేల కోట్ల ఇరిగేషన్ స్కీములో యిరుక్కున్నారు. విచారణకు అనుమతి కోరుతూ బ్యూరోవారు గత కాంగ్రెసు ప్రభుత్వానికి రాస్తే ఆ ప్రభుత్వం యివ్వకుండా తొక్కిపెట్టింది. ఇప్పుడు ఫడ్నవీస్ యిచ్చాడు.
ఇక మాజీ పబ్లిక్ వర్క్‌స్ శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై ఆప్ కార్యకర్త అంజలీ దమాణియా పిల్ దాఖలు చేసింది. కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన పనులమీద కమిషన్‌గా అతను రూ. 82.42 కోట్లు పొందాడని 2013 నుంచి ఎసిబికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు, ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంటుకు పిటిషన్లు యిచ్చి వేసారి, బాంబే హై కోర్టులో పిల్ పడేసిందామె. ఇప్పుడు ఎసిబి కదిలింది. కోర్టుకు విన్నవిస్తే డిసెంబరు 18 నాటి తన తీర్పులో హైకోర్టు ఎసిబి డైరక్టర్ జనరల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ డైరక్టర్లతో స్పెషల్ ఇంక్వయిరీ టీము వేసి భుజబల్‌పై అవినీతి ఆరోపణలను విచారించి ఫిబ్రవరి 28కి రిపోర్టు సమర్పించమంది. తనపై వచ్చిన ఆరోపణలను భుజబల్ లిఖితపూర్వకంగా జవాబు యిచ్చి మద్దతుగా డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. వాటిని ఎసిబి సేకరించిన డాక్యుమెంట్లతో సరిచూసి అప్పుడు నేరాన్ని నిర్ధారిస్తారు. తెలిసిన వనరుల నుంచి వచ్చిన ఆదాయం కంటె 15% ఎక్కువగా ఆస్తులుంటే అప్పుడు కేసు అవుతుంది. ఈ కేసుపై మాట్లాడుతూ భుజ్‌బల్ ''కాంట్రాక్టులు యిచ్చేముందు అన్ని విధానాలను కరక్టుగా పాటించాం. న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ కాంట్రాక్టు విషయంలో గోల్‌మాల్ జరిగిందని ఆరోపిస్తున్నారు. కాబినెట్‌లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ నిర్ణయాన్నే నేను అమలు చేశాను. దానికి నన్ను తప్పు పడితే ఏం చేయగలను?'' అన్నాడు.
హర్షవర్ధన్ పాటిల్ అనే కోఆపరేటివ్ మినిస్టర్‌పై అనిల్ గోటే అనే బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు చేశాడు. ధూలే నాన్‌దర్బార్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రియదర్శిని కాటన్ కోఆపరేటివ్ సొసైటీకి ఏ అదనపు గ్యారంటీలు లేకుండా రూ.116 కోట్ల అదనపు ఋణాన్ని యిస్తూంటే సహకారమంత్రిగా వున్న పాటిల్ ఏమీ పట్టించుకోలేదని, అనేకమంది అధికారులకు, సొసైటీ డైరక్టర్లకు అనవసరమైన స్వేచ్ఛ యిచ్చి వారు దుర్వినియోగానికి పాల్పడేటట్లు చేశాడని ఫిర్యాదు చేశాడు. పాటిల్‌పై కూడా బహిరంగ విచారణ చేపట్టడానికి ఎసిబి సెప్టెంబరులో అనుమతి కోరింది. డిసెంబరు చివరి వారంలోనే ఫడ్నవీస్ అనుమతి యిచ్చాడు. మంత్రులతో బాటు పిడబ్ల్యుడి, హౌసింగ్, ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ వంటి అనేక శాఖల్లో పనిచేసిన ఐయేయస్, ఐఎఫ్ (ఫారెస్ట్) ఎస్ అధికారులను, డజన్ల కొద్దీ యితర అధికారులపై కూడా కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు అధికారంలో వున్నవారిపై ఆరోపణలు చేయడం, తాము అధికారంలోకి వస్తే డబ్బు కక్కిస్తామని ప్రతిజ్ఞలు చేయడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక ఆ వూసే మర్చిపోతారు. అసెంబ్లీలో మాత్రం పాత ఆరోపణలే తిరిగి తిరిగి చేస్తూ వుంటారు. 'మీ చేతిలో అధికారం వుంది కదా, కావాలంటే విచారణకు ఆదేశించండి. అగ్నిపునీత అయిన సీతలా బయటకు వస్తాం' అని అవతలివాళ్లు ఛాలెంజ్‌లు చేస్తూ వుంటారు. ఇద్దరి మధ్య ఏవో ఒప్పందాలు కుదిరివుంటాయి, యిదంతా కలిసి ఆడుతున్న నాటకం అని ప్రజలు అనుకుంటూ వుంటారు. ఫడ్నవీస్ ధైర్యంగా విచారణలు చేపట్టారు. ఇదంతా కక్షసాధింపు చర్య అని బాధితులు అంటే అననీ. కనీసం తను చేసిన ఆరోపణల్లో పస వుందని ఆయన నమ్ముతున్నాడు. తెలుగు ముఖ్యమంత్రులు తాము గతంలో ఆరోపణలు చేసినవారిపై విచారణ ప్రారంభించడం లేదు కాబట్టి అలాటి నమ్మకం వారికి లేదని మనం నమ్మవలసి వస్తోంది.
-ఎమ్బీయస్ ప్రసాద్