లండన్ కు ఒకపక్కగా నైట్స్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఉంటుంది ఈక్వెడార్ ఎంబసీ. దక్షిణమెరికన్ కంట్రీ అయిన ఈక్వెడార్ యూకేతో దౌత్యసంబంధాలను ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తోంది. గతంలో ఈ రాయబార కార్యాలయం గురించి ఎవరికీ అంతగా తెలియదు కానీ.. 2012 ఆగస్టు పదహారో తేదీ నుంచి మాత్రం ఈ కార్యాలయం చుట్టూ స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు మొహరించారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా వారు అక్కడ నుంచి కదలడం లేదు. పోలీసులు డ్యూటీలు మారుతున్నారు.. బయటే వేచి ఉన్నారు!
ఎప్పుడు జూలియస్ అసాంజ్ బయటకొస్తాడా..అతడిని పట్టేసుకొని అమెరికాకు అప్పగించేద్దామా.. అన్నట్టుంగా ఉంది బ్రిటన్ పోలీసుల తాపత్రయం. వికిలీక్స్ వ్యవస్థాపకుడు అయిన జులియస్ అసాంజ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. అమెరికా సన్నిహిత దేశాలు అతడిని పట్టేసుకొని ఒక దశాబ్దం పాటైనా తనను జైలుకు పంపేస్తే తప్ప తమకు ప్రశాంతత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సంచలన రీతిలో ఈక్వెడార్ లండన్ లోని తన ఎంబసీలో అసాంజ్ కు ఆశ్రయం ఇస్తోంది.
దాదాపు రెండు న్నర సంవత్సరాల నుంచి అసాంజ్ నైట్స్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఆ బిల్డింగ్ లోనే ఉంటున్నాడు. ఈకాలంలో ఎప్పుడైనా అతడు ఒక్కసారి బయటకు వచ్చి ఉన్నా… స్కాట్ లాండ్ యార్డు పోలీసుల పని పూర్తయ్యేది. తమ దేశంలోనే ఉన్నా… ఒక విదేశీ దౌత్య కార్యాలయంలోకి ఆ దేశం పర్మిషన్ లేనిది బ్రిటన్ పోలీసులు అడుగుపెట్టలేరు! ఇది దౌత్యనీతి. ప్రస్తుతానికి ఈక్వెడార్ తో బ్రిటన్ కు ఈ ఒక్క అంశంలో తప్ప అన్ని విధాలా సవ్యమైన సంబంధాలే ఉన్నాయి. దీంతో బ్రిటన్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతోంది.
తన అన్నయ్య అమెరికా కు అసాంజ్ పై ఉన్న అసహనాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రిటన్ ప్రభుత్వం ఈక్వెడార్ ఎంబసీ చుట్టూ పోలీసులను మొహరించింది. అసాంజ్ అక్కడ నుంచి తప్పించుకుపోకుండా కాపాలా కాస్తోంది. మరి రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్న ఈ తతంగం గురించి ఖర్చు వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
బ్రిటన్ సమాచార హక్కు చట్టం ప్రకారం ఎవరో ఔత్సాహికుడు దాఖలు చేసిన పిటిషన్ కు స్పందిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. భారత ద్రవ్యమానం లో చెప్పాలంటే దాదాపు 96 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట బ్రిటన్ ప్రభుత్వం. అసాంజ్ కోసం ఈక్వెడార్ ఎంబసీ బయట వేచి ఉన్న స్కాట్ లాండ్ యార్డ్ పోలీసుల విధుల కోసం ఇంత ఖర్చు అయ్యిందట! లోపల ఉన్న అసాంజ్ వద్ద ఆయుధాలేమీ లేవు. పోలీసులు లోపలకు వెళితే అతడు లొంగిపోవడానికి మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే యూకే పోలీసులు లోపలకు వెళ్లలేరు. దీంతో ఒక గడపదాటలేకపోవడం వల్ల రెండున్నరేళ్లలో దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా అవుతుంది.
బ్రిటన్ కు ఖర్చు చేసే ఓపిక ఉంది.. అవసరం ఉంది .. కాబట్టి ఖర్చు చేస్తోంది. ఇదిలా ఉంటే లోపల ఉన్న అసాంజ్ ఆరోగ్యం మాత్రం దెబ్బతింటోందని ఈక్వెడార్ ప్రకటించింది. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి సూర్య కాంతి తగలకపోవడం.. స్వేచ్ఛగా బయటకు తిరగలేక ఒక భవనానికి పరిమితం కావడం వల్ల.. అసాంజ్ ఆరోగ్యం దెబ్బతింటోందని, అతడి శారీరక, మానసిక స్థితి కి ఇది అంత మంచిది కాదని.. ఈక్వెడార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అయితే ఈ స్వేచ్ఛావాదికి జననాన్ని ఇచ్చిన ఆస్ట్రేలియన్ ప్రభుత్వం మాత్రం అమెరికా అడుగులకు మడుగులొత్తే పనిలో ఉంది. దీంతో అసాంజ్ వంటి యోధుడిని పట్టించుకొనే వారెవరూ లేకుండాపోయారు. ఏదో ఈక్వెడార్ ధైర్యంగా వ్యవహరించి ఆశ్రయం ఇవ్వబట్టి అసాంజ్ ఇప్పటి వరకూ మిగిలున్నాడు కానీ.. ఆ బుల్లిదేశానికైనా ఈ మాత్రం ధైర్యం లేకపోతే అసాంజ్ ను అమెరికా ఎప్పుడో చంపించి ఉండేది!