విశాఖ సైకిల్ పార్టీలో గ్రూపుల గోల

అధికారంలోకి రాని రోజులే బాగున్నాయి. పవర్ లోకి వచ్చి మరీ పతనమైపోయాం.. ఇదీ విశాఖ జిల్లా తెలుగు తమ్ముళ్ల ఆవేదన. పదేళ్ల పాటు నానా పాట్లూ పడ్డాం, పార్టీ కోసం జెండాలు మోసాం, ఎండలను…

అధికారంలోకి రాని రోజులే బాగున్నాయి. పవర్ లోకి వచ్చి మరీ పతనమైపోయాం.. ఇదీ విశాఖ జిల్లా తెలుగు తమ్ముళ్ల ఆవేదన. పదేళ్ల పాటు నానా పాట్లూ పడ్డాం, పార్టీ కోసం జెండాలు మోసాం, ఎండలను కాశాం, కానీ.. ఫలితాలు మాత్రం ఎవరో అనుభవిస్తున్నారు.. పసుపు పార్టీ కేడర్‌లో నిర్వేదం ఇది. నిజంగా అన్న గారు పెట్టిన పార్టీయేనా ఇది. నానా జాతి సమితిగా ఉంది, వీరూ వారూ అన్న తేడా లేకుండా అంతా చేరిపోయారు, కలగూర గంపలా పార్టీ పరిస్థితి  ఉంది. ఎవరికి ఎవరూ జవాబుదారీ కాదు, ఫక్తు కాంగ్రెస్ సంస్కృతి నడుస్తోందిపుడు.. పాతకాలం నాటి టీడీపీ కార్యకర్తల బాధ ఇది. ఇవన్నీ వింటూంటే జిల్లా టీడీపీలో ముసలం పుట్టిందన్నది ఇట్టే అర్ధమవుతుంది. దానికి ఏడాది వయసు కూడా వచ్చిందని కూడా తెలిసిపోతుంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రస్తుత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన గ్యాంగ్‌తో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరినపుడే గ్రూపులకు శుభారంభం పలికినట్లైంది. అధినేత చంద్రబాబు ఎంత పట్టించుకున్నా జిల్లా రాజకీయం మాత్రం అదుపులోకి రావడం లేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ప్రచ్చన్న యుద్ధం కాస్తా ఇపుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతోంది. రెండు బలమైన వర్గాల మధ్య పెనుగులాట సాగుతూనే ఉంది. అది చివరికి పార్టీ ప్రతిష్టను కూడా మంటకలుపుతోంది. ఇపుడు టీడీపీలో ఉన్న పాత కాపులకు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి, ప్రజారాజ్యం పార్టీ వారికి పోరు యమ జోరుగా సాగుతోంది. ఫలితంగా పార్టీ పరువు గంగలో కలుస్తోంది. ఈ మధ్య జరిగిన అనేకానేక సంఘటనలు దీనిని రుజువు చేస్తున్నాయి. ఇపుడు ఏకంగా బాహాటంగా నిందించుకుంటూ పత్రికలకు కూడా ఎక్కుతున్న వైనం క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరు తెచ్చుకున్న టీడీపీకి మచ్చ తెచ్చేలాగానే ఉంది. జిల్లాలో అధికారులు సైతం ఇద్దరు మంత్రుల మధ్యన విడిపోయారు. ఓ మంత్రి చెపితే ఆయన వర్గంగా ఉన్న అధికారులు రెండవ మంత్రి పేరు కూడా తలవరు, ఆయనకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. ఇది ఆధిపత్య పోరాటానికి పరాకాష్టగా చెప్పుకోవాలి.

దూకుడు మీదున్న మంత్రి గంటా

తనకు ఉన్న పలుకుబడితోనూ, వ్యూహాలతోనూ జిల్లా రాజకీయాలను అదుపులోకి తెచ్చుకోవడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు చాలా ముందున్నారు. మరో మంత్రి, సీనియర్ నాయకుడు అయిన అయ్యన్నపాత్రుడుతో ఉన్న రాజకీయ వైరం నేపథ్యంలో గంటా తెలివిగా పావులు కదుపుతున్నారు. ఆచితూచి అడుగు లు వేస్తూ ఏకంగా జిల్లాలోని మెజారిటీ టీడీపీ వర్గాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. ఈ పరిణామాలు అయ్యన్న వర్గంలో కలవరాన్ని కలిగిస్తున్నాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న గంటాకు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్న మరో మంత్రి నారాయణతో చక్కని సంబంధాలు ఉన్నాయి. అలాగే, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కాలంలో పెంచుకున్న పలుకుబడి నేపథ్యంలో వివిధ వర్గాలను, నాయకులను కలుపుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. తన మాటే చెల్లించుకోవడంలో కృతకృత్యులవుతున్నారు.

 గత నెల 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటు సాగిన విశాఖ ఉత్సవ్‌ను ఒంటి చేత్తో నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. సాటి మంత్రి అయ్యన్నపాత్రున్ని ఈ భారీ కార్యక్రమం నిర్వహణలో ఎక్కడా సంప్రదించకుండా పక్కన పెట్టారన్న విమర్శలు వచ్చినా కూడా గంటా చివరికి ఉత్సవ్‌ను విజయవంతం చేశారనిపించుకున్నారు. విశాఖ ఉత్సవ్‌కు సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి వారిని ఆహ్వానించడం ద్వారా మంత్రివర్గంలోని మెజారిటీ మంత్రులతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. తన సన్నిహితుడు మంత్రి నారాయణ ద్వారా  సీఎం బాబుతోనూ చనువును పెంచుకున్నారు. ఇదే క్రమంలో జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడపాలన్న గంటా ఆకాంక్ష ప్రత్యర్ధి మంత్రి అయ్యన్నకు చికాకు పుట్టిస్తోంది. జిల్లాకు ఏ మంత్రి వచ్చినా నగరానికే వస్తారు కాబట్టి గంటాయే వారిని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి వారితో మమేకం అవుతున్నారు. గంటా ఉన్న చోట అయ్యన్న సహజంగానే రారన్న ప్రచారం అధికారులకూ బాగానే వంట బట్టింది. దాంతో, వారు కూడా గంటాకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. 

ఈ విధంగా విశాఖకు వచ్చిన ప్రతీ మంత్రి గంటాతోనే కలసి కార్యక్రమాలను నిర్వహించడం చూస్తూంటే జిల్లాలో ఇంకో మంత్రి ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక, అధికారులను కూడా తనకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకోవడం ద్వారా గంటా అధికారులలోనూ ప్రత్యేక కోటరీని ఏర్పాటుచేసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్‌గా పట్టుబట్టి మరీ ప్రవీణ్‌కుమార్‌ను నియమించుకున్నారు. మరి, గంటాకు కమిషనర్ కూడా తనదైన శైలిలో భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఇటీవల ముగిసిన రిపబ్లిక్ డే ఉత్సవాలలో జీవీఎంసీ రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల నివేదికలో ఎక్కడా మరో మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రస్తావనే లేకపోవడం విశేషం. అదే విధంగా, కేంద్రంలో మంత్రిగా నియమితులైన సైన్స్ అండ్ టెక్నాలజి శాఖ చూస్తున్న సుజనా చౌదరి రెండు రోజుల పాటు నగర కార్యక్రమాలలో బిజీగా గడిపారు. ఈ కార్యక్రమంలోనూ ఎక్కడా అయ్యన్నకు ప్రాధాన్యత లభించలేదు. ఇంతవరకూ నగరానికే పరిమితమైన గంటా ఇపుడు జిల్లా రాజకీయాలను గుప్పిట పట్టాలని చూస్తున్నారు. 

ఈ క్రమంలో అయ్యన్న వర్గంలో ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు కనీసమాత్రమైనా సమాచారం లేకుండా ఆయన నియోజకవర్గంలోనే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రామానాయుడు ఓటమికి కారకునిగా భావిస్తున్న విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుతో కలసి ఈ కార్యక్రమానికి గంటా హాజరుకావడంతో ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడే మండిపడ్డారు. రామానాయుడు ఈ వ్యవహారంపై అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఘాటైన లేఖ కూడా రాశారు. జిల్లా రాజకీయాలలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధిపత్య ధోరణి పెరుగుతోందని, ఆయన వర్గాలను పెంచి పోషిస్తున్నారని రామానాయుడు ఆరోపించారు. దీని వెనుక మంత్రి అయ్యన్నపాత్రుడు హస్తం ఉందన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం మాత్రం జిల్లాలో ఉన్న రెండు గ్రూపుల మధ్య పరోక్ష పోరును ప్రత్యక్షం చేసిందనే చెప్పాలి.

తమ్ళుళ్లను పక్కన పెడుతున్న మాజీ ప్రజారాజ్యం నేతలు

టీడీపీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సీనియర్ నాయకులను, మాజీ మంత్రులను కూడా మాజీ ప్రజారాజ్యం నేతలు ఖాతరు చేయడం లేదు. మంత్రి గంటా తో పాటే, టీడీపీ ప్రవేశం చేసిన వీరంతా టీడీపీ విధానాల కంటే మంత్రి గంటా శ్రీనివాసరావు మాటేక విలువ ఇస్తారన్నది వాస్తవం. గంటాతో పాటు టీడీపీలో చేరిన వారిలో విద్యా సంస్ధల అధినేత అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎంపీగా నెగ్గారు. అలాగే, మరో నేత పంచకర్ల రమేష్‌బాబు ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు. గంటా పలుకుబడితో టిక్కెట్ పొందిన టీడీపీ నాయకుడు పీలా గోవింద్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరంతా గంటా సన్నిహితులుగా ముద్రపడిన వారు. వీరితో పాటు, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బండారు 

సత్యనారాయణమూర్తి కూడా గంటా శిబిరంలోనే కొనసాగుతున్నారు. అయితే, చిత్రంగా బండారుకు, మాజీ ప్రజారాజ్యం నేతలకు మధ్య అంత సాన్నిహిత్యం ఉండడంలేదు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి విశాఖ పర్యటనలో హడావుడి చేసిన అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాసరావు కనీస సమాచారం ఇవ్వకుండా స్ధానిక ఎమ్మెల్యే బండారును అవమానించారు. దాంతో, ఆయన అలిగి ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం టీడీపీ లోగుట్టును బయటపెట్టింది. అప్పటికి ఇద్దరికీ మంత్రి గంటా సర్దిచెప్పినా టీడీపీలో మాజీ ప్రజారాజ్యం బ్యాచ్ దూకుడు మాత్రం తగ్గడంలేదు. ఇది తమ్ముళ్లకు కోపం తెప్పిస్తోంది. రానున్న రోజులలో ఇది ఎంత వరకూ వెళ్తుందన్నది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది

మౌనమే వ్యూహంగా అయ్యన్న

గంటా దూకుడును ఓ కంట కనిపెడుతూనే ప్రస్తుతానికి మౌనమే శరణ్యమన్న వ్యూహాన్ని సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు పాటిస్తున్నారు. గంటాతో తనకు విభేదాలు ఉన్నాయని బాహాటంగానే పలుమార్లు చెప్పిన అయ్యన్న దీటుగా ఎదుర్కోనే విషయంలో మాత్రం సరైన పథక రచన చేయలేకపోతున్నారని ఆయన వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే, అయ్యన్న మాత్రం మౌనమే తన వ్యూహమని చెపుతున్నారు. అన్ని విషయాలను ఆయన పరిశీలిస్తున్నా కూడా ఎక్కడా ప్రస్తుతానికి నోరు మెదపడంలేదు. నగరానికి మంత్రి గంటాను, జిల్లాకు అయ్యన్నను కేటాయించి ఆయా విధంగా కార్యకలాపాలను సాగించమని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా కూడా గంటా జిల్లా రాజకీయాలలో వేలు పెట్టడం అయ్యన్నకు రుచించడంలేదు. నగర రాజకీయాలలో అయ్యన్న కనీసం జోక్యం చేసుకోకపోయినా జిల్లాలో మాత్రం గంటా తన పెత్తనం కోసం ఆరాటపడుతున్నారని అయ్యన్న వర్గం ఆరోపిస్తోంది. అయితే, ఈ పరిణామాలను ఎప్పటికపుడు సీఎం బాబుకు అయ్యన్న చెబుతూ వస్తున్నారని, తగిన సమయం కోసమే వేచి చూస్తున్నారని ఆయన వర్గం అంటోంది. ఏది ఏమైనా కూడా నివురు కప్పిన నిప్పులా ఇద్దరు మంత్రుల రాజకీయం సాగుతోంది. ఇది ఏ సమయంలో పేలుతుందో, పార్టీ అస్థిత్వానికి ఎటువంటి ముప్పును కలిగిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.