మన్మోహన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. సోనియా, రాహుల్ 'మేం నైతిక బాధ్యత వహిస్తున్నాం, రాజీనామా చేస్తున్నాం' అని పైకి అనడం, 'అబ్బే, మీరు కూడా మమ్మల్ని వదిలేస్తే మేం బొత్తిగా దిక్కులేనివాళ్లమై పోతాం' అని కాంగ్రెస్ నాయకులు మొత్తుకోవడం జరిగిపోయింది. ఇక తరువాతి థలో యీ నాయకులంతా 'తప్పంతా మన్మోహన్ది. ఈ అసమర్థ ప్రధాని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోవడం చేతనే ఓడిపోయాం' అని కోరస్ పాడి, ఆయన్ను దోషిగా నిలబెడతారు. కాంగ్రెసు చరిత్ర పుస్తకాల్లో ఆ విధంగా రాస్తారు కూడా. పివి నరసింహారావు వద్ద పనిచేసినపుడు మేధావిగా పేరుబడడమే కాదు, యుపిఏ1 ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి, 2009 ఎన్నికలలో మళ్లీ గెలవడానికి కారణభూతుడైన మన్మోహన్ యిమేజి ఆ తర్వాత యింతలా ఎందుకు దిగజారిందో సంజయ్ బారు తన పుస్తకంలో వివరించారు. అలా దిగజారడానికి కారణం సోనియా గాంధీ అని అందరికీ తెలుసు. తన ఆఫీసు వరకు అవినీతి లేకుండా చూసుకుంటే చాలని, తనపై ఎవరూ వేలెత్తి చూపకుండా వుంటే చాలని మన్మోహన్ అనుకున్నారు. ప్రజలు అలా అనుకోలేదు. సోనియా చెపితే మాత్రం, యీయన తన సహచరుల అవినీతిని సహించడమేమిటని మండిపడ్డారు, శిక్షించారు. ''నేను ప్రధానమంత్రిగా ఏమీ సాధించలేకపోయినా, ఆర్థికమంత్రిగా నా విజయాల గురించి ప్రజలు గుర్తుంచుకుంటారు'' అని మన్మోహన్ తన సెక్యూరిటీ ఎడ్వయిజర్ ఎం. కె. నారాయణన్తో ఒకసారి అన్నారట. 2014 ఘోరపరాజయం తర్వాత మన్మోహన్కు ఆనాటి ఖ్యాతి కూడా మిగులుతుందో లేదో అని అనుమానం వస్తోంది. పివి హయాంలో యీయన చూపిన తెలివితేటలు యీయనవి కావేమో, పివి చెప్పగా యీయన చేసినవేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకిలా జరిగింది?
ప్రధాని కాగానే మన్మోహన్ను పివితో పోల్చారు. ఆయనలాగే దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. పివికి ఆయనకు గల పోలికేమిటి, తేడా ఏమిటి? అనే విషయంపై కాలమిస్టు కావేరీ బామ్జాయ్ చక్కటి పరిశీలన చేశారు. మన్మోహన్ అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడపబోయినపుడు కాంగ్రెసు నాయకులు సోనియా వద్దకు వచ్చి ''ఈయనా పివిలాగే తయారయ్యాడు. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి (అనగా నిధులు సంపాదించుకోనీయటం లేదని భావం) సొంత యిమేజి గురించి పాకులాడుతున్నాడు.'' అని ఫిర్యాదు చేశారట. పివి పేరెత్తితేనే సోనియాకు మంట అని తెలిసి ఆ పోలిక తెచ్చారు. నిజానికి మన్మోహన్ హయాంలో, ముఖ్యంగా 2009 తర్వాత చాలా స్కాములు జరిగాయి. ఎటొచ్చీ వాటిలో మన్మోహన్ ప్రత్యక్ష జోక్యం లేదంతే! సోనియా కోరుకున్న విధంగానే ప్రభుత్వం నడిచింది. మన్మోహన్కు యిష్టం లేనివారిని కూడా మంత్రులుగా రుద్దింది. వాళ్లు ఏం చేసినా చూసీచూడకుండా వదిలేయమంది. మన్మోహన్ తనను తాను ఒక ఎడ్మినిస్ట్రేటర్గానే పరిగణించుకుని పార్టీ వ్యవహారాల జోలికే కాదు, యితర మంత్రిత్వశాఖల జోలికి కూడా వెళ్లలేదు. తన సంస్థలో అవినీతి జరగకుండా చూడడం, తన సహచరులందరూ తన మాట వినేట్లా చూసుకోవడం కూడా ఎడ్మినిస్ట్రేటర్ బాధ్యతల్లో ఒకటి అని ఆయనకు తోచలేదు. తను అనుకున్న విధంగా ప్రభుత్వాన్ని నడపలేనని గ్రహించిన రోజున ఆయన ప్రధానిగా తప్పుకుని వుంటే యీ నాటి అప్రతిష్ట తప్పేది.
పివిలో ఒక ఎడ్మినిస్ట్రేటర్తో బాటు, ఒక రాజకీయవేత్త కూడా వున్నాడు. చిన్నప్పటినుండి కాంగ్రెసు రాజకీయాల్లో నలిగిన వ్యక్తి ఆయన. పార్టీపై పట్టు సాధిస్తే తప్ప ప్రభుత్వంపై పట్టు రాదని ఆయనకు తెలుసు. అందుకనే తను ప్రధాని అయిన కొన్ని నెలలకే 1992లో జరిగిన ఎఐసిసి సెషన్లో తనను తాను పార్టీ అధ్యకక్షుడిగా చేసుకున్నాడు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీని తన విధేయులతో నింపేశాడు. పార్టీలో తన వ్యతిరేకులను యిబ్బంది పాలు చేయడానికి హవాలా స్కాముల వంటివి ఉపయోగించుకున్నాడు. రాజకీయంగా కూడా బలంగా వుండడానికి పివి చేసిన ప్రయత్నాలు మన్మోహన్ చేయలేదు. మన రాష్ట్ర విభజన విషయంలో సైతం తన సొంత అభిప్రాయాన్ని పక్కన పెట్టి సోనియా చెప్పినట్లు తలవూపాడు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి వివరించే సాహసం చేయలేదు. సోనియాను కట్టడి చేయడానికి పివి బోఫోర్స్ స్కామును ఉపయోగించుకోవడం చేత తర్వాతి రోజుల్లో సోనియా పివిపై కక్ష సాధించింది. 1996లో కాంగ్రెసు 140 సీట్లు గెలిచి మిశ్రమ ప్రభుత్వం ఏర్పరచడానికి పివి ప్రయత్నిస్తూండగానే జనరల్ సెక్రటరీ మాధవరావు సింధియా చేత 'ప్రభుత్వ ఏర్పాటుకై కాంగ్రెసు ప్రయత్నించదు' అని సోనియా ప్రకటింపచేసి, పివికి అడ్డుకొట్టింది. చనిపోయిన తర్వాత పివి శవం కూడా ఢిల్లీలో వుండకుండా చేసింది. 2009లో కాంగ్రెసు పార్టీ 125 వ వార్షికోత్సవ సభలో ప్రధానులు పేర్లు చెపుతూ పివి పేరు తలవను కూడా తలవలేదు. తనకూ అలాటి గతే పడుతుందని భయపడి కాబోలు మన్మోహన్ రాజకీయంగా బలపడడానికి అస్సలు ప్రయత్నించలేదు. సోనియా చెప్పినట్లల్లా ఆడి, ప్రధాని పదవిలో చివరిదాకా కొనసాగి, ఏం బావుకున్నాడా అని చూస్తే ఏమీ కనబడటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్