మహారాష్ట్రలోని అహమద్‌నగర్ జిల్లాలో ఒక మరాఠా బాలికను ముగ్గురు దళితులు అత్యాచారానికి గురిచేసి, చంపివేయడంతో ప్రారంభమైన మరాఠా మౌనప్రదర్శనలు నానాటికీ బలపడుతూ వస్తున్నాయి. వాళ్లు రాజకీయనాయకులను దరి చేయనీయటం లేదు. ముందువరుసలో మహిళలు, వారి వెనుక అడ్వకేట్లు, డాక్టర్లు వంటి వృత్తినిపుణులు, వారి వెనుక రైతులు, చివరగా ఉంటేగింటే రాజకీయ నాయకులు! ఉన్నా వారిని ఉపన్యసించనీయటం లేదు. లక్షలాది మంది మౌనంగా నడుస్తూ ప్రదర్శన ముగిశాక, ఐదుగురు అమ్మాయిలు వెళ్లి జిల్లా కలక్టరుకు మహజరు యిస్తారు – మరాఠాలకు రిజర్వేషన్ కల్పించమని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని ఎత్తివేయమని! ఆగస్టు 10 నుంచి అలాటి ప్రదర్శనాలు డజనుకి పైగా జరిగాయి. ఆందోళనకు మద్దతు తెలుపుతూ అక్టోబరు 2న 22 వేల గ్రామసభలు తీర్మానాలు చేశాయి. సతారా జిల్లాలోని గుండేవాడి గ్రామంలో వున్న 1400 మందీ మరాఠాలే కావడంతో తమ ఊరి పేరును మరాఠా నగర్‌గా మార్చేసుకున్నారు. 'మరాఠా' అనే పేరు మీద కొత్త టీవీ ఛానెల్ రాబోతోంది. ఇలా 10 వారాలుగా ఆందోళన తీవ్రంగా నడుస్తున్నా దాన్ని ఎలా హ్యేండిల్ చేయాలో ఎవరికీ తెలియటం లేదు. రాజకీయనాయకులు చొరబడి వుంటే, యీ పాటికి పరిష్కారం చేసి వుండేవారు. శరద్ పవార్ వంటి మరాఠా నాయకుడు కూడా చాటుగా సాయపడుతున్నాడు కానీ ముందుకు రావటం లేదు.
ఈ ఆందోళనలోని మొదటి విషయమైన రిజర్వేషన్ల గురించి చెప్పాలంటే – 1980లలో తొలిసారి యీ డిమాండ్ వచ్చింది. మరాఠాలు, కుంబీలు కలిసి జనాభాలో 34% వున్నారు. మండల్ కమిషన్ కుంబీలను బిసిలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించడంతో వాళ్లు తక్కిన మరాఠాల కంటె ముందుకు వెళ్లారు. నారాయణ రాణే కమిటీ నివేదిక ప్రకారం మరాఠాలు ప్రభుత్వోద్యోగాల్లో 15% వున్నారు. ఉన్నత విద్య చదివేవారిలో వారి శాతం 12 మాత్రమే. సైన్యంలో వారి శాతం 20ట. ఋణగ్రస్తుల్లో 67%, భూములమ్ముకునేవారిలో 50% మరాఠాలే.
వారిని ఊరడించడానికి రాష్ట్రప్రభుత్వం యీ అంశాన్ని పరిశీలించమని బిసి నేషనల్ కమిషన్‌ను కోరింది. 1990 నుంచి 2008 మధ్య మూడు కమిషన్లు దీనిపై చర్చించాయి. 2008 నాటి కమిషన్ మరాఠాలు ఆర్థికంగా కాని, సామాజికంగా కాని, రాజకీయంగా కానీ వెనుకపడి లేరని తేల్చింది. ఈ మాట వాస్తవం కాదని, నిజానికి కొన్ని (169 అని లెక్క కూడా చెప్తున్నారు కొందరు) మరాఠా కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని, వాళ్లే రాజకీయాలను, కోఆపరేటివ్ రంగాన్ని, చక్కెర వ్యాపారాన్ని, ఉల్లిపాయల వ్యాపారాన్ని హస్తగతం చేసుకున్నారని బీద మరాఠాలు ఆరోపిస్తున్నారు. దళితులను, ప్రభుత్వాన్ని నిరసిస్తున్న యీ తరుణంలోనే పనిలోపనిగా తమ పేరు చెప్పి సకల సౌకర్యాలు అనుభవిస్తున్న ధనిక మరాఠాలకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించాలంటున్నారు. శరద్ పవార్ కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా వున్న పదేళ్ల కాలంలోనే సగటున రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, చేసుకున్నవారిలో 36% మంది మరాఠాలేనని ఆందోళన కారుల వాదన. బిజెపి హిందువులను సంఘటితం చేసి విజయాలు సాధిస్తూండడం చూసి మరాఠాలను చీల్చి తమ పక్షాన కూడగట్టడానికి శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌లు వారి రిజర్వేషన్‌ను 2009లో ఎన్నికల అంశం చేసి, పదవిలోంచి దిగిపోయే ముందు వారికి 16% కోటా యిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు కానీ వ్యవహారం కోర్టులో వుంది. ఎందుకంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితి (తమిళనాడు, ఆంధ్ర దీన్ని ఉల్లంఘించాయి)ని దాటి మహారాష్ట్ర యిప్పటికే 2% ఎక్కువగా యిస్తోంది.
ఈ కారణాలతో ఆందోళన నడుస్తూంటే కర్మకాలి ఊరేగింపులు జోరుగా సాగుతున్న నాశిక్ జిల్లాలోనే తాలేగావ్ అనే వూళ్లో అక్టోబరు 7న 16,17 ఏళ్ల దళిత బాలుడు, అయిదేళ్ల మరాఠా పాపపై అత్యాచార ప్రయత్నం చేసినట్లు రిపోర్టు వచ్చింది. మరాఠాలు కాగడాలు చేపట్టి నాశిక్-ముంబయి హైవేపై ట్రక్కులను, బస్సులను, పోలీసు వాహనాలను ఆరు గంటలపాటు తగలబెట్టారు. ఏడెనిమిది దళిత నివాసాలకు నిప్పుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా దీనికి ప్రచారం కలిగినకొద్దీ పరిస్థితి మరింత సంక్లిష్టం అయిపోతుందని భయపడిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బస్సులు రద్దు చేసేసి, వారం రోజుల పాటు యింటర్నెట్ సౌకర్యం లేకుండా చేశాడు. మరాఠాలు బిసిలుగా గుర్తింపబడితే తమ రిజర్వేషన్లకు గండి పడుతుందని భయపడిన బిసిలు యిటీవల నాశిక్ జిల్లాలో 4 లక్షల మంది చేరి 'మనీ లాండరింగ్ కేసులో అన్యాయంగా (?) యిరుక్కుని మార్చి నెల నుండి జైల్లో వున్న ఛగన్ భుజ్‌బల్ అనే బిసి నాయకుడికి మద్దతుగా..' అనే పేర పెద్ద ప్రదర్శన నిర్వహించారు.
మరాఠాలు బ్రాహ్మణ వ్యతిరేకులు. ఫడ్నవీస్ బ్రాహ్మణుడు. అందువలన అతనికి పదవీగండం వుండవచ్చని కొందరంటున్నారు. ఆ భయంతో అతను మరీ రాజీ పడుతున్నాడు. ఇటీవల 'మహారాష్ట్ర భూషణ్' అనే బిరుదును 90 ఏళ్లు పైబడిన బాబాసాహెబ్ పురందరే అనే ప్రసిద్ధ చరిత్రకారుడికి యిచ్చారు. ఖేడేకర్ అనే మరాఠా నాయకుడు 'గత 15 ఏళ్లల్లో 7గురు బ్రాహ్మణులకు యీ బిరుదు యిచ్చారు. మళ్లీ యింకో బ్రాహ్మడికా?' అని నిరసన తెలిపాడు. అతను రాసిన ఒక పుస్తకంలో 'బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులందరికీ శత్రువులే. బ్రాహ్మలందరినీ నరికి పోగులు పెడితే తప్ప దేశం మందుకి వెళ్లదు' అని రాశాడట. ఇలాటివాణ్ని ఫడ్నవీస్ బులధానా జిల్లాలో శివాజీ తల్లికి కట్టబోయే స్మారకచిహ్నం నిర్మాణ కమిటీకి చైర్మన్‌గా వేశాడు. మరాఠాలను చల్లార్చడానికి మరాఠా విద్యార్థులకు ఆర్థికసాయం ప్రకటించాడు. అంతేకాదు, మరాఠాలు అత్యధికంగా వున్న కూలీపనివారి ఉన్నతికై పనిచేస్తున్నామని చెప్పుకునే 'అన్నాసాహెబ్ పాటిల్ ఆర్థిక వికాస్ మహామండల్'కు రూ. 200 కోట్లు సహాయం ప్రకటించాడు. ఇవన్నీ చూసి బ్రాహ్మణులు మేల్కొంటున్నారు. నవంబరులో వారొక సమావేశం ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు. చివరికి యిది ఎలాటి పర్యవసానాలకు దారి తీస్తుందో తెలియదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2016)