జూన్ 21న ఛత్తీస్‌గఢ్‌లో 16వ ప్రాంతీయపార్టీ ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేర వెలసింది. పెట్టింది వేరెవరో కాదు, కాంగ్రెసు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆ రాష్ట్రంలో కాంగ్రెసు అనగానే తట్టే మొదటి వ్యక్తి ఐన అజిత్ జోగి. కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీ పెట్టడానికి కాంగ్రెసులోంచి బయటకు వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం రాష్ట్రపాలనంతా ఢిల్లీ నుంచి సాగుతోందని, తను కేవలం స్థానికుల కోసమే ప్రాంతీయ పార్టీ పెడుతున్నాననీ చెప్పాడు. అతని భార్య రేణు జోగి మాత్రం కాంగ్రెసులోనే వుండిపోయింది. కొడుకు అమిత్‌ని కాంగ్రెసు జనవరిలోనే బయటకు పంపేసింది. అజిత్‌ను కూడా పంపేయాలని రాష్ట్ర కాంగ్రెసు తీర్మానం చేసింది కానీ హై కమాండే తాత్సారం చేసింది. 2014లో అంతాగఢ్ ఉపయెన్నిక సమయంలో బిజెపి అభ్యర్థికి నెగ్గేందుకు వీలుగా అజిత్ తన అనుచరుడైన కాంగ్రెసు అభ్యర్థి మంటూరామ్ పవార్‌ను విరమింపచేశాడు. ఈ సందర్భంగా అజిత్ జోగి, కొడుకు అమిత్ జోగి, బిజెపి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అల్లుడు పునీత్ గుప్తాల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు బయటకు వచ్చేశాయి. ఎన్నికలో బిజెపి అభ్యర్థి గెలిచాడు. విత్‌డ్రా అయిన పవార్ బిజెపిలో మారిపోయాడు. తండ్రీకొడుకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో అమిత్‌ను పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరించింది. దాన్ని ఎత్తివేయించడానికి యిక అప్పణ్నుంచి అజిత్ జోగి ఢిల్లీ ప్రదక్షిణాలు చేశాడు. కానీ రాహుల్ గాంధీ దర్శనం దయచేయించలేదు. 'కాంగ్రెసు హై కమాండ్, ముఖ్యంగా రాహుల్, రాష్ట్రనాయకుల సమస్యలను పట్టించుకోవడం లేదనడానికి నిదర్శనం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కాంగ్రెసు నాయకులే ఉదాహరణలు. నన్నూ అలాగే నిర్లక్ష్యం చేశారు. వారి ముందు ఏం చెప్పుకున్నా బధిరశంఖారావమే' అని చెప్పుకుంటూ అజిత్ బయటకు వచ్చేశాడు.
అజిత్ జోగి ఇంజనీరింగు చదివి, 1968లో ఐపియస్‌కు, 1971లో ఐయేయస్‌కు సెలక్టయ్యాడు. మధ్యప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో కలక్టరుగా పనిచేశాడు. ఆ సమయంలోనే కాంగ్రెసు నాయకుడు అర్జున్ సింగ్‌కు ఆత్మీయుడయ్యాడు. అజిత్ కన్వర్టడ్ క్రిస్టియన్ కుటుంబానికి చెందినవాడు. తల్లి సత్నామీ, తండ్రి ఎస్టీ. చత్తీస్‌గఢ్‌లో వున్న 12.8% ఎస్సీ కులాలలో సత్నామీలదే మెజారిటీ. ఎస్టిలు 30.6%, మైనారిటీలు 3% వున్నారు. వీళ్లందరికీ యితను ఆమోదయోగ్యుడవుతాడని కాంగ్రెసు వారు అంచనా వేసి అతన్ని 1986లో తమ పార్టీలో చేర్చుకుని రాజ్యసభకు పంపారు. అతను కాంగ్రెసు జనరల్ సెక్రటరీగా, అధికార ప్రతినిథిగా కూడా పనిచేశాడు. 2000 నవంబరులో ఛత్తీస్‌గఢ్ ఏర్పడినపుడు అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిగా అతను నియంతలా వ్యవహరించాడని, పార్టీలో ఎవరినీ లెక్కపెట్టలేదనీ అందుకే 2003లో కాంగ్రెసు అధికారం పోగొట్టుకుని యిప్పటిదాకా మళ్లీ గెలవలేకపోతోందని అంటారు. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా వుంటుంది. 2013 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి 41% ఓట్లు వస్తే కాంగ్రెసుకు 40% వచ్చాయి. సీట్ల విషయానికి వస్తే బిజెపికి 49 రాగా, కాంగ్రెసుకు 39 వచ్చాయి. మొత్తం 90 సీట్లు. ''జోగి కారణంగానే అగ్రవర్ణాలు మా పార్టీకి దూరమై బిజెపికి వేశారు. అందుకే ఓడిపోయాం. ట్రైబల్స్ కూడా దూరమయ్యారు. బస్తరు, సుర్గుజా ప్రాంతాలలో అనేక గిరిజన నియోజకవర్గాలు ఓడిపోయాం. ఇప్పుడు అజిత్ వదిలాడు కాబట్టి, వాళ్లు మళ్లీ మా చెంతకు రావచ్చు'' అంటున్నాడు ఒక కాంగ్రెసు నాయకుడు. రాష్ట్రంలో బ్రాహ్మణులు 4%, రాజపుత్రులు 3% వున్నారు. బిసిలు 46.6% వున్నారు.
2018 ఎన్నికలలో బిజెపికి మేలు చేయడానికే అజిత్ కాంగ్రెసు ఓట్లు చీల్చుదామని చూస్తున్నాడు అని కాంగ్రెసు నాయకుల ఆరోపణ. కాంగ్రెసు నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టి అర్జున్ సింగ్ వంటి వాడే విఫలమయ్యాడు. ఇతనెంత అంటున్నారు. 2003లో విసి శుక్లా కాంగ్రెసులోంచి వెళ్లిపోయి ఎన్‌సిపి పెట్టాడు. సొంతంగా 1 సీటు మాత్రమే గెలిచినా 7% ఓట్లు చీల్చి కాంగ్రెసు అవకాశాలు దెబ్బ తీసి బిజెపి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాడు. ఇప్పుడు అజిత్ కూడా అదే పని చేయవచ్చని కొందరి అంచనా. ఎస్సీల పార్టీగా పేరు పడిన బియస్పి కూడా ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ బలాన్ని దెబ్బ తీయలేకపోయింది. నెగ్గే పార్టీకి, ఓడే పార్టీకి మధ్య తేడా 1% మాత్రమే అయినపుడు, వచ్చే ఎన్నికలలో యితను 5-6% ఓట్లు చీల్చినా ఫలితాలు తారుమారవుతాయి. నెగ్గినవాళ్లు యితని మద్దతుకై అర్రులు చాచవచ్చు. ఇలాటి పరిస్థితుల్లోనే ఝార్ఖండ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మధు కోడా 2006లో ముఖ్యమంత్రి కాగలిగాడు. తను బిజెపికి 'బి' టీముగా లేనని చూపుకోవడానికి కాబోలు అజిత్ తన పార్టీ ఆవిష్కరణను ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నిర్వహించాడు. అజిత్ వెళ్లిపోయినా కాంగ్రెసు చెక్కు చెదరదని చూపించడానికి అదే రోజున కాంగ్రెసు అజిత్ నియోజకవర్గంలో పెద్ద ర్యాలీ నిర్వహించింది. ప్రస్తుతం అజిత్‌తో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారంతే!
కొసమెరుపు ఏమిటంటే – క్రైస్తవుడైన అజిత్ పార్టీ ప్రారంభిస్తూ ఆవిర్భావ ముహూర్తాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణుడి చేత పెట్టించానని ప్రకటించడం! –
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2016)