హిందూమతం నుంచి యితర మతాల్లోకి మారేవాళ్ల గురించి వార్తల్లో ఎప్పుడూ రాదు కానీ ఆగ్రాలో 300 చ.కి.మీ. విస్తీర్ణం గల వేద్ నగర్ అనే మురికివాడలో నివసించే 57 కుటుంబాలకు చెందిన సుమారు 250 మంది ముస్లిములు డిసెంబరు 8 న హిందూమతంలోకి మారడంతో వాళ్ల గురించి కథనాలు చాలానే వస్తున్నాయి. మీడియా వారిని వెతికిపట్టుకుని వారి కథనాలు వెలువరిస్తోంది. అక్కడున్నవారిలో చాలామంది బెంగాల్, బంగ్లాదేశ్, బర్మాల నుంచి జీవనోపాధి కోసం అక్కడకు వచ్చిన ముస్లిములు. చెత్తకాగితాలు ఏరుకోవడం వారి వృత్తి. రోడ్డుమీద పారేసిన తుక్కు వస్తువులు ఏరుకోవడానికి రోజుకి 20, 25 కి.మీ.లు నడిచినా నెలకు రూ.2000 కి మించి ఆదాయం రాదు, పిల్లలెక్కువ. దినదినగండంగా బతుకుతున్నారు. వాళ్లకు రేషన్ కార్డులు లేవు. బంగ్లాదేశ్, బర్మాల నుంచి వచ్చినవారికి వెనక్కి పంపించేస్తారన్న భయం తోడయింది. హిందూత్వ సంఘాలు వీరిని వెతికి పట్టుకున్నాయి. 'రేషన్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, ఉద్యోగాలు యిస్తాం' అని ఆశపెట్టి మతం మార్చారు. అన్ని పేపర్లలో ఆ విషయం రాగానే మీడియా చుట్టుముట్టింది, ముస్లిం మతపెద్దలు కదలివచ్చి తిట్టిపోశారు. 'ఇలా అయితే అల్లా మిమ్మల్ని క్షమించడు. ఇప్పుడు మీరు హిందువులు కాదు, ముస్లిములు కాదు' అని భయపెట్టారు. ఎటూ కాకుండా పోయినందుకు ముసలివాళ్లందరికీ బెంగ పట్టుకుంది. పోయిన మతం ఎలాగూ పోయింది, బతుకు మాట ఏమిటని అడుగుదామంటే హిందూత్వ కార్యకర్తలు కనబడకుండా పోయారు.
'ఈ మతమార్పిళ్లన్నీ యిలాగే వుంటాయి' అంటాడు ఆగ్రాకు 50 కి.మీ.ల దూరంలో వున్న అస్రోయీ గ్రామంలో వుండే రామ్ పాల్ అనే వ్యక్తి. పదేళ్ల క్రితం అతనింటికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు. 'నీకు పట్నంలో నెలకు రూ.2500 జీతంతో ఉద్యోగం యిప్పిస్తాం, మీ వూళ్లో బడి పెడతాం, ఆసుపత్రి పెడతాం, మీ యింటి ముందు కాస్త స్థలం యిస్తే చర్చి పెట్టుకుంటాం' అన్నారు. ఇతను సరేనన్నాడు. ఓ షెడ్ కట్టి అదే చర్చి అన్నారు. ఇతనికి ఉద్యోగం వచ్చింది. తొమ్మిది నెలలు గడిచాక 'మీ వూళ్లో నువ్వు తప్ప వేరెవరూ మతంలోకి చేరలేదేం?' అని సతాయించసాగారు. 'మీరు కడతానన్న స్కూలు, ఆసుపత్రి కట్టలేదు కదా' అన్నాడితను. ఊరు కెళితే జనాలందరూ నువ్వు హిందువువా? క్రైస్తవుడివా? అని అడగసాగారు. ఈ బాధ భరించలేక ఒక హిందూత్వ సంస్థ దగ్గరకు వెళ్లి 'నన్ను హిందూమతంలోకి మళ్లీ మార్చేయండి' అని బతిమాలుకున్నాడు. వాళ్లు సరేనన్నారు. ఏ మతంలో వున్నా అతని జీవనశైలిలో మార్పు రాలేదు. పందుల పెంచి నెలకు రూ. 3000 దాకా సంపాదించుకుంటాడు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపుకుంటాడు.
ఇప్పుడీ ఆగ్రా మతమార్పిడుల అంశం కారణంగా అందరి దృష్టీ యీ 57 కుటుంబాలపై పడింది. జిల్లా యంత్రాంగం వచ్చి వాళ్లకు భోజనాలూ అవీ ఏర్పాటు చేసింది. కప్పుకునేందుకు దుప్పట్లూ అవీ యిచ్చింది. కొన్ని సంస్థలవాళ్లు వచ్చి పుస్తకాలు పంచారు. ఇవన్నీ కొద్దిరోజుల పాటే మళ్లీ యింకో చోట మార్పిళ్లు జరిగేదాకానే అని వీళ్లకు తెలుసు. కానీ వస్తూంటే కాదనడం దేనికి అని పుచ్చుకుంటున్నారు. భారతదేశంలోని వారందరూ స్వతహాగా హిందువులే అనీ, అందుచేత యీ మతాంతీకరణ 'ఘర్ వాపసీ' (ఇంటికి తిరిగిరావడం) అనీ హిందూత్వ వర్గాలు వాదిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా ముస్లిముల కంటె క్రైస్తవులు ఎక్కువగా పోరాడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవంలోకి మారిన హిందూ దళితులపై హిందూ సంస్థలు దృష్టి కేంద్రీకరించాయి. ఆదివారం నాడు చర్చి ప్రార్థనల తర్వాత బయటకు వస్తున్నవారిని గమనిస్తూ వారిలో దళిత, వెనుకబడిన వర్గాల వారి వద్దకు వెళుతున్నారు. కాస్సేపు మాట్లాడితే వాళ్లు తమ అసలు కులం ఏదో చెప్పేస్తున్నారు. ''మీకు మీ కులం మళ్లీ యిప్పించేస్తాం. మీ బంధువులందరితో కలిసిమెలసి వుండవచ్చు. ఎందుకిలా విడిగా వుండడం?'' అని బుజ్జగిస్తున్నారు. వాళ్లు సరేనంటే మతం మారుస్తున్నారు. ఈ ధోరణి మిషనరీలకు నచ్చటం లేదు.
క్రైస్తవ మిషనరీల చేతిలో చాలా విద్యాసంస్థలున్నాయి, సంఘటీకృతమైన వ్యవస్థ వుంది. గట్టిగా మాట్లాడగలిగేవారూ వున్నారు. మీడియాను ప్రభావితం చేయగలిగినవారూ వున్నారు. ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డా|| ఫ్రేజర్ పార్లమెంటు ఎన్నికల సమయంలో తన విద్యార్థుల నుద్దేశించి ఒక లేఖ రాసి యీ మెయిల్‌గా పంపాడు. కాలేజీ వెబ్సైట్లో పెట్టాడు. ఆ లేఖలో ''ఈ ఎన్నికలలో కార్పోరేట్ల పెట్టుబడి, మతతత్వ శక్తులు రెండూ కలిసి మన లౌకికవాద ప్రజాస్వామ్యానికి ముప్పు తేబోతున్నాయి. మీరు జాగ్రత్తగా వ్యవహరించండి.'' అని రాశాడు. ఇది మోదీకి వ్యతిరేకంగా వుద్దేశించినదని అందరికీ అర్థమవుతుంది. ''ఇలాటి రాజకీయపరమైన విషయాలు ప్రచారం చేయడం మీకు తగునా?'' అని అడిగితే ''ఒక తండ్రి తన పిల్లల్ని ఉద్దేశించి రాసినట్టుగా రాశాను. తప్పేముంది?'' అని వాదిస్తాడాయన. కేరళలోని సైరో-మలబార్ చర్చి ప్రతినిథి ఫాదర్ పాల్ తేలకాట్ యిటీవల మాట్లాడుతూ ''బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులందరూ భయపడుతున్నారు. వరల్డ్ హిందూ కాంగ్రెసు 2014లో వాళ్లు తీర్మానం చేశారు – ''హిందూత్వానికి శత్రువులు 5 ఎమ్‌లు – మెకాలేయిజం (బ్రిటిషు హయాంలో నేటి విద్యావ్యవస్థ ప్రవేశపెట్టినతను మెకాలే), మిషనరీలు (క్రైస్తవ మత సంస్థలు), మెటీరియలిజం (దేవుడి లేడని వాదించే భౌతికవాదం), మార్క్సిజం ('మతం మత్తుమందు లాటిది, ప్రజలు చైతన్యవంతులు కాకుండా పాలకులు మతం పేరు చెప్పి వారిని జోకొడతారు' అని బోధించే కమ్యూనిజం), ముస్లిములు'' అని. ఇప్పుడు అనేక క్రైస్తవ స్కూళ్లల్లో సరస్వతీ దేవి బొమ్మ పెడతారా లేదా అని విద్యార్థుల చేత, వారి తలిదండ్రుల చేత అడిగిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో విద్యార్థులు పట్టుబట్టారు. అంతే కాదు, యిన్నాళ్లదాకా పిలుస్తున్న 'రివరెండ్ ఫాదర్'కు బదులు 'ప్రాచార్యా' అని పిలుస్తామంటున్నారు.'' అన్నారు.
నవంబరు 30 న మోదీ క్రైస్తవ జనాభా అధికంగా వున్న నాగాలాండ్ వెళ్లినపుడు క్రైస్తవ నాయకులు మోదీని కలిసి ఆయన పాలన వచ్చాక దేశమంతా క్రైస్తవులపై దాడులు పెరిగాయని ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణల ప్రకారం – ఢిల్లీ, ఝార్ఖండ్‌లోని భిలాయ్, దుర్గ్, కర్ణాటకలోని ఉడుపి, చిత్రదుర్గ, కేరళలోని త్రిశూర్, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, మహాసముంద్, యుపిలోని జాన్పూర్, బులంద్‌శహర్, ఆలీగఢ్, తమిళనాడులోని కరూరు, మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలలో చర్చిలపై రాళ్లు వేయడం, ధ్వంసం చేయడం వంటి సంఘటనలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని దేవాస్, కట్నీ, ఇండోర్, భోపాల్, ఆలీపూర్, కర్ణాటకలోని చిత్రదుర్గ, కార్వార్, తమిళనాడులోని తిరునల్వేలి, ఛత్తీస్‌గఢ్‌లోని జశ్పూర్, బెంగాల్‌లోని మేదినీపూర్, బిహార్‌లోని పాట్నా, యుపిలోని ఫైజాబాద్‌లలో పాస్టర్లను పోలీసులు అరెస్టు చేయడమో, వేధించడమో చేశారు. ఆదివారం నాడు ఏదో ఒక చోట చేరి క్రైస్తవులందరూ పాటలు పాడడాలు, ప్రార్థనలు చేస్తూంటారు కదా. ఇటీవలి కాలంలో కొందరు వచ్చి అవి ఆపేయమని గట్టిగా చెప్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని చెదరగొడుతున్నారు. అన్ని రకాలవీ కలిపి మొత్తం 71 సంఘటనలు. బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారంటూ మధ్యప్రదేశ్‌లో గత మూడు నెలల్లో 500 కేసులు బుక్ చేశారు. 1998లో వాజపేయి ప్రధానమంత్రిగా వుండగా ఒడిశాలో గ్రహామ్ స్టెయిన్స్ అనే క్రైస్తవ మిషనరీని సజీవదహనం చేశారు. మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తాయన్న భయం వేస్తోంది అన్నారు నాగాలాండ్ క్రైస్తవులు. ఇలా ఫిర్యాదు చేసినవారికి బుద్ధి చెప్పడానికా అన్నట్లు మర్నాడే ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో సెయింట్ సెబాస్టియన్ చర్చ్‌లోని బలిపీఠం దగ్ధం చేశారు కొందరు. దాంతో వేలాది క్రైస్తవులు ఢిల్లీ పోలీసు హెడ్‌క్వార్టర్స్ వద్ద ఘొరావ్ నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా పాటించే డిసెంబరు 25ను 'సుపరిపాలనా దినం'గా ప్రకటించి ఆ రోజు ఆ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని స్మృతి ఇరానీ ఆదేశాలు జారీ చేశారు. అంటే కావాలని అవేళ స్కూళ్లు తెరిపిస్తున్నారన్నమాట అని అందరూ విరుచుకుపడ్డారు. అబ్బే లేదు, వారు స్కూళ్లకు వచ్చే రాయనక్కరలేదు అంటూ ఇరానీ సవరించుకున్నారు. ఏది ఏమైనా భారతీయులకు సంబంధించి యీ డిసెంబరు 25 ను క్రైస్తు జన్మదినంగా కాక వాజపేయి, మాలవ్యాల జన్మదినంగా గుర్తుంచుకునేట్లు చేసింది బిజెపి ప్రభుత్వం. ఇవన్నీ క్రైస్తవులను బాధిస్తున్నాయి. ''విద్య, వైద్యం పేరు చెప్పి మేం కనబడిన వాళ్లందరినీ మా మతంలోకి లాక్కుంటాం అని తెగ ప్రచారం సాగుతుంది. భారతదేశంలో 2000 ఏళ్లగా క్రైస్తవం వుంది. అయినా జనాభాలో క్రైస్తవులు 2.3% మంది మాత్రమే వున్నారని గమనించండి.'' అంటున్నారు వాళ్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 80.5%, ముస్లిములు 13.4%, క్రైస్తవులు 2.3%, శిఖ్కులు 1.9% మంది వున్నారు. క్రైస్తవుల్లో విద్యావంతులు 80% కాగా, శిఖ్కుల్లో 69%, హిందువుల్లో 65%, ముస్లిములలో 59%. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది దళితులు క్రైస్తవంలో మారినా రిజర్వేషన్లు పోతాయన్న భయంతో తమను తాము హిందువులుగానే పేర్కొంటారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు దళితక్రైస్తవులను దళితులుగా పరిగణిస్తామని చెప్తున్నా దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదు. క్రైస్తవులకు, దళిత ముస్లిములకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేస్తారా అని యిటీవల రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అలాటి ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇప్పుడు హిందూమతంలోకి జరుగుతున్న మతమార్పిడుల గురించి విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తే 'అయితే మతమార్పిడుల నిషేధ చట్టం అమలు చేద్దామంటారా?' అని అడుగుతోంది బిజెపి. సరేనంటే ముస్లిము, క్రైస్తవవర్గాలు చిక్కుల్లో పడతాయని విపక్షాల భయం. ఇప్పటికే ఆ చట్టం కొన్ని రాష్ట్రాలలో దుర్వినియోగం అవుతోంది. ఆట్టే మాట్లాడితే అక్కడ కూడా చట్టరూపం ధరించలేదు. అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేశారంతే. కోర్టుల్లో వాటిని సవాలు చేశారు కాబట్టి గవర్నరు ఆమోదముద్ర పడలేదు. అందుచేత యింకా చట్టంగా పరిగణించలేం. అయినా అది పెట్టుకుని అనేకమంది పాస్టర్లపై కేసులు బుక్ చేయడం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో ఆ 'చట్టం' క్రింద గత 8 ఏళ్లల్లో 700 ఫిర్యాదులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత 270 కేసులు నిలిచాయి. పోలీసులు కేసులు రిజిస్టరు చేసి వందకుపైగా పాస్టర్లను అరెస్టు చేసి జైల్లో పెట్టారు, వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. 40 మందిపై పెట్టిన కేసులను కోర్టు కొట్టేసింది. 2003లో గుజరాత్ ప్రభుత్వం 'ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్' చేసింది. దాని ప్రకారం ఎవరైనా మతం మార్చుకోదలచుకుంటే జిల్లా కలక్టర్ అనుమతి పొందాలి! ఆ చట్టం యొక్క నియమనిబంధనలు రూపొందించడానికి ఐదేళ్లు పట్టింది! అవి తయారయ్యేసరికి దాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. కోర్టు ప్రభుత్వానికి నోటీసు పంపింది. పంపి ఆరేళ్లయినా గుజరాత్ ప్రభుత్వం యిప్పటిదాకా దానికి సమాధానం పంపలేదట. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్'కి 2006లో చేస్తే గవర్నరు ఆమోదించలేదు. దాన్ని భారత దేశాధ్యకక్షుడికి పంపితే ఆయన సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరారు. అది పెండింగులో వుండగానే 2013 జులైలో మధ్యప్రదేశ్ ఎసెంబ్లీ అదే సవరణ చేసి ఎలాటి చర్చ లేకుండా ఆమోదించింది.
తన ప్రభుత్వం యిలాటి మతపరమైన అంశాలతో వివాదాల్లో చిక్కుకోవాలని మోదీ కోరుకోవడం లేదని కొందరంటారు. విదేశాలతో వ్యాపారబంధాలను పెంచుకోవాలని, వారికి అనుగుణంగా చట్టాలు మార్చి పెట్టుబడులను ఆకర్షించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని పాశ్చాత్యదేశాలు గుర్తించాయి. కానీ అవన్నీ క్రైస్తవ దేశాలే. భారతదేశంలో మతపరమైన వివక్షత సాగుతోందనే ప్రచారం వారికి యిబ్బంది కలిగిస్తుంది. ఆ యా దేశాల్లో చర్చిలు కూడా చాలా బలమైనవి, స్థానిక రాజకీయాలను ప్రభావితం చేయగలిగినవి. అంతేకాకుండా సామ్రాజ్యవాద దృక్పథంతో వున్న అగ్రరాజ్యాలకు మతమార్పిళ్లపై యిలాటి ఎదురుదాడి రుచించదు. మతానికి, రాజ్యవిస్తరణకు ఏమిటి సంబంధం అనే ప్రశ్నకు మాజీ డిజిపి అరవిందరావుగారు జనవరి 2 నాటి ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో సమాధానం దొరుకుతుంది. ఆయన ప్రతి శుక్రవారం ఆ పేపర్లో ''భారతీయం'' అనే పేర ఆధ్యాత్మికపరమైన, మతపరమైన అంశాలపై చక్కటి, హేతుబద్ధమైన వ్యాసాలు రాస్తారు. ఆయన వ్యాసం సారాంశాన్ని రాస్తున్నాను. పూర్తి పాఠం కావాలంటే వ్యాసం చదవాల్సిందే! – ''10 వ శతాబ్దిలో పాశ్చాత్య సంస్కృతికి, అరబిక్ దేశాల సంస్కృతికి మధ్య క్రూసేడ్స్ పేర జరిగిన పోరాటం యిప్పుడు కొత్తరూపంలో పునరావృతం అవుతోంది.
ప్రపంచంలో అత్యధికులు క్రైస్తవులు, తర్వాతి స్థానంలో ముస్లిములు, ఆ తర్వాత బౌద్ధులు, నాలుగో స్థానంలో హిందువులు. పూర్వకాలపు వలసవాదం కారణంగా, ప్రపంచీకరణ కారణంగా ఇస్లాం మతస్తులు యూరోప్, అమెరికా దేశాల్లో విస్తరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో కుటుంబవిలువలు, మతవిశ్వాసాలు క్షీణించి క్రైస్తవులు సంఘటితంగా లేరు. ముస్లిములు ఆ విషయాలంలో బలంగా వున్నారు. కొందరు క్రైస్తవులు ఇస్లాంలోకి మారుతున్నారు కూడా. అందువలన రాబోయే 25 ఏళ్లల్లో ముస్లిములు యూరోప్‌లో మెజారిటీగా వుండబోతారని ఒక అంచనా. అది తలచుకుని పాశ్చాత్యదేశాల్లోని క్రైస్తవులు ఇస్లాం వ్యాప్తి పట్ల, మతమార్పిడుల పట్ల ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇస్లాం దేశాలను అంతర్యుద్ధాలతో, మారణకాండలతో బలహీన పర్చడానికి, భారత్‌లో తమ సంఖ్య పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇది గమనించిన చైనా మతమార్పిడిని వ్యతిరేకిస్తోంది.
'ఒక దేశం మరొక దేశాన్ని వశపరచుకోవడానికి దాడి చేయడం ఓ పద్ధతి. ఆ దేశపు అంతర్గత వ్యవస్థను, దేశ సంస్కృతిని బలహీనపరచి, తమ సంస్కృతిని, మతాన్ని వ్యాపింపచేసి, ఆ తర్వాత తమ మతస్తుల భద్రతకు ముప్పు వచ్చిందని గగ్గోలు పెట్టి, తమ అనుయాయులకు అధికారంలో భాగస్వామ్యం దక్కేట్లు చేసి తమ కనుకూలమైన తోలుబొమ్మ ప్రభుత్వాలను కూర్చోబెట్టడం మరో పద్ధతి. ఆఫ్రికా, ఆసియాలోని అనేక చిన్నదేశాలపై పాశ్చాత్యదేశాలు యీ తరహాలో పెత్తనం సంపాదించుకున్న వైనం గమనిస్తూనే వున్నాం. భారతదేశం చూడ్డానికి పెద్దదే అయినా మన వ్యవస్థ బలహీనమైనది. హిందూమతంలో ఎలాటి సంస్థాగత నిర్మాణమూ లేదు. ఇతర మతస్తులను తన అనుయాయులుగా మార్చమని ఏ హిందూ దేవుడూ ఆజ్ఞ యివ్వలేదు. హిందువుల్లో ఉదారవాదం వ్యాపించి, యితరుల వ్యూహాల్ని తెలుసుకోలేకపోవడం జరుగుతోంది. ఆధునిక యుగంలో ఎవరూ చూడని దేవుడు, స్వర్గం-నరకం వంటి విషయాలపై మాదే సరైన వాదం అంటూ దాన్ని విస్తరించేవాళ్ల ఉద్దేశాలు కేవలం మతవిశ్వాసమే అనడానికి వీల్లేదు. సామ్రాజ్యవాదం ప్రస్ఫుటంగా కనబడుతుంది…''
ఇదీ అరవిందరావుగారు అనేక గ్రంథాల నుంచి సమాచారం సేకరించి, సోదాహరణంగా రాసిన వ్యాసంలోని ముఖ్యాంశం. యూరోప్‌లో, అమెరికాలో ఇస్లాం వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది. 'వీళ్లు వచ్చి జనాభా పెంచేసుకుని, మనను, మన మతాన్ని మైనారిటీలుగా చేసేస్తున్నారు. మన ఉద్యోగాలు కాజేస్తున్నారు' అనే భావం తెల్లవారు బాహాటంగా ప్రకటిస్తున్నారు. వారే యితర దేశాల్లోకి చొచ్చుకుపోయి విస్తరించాలి తప్ప రివర్స్ గేర్‌లో వారిపై ఒత్తిడి పడితే భరించలేరు. గతంలో లాగ మన దేశాలలో వారి జండా ఎగరనక్కరలేదు. వారి దేశపు కంపెనీలకు మన దేశసంపదను కట్టబెట్టేస్తే చాలు. వారి యుద్ధస్థావరాలకు చోటిస్తే చాలు. అలాటి వ్యూహాలు రచిస్తూ భారత్‌ను టార్గెట్ చేస్తున్న పాశ్చాత్య దేశాలకు భారత్‌లో యిప్పుడు జరుగుతున్న రివర్స్ మతమార్పిడులు మింగుడుపడవు. వారి దేశపు చర్చిలు ప్రస్తుత భారత ప్రభుత్వానికి క్రైస్తవవ్యతిరేక ముద్ర కొట్టి వారితో సంబంధబాంధవ్యాలు పెంచుకోకూడదని ఒత్తిడి చేస్తే వారు వెనకంజ వేయవచ్చు. అది మోదీ ఆర్థికవిధానాలకు దెబ్బే. అందువలన యీ హిందూత్వ శక్తులు అదుపులో వుంటే బాగుంటుందని మోదీ ఆలోచనట. గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా రోడ్డుకి అడ్డంగా వున్న మసీదులతో బాటు అంతకంటె ఎక్కువ సంఖ్యలో వున్న దేవాలయాలను తొలగించిన వ్యక్తి మోదీ. ఆరెస్సెస్ తనకు వ్యతిరేకంగా పోరాడినా ఖాతరు చేయలేదు. ప్రధాని పదవికై ఆశించినప్పుడు మాత్రమే అతను ఆరెస్సెస్‌తో రాజీ పడ్డాడు. ప్రస్తుతం ఏదో రకంగా ఆర్థికాభివృద్ధి చేసి జనాలను ఆకట్టుకోవాలని అతని తాపత్రయం. కానీ ఆరెస్సెస్ నాయకత్వంలోని హిందూత్వ శక్తులకు అదేమీ పట్టదు. 'ఇప్పుడున్నది మన ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాలపై ఆధారపడవలసిన అవసరం లేని తరుణం. మన తడాఖా యిప్పుడు చూపించకపోతే యింకెప్పుడు చూపిస్తాం?' అనే వూపులో వున్నారు. చివరకు యిది ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)