ఎమ్బీయస్‌ : మావోయిస్టు మేధావి

ఢిల్లీలోని రామ్‌లాల్‌ ఆనంద్‌ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా వున్న జి.ఎన్‌. సాయిబాబా అనే తెలుగు మావోయిస్టు సానుభూతిపరుణ్ని అరెస్టు చేయగానే మేధావివర్గం యథావిధిగా గగ్గోలు పెట్టింది. సాయిబాబాగారు ఉన్నత విద్యావంతుడు కావడం మాత్రమే కాదు,…

ఢిల్లీలోని రామ్‌లాల్‌ ఆనంద్‌ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా వున్న జి.ఎన్‌. సాయిబాబా అనే తెలుగు మావోయిస్టు సానుభూతిపరుణ్ని అరెస్టు చేయగానే మేధావివర్గం యథావిధిగా గగ్గోలు పెట్టింది. సాయిబాబాగారు ఉన్నత విద్యావంతుడు కావడం మాత్రమే కాదు, చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి కోర్టుకి తీసుకెళుతున్న ఫోటో పేపర్లో రావడంతో డబుల్‌ సింపతీ లభించింది. మేధావి కావడం, స్వతంత్ర భావాలు కలిగి వుండడం యీ దేశంలో నేరమా? అని కొందరు ప్రశ్నించారు. ప్రజాహక్కుల ఉద్యమాల పేరుతో, లెఫ్టిస్టు మేధావిని అని చెప్పుకుంటూ మావోయిస్టులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ, మావోయిస్టులు ప్రజలపై చేసే దుశ్చర్యల పట్ల మౌనం వహిస్తూ తిరిగే మహానుభావులు మన తెలుగునాట ఎందరో వున్నారు. మావోయిస్టులకు తుపాకులు, బాంబులు హార్డ్‌వేర్‌ అయితే,  సభ్యసమాజంలో మర్యాదస్తులుగా మెలగుతూ, తమకు అనుకూల ప్రచారం చేస్తూ, తమ సభ్యుల మధ్య, సంస్థల మధ్య సమన్వయం చేస్తూ, ప్రభుత్వానికి తమకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించే తిరిగే యిలాటివారు సాఫ్ట్‌వేర్‌. ఒకే నాణానికి రెండు పార్శ్వాలుగా వారూ, వీరూ వుంటారు. అయితే యీ సాయిబాబా అటువంటి వారా, లేక అమాయకుడా అన్న సందేహం అరెస్టు వార్త చదవగానే మనలో కలిగింది. ఖోబడ్‌ గాంధీ, వినాయక్‌ సేన్‌.. యిలా అనేకమంది విషయంలో యిలాటి అనుమానాలు రేకెత్తించింది మీడియా. ఇంతకీ సాయిబాబా సంగతేమిటి?

మావోయిస్టు సానుభూతిపరులైన హేమ్‌ మిశ్రా, ప్రశాంత్‌ రాహీలను పోలీసులు విచారిస్తూ వుంటే వాళ్లు సాయిబాబా పేరు చెప్పారు. 'మావోయిస్టులకు ఏమైనా చెప్పాలంటే మేం ఢిల్లీలోని సాయిబాబాకు చెప్తాం, వారి నుండి ఆదేశాలు ఏమైనా వచ్చినా యీయనే మాకు చెప్తారు.' అని. ఇక డిసెంబరు నుండి యీయనపై నిఘా మొదలైంది. ఇలాటివారందరికీ బయటకు కనబడేందుకు సంస్థలుంటాయి కదా. రివల్యూషనరీ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (వీళ్లెవరికీ ప్రజాస్వామ్యం అంటే నమ్మకం వుండదు, అయినా తమ సంస్థల పేర్లలో డెమోక్రాటిక్‌ అని చేర్చకుండా మానరు) అని 2005లో ఒక సంస్థ స్థాపించి ప్రజలకోసం పనిచేసే (మావోయిస్టు భావాలతో…అని చేర్చుకోవాలి) అనేక సామాజిక, సాంస్కృతిక సంస్థల ఫెడరేషన్‌గా దాన్ని రూపొందిచారీయన. 

'లేవండి, ప్రతిఘటించండి, విముక్తి చేయండి' అని వారి నినాదం. దానికి యీయన జాయింట్‌ సెక్రటరీగా వున్నాడు. ఈయన వ్యవహారాలు నిఘా వేసి చూశాక మే 9 న ఇంట్లో సోదా చేయగా మావోయిస్టు డాక్యుమెంట్లు వున్న మూడు హార్డ్‌ డిస్కులు దొరికాయి. నక్సలైటు సానుభూతిపరుడు కాదు, ఏకంగా నక్సలైటే అని పోలీసులకు తోచింది. అరెస్టు చేశారు. ఆయన అమాయకుడు అని మేధావివర్గం విరుచుకుపడ్డారు. ఇది జరిగిన రెండు రోజులు తిరక్కుండా నక్సలైట్లు ప్రతీకార చర్యగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లాండ్‌మైన్‌ పెట్టి 7గురు పోలీసులను చంపివేశారు. వారు యాంటీ-నక్సల్‌ విభాగానికి చెందినవారు. ప్రత్యేకంగా శిక్షణ పొందినవారు. దీన్ని బట్టే తెలుస్తోంది – మావోయిస్టులకు, సాయిబాబాకు గల బంధం ఎంత గట్టిదో! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]