ఎమ్బీయస్‌: మేలుకో, లోకేశ్‌!

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెరాస, మజ్లిస్‌ గెలుస్తాయని మొదటినుంచీ అంటూనే వున్నారు కానీ తెరాసకు అనుకున్న దాని కంటె 20-30 సీట్లు ఎక్కువ వచ్చాయి. 100 సీట్లు గెలుస్తామన్న మాట అబద్ధం చేయడానికా…

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెరాస, మజ్లిస్‌ గెలుస్తాయని మొదటినుంచీ అంటూనే వున్నారు కానీ తెరాసకు అనుకున్న దాని కంటె 20-30 సీట్లు ఎక్కువ వచ్చాయి. 100 సీట్లు గెలుస్తామన్న మాట అబద్ధం చేయడానికా అన్నట్లు సరిగ్గా 99 దగ్గర ఆగిపోయాయి. ఇది నిశ్చయంగా ఘనవిజయం. ఈ విజయం తెరాసలో ఎలాటి మార్పు తెస్తుందో వేచి చూడాలి. ప్రతిపక్షాలు కుప్పకూలడం వలననే తెరాస యింత గొప్పగా గెలిచిందన్నది నిర్వివాదాంశం. ప్రతిపక్షాల్లో అన్నిటి కంటె ఘోరంగా దెబ్బ తిన్నది గతంలో 45, యిప్పుడు 1 గెలిచిన టిడిపి! గ్రేటర్‌ ఎన్నికలలో టిడిపికి సారథ్యం వహించిన లోకేశ్‌ యీ విషయాన్ని గుర్తించి, మరమ్మత్తు చర్యలు చేపట్టాలి. 

ముందుగా ఫలితాలను గణాంకాల ద్వారా విశ్లేషించి చూస్తే, వచ్చిన మార్పేమిటో స్పష్టమైన చిత్రం గోచరిస్తుంది. 2009 గ్రేటర్‌ ఫలితాలతో పోల్చిచూడడంలో అర్థం లేదు. అప్పటికి తెరాస యిక్కడ ఒక శక్తి కాదు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత గ్రేటర్‌ పరిధిలో జరిగిన 2014 ఎసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దగ్గర పెట్టుకుని అప్పటికి, యిప్పటికి వచ్చిన మార్పు ఏమిటి, ఎందుకు అన్నదే చూడాలి. శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం 81.43 లక్షలు కాగా, యీ సారి గ్రేటర్‌లో ఓట్లు 74.23 లక్షలు. అప్పుడు 52% పోలింగు అయితే, యిప్పుడు 45% అయింది.  మామూలుగా నగరాల్లో పోలింగు తక్కువే జరుగుతుంది. హైదరాబాదు నగరవాసుల మనోభీష్టం గురించి తెలుసుకోకుండానే విభజన జరిగిపోయింది. ఎవరికి ఓటేయాలో తెలియక, అన్ని పార్టీలపై ఆగ్రహంతో వున్నపుడే 52% పోలింగు జరిగింది. ఇప్పుడు ఆ నిరాసక్తత మరీ పెరిగి 45%తో ఆగిపోయింది. అంటే రాజకీయాలపై ఆసక్తి బాగా వుండి, ఏదో ఒక పార్టీకి విధేయులై వున్నవారు మాత్రమే ఓటేశారు అనుకుంటే యీ అంకెలు పార్టీ యంత్రాంగ పటిష్టతకు సూచికలుగా అనుకోవాలి. 

ఆ విధంగా చూస్తే తెరాస తన ఓటింగు శాతాన్ని అమాంతంగా 25.5% పెంచుకుంది. ఓటర్ల సంఖ్యలో చూస్తే 6.87 లక్షల మంది అదనంగా దానికి వేశారు. గతంతో పోలిస్తే 9.09 లక్షల మంది ఓటర్లు తగ్గారని గుర్తు పెట్టుకుంటే యిది ఎంత విశేషమో అర్థమవుతుంది. పైగా 48 డివిజన్లలో 50% కంటె ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది! దీనికి చాలా కారణాలే చెప్తున్నారు. నిజానికి తెరాస వచ్చిన తర్వాత నగరానికి జరిగిన మేలంటూ ఏమీ కనబడలేదు. తెరాస ఎడాపెడా వాగ్దానాలు చేస్తూ పోవడం తప్ప మెట్రో రూటు మారుస్తామంటూ అనవసరంగా ఆలస్యం చేశారు. టూ బెడ్‌రూమ్‌ పథకానికి పేదలు ఆకర్షితులయ్యారంటున్నారు. దాన్ని ఎలా నమ్మారు? ఋణమాఫీ విషయంలో కెసియార్‌ చేసిన వాగ్దానం పూర్తి కాలేదు. ఇంకా ఋణాలున్నాయి, వడ్డీలు పెరుగుతున్నాయి, కొత్త ఋణాల జారీకి యిబ్బందిగా వుంది. బాబు లక్షన్నర పరిమితి పెట్టి అమల్లో చాలామందికి రకరకాల కారణాలు చెప్పి ఎగ్గొట్టారు. తెలంగాణలో అలాటి యిబ్బంది లేకపోయింది. అందుకని నమ్మారేమో తెలియదు. డివిజన్ల పునర్విభజన చేయడం, సర్వశక్తులూ మోహరించడం, విపరీతంగా ప్రచారం చేయడం, టిడిపి, కాంగ్రెసు నాయకులను తన పార్టీలోకి గుంజుకుని వాళ్లకు నాయకులు లేకుండా చేయడం, యితర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని ఆకర్షించే హామీలు గుప్పించడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి కొడుకును వుపయోగించడం.. యిలా తెరాస ఎన్నో మార్గాలు అవలంబించింది. లిచిన మాట వాస్తవం. 

ఇక తక్కిన పార్టీలన్నీ ఓట్లు పోగొట్టుకున్నాయి. టిడిపి-బిజెపి కూటమికి గతంలో కంటె 11% తగ్గాయి, అంకెల్లో చెప్పాలంటే 6.80 లక్షల మంది తగ్గారు. కాంగ్రెసుకు తగ్గినది 4%, అంకెల్లో 2.72 లక్షలు. మజ్లిస్‌కు 11% తగ్గారు, అంకెల్లో 6 లక్షలు. ఇతర పార్టీలు, స్వతంత్రులకు గతంలో ఎన్ని వచ్చాయో యిప్పుడూ యించుమించు అన్నే వచ్చాయి. ఈ విధంగా చూస్తే టిడిపి-బిజెపి కూటమే భారీగా నష్టపోయింది. మజ్లిస్‌కు కూడా ఓటర్లు తగ్గినా, సీట్లు తగ్గలేదు. కాంగ్రెసు అంతఃకలహాల్లో మునిగిపోయింది. నాయకులెవరికీ ఉత్సాహం లేదు. ఢిల్లీ నాయకత్వానికి ముందే హుషారు లేదు. ఇక్కడ నెగ్గినా, నెగ్గకపోయినా ఒకటే అన్నట్టున్నారు. అందువలన 2 సీట్లు వచ్చాయి. 3%, అంకెల్లో 2.70 లక్షల ఓట్లు తగ్గాయనుకోవచ్చు. కానీ బిజెపి, టిడిపి పరిస్థితి అది కాదు. బిజెపి తెలంగాణ పోరాటంలో ముందు వుంది. కిషన్‌ రెడ్డి యీ మధ్య చప్పబడ్డారు కానీ లేకపోతే ఆ మధ్య కెసియార్‌ తప్పులు ఎండగడుతూ చురుగ్గా వున్నారు. వాళ్లకు క్యాడర్‌ కూడా వుంది కానీ యించుమించు అదీ 3% ఓట్లు పోగొట్టుకుంది. సంఖ్యాపరంగా 2.20 లక్షల ఓట్లు తగ్గాయి. 66 డివిజన్లలో పోటీ చేసి కేవలం 4 నెగ్గింది. 34 డివిజన్లలో 300 ఓట్ల తేడాతో ఓడిపోయాం అని కిషన్‌ రెడ్డి చెప్పుకున్నారు కానీ అలాటి సందర్భాలు యితరులకూ వుంటాయి. టిడిపితో చేతులు కలిపి నష్టపోయాం అనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికలలో నగరమే వాళ్ల పరువు కాచింది. టిడిపితో పొత్తు వుంది కాబట్టే టిడిపి ఓట్లు బదిలీ అయి నగరంలోని 24 ఎసెంబ్లీ సెగ్మంట్లలో బిజెపికి 5 వచ్చాయి. ఇప్పుడు అన్ని డివిజన్లు కూడా రాలేదు. అన్నిటికన్న బాధాకరమేమిటంటే వాళ్ల ఆజన్మవిరోధి మజ్లిస్‌ తెరాస ప్రభంజనంలో కూడా తన స్థానాలు నిలబెట్టుకుంది.

ఇక టిడిపికి సుమారుగా 5 లక్షల ఓట్లు తగ్గాయి. శాతం ప్రకారం చూస్తే సుమారు 8%! ఇది చాలా ఎక్కువ. టిడిపి ఓట్లు తెరాసకు పడ్డాయనే ప్రచారం సాగుతోంది. అది కచ్చితంగా చెప్పగలిగిన విషయం కాదు. తెరాసకు అదనంగా వచ్చిన 6.87 లక్షల ఓటర్లు అన్ని పార్టీల నుంచి వచ్చి వుండవచ్చు. ముఖ్యంగా గతంలో టిడిపికి వున్న 45 మంది కార్పోరేటర్లలో 30-35 మందిని తెరాస చేర్చుకుని వారికి టిక్కెట్లు యిచ్చింది. వాళ్లు గెలిచారు. వాళ్ల ఓట్లన్నీ టిడిపికి తగ్గి తెరాస ఖాతాలో పడి వుండవచ్చు. అది కాకుండా టిడిపికి దన్నుగా నిలబడిన మధ్యతరగతి వర్గాలు, ఆంధ్రమూలాలున్నవారు యిల్లు కదిలి వుండకపోవచ్చు. వారిలో కొందరు టిడిపిపై కోపంతో తెరాసకు వేసీ వుండవచ్చు. నిరాసక్తత చూపినవారి కారణాల గురించి ఆలోచిస్తే – ఉమ్మడి రాజధానిలో పదేళ్ల పాటు వుండి ఆంధ్ర, తెలంగాణలను రెండు కళ్లగా చూసుకుంటానన్న చంద్రబాబు తమను వదిలే పెట్టేసి తన బాగు చూసుకున్నారని నిరాశ పడి వుండవచ్చు. బాబు ఆలోచనాధోరణిలో సడన్‌గా వచ్చిన మార్పుకి రేవంత్‌ రెడ్డి నోటు-ఓటు వ్యవహారానికి లింకు వుందన్న సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ వుంటే తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యే అవకాశం వుందని, తెలంగాణ పోలీసులు తమను సతాయించగలరని బాబు భయపడడం చేతనే రాష్ట్రం నడిబొడ్డునుండి పాలన మొదలెట్టేస్తాం అనే పాట అందుకున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినపుడే రాష్ట్రం నుంచి పాలిస్తే మంచిదనే ఆలోచన రావాలిగా. కానీ అప్పుడంతా పదేళ్లదాకా మనకి హక్కు వుంది, ఎందుకు వదులుకోవాలి అని వాదించేవారు. సెక్రటేరియట్‌ను చీల్చారు. తన ఛాంబర్‌కు వాస్తుమార్పులు చేయించారు. అలాటిది ఎప్పుడైతే కెసియార్‌ ఆ కేసులో యిరికించారో, భయపడిపోయారు. రాజీ పడ్డారు. ఆ రాజీ కూడా సమానస్థాయిలో జరిగినట్లు లేదు. కెసియార్‌ తన ప్రసంగాల్లో బాబును యీసడించారు. తన రాజధానికి ఏమీ తెచ్చుకోలేక పోయాడు కానీ హైదరాబాదుకి ఏం తెస్తాడు? 13 జిల్లాలున్నాయి, పోయి అక్కడ ఊడ్చుకోమను అని తీసిపారేశాడు. అయినా బాబు తన ప్రసంగంలో కెసియార్‌ను పన్నెత్తి మాట్లాడలేదు. జగన్‌ కూడా కెసియార్‌ను ఏమీ అనకపోవడం చేతనే ఆంధ్రులలో, తెలంగాణలోని ఆంధ్రమూలాల వారిలో గౌరవం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు బాబుకు అదే గతి పడుతోంది. కెసియార్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయిపోయిన బాబు తమనేం రక్షిస్తారనే ఆలోచన ఆంధ్రమూలాల వారిలో కలగడంలో ఆశ్చర్యం ఏముంది? అందువలన ఉన్న కొమ్మనే గట్టిగా పట్టుకోవాలనే భావనతో కొందరు తెరాసకు వేసి వుండవచ్చు. మరి కొందరు ఎవరికీ వేయకుండా వూరుకునీ వుండవచ్చు. 

నిజానికి 2014 అసెంబ్లీ ఎన్నికల సమయానికి టిడిపి ఓటర్లు అత్యుత్సాహంతో వున్నారు. హైదరాబాదులో వున్న ఆంధ్రమూలాల వారు చాలామందికి ఆంధ్రలో కూడా ఓట్లున్నాయి. బాబు పార్టీ అంటే అభిమానం వున్న అనేక కంపెనీల వారు తమ ఉద్యోగులకు సెలవులు, వాహనాలు యిచ్చి ఆంధ్ర పంపి టిడిపికి ఓట్లేయించారు. వారిలో కొంతమంది యిక్కడి ఓటు దాచుకుని అక్కడే వేసినా, మరి కొందరు అక్కడా యిక్కడా కూడా వేశారు. ఆంధ్రలో బాబు ఎలాగూ వస్తారు, హైదరాబాదులో కూడా వుండి, మనల్ని రక్షిస్తారు అనే నమ్మకంతోనే వారీ పని చేశారు. ఆంధ్రలో టిడిపిని గెలిపించడానికి గల కారణాల్లో ముఖ్యమైనది వ్యవసాయ ఋణమాఫీ! అన్ని రకాల ఋణాలు మాఫ్‌ చేస్తారనే అభిప్రాయం కలిగించారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి లక్ష నిబంధనలు పెట్టి, రాష్ట్రానికి బయట వున్న వారికి ఆ బెనిఫిట్‌ అందకుండా పోయింది. ఇది ఎదురుచూడని దెబ్బ కాబట్టి బాబుపై ప్రేమ తగ్గిపోయింది. ఉద్యోగుల విషయానికి వస్తే పదేళ్ల ఉమ్మడి రాజధాని క్లాజ్‌ కారణంగా తాము యిప్పట్లో కదలనక్కరలేదని, రాజధాని తయారీ పదేళ్లు కాదు కదా పదిహేనేళ్లయినా పట్టవచ్చని, ఆ పాటికి తాము రిటైరు కావడమో, లేక కెరియర్‌ చివర్లో వుండడమో జరుగుతుందని, హైదరాబాదు వదిలే సందర్భమే రాదనీ ఆంధ్రమూలాల ఉద్యోగులు అనుకున్నారు. తీరా చూస్తే బాబు యిప్పుడే తరలి రావాలంటున్నారు. ఉద్యోగులెవరికీ తరలి వెళ్లడం యిష్టం లేదని అందరికీ తెలిసిన విషయమే. ఇళ్ల అద్దెలు ఎక్కువని, సౌకర్యాలు లేవనీ ఏదో ఒకటి చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఉద్యోగస్తులు, వారి కుటుంబాలవారు టిడిపికి వ్యతిరేకంగా ఓటేసి వుండవచ్చు, లేదా పోలింగు బూతుకే వెళ్లి వుండకపోవచ్చు. 

జంటనగరాలలో రాయలసీమ నుండి వచ్చి స్థిరపడినవారెందరో వున్నారు. ప్రస్తుతం రాయలసీమవారికి బాబుపై ఆగ్రహం వుండడంలో ఆశ్చర్యం ఏముంది? వారికి రాజధాని లేదు సరి కదా హైకోర్టయినా ఎలాట్‌ చేయలేదు. కర్నూలు, కడప జిల్లాల్లో ఏమైనా పెట్టాలన్న సూచన రాగానే అక్కడ శాంతిభద్రతలు సరిగ్గా వుండవు అంటూ ముఖ్యమంత్రే తోసిపారేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమకారులు 'హైదరాబాదు ఒకప్పుడు ప్రశాంతంగా వుండేది,  వైయస్‌ హయాంలో రాయలసీమ రౌడీలు తెల్లలుంగీలు కట్టుకుని వచ్చి హైదరాబాదులో కబ్జాలు చేసేసి, భయభ్రాంతుల్ని చేశారు' అంటూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు రాయలసీమకు చెందిన బాబు, ఆయన సహచరులు అలాటి ప్రచారం చేస్తున్నారు. కోస్తాజిల్లాలవారు శాంతికాముకులు, రాయలసీమవారు రక్తపిపాసులు అనే కలర్‌ యిస్తున్నారు. ఎన్నికల సమయంలో టిడిపి 'రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని, బాంబుల సంస్కృతిని వైజాగ్‌కు దిగుమతి చేస్తున్నారు. విజయమ్మను ఓడించకపోతే యిది మిగతా జిల్లాలకు కూడా పాకుతుంది. ఇది శాంతి సీమ, యిక్కడ యిలాటి అరాచకం సహించం' అంటూ ప్రచారం చేసింది. ఎన్నికల తర్వాత కూడా అలాటి ప్రచారాన్ని తగ్గించలేదు. రాయలసీమలో మూలాలున్న నగరవాసులకు యిది రుచిస్తుందా? వారు టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేసి వుండకపోయినా అనుకూలంగా వేసి వుండకపోవచ్చు.

అబ్బే అలాటిదేమీ లేదు, జగన్‌ను నిలవరించడానికి అక్కడ ఏం అన్నా, యిక్కడ మాత్రం మీకు రక్షణగా నిలుస్తాం అంటూ వారి దగ్గరకు వెళ్లి నచ్చచెప్పే నాయకుడెవరూ టిడిపిలో కాన రాలేదు. టిడిపి నాయకులందరూ తెరాసలోకి దూకేశారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని చెప్పుకుంటున్న బాబు, ఆయన ప్రతినిథిగా యిక్కడే వున్న లోకేశ్‌, తెలంగాణకు అనుకూలంగా లేఖ యిచ్చి తీరాలని పట్టుబట్టి సాధించిన ఎర్రబెల్లి యిత్యాది నాయకులు ఎవరూ నాయకుల వలసను అడ్డుకోలేక పోయారు. టిడిపి చాలాకాలంగా యువతను పట్టించుకోవడం మానేసింది. ఎన్టీయార్‌ తరహాలో యువతను ఆకట్టుకుని టిక్కెట్లు యిచ్చి వుంటే వారైనా పార్టీతో నిలిచేవారేమో. యువకులకు భవిష్యత్తుపై నమ్మకం వుండి ఒకే పార్టీలో కొనసాగుతారు. కానీ 50 ఏళ్ల పడిలో పడిన నాయకులెవరూ అధికారం లేకపోతే విలవిలలాడిపోతారు. ఫిరాయించడానికి అవకాశాల కోసం వెతుకుతారు. ఎన్టీయార్‌ కాలంలో చేరిన యువకులే తప్ప బాబు హయాంలో టిడిపిలో చేరిన యువకులెవరు? అప్పటివాళ్లే కొనసాగుతున్నారు. జగన్‌ పార్టీ పెట్టినపుడు యువతను చేర్చుకుని అవకాశాలు యిచ్చి వుంటే ప్రస్తుత అవస్థ వుండేది కాదు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృతతో నాయకులనే చేర్చుకున్నాడు. అవకాశం రాగానే వాళ్లు ఫిరాయించేస్తున్నారు. ఆంధ్రలో, తెలంగాణలో యిదే కథ. కెసియార్‌, బాబు ఫిరాయింపుదారులపై ఆధారపడే రాజకీయాలు నడుపుతున్నారు. ఎదురుగాలి వీచగానే యీ గాలికోళ్లు దిశ మార్చుకుంటాయి. ఇప్పటికైనా తెరాస, వైసిపి, టిడిపి కొత్త నాయకులను తయారు చేసుకోవాలి. గ్రేటర్‌ ఎన్నికలు రాబోతున్నాయని తెలిసినపుడు ముందుగానే టిడిపి, వైసిపి యీ ప్రక్రియ మొదలుపెట్టవలసినది. అలాటిది చేయకపోవడం చేతనే వైసిపి రంగంలోకి దిగడానికి ధైర్యం చేయలేకపోయింది.

ఇక టిడిపి ఎవరూ దొరకనట్లు రేవంత్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుణ్ని చేసి దించింది. ఆయన నగరానికి చెందిన నాయకుడు కాదు. పైగా నోటు-ఓటు కేసులో నిందితుడు. ఆ కేసులో బాబు హస్తం వుందో లేదో అన్న సందేహానికి తావుంది కానీ రేవంత్‌ వీడియోలో పట్టుబడిపోయిన వ్యక్తి. ఆయన కెసియార్‌ అవినీతిని ఎదుర్కొంటాం అంటూ ప్రచారం చేస్తే హాస్యాస్పదంగా వుండదా? పైగా ఆయన అనేకసార్లు హద్దులు మీరి మాట్లాడాడు. 

బాబు మొదట్లో, చివర్లో ప్రచారానికి వచ్చారు. పాడిందే పాటరా అన్నట్లు 'హైదరాబాదుకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చాను, బిల్‌ గేట్స్‌కు నచ్చచెప్పాను, సైబరాబాదు కట్టాను. ..' యివే కబుర్లు. 'నీకు యింజనీరింగు చదువు చెప్పించడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా?' అని తలితండ్రులు చెప్పబోతేనే పిల్లలకు విసుగు. 'ఆపవయ్యా సుత్తి, యిప్పుడు స్టేట్స్‌ పంపడానికి  డబ్బిస్తావా లేదా అది చెప్పు చాలు' అంటారు. బాబు జమానా 2004తో అయిపోయి పదకొండేళ్లయింది. ఆయన తొమ్మిదేళ్ల పాలనకు ముందు, దానికి తర్వాత ఏమీ జరగలేదని ఆయన మనల్ని నమ్మమంటాడు. హైదరాబాదు యిలా యివాల్వ్‌ కావడానికి 400 ఏళ్ల పై బడి పట్టింది. పోనీ ఆధునిక హైదరాబాదు చరిత్ర తీసుకున్నా 60 ఏళ్లు. దానిలో తొమ్మిదేళ్లంటే ఏ మూలకి? బిల్డింగు పెయింటు వేసిన ప్రతీ వాడూ నాదే బిల్డింగంటే ఓనరేం కావాలి? సరే ఆయన అంత ప్రజ్ఞావంతుడైతే యిప్పుడు అమరావతి కుంటుతోందేం? తాత్కాలిక సెక్రటేరియట్‌, తాత్కాలిక రాజ్‌భవన్‌, తాత్కాలిక అసెంబ్లీ… యిలా అన్నీ తాత్కాలికాలే కట్టడమేం? కట్టడాలు కనబడటం లేదు, శంకుస్థాపన మహోత్సవాలు తప్ప! ఈయనకు మోదీ దగ్గర ఏమీ పలుకుబడి లేదని కెసియార్‌ ఎంత వెటకారంగా చెప్పాడో చూడండి. బాబు తన సొంత రాష్ట్రంలో ఏదైనా చేసి చూపిస్తే తప్ప యిక్కడ కాస్తయినా అంబ పలకదు. అక్కడ చేసినా, యిక్కడ కూడా ఒక కాలుంది, మిమ్మల్ని వదిలిపెట్టలేదు అని చూపించుకుంటే తప్ప తెలంగాణలో టిడిపిలో చేరేవాడుండడు. 

ఈ విషయాన్ని లోకేశ్‌ గుర్తించాలి. ఆయన యిప్పటిదాకా తెర వెనుక రాజకీయాలే చేస్తున్నాడు. ట్వీట్‌ చేసే టాలెంటు వేరు, జనంలోకి వచ్చి మెప్పించే టాలెంట్‌ వేరు. ట్వీట్‌ విషయంలో ఘోస్ట్‌ రైటర్స్‌ వున్నారేమోనన్న అనుమానం వుంటుంది. ఆయన జనంలో తిరుగుతూ. సందర్భోచితంగా మాట్లాడుతూ, అవసరమైన చోట చమత్కారం ప్రదర్శిస్తూ తను ఒక యువనాయకుణ్ని అని చూపించుకోవాలి. ప్రత్యర్థి నుంచి కూడా నేర్చుకోవచ్చు. కెటియార్‌ జాతీయ టీవీ ఛానెల్స్‌లో, కాన్ఫరెన్సులలో అనేక చోట్ల పాల్గొని తన మేధస్సును, వచోపటిమను చూపుకున్నారు. మూణ్నెళ్లగా వాడవాడలా తిరుగుతూ కార్యకర్తలను మంచి చేసుకున్నారు. తెరాస గెలుపు ఖాయం అనుకున్నారు కాబట్టి టిక్కెట్లకోసం ఆశావహులు, నిరాశోపహతులు ఎందరో వున్నారు. వారిని కెటియార్‌ బుజ్జగించి, రెబెల్స్‌ బెడద లేకుండా చూసుకున్నాడు. మరి టిడిపి విషయంలో బిజెపితో పొత్తు సవ్యంగా సాగలేదు. ఓట్ల బదిలీ కాలేదు. అటూయిటూ రెబెల్స్‌ నిలబడి విజయావకాశాలను దెబ్బ తీసుకున్నారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆంధ్ర పాలనలో లోకేశ్‌కు పనేమీ లేదు. తండ్రి ఆరోగ్యంగా వున్నారు, అన్ని విషయాలూ స్వయంగా చూసుకుంటున్నారు. హెరిటేజి వ్యవహారాలు తల్లి చూసుకుంటున్నారు. మరి తను తెలంగాణను పట్టించుకుని ఓటమి బాధ్యతను తలకెత్తుకుని, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి. తెలంగాణలో టిడిపికి బలమైన క్యాడర్‌ వుంది. బిసిల మద్దతు వుంది. ఎన్టీయార్‌ ఎందరికో ఆరాధ్యదైవం. కష్టపడితే కొన్ని వర్గాలనైనా ఆకట్టుకుని ఒక బలమైన శక్తిగా కొనసాగవచ్చు. బద్ధకిస్తే పార్టీ మొత్తం తెరాసలో విలీనమై పోతుంది. ఆంధ్ర రాజకీయాలతో సతమతమవుతున్న బాబే యివన్నీ చూసుకోవాలనడం భావ్యం కాదు. లోకేశ్‌ మేల్కోవాలి. ఎన్టీయార్‌ భవన్‌ విడిచి బయటకు వచ్చి చిన్నతనంలో తిరిగినట్లుగా గల్లీల్లో తిరుగుతూ, పతంగులు ఎగరేస్తూ, అన్ని వర్గాలతో కలిసిమెలసి తిరిగి, అన్ని రకాల రాజకీయ, సాంస్కృతిక సమావేశాల్లో కనబడుతూ, మాట్లాడుతూ ప్రజల్లో తనేమిటో, తన సత్తా ఏమిటో చూపుకోవాలి. అమెరికాలో చదివిన విద్య నిరర్థకం కాలేదని నిరూపించుకోవాలి. వయసులో కాస్త పెద్దవాడైన, ప్రస్తుతం విజేతగా నిలిచిన కెటియార్‌ను ఆదర్శంగా తీసుకున్నా, అనుకరించినా తప్పు లేదు. ఈ ప్రయత్నంలో ఏడాదికైనా, రెండేళ్ల కైనా ఏదో ఒక ఉపయెన్నికలలోనైనా విజయం సాధించిచూపితే తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]