ప్రస్తుతం మోదీ హవా దేశమంతా వీస్తోంది. ముఖ్యంగా చదువుకున్నవారిలో. మోదీ దగ్గినా, తుమ్మినా ఓహో అనేవారే కనబడుతున్నారు. అతను ఒంటిచేత్తో దేశాన్ని పాతాళంలోంచి నభోమండలానికి ఎత్తేయగల సమర్థుడని అందరూ నమ్ముతున్నారు. అతని ధోరణిపై ఏ చిన్న వ్యాఖ్య చేసినా 'నీది నెగటివిజమ్' అంటూ మండిపడుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే వంటి మీడియా సంస్థలు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఈ హంగామా వెనక కొన్ని విషయాలు ప్రజల దృష్టికి పెద్దగా రాకుండా పోతున్నాయి. వాటిని ఎత్తి చూపడమే యీ వ్యాసం లక్ష్యం. ముందుగా మోదీ ప్రభుత్వం చేపట్టిన వాటిల్లో కొన్ని మంచిపనులు వున్నాయని ఒప్పుకోవాలి. జాతీయ టీకాల విస్తరణ వాటిల్లో ఒకటి. బ్రిక్స్ బ్యాంకు స్థాపన వంటి కొన్ని అంశాలలో గత ప్రభుత్వమే చాలా గ్రౌండ్ వర్క్ చేసి వుంటుందని మనం గ్రహించాలి. రైల్వే బజెట్, సాధారణ బజెట్ విషయాలలో కూడా ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాల విషయంలో గత ప్రభుత్వంలోని అధికారులు ఎంతో కసరత్తు చేసి రూపొందించి వుంటారు. కొత్త ప్రభుత్వం తన విధాన నిర్ణయాలతో కొన్ని కొన్ని పైపై మార్పులు చేస్తారు. ఎందుకంటే బజెట్ కసరత్తు కొన్ని నెలలపాటు సాగే ప్రక్రియ. అచ్చమైన బిజెపి బజెట్‌ల కోసం ఇంకో ఏడాది వేచి చూడాలి. బజెట్‌లపై తర్వాత మాట్లాడుకోవచ్చు.
సార్క్ దేశాల ప్రతినిథులను తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం, శ్రీలంక అతిథిపై తమిళనాడు నాయకులు కోపగించినా లక్ష్యపెట్టకపోవడం – యివన్నీ మంచి సంకేతాలే. పాకిస్తాన్‌తో వ్యవహారం విషయంలో ఎటూ చెప్పలేం. అవి ఎప్పుడు మెరుగుపడతాయో, ఎప్పుడు చెడిపోతాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే భారత్‌తో సంబంధాలు బాగుపడుతున్నాయనగానే పాకిస్తాన్‌లో కొన్ని శక్తులు గొడవ ప్రారంభిస్తాయి. పాలకులు వాటిని అదుపు చేయలేరు. కానీ మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నామని, శత్రుత్వం వహించలేదని ప్రపంచానికైనా చూపిస్తే మన గుడ్‌విల్ పెరుగుతుంది. ఇక వివాదాస్పద విషయాల గురించి విడివిడిగా పరామర్శిద్దాం.
తొలినాళ్ల హంగామా
మోదీ అధికారంలోకి వస్తూనే కాబినెట్ సబ్‌కమిటీలు రద్దు చేశారనీ, అధికారులందరినీ పెందరాళే వచ్చేయాలని, ఫైళ్లు చకచకా కదిలిపోవాలని ఆదేశాలు యిచ్చారని, తమ బంధువులెవరినీ సెక్రటరీలుగా పెట్టుకోవద్దని మంత్రులకు గట్టిగా చెప్పారనీ, పొదుపు పాటించాలన్నారనీ, … యిలాటి పబ్లిసిటీ జోరుగా జరిగింది. కాంగ్రెసు వాళ్లు యిలాటివి పెద్దగా పట్టించుకోరు కానీ కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా యీ హంగామా తప్పదు. పొదుపు కోసం వెంకయ్య నాయుడు ఒక రోజు తన ఆఫీసుకి కారులో కాకుండా మెట్రో రైలులో ప్రయాణించారని ఫోటోలు కూడా వచ్చాయి. అవేళ తిరిగి వెళ్లేటప్పుడు మెట్రోలో వెళ్లారో లేదో రాయలేదు. అంటే ఆ రోజు పొద్దున్న ఆయన కారు ఖాళీగా ఆఫీసుకి వచ్చి వెయిట్ చేసి సాయంత్రం ఆయన్ను ఎక్కించుకుని యింటికి చేర్చి వుంటుంది. దీనివలన ఎంత పెట్రోలు ఆదా అయిందంటారు? పైగా 365 రోజుల్లో ఒక రోజు మెట్రో ఎక్కగానే సరిపోయిందా? ఇప్పటికైనా యీ పబ్లిసిటీ గిమ్మిక్స్ మానేయాలి.
అలాగే చిన్న కాబినెట్ అనే ప్రచారం ఒకటి. సంకీర్ణ ప్రభుత్వమైతే అందరినీ సంతృప్తి పరచడానికి పదవులు పంచాలి. సొంత మెజారిటీ వున్న ఒకే పార్టీ ప్రభుత్వం కాబట్టి ఆ యిబ్బంది లేదు. అంతమాత్రం చేత కొన్ని శాఖలకు మంత్రులు లేకుండా చేస్తే ఎలా? అరుణ్ జైట్లీగారు మొన్న బజెట్ ఉపన్యాసం 40 ని||లు యిచ్చాక ఐదు నిమిషాలు విరామం కావాలని అడిగి తీసుకున్నారు. వయసు 61యే కానీ మధుమేహ పీడితుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడలేడట. ఓపిక తక్కువట. మరి అలాటి వాడికి భారీ శాఖలైన ఆర్థిక శాఖ, కార్పోరేట్ వ్యవహారాలు, రక్షణ శాఖ అన్నిటినీ చూసుకోమంటే ఎలా? రెండిటిలోనూ పనిభారం ఎక్కువే. నిద్ర చాలక శాఖాధిపతుల సమావేశాల్లో ఆయనకు కళ్లు మూతలు పడుతున్నాయట.
ఎన్నేళ్ల బానిసత్వం ?
లోకసభలో తొలిసారి మాట్లాడుతూ మోదీ ''1200 సంవత్సరాల బానిస పాలన..'' అంటూ మాట్లాడారు. మనందరికీ తెలిసి మన సంపదను దోచుకుని తమ దేశాలకు పట్టుకుని పోయిన ఆంగ్లేయుల పాలన మహా అయితే 200 సం||లు సాగింది. మరి తక్కిన వెయ్యి సంవత్సరాలు ఎక్కణ్నుంచి వచ్చాయి? అంటే ముస్లిము పాలన కూడా కలిపి చెప్పాడన్నమాట. గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా మొన్న ఆగస్టు 15 న స్వాతంత్య్రదినోత్సవ ఉపన్యాసం యిస్తూ ''గత 1000-1200 సం||రాలుగా భారతదేశం బానిసగా పడి వుంది'' అన్నాడాయన. రెండిటికి మధ్య రెండు వందల ఏళ్లు తేడా వుంది. ప్రధానమంత్రి అయ్యేటప్పటికి ఒక నిర్ధారణకు వచ్చేశాడు – 1200 ఏళ్లు అని. అంటే ముస్లిములు భారతదేశానికి వచ్చినప్పటి నుండి మనకు బానిసత్వం దాపురించింది అని నూరిపోయడమన్నమాట. ఇది ఆరెస్సెస్ భావజాలం. తరతరాలుగా భారతదేశం అనేక రాజ్యాలుగా విడిపోయి వుంది. ఒకరిపై మరొకరు దండయాత్రలు చేసుకుంటూ వుండేవారు. కొన్ని ప్రాంతాలు కొంతకాలం పాటు ఒక ప్రాంతపు రాజు అధీనంలో వుంటే, మరి కొంతకాలం అవతలి రాజు అధీనంలో వుండేవి. తరతరాలుగా అనేకమంది దండెత్తి వచ్చారు. శకులు, హూణులు, కుషానులు, యవనులు.. యిలా! అందరి కంటె ముందు ఆర్యులు వచ్చారు. ఆరెస్సెస్ వాదులు 'అబ్బే ఆర్యులు యిక్కడివారే, ఎక్కణ్నుంచీ రాలేదు' అంటారు. మరి జర్మనీ, లాటిన్ వంటి అనేక యూరోపియన్ భాషలకు ఆర్యభాషతో లింకు ఎలా వున్నట్టు? జర్మన్లు తాము ఆర్యన్లు అని ఎలా చెప్పుకున్నారు? అంటే ఆర్యన్లే యిక్కణ్నుంచి వెళ్లి వాళ్లపై దండయాత్ర చేసి బానిసలు చేసుకున్నారా?
ఆర్యుల మాట వదిలేసినా తక్కినవాళ్లు వచ్చారని అందరికీ తెలుసు కదా! వాళ్లెవరూ పరాయివాళ్లు కారు, సంఘ్ దృష్టిలో! ముస్లిములు మాత్రమే పరాయివారు, మనలను బానిసలు చేసి పీడించిన దుర్మార్గులు. ముస్లిము పాలకులు యిక్కడే స్థిరపడ్డారు, రాజ్యాలు ఏలారు. యీ సంపదను ఎక్కడకూ తరలించుకు పోలేదు. రాజ్యవిస్తరణలో భాగంగా సాటి ముస్లిము రాజులతో కూడా యుద్ధాలు చేశారు. హిందూ రాజులు కూడా డిటోడిటో. ఏక సమయంలో హిందూ రాజులు, ముస్లిము రాజులు ప్రజలను పాలించారు. అప్పటినుండీ మొత్తం భారత ఉపఖండమంతా బానిసత్వంలోకి నెట్టబడిందనడం హాస్యాస్పదం. సాక్షాత్తూ ప్రధానమంత్రి నోట యిది వినబడడం శోచనీయం. 2002 గోధ్రా అల్లర్ల గురించి మాట ఎత్తినప్పుడల్లా మోదీ 'గతం గతః, పాతవిషయాలను వదిలేసి ముందుకు సాగాలి అంటూ వుంటారు. 12 ఏళ్ల క్రితం దాన్ని మర్చిపోవాలి కానీ ఎప్పుడో మధ్యయుగాల నాటి యుద్ధాల గురించి మాత్రం మనం మరువకూడదట. ప్రజలను హిందూ, ముస్లిములుగా విడగొట్టి, ముస్లిములు పక్కన వున్నంతకాలం మనం బానిసలుగా బతుకుతున్నట్టే అనడం అన్యాయం, అక్రమం.
హిందూ చరిత్ర తిరగరాయించబోతున్నారు
అభివృద్ధి జపం చేస్తూ అధికారంలోకి వచ్చినా మోదీ హిందూ ఎజెండాను వదలలేదనడానికి యిది తార్కాణం. అంతేకాదు, చరిత్ర తిరగరాయించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. మోదీ వస్తూనే చేసిన పనుల్లో ఐసిఎచ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రిసెర్చ్) అధినేతను మార్చడం! ఇదీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ (ఐసిఎస్‌ఎస్‌ఆర్) యివన్నీ వివాదాస్పద సంస్థలే. అధికారంలో వున్నవాళ్లు తమ ఆలోచనలకు అనుగుణంగా ఆలోచించేవారిని వీటిలో నియమిస్తూ వుంటారు. వీరు తయారుచేసిన పుస్తకాల ఆధారంగా పాఠ్యపుస్తకాలు తయారయి, భావితరాలను ప్రభావితం చేస్తాయి. మేధావులందరూ ఒకేలా ఆలోచించరు. దొరికిన చారిత్రక ఆధారాలను తర్కబద్ధంగా ఆలోచించడం సరైన పద్ధతి. అయితే కొందరు తాము ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల కోణంలో నుండి వాటిని చూసి అలా విశ్లేషిస్తూ వుంటారు. మన దేశంలో మొదటి నుండి చరిత్ర పట్ల గౌరవం, శ్రద్ధ లేదు. పాత రచనల్లో చాలాభాగం అతిశయోక్తులే. ఒకదానికి మరొకదానికి పొసగవు. పాశ్చాత్యదేశాలు యీ విషయంలో చాలా మెరుగు. అక్కడ వున్నదున్నట్టు రికార్డు చేసిన సందర్భాలు చాలా వున్నాయి. వారు వారికి తెలిసిన దృక్కోణంలో భారతచరిత్రను వివరించారు. వాటిలో పొరబాట్లు వుండవచ్చు కానీ మొత్తానికి కొట్టి పారేయలేం. అయితే ఆరెస్సెస్ వాదులు పాశ్చాత్యుల కోణాన్ని, వాటిని అనుసరించిన భారతీయమేధావులను తీసిపారేస్తారు. వాళ్లందరిపై కమ్యూనిస్టు ముద్ర కొట్టేస్తారు. వాజపేయి ప్రభుత్వంలో మురళీ మనోహర్ జోషి హ్యూమన్ రిసోర్సెస్ శాఖ చూసేటప్పుడు పై రెండు సంస్థల్లోనే కాక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్వాన్స్‌డ్ స్టడీస్, యుజిసి వంటి సంస్థలను కూడా ఆరెస్సెస్ మేధావులతో నింపేశాడు. ఐసిఎచ్‌ఆర్ అప్పట్లో ''ఫ్రీడమ్ ప్రాజెక్ట్'' అనే పథకం కింద 1937 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్య్రపోరాటంపై ఏడాదికి ఒక సంపుటం చొప్పున 10 సంపుటాలు తెద్దామనుకుంది. కానీ రెండు సంపుటాలు తయారయ్యేసరికి జోషీ అడ్డుపడ్డారు – ''దీనిలో హిందూ మహాసభ వంటి సంస్థల పాత్ర గురించి తగినంతగా రాయలేదు.'' అంటూ!
ఇప్పుడు మళ్లీ అలాటి ప్రయత్నాలే మొదలయ్యాయని అర్థమవుతోంది. ఐసిఎచ్‌ఆర్‌కు చైర్మన్‌గా నియమించబడిన ఎల్లాప్రగడ సుదర్శన రావు పూర్తిగా ఆరెస్సెస్ మనిషే. ఆయన యిప్పటికే మహాభారత ప్రాజెక్టుపై పని చేస్తున్నారు. చరిత్రకారు డెప్పుడూ ఆధారాల కోసం వెతుకుతారు. మన రావుగారికి వాటితో పని లేదు. ఆధారాల కోసం వెతకడం పాశ్చాత్యపద్ధతి అంటాడాయన. ప్రజల నోట్లో ఆడే పుక్కిటి పురాణాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందేట. ''రాముడు భద్రాచలంలో తిరుగాడాడు అని స్థానికులు చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి? ఎన్నో తరాలుగా వాళ్లు తమ మెదళ్లలో నిక్షిప్తం చేసుకున్న జ్ఞాపకాలన్నమాట. దానిని కూడా మనం చరిత్రగానే ఆమోదించాలి'' అని ఆయన వాదన. ఇలాటి వాదన వింటే మతి పోతుంది. 'కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకు పోయినది యిక్కణ్నుంచే..' అని చెప్పే చోట్లు కనీసం మూడు, 'రావణుడు శివుని ఆత్మలింగాన్ని పోగొట్టుకున్నది యిక్కడే..' అని చెప్పే చోట్లు మూడు నాకు తెలుసు. అవి వివిధ రాష్ట్రాలలో వున్నాయి. రావు గారి నిర్వచనం ప్రకారం వీటిలో దేన్ని చరిత్ర అనాలి? ఇలాటి మేధావి ప్రచారం చేయబోతున్న చరిత్రను మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో పెట్టబోతున్నారు. శభాష్!
హిందీ, హిందూ, హిందూస్తాన్
ఇదీ ఆరెస్సెస్ నినాదమే. జనసంఘ్ కూడా యిదే నినాదంతో ఎదిగింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా యిదే నినాదాన్ని చేపట్టింది. ఆరెస్సెస్ పుస్తకాల్లో భారతదేశం, ఆర్యసంస్కృతి, సంస్కృతం ఘనత గురించి ఉగ్గడించి, చివరిలో 'పరిణతి చెందిన వివిధ భాషలతో విలసిల్లే భారతదేశానికి లింకు భాషగా పరభాష, బానిసత్వానికి ప్రతీక అయిన ఆంగ్లభాష పనికి రాదు, సంస్కృతమే వుండాలి కానీ సంస్కృతం కష్టం కాబట్టి హిందీ వుండాలి' అని తేలుస్తారు. ఇదెక్కడి జంప్? సంస్కృతం అయితే అందరికీ సమానదూరం. నేర్చుకోవడంలో సమానకష్టం. అది క్లిష్టంగా వుంటే సరళీకృత సంస్కృతం అని వుంది, దాన్ని వ్యాప్తి చేయాలి. అంతేగాని ఆరెస్సెస్‌కు బలం వున్న ప్రాంతాల ప్రజలకు మేలు చేసేలా వాళ్ల భాషను యితరులపై రుద్దుతానంటే ఎలా? దేశంలో కౌ బెల్ట్‌గా పిలవబడే ప్రాంతాల్లోనే హిందీ బలంగా వుంది. తక్కిన ప్రాంతాల్లో హిందీ అర్థం చేసుకుంటారు కానీ, హిందీలో పట్టుమని ఒక్క పేజీ కూడా రాయలేరు, స్కూలు రోజులు దాటాక హిందీ చదవడం కూడా మానేస్తారు. అలాటివాళ్లు హిందీ మాతృభాషగా వున్నవారితో పోటీ పరీక్షల్లో ఎలా పోటీ పడగలరు?
స్వాతంత్య్రానికి ముందు నుండి తమిళులు, మలయాళీలు, బెంగాలీలు ఉన్నతోద్యోగాలలో వుండేవారు. వాళ్లందరూ ఇంగ్లీషులో నిష్ణాతులు. వీళ్లని దెబ్బ కొట్టాలంటే ఇంగ్లీషు తీసి పారేసి హిందీయే పెట్టాలి, అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి అని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి హిందీవాదులు ఆందోళన చేస్తున్నారు. నెహ్రూ కాలంలో సేఠ్ గోవిందదాస్ యీ ఉద్యమానికి నాయకుడు. రామ్ మనోహర్ లోహియా కూడా..! నెహ్రూ కూడా హిందీప్రాంతం వాడైనా దేశసమగ్రతను దృష్టిలో పెట్టుకుని వారి వాదనలు నిరాకరించాడు. దాంతో అతను ఆంగ్లమానసపుత్రుడని, ఇంగ్లీషు అమ్మాయిలతో తిరగడం చేత అలా అయ్యాడని, ముస్లిముకు పుట్టాడని.. యిలా అనేక పుకార్లు పుట్టించారు. నెహ్రూ తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్ వాడే. అతను 1965లో హిందీని రుద్దబోయాడు. దాంతో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున లేచి, 1967లో అక్కడి కాంగ్రెసు ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేసింది. ఇప్పటిదాకా మళ్లీ అధికారంలోకి రాలేదు.
ఇప్పుడు మోదీ మళ్లీ హిందీని తలకెత్తుకున్నారు. సోషల్ మీడియా అఫీషియల్ కమ్యూనికేషన్‌లో అధికార భాషగా హిందీనే ఉపయోగించాలని కేంద్రప్రభుత్వం తన మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. కరుణానిధి దీనికి అభ్యంతరం తెలిపినా మోదీ ఖాతరు చేయలేదు. ఎందుకంటే బిజెపి బలమంతా హిందీ ప్రాంతాల్లోనే వుంది. వాళ్లకు అవకాశాలు రావాలంటే, పోటీలోంచి దక్షిణాది వారిని, తూర్పుప్రాంతీయులను, చాలా మేరకు పశ్చిమప్రాంతీయులను తప్పించాలంటే హిందీని రుద్దాల్సిందే. జనతా పార్టీ అధికారంలో వుండగా కాబినెట్ మీటింగులన్నీ హిందీలోనే జరిగేవి. ఎందుకంటే అప్పుడు దక్షిణాది నుండి, తూర్పు నుండి ఒకరిద్దరు మంత్రులు మాత్రమే వుండేవారు. ఇప్పుడు మళ్లీ హిందీ హవా ప్రారంభమైంది. ప్రమాణస్వీకారాలు చేసినవారిలో అధికాంశం హిందీలోనే చేశారు. దక్షిణాది వారు మాత్రం ఇంగ్లీషులో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినపుడు ప్రణాళికా రచనంతా ఇంగ్లీషులోనే సాగుతుంది. మీడియాతో మాట్లాడినపుడు కాంగ్రెసు అధికారప్రతినిథులు సాధారణంగా ఇంగ్లీషులో మాట్లాడి, తర్వాత హిందీలో అనువదించేవారు. ఇప్పుడు ఉల్టా. హిందీలో మాట్లాడి, అర్థం కాని వారికోసం అంటూ ఇంగ్లీషులో చెప్తున్నారు. మోదీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చినపుడు మొన్న షార్‌లో ఇంగ్లీషు, హిందీ రెండు భాషల్లో మాట్లాడినట్లు మాట్లాడి వుండవచ్చు – ఎలాగూ అనువాదకుణ్ని పెట్టుకున్నారు కాబట్టి! కానీ హిందీలో మాత్రమే మాట్లాడారు. ఆ ప్రాంతాల్లో ఇంగ్లీషయితే కనీసం విద్యావంతులు కనక్ట్ అవుతారు. హిందీ అయితే ఎవరూ కనక్ట్ కారు. విదేశమైన భూటాన్‌కి వెళ్లినపుడు మోదీ హిందీలో మాట్లాడారు, వెంట నున్న సుష్మా స్వరాజ్ ఇంగ్లీషులో మాట్లాడారు. పోనుపోను 'హిందువువైతే హిందీ మాట్లాడాలి' అనే నినాదం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు.
అస్మదీయుల నియామకాలు
ట్రాయ్ చైర్మన్‌గా చేసిన నృపేన్ మిశ్రాను మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకుందామనుకున్నపుడు రూల్సు అడ్డు వచ్చాయి. ట్రాయ్ చైర్మన్‌గా పని చేసిన వారు పదవీ విరమణ తర్వాత వేరే ఉద్యోగం ఏదీ చేపట్టకూడదని! ఉద్యోగంలో వుండగా ప్రయివేటు కంపెనీలకు అనుమతులు, సౌకర్యాలు యిచ్చే అవకాశం వున్న ఉద్యోగుల విషయంలో యిలాటి జాగ్రత్త తీసుకుంటారు. రిటైరయ్యాక ఉద్యోగం చేద్దామనుకున్న కంపెనీకి రిటైర్ కావడానికి కొద్దిగా ముందుగా ఎడాపెడా లైసెన్సులు యిచ్చేయవచ్చు. ట్రాయ్ విషయంలోనైతే అది వేల కోట్లలో వుంటుంది. మోదీ మిశ్రాను కోరుకున్నారు కాబట్టి ఆయనకోసం రూల్సు మార్చేశారు. అది రేపు ఎటువంటి అనర్థాలకు దారితీస్తుందో ఆలోచించాలి కదా. పార్లమెంటులో యిదే ప్రశ్న ప్రతిపక్షాలు అడిగితే 'ట్రాయ్ వంటి తక్కిన సంస్థల్లో యిలాటి రూల్సు లేవు, అందుకే దీన్ని తీసేశాం' అంది మోదీ సర్కారు. ఇలాటి నియమం అక్కడ లేకపోతే అక్కడా పెట్టాలి తప్ప యిక్కడ తీసేస్తే ఎలా?
సిబిఐకు జాయింట్ డైరక్టర్‌గా వున్న జావీద్ అహ్మద్‌కు పదవీకాలాన్ని పొడిగించాలని సిబిఐ డైరక్టరు రంజిత్ సిన్హా సిఫార్సు చేశారు. హోం శాఖ అతనికి క్యాడర్ క్లియరెన్సు యిచ్చింది కూడా. అయితే అమిత్ షాపై వున్న కేసుల్లో జడ్జిగా వున్న మాజీ సుప్రీం కోర్టు జడ్జి అఫ్తాబ్ ఆలమ్‌కి యితను కజిన్ అని తెలియడంతో తన క్లియరెన్సును ఉపసంహరించుకుంది కూడా. అంతేకాదు, అతనికి ఢిల్లీలో మరే పదవి యివ్వకుండా ఉత్తర్ ప్రదేశ్‌కు క్యాడర్ వాడు కాబట్టి ఆ రాష్ట్రానికే తిప్పి పంపేయాలంది. సిబిఐకు మరింత స్వేచ్ఛ నివ్వాలని ప్రతిపక్షంలో వుండగా ఉద్యమించిన బిజెపి అధికారం దక్కగానే కాంగ్రెసు పోకడలే పోతోంది.
గుజరాత్ సమీకరణమే ముఖ్యం
అమిత్ షాను నచ్చనివారెవరూ బిజెపి పాలనలో బాగుపడరని గోపాల్ సుబ్రమణియం కథ కూడా నిరూపించింది. సిబిఐ లాగే సుప్రీం కోర్టు స్వేచ్ఛ కూడా హరించకూడదని అంటూ వచ్చిన బిజెపి యీ రోజు సుప్రీం కోర్టు జడ్డిల నియమించవచ్చంటూ కోర్టు కొలిజియం పంపిన నాలుగు పేర్లలో గోపాల్ పేరును పక్కన పెట్టేసింది. తిరస్కరిస్తే మొత్తం జాబితాను తిరస్కరించాలి. ఇలా ఒక్కరిని విడగొట్టి చూపి, తన అభిమతం ఏమిటో చాటి చెప్పింది. సీనియర్ అడ్వకేట్‌గా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిగా (పద్మనాభస్వామి కోవెల ఆస్తుల విషయంలో కూడా ఆయన అమికస్ క్యూరీగా వ్యవహరించారు – స్వంత ఖర్చులతో) గోపాల్‌కు పేరుంది. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఎమికస్ క్యూరీగా అప్పటి హోం మంత్రి అమిత్ షాను తప్పుపట్టడమే ఆయన చేసిన తప్పుపని, మోదీ దృష్టిలో! కేసును సిబిఐకు అప్పగించవద్దని గుజరాత్ ప్రభుత్వం ఎంత వాదించినా గోపాల్ వాదనలను పరిగణించి సుప్రీం కోర్టు సిబిఐకు అప్పగించింది. అందుకే మోదీకి, అమిత్ షాకు అంత కక్ష.
తన పేరు తప్పించారని తెలియగానే గోపాల్ ఆభిజాత్యం వున్న మనిషి కాబట్టి తనంతట తానే తప్పుకున్నాడు. తను చేసిన పనికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని తెలిసిన మోదీ సర్కారు 'గోపాల్‌పై సిబిఐ, ఇంటెలిజెన్సు బ్యూరో ఆరోపణలు చేశాయట' అనే పుకారును మీడియాకు లీక్ చేసింది. 2 జి స్కాము నిందితుడు ఎ.రాజా లాయరుకు, సిబిఐకు గోపాల్ తన సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశాడని మొదటి ఆరోపణ. అలాటిది ఏదీ జరగలేదని, జరిగినట్లుగా నిరూపించాలని గోపాల్ చీఫ్ జస్టిస్‌కు రాతపూర్వకంగా తెలియపరిచారు. దానికి సిబిఐ వద్ద సమాధానం లేదు. ఇంకో ఆరోపణ ఏమిటంటే – నీరా రాడియా టేపుల్లో ఆమెకు, రతన్ టాటాకు జరిగిన సంభాషణలో గోపాల్ పేరు దొర్లిందని! దొర్లిన మాట నిజమే కానీ అది గోపాల్ నిజాయితీని చూపిస్తోంది. నీరా ''వాళ్లు చెప్పినట్లు గోపాల్ వింటాడని నేననుకోను. అతను ముక్కుసూటి మనిషి. రాజా అతన్ని ఎలాగైనా టార్గెట్ చేద్దామని చూస్తున్నాడు…'' అంది. ఇలాటి మనిషి మోదీకి అక్కరలేదు. అది గ్రహించిన గోపాల్ తనే తప్పుకున్నారు. హమ్మయ్య అనుకున్న మోదీ సర్కారు 'ఆయనంతట ఆయనే తప్పుకున్నాడు కాబట్టి యిక దానిపై సమీక్ష అక్కరలేదు' అని ప్రకటించేసింది.
గోపాల్ విషయంలో యింత 'జాగ్రత్త' తీసుకున్న మోదీ ఎటార్నీ జనరల్ నియామకంలో తీసుకోలేదు. ఆ పదవిలో నియమించబడిన ముకుల్ రోహతగి 2 జి స్కాము కేసులో కొందరు నిందితుల తరఫున వాదింంచారు. భారతీయ జాలర్లను చంపిన ఇటాలియన్ నావికుల కేసులో ఇటాలియన్ ఎంబసీకి ప్రాతినిథ్యం వహించారు. గాస్ ధర కేసులో ప్రభుత్వంతో తలపడిన అనిల్ అంబానీకి న్యాయవాదిగా వున్నారు. అయితే మోదీకి అతనంటే ఎందుకు మక్కువ అంటే నకిలీ ఎన్‌కౌంటర్ కేసుల్లో అతను గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించాడు. పైగా అతను అరుణ్ జైట్లీకి మిత్రుడు! దీని అర్థం గుజరాత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి శత్రువు… సమర్థిస్తే మిత్రుడు. డా|| పెన్నీ వెరా సాన్‌సో అనే లండన్ యూనివర్శిటీ ఆంత్రపాలజీ ప్రొఫెసర్ 'ఏజింగ్ అండ్ పావర్టీ' (వయోధిక్యత – పేదరికం) అనే అంశంపై రిసెర్చి చేస్తోంది. 1990 నుండి భారతదేశం సందర్శిస్తూ అనేక వివరాలు సేకరించింది. మార్చిలో అహ్మదాబాదులో అక్కడి వృద్ధులపై, పేదలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అంతే సర్కారు వారు కన్నెఱ్ఱ చేశారు. ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి జూన్ 8 న ఆమె హైదరాబాదు వస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను వెనక్కి తిప్పి పంపేశారు.
కాంగ్రెసు బాటలోనే…
గవర్నర్లను తొలగించడంలో బిజెపి కాంగ్రెసును కాపీ కొట్టిందని అందరికీ తెలిసిపోయింది. 2004లో కాంగ్రెసు చేసినది తప్పని సుప్రీం కోర్టుకి వెళ్లిన బిజెపి తనకు అధికారం దక్కగానే చేసిన మొదటి పని – అదే! అదేమంటే, 'అలనాడు కాంగ్రెసు చేయలేదా' అంటూ వాదిస్తోంది. అలాటి పనులు చేయడం బట్టే కదా కాంగ్రెసుకు ప్రజలు యిలాటి సత్కారం చేశారు, మరి మీకూ వాళ్లకూ తేడా లేకపోతే ఎలా?' అలా అని అడిగినా ఏమీ పట్టించుకోలేదు. కాంగ్రెసు నియమించిన గవర్నర్లు గొప్పవారు కారు కానీ వారిని తొలగించడానికి కూడా ఓ పద్ధతి పాటించాలి. కానీ బిజెపి అలాటి మర్యాదలు పాటించలేదు. సుప్రీం కోర్టు సలహాలను బేఖాతరు చేసి, గవర్నర్లను అవమానకరంగా తీసేసింది. పోనీ వారి స్థానాల్లో మేధావులను తెచ్చిందా అంటే అదీ లేదు, తన పార్టీ నాయకులను తెచ్చింది. ఇది కాంగ్రెసు విధానమే.
కాంగ్రెసుకు, తనకు తేడా లేదని పోలవరం బిల్లు విషయంలో కూడా నిరూపించుకుంది బిజెపి. పోలవరం ఆర్డినెన్సును బిల్లుగా మార్చడం సమంజసమే అని మన తెలుగువాళ్లకు తెలిసినంతగా తక్కిన దేశప్రజలకు తెలియదు. లోకసభలో చర్చ జరిపి, అందరినీ ఒప్పించవలసిన బాధ్యత పాలకపక్షానికి వుంది. రాజ్యసభలో జరిగిన చర్చలాటిది లోకసభలో కూడా జరగనిచ్చి వుంటే బాగుండేది. మెజారిటీ వుంది కదాని బుల్‌డోజ్ చేసి పడేస్తే ఎలా? ఆనాడు విభజన బిల్లు ఎలా పాసయిందో, యీనాడు విభజన సవరణ బిల్లు అంతే అందంగా పాసయింది.
ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)