వీరకుడు తిరిగి వచ్చి 'ఒక స్త్రీ కళేబరం కనబడింది. కుక్కలు నక్కలు పీక్కుతింటున్నాయి. అరకొరగా మిగిలిన జుట్టు చేత, చేతులు కాళ్ల చేత అది స్త్రీ శవమని గుర్తించాను.' అన్నాడు. నిజానికి దీని ప్రస్తావన శకారుడి నుంచి తప్పించుకోవడానికి విటుడు పారి పోతున్నపుడు వస్తుంది. ఒక దారిలో వెళ్లి తిరిగి వచ్చి 'చెట్టు పడి ఒకామె చచ్చిపడి వుంది, మరో దారిలో వెళతాను' అని ప్రేక్షకులతో అంటాడు. అతను పారిపోయిన తర్వాత మరో ఘట్టం కూడా వస్తుంది. శవాన్ని ఆకులతో కప్పిపెట్టి పారిపోవాలని చూస్తున్న శకారుడు 'ఇటు వెళదామా, ఆ బౌద్ధభిక్షువు యిటువైపు వస్తున్నాడు. నేను ముక్కు బద్దలు కొట్టాను కాబట్టి నా మీద కసిగా వుంటాడు. ఈ ఆకుల కుప్పను, నన్ను చూసి వసంతసేనను నేనే చంపానని గ్రహిస్తాడు' అనుకుని మొండిగోడ మీద నుంచి దూకి వనంలోంచి బయట పడ్డాడు.
ఆ తర్వాత భిక్షువు అక్కడకి వచ్చి ఉతుక్కున్న తన కౌపీనాన్ని ఎక్కడ ఆరవేద్దామా అని చోటు వెతుక్కున్నాడు. కొమ్మకు ఆరవేస్తే కోతులు చింపేస్తాయి అనుకుని అక్కడ వున్న ఎండుటాకుల కుప్ప మీద ఆరవేసి ధ్యానం చేసుకుంటూండగా గోచీలోంచి కిందకు జారిన నీరు వసంతసేన మొహం మీదకు కారి, ఆమెకు మళ్లీ స్పృహ రాసాగింది. నిజానికి ఆమె చావలేదు. మూర్ఛపోయిందంతే. ఆమెకు మెలకువ వచ్చి చెయ్యి బయటకు చాచింది. అది చూసి బౌద్ధ భిక్షువు కాస్త కంగారుపడినా ఆకులు తొలగించి, ఆమెను గుర్తు పట్టి, నీరు తాగించి ప్రాణం కాపాడాడు. 'గుర్తు పట్టావా తల్లీ? పది బంగారు నాణాలు చెల్లించి కాపాడినవాణ్ని' అని పరిచయం చేసుకున్నాడు. 'ఏమిటి నీకీ అవస్థ?' అని అడిగాడు. 'వెలయాలితనానికి పడిన శిక్ష' అందామె వైరాగ్యంతో. 'చేరువలో బౌద్ధవిహారం వుంది. అక్కడ విశ్రాంతి తీసుకుని యింటికి వెళుదువుగాని' అంటూ ఆమెను అక్కడకు నడిపించాడు. దీని తర్వాతనే శకారుడు న్యాయమూర్తి వద్దకు వెళ్లిన ఘట్టం వస్తుంది. అందుచేత ప్రేక్షకుడికి వసంతసేన బతికే వుందని తెలుసు. వీరకుడికి కనబడిన శవం వేరేవారిదని అర్థమౌతుంది.
శవం కూడా కనబడిందని, కానీ అది వసంతసేనది కాదని నిరూపించే స్థితిలో లేదని తెలిశాక న్యాయమూర్తికి ఏం చేయాలో పాలుపోలేదు. చారుదత్తుణ్ని దోషిగా అంగీకరించలేక, నిర్దోషిగా తేల్చలేక ఊబిలో పడ్డ ఆవులా గిలగిలలాడాడు. ఆ విషయం గ్రహించి చారుదత్తుడు కూడా హతాశుడయ్యాడు. శకారుడే వసంతసేనను చంపి తనపై ఆ నేరాన్ని నెట్టేస్తున్నాడని అర్థం చేసుకుని ఖేదపడ్డాడు. వసంతసేన లేని తన జీవితం వ్యర్థం అనుకుని శిక్షకు సిద్ధపడ్డాడు. నిజం చెప్పు, చారుదత్తా అని అడిగిన ప్రశ్నకు 'శకారుడు చెప్పినది అబద్ధం. పూల కోసమైనా నేను పూలతీగను వంచను, పూలు త్రుంచను, అలాటిది ఒక స్త్రీని సంహరిస్తానా?' అని ఎదురు ప్రశ్న వేశాడు. శకారుడికి యీ వ్యవహారమంతా మంట పుట్టించింది. 'మీరంతా అతని పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. దోషి అని తేలినా యింకా ఆసనం వేసి మర్యాద చేసి, అనునయంగా అడుగుతున్నారు' అని నింద వేశాడు. దాంతో న్యాయమూర్తి చారుదత్తుడి ఆసనం తీయించేశాడు. ఆ ఆసనంలో శకారుడు వచ్చి దర్జాగా కూర్చున్నాడు.
నిలబడిన చారుదత్తుడు 'నా యీ దుర్దశ నా వాళ్లెవరికీ తెలియదు కదా, నా భార్య పాపం యింట్లోనే వుంది, నా కొడుకు ఆటలాడుతూ వుండి వుంటాడు. నేను ఉద్యానం నుండి తిరిగి యింటికి రాగానే వసంతసేన బంగారు బండి చేయించుకోమని మా అబ్బాయికి బంగారు నగలిచ్చిందని తెలిసి మైత్రేయుణ్ని ఆమె యింటికి పంపించాను. అందువలన అతనూ నాకు తోడుగా లేడు' అని బాధపడసాగాడు.
వసంతసేన యింటికి బయలుదేరిన మైత్రేయుడికి దారిలో రేభిలుడు తగిలి చారుదత్తుణ్ని న్యాయస్థానానికి రప్పించారని చెప్పాడు. దాంతో అతను ఎకాయెకి న్యాయస్థానానికి వచ్చేశాడు. అక్కడ చారుదత్తుణ్ని చూసి 'ఏమైంది?' అని అడిగాడు. 'ఇదీ సంగతి' అని చారుదత్తుడు అతనితో చెవిలో చెప్పగానే మైత్రేయుడు శకారుడిపై మండిపడ్డాడు. 'ఒరే తిరుగుబోతుదాని కొడుకా, మా చారుదత్తుడిపై యింతటి అభాండం వేస్తావురా?' అంటూ చేతి కర్ర ఎత్తి కొట్టబోయాడు. శకారుడు లేచి అతనిపై పడి తన్నబోయాడు. ఇద్దరూ పెనగులాడడంలో మైత్రేయుడి పై శాలువా తొలగిపోయి చంకలోని నగల మూట కిందపడింది. అది చూడగానే చారుదత్తుడు అపహరించిన నగలివే అని న్యాయమూర్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
నిర్ధారణ కోసం వసంతసేన తల్లికి వాటిని చూపించి 'ఇవి నీ కూతురి నగలేనా?' అని అడిగారు. ఆమె 'అలాగే వున్నాయి కానీ అవి కావు. ఎవరో స్వర్ణకారుడు నేర్పుగా అలాగే చేశాడు.' అని చెప్పింది, పోయిన కూతురు ఎలాగూ పోయింది, చారుదత్తుణ్నయినా రక్షిద్దామని. కానీ చారుదత్తుడు అవి వసంతసేనవే అని చెప్పేశాడు. 'నీ దగ్గరకు ఎలా వచ్చాయి?' అని అడిగితే 'ఆమెయే నా కుమారుడికి యిచ్చిందని చెప్పాను కదా, మీరు నమ్మకపోతే నేనేం చేయగలను? నేను ఏ పాపమూ ఎరుగను.' అని చెప్పాడు. శకారుడు మధ్యలో 'ఎందుకీ బుకాయింపు? నేనే చంపాను అని చెప్పేయవచ్చుగా' అని ఉడికించాడు. 'గొప్ప సత్యసంధుడివి నువ్వు చెప్పావు కదా, చాలు, యిక నేను చెప్పే పనేముంది?' అన్నాడు చారుదత్తుడు విసుగ్గా.
'అదిగో, అతనే నేరం ఒప్పేసుకున్నాడు, యిక తాత్సారం చేయకుండా శిక్ష వేసేయండి' అని శకారుడు గోలగోల చేశాడు.
న్యాయమూర్తికి గత్యంతరం లేకపోయింది. చారుదత్తుణ్ని అదుపులోకి తీసుకోమన్నాడు. వెంటనే వసంతసేన తల్లి 'నా కూతురు హత్య కావింపబడితే ఫిర్యాదు చేయవలసినది నేను కదా, మధ్యలో శకారుడికి ఏం పని? నేను అభియోగం చేయడం లేదు, యితన్ని వదిలివేయండి' అని విజ్ఞప్తి చేసింది. కానీ న్యాయమూర్తి ఒప్పుకోలేదు. 'అమ్మా, విచారణ పూర్తయింది. మీరు వెళ్లిపోవచ్చు' అని పంపించి వేశాడు. వచ్చిన పని పూర్తయినందుకు సంతోషంతో శకారుడు వెళ్లిపోయాడు.
న్యాయమూర్తి తీర్పు చెప్పబోతూ 'చారుదత్తుడిపై హత్యానేరం నిరూపించబడింది. మరణశిక్ష వేయాలి. అయినా యితని సచ్చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆస్తిపాస్తులు తీసేసుకుని, దేశబహిష్కార శిక్ష వేస్తే చాలనుకుంటున్నాను. కానీ ఆ నిర్ణయం తీసుకోవలసినది రాజుగారే.' అంటూ బంట్రోతును రాజు వద్దకు పంపించాడు. అతను తిరిగి వచ్చి ''ఏ నగలకోసం అతను స్త్రీ హత్య చేశాడో ఆ నగలను అతని మెడలో వేసి నగరంలో ఊరేగిస్తూ ఎవరైనా యిలాటి అకార్యం చేస్తే వారికి యిదే శిక్ష అని టముకు వేయిస్తూ దక్షిణం వైపున్న శ్మశానానికి తీసుకెళ్లి కొఱత వేయండని రాజుగారు ఆజ్ఞాపించారు' అని చెప్పాడు.
అది విని న్యాయమూర్తి చింతాక్రాంతుడయ్యాడు. శకారుడి వంటి ధూర్తులు శాసనాలను తమకు అనుకూలంగా మలచుకుని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు లొంగిపోయి రాజులు యిప్పటికే వేలాదిమందిని చంపారు, ఇంకా చంపుతారు అనుకుంటూ అలాగే చేయమన్నాడు. చారుదత్తుడు మైత్రేయుణ్ని పిలిచి 'నా తల్లికి నమస్కారాలు అందచేయి. నా భార్యను ఓదార్చు. నా కుమారుణ్ని నువ్వే సాకు' అని అప్పగింతలు పెట్టాడు.
చారుదత్తుడి మెడలో ఎఱ్ఱని కరవీరపుష్పాల మాల వేసి, ఎఱ్ఱచందనంలో అరచేతులు ముంచి శరీరమంతటా ముద్రలు చరిచి, వరిపిండి చల్లి బలిపశువులా అలంకరించి తలారులు వీధుల్లో తిప్పుతూంటే సామాన్య ప్రజలు చూసి ఆశ్చర్యపడ్డారు – ఎందరికో ఆశ్రయం యిచ్చిన మంచి గంధపు చెట్టువంటి చారుదత్తుణ్ని యీనాడు కాలయముడు గొడ్డలితో నరికి వేస్తున్నాడే, మనుష్య జన్మ ఎంత వింతైనది అని. ధనిక స్త్రీలు కిటికీలు సగం తెరిచి చూసి అయ్యో చారుదత్తా అంటూ కన్నీరు కారుస్తున్నారు. ఇంతలో మైత్రేయుడు చారుదత్తుని కొడుకు రోహసేనుణ్ని వెంటపెట్టుకుని వచ్చాడు. తలారుల అనుమతితో చారుదత్తుడు కొడుకుతో మాట్లాడి ధైర్యం చెప్పాడు.
శకారుడు తన మేడలో గొలుసులతో బంధించి వుంచిన స్థావరకుడికి తలారుల చాటింపు వినబడింది. హంతకుడు శకారుడే అని జనాలకు ఎలా చెప్పాలి? మేడ మీద నుంచి దూకి గుంపులో పడాలి. దూకితే చచ్చిపోతే? ఒక మంచివాణ్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయినా తప్పు లేదు అనుకుని గొలుసులతో సహా దూకేశాడు. ప్రాణం పోలేదు. పైగా బంధించి వున్న గొలుసు తెగిపోయింది. స్థావరకుడు తలారుల వద్దకు వచ్చి వసంతసేనను చంపినది శకారుడే తప్ప చారుదత్తుడు కాదు అని ప్రకటించాడు. చారుదత్తుడు సంతోషించాడు 'నేను చావుకై భయపడటం లేదు, అపకీర్తికై భయపడుతున్నాను. నీ మాటల వలన నాపై నింద తొలగిపోతే అంతే చాలు' అన్నాడు. స్థావరకుడి మాటలతో గందరగోళ పడిన తలారులు చాటింపు ఆపివేశారు. సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)