ముందే చెప్తున్నా – చివరిదాకా చదివినా నేతాజీ ఎప్పుడు చచ్చిపోయారో, అసలు చచ్చిపోయారో లేదో కూడా నేను చెప్పటం లేదు, ఎందుకంటే నాకు తెలియదు, నా హైస్కూలు రోజుల్నించి యీ మిస్టరీ గురించి వింటున్నా. ఇప్పటికీ మిస్టరీ విడలేదు. వచ్చే జన్మలో కూడా యిక్కడే పుట్టినా అప్పటికి కూడా యీ మిస్టరీని అలాగే కాపాడతారు. బెంగాల్ అనే ప్రాంతం మనదేశంలో అంతర్భాగంగా వున్నంతకాలం, అక్కడ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నంతకాలం యీ చిక్కుముడిని చిక్కుముడిగానే వుంచి అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని అటూయిటూ కళ్ల ముందు ఆడిస్తారు. ఇటీవలి కాలంలో నేతాజీ ఫైళ్ల గురించి మీరంతా చదివే వుంటారు. ఆయన చితాభస్మం టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఒక పాత్రలో వుందని, దాని సంరక్షణకు భారతప్రభుత్వం అద్దె చెల్లిస్తోందని చదివేవుంటారు. అది నేతాజీ అవశేషమో కాదో తెలుసుకోవడానికి ఒక్క డిఎన్ఏ టెస్టు చేయిస్తే చాలు కదా అని నాలాగే మీకూ అనిపించి వుంటుంది. అలాటి డిఎన్ఎ టెస్టు చేయడానికి సాధనసంపత్తి లేదా? మన దగ్గరే బోల్డంత టెక్నాలజీ వుంది. పోల్చి చూడడానికి మనుష్యులు లేరా? బోసు సోదరుల పిల్లలే చాలామంది వున్నారు. స్వయానా ఆయన కూతురుంది. పోనీ వాళ్లకేమైనా అభ్యంతరాలున్నాయా? సాక్షాత్తూ కూతురే అడుగుతోంది – ఆ పరీక్ష చేసి అవునో కాదో తేల్చేయండి అని. మరి ఆ పని ఎందుకు చేయరు? ''సత్యమేవ జయతే'' అని నుదుటి మీద రాసి పెట్టుకున్న మనం సత్యాన్ని తెలుసుకోవడానికి యింత సులభమైన మార్గం వుండగా దాన్ని వదిలిపెట్టి ఫైళ్ల వెనక్కాల పడడమేం?
సరే, పడ్డారు, పోనీ అవైనా అన్నీ బయటపెడుతున్నారా? లేదే! 2015 అక్టోబరు 14న 33 ఫైళ్లు డిక్లాసిఫై చేసి నేషనల్ ఆర్కయివ్స్కు యిచ్చారు. 2016 జనవరి 23 న 100 ఫైళ్లు డిక్లాసిఫై చేశారు, సంతోషం. తర్వాత నుంచి నేషనల్ ఆర్కయివ్స్వారు నెలకు 25 ఫైళ్ల చొప్పున రిలీజు చేస్తూ పోతారట. ఈ లెక్కేమిటో, సినిమాలో హీరో లాంచింగ్‌లో పిడికిలి, మణికట్టు, భుజం, ఛాతీ.. యిలా ఒక్కోటీ రివీల్ చేస్తూ పోయినట్లు వాయిదాల పద్ధతి విడుదలలో లాజిక్ ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ నాకు కొడవంటిగంటి వారి డిటెక్టివ్ కేయాస్ కథ – ''వింత భూకంపం'' గుర్తుకు వస్తుంది. ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలలు విస్తారంగా చదివేవారు. రచయితలు సస్పెన్స్ సాగదీయడానికి సమాచారం కొద్దికొద్దిగా అందిస్తూ టెంపో మేన్‌టేన్ చేసేవారు. వారిలో కుటుంబరావు గారి బావమరిది కొమ్మూరి సాంబశివరావుగారు ఒకరు. అలాటి రచనలను ప్యారడీ చేస్తూ కుటుంబరావుగారు టివి శంకరం పేరుతో 'డిటెక్టివ్ కేయాస్' కథలన్ని చాలా వ్యంగ్యంగా రాశారు. 'వింత భూకంపం' కథలో పద్మావతి అనే ఒకావిడ చనిపోయింది. భర్తను డిటెక్టివ్ విచారిస్తున్నాడు. భర్త 'ఇంకో విషయం చెప్పాలి సార్, మా ఆవిడ చచ్చేముందు గుడ్డల సాయిబొకడు వచ్చి ఏదో బట్టలు చూపించి వెళ్లాడు…' అని చెప్పబోతూ వుంటే డిటెక్టివ్ కేయాస్ '..అది కథలో యిప్పుడే రాదులే, చెప్పొద్దు' అంటాడు. విచారణలో భాగంగా ఒకావిణ్ని కలుస్తాడు. 'పద్మావతి తెలుసా?' అని అడిగితే '… మా అమ్మాయితో కలిసి మైసూరులో హాస్టల్లో వుండేది. తనతో మాట్లాడతారా?' అని అడుగుతుందామె. 'మీ అమ్మాయితో యిప్పుడు మాట్లాడకూడదు. ఇంకా చాలా పేజీలు గడవాలి.' అంటాడు డిటెక్టివ్. ఆయన ప్యారడీ గొప్పగా వుంది అనుకున్నాను కానీ నిజజీవితంలో యిప్పుడు చూస్తున్నాను. డిటెక్టివ్ పుస్తకాల రచయితకి పుస్తకం బరువు పెరగాలన్న యావ. మన ప్రభుత్వానికి బెంగాల్ ఎన్నికల దాకా దీన్ని సాగదీయాలన్న తపన.
బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మమతా బెనర్జీ, మోదీ యిప్పుడు బోసు పేరును వాడుకోవాలని పోటీ పడుతున్నారు. కాంగ్రెసు బోసుకు అన్యాయం చేసింది, తగిన స్థానం కల్పించలేదు, నెహ్రూ అసూయతో బోసు స్మృతిని చెరిపేద్దామని చూశాడు, మేం ఆ కుట్రను బయటపెట్టి బోసు పట్ల మా భక్తిని ప్రదర్శిస్తున్నాం అని చెప్పుకోవడమే యిద్దరి లక్ష్యం. బోసు అంతర్ధానం గురించి ఎంతోమంది ఎన్నేళ్లయినా రిసెర్చి చేస్తూనే వుంటారు. జర్నలిస్టులు ఏదో ఒక విషయాన్ని తవ్వుతూనే వుంటారు. 2015 ఏప్రిల్ లో భారత మీడియా ఒక విషయాన్ని బయట పెట్టింది – 'బోసు కుటుంబంపై 20 ఏళ్ల పాటు భారత ప్రభుత్వం నిఘా వేసింది' అని. ఫలానా కారణం చేత వేసింది, ఫలానా ఫలానా విషయాలు కూపీ చేసి లాగింది అని కథనంలో లేదు. నిఘా వేసిందని మాత్రమే బయటకు రాగానే దేశంలో గగ్గోలు పుట్టింది. కేంద్రప్రభుత్వ వైఖరిపై సందేహాలు పొడసూపాయి. వెంటనే కేంద్రం చేయవలసిన పని – నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసి ఆ నాటి పరిస్థితులు యివి, అందువలన చేయవలసి వచ్చిందనో, లేకపోతే పొరపాటైంది, జాతిని క్షమించమని కోరుతున్నామనో చెప్పడం! కానీ మోదీ సర్కారు అలాటిది ఏమీ చేయలేదు. విషయాన్ని నానుస్తూ, నిజంతో దోబూచులాడుతూ పోయింది.
నిజానికి బోసు ఫైళ్లను డీక్లాసిఫై చేసి నిజానిజాలు జాతి ముందు వుంచుతామని మోదీ ఎప్పుడో వాగ్దానం చేశారు, కానీ నిలబెట్టుకోలేదు. సమాచార హక్కు కింద ఎవరో అడిగితే 'భారతదేశానికి యితర దేశాలతో వున్న సంబంధాలు దెబ్బ తింటాయి కనుక వాటిని విడుదల చేయలేం' అని జవాబిచ్చారు. మరి యీనాడు కొద్దికొద్దిగా రిలీజు చేస్తున్నారు, యిప్పుడు దౌత్యసంబంధాలు దెబ్బ తింటాయన్న భయం లేదా? ఇప్పటికే తినేశాయా? ఇతర దేశాల్లో రహస్యఫైళ్లను డిక్లాసిఫై చేయడానికి కాలపరిమితి వుంటుంది. మన దేశంలో లేదు. అందువలన ఎన్నాళ్లు దాచి వుంచినా ఎవరూ అడగలేరు. పాలకుల రాజకీయప్రయోజనాలకు అనుగుణంగా దాచి వుంచుతున్నారు. కానీ బోసు కుటుంబంపై నిఘా విషయం చాలా గంభీరమైన విషయం కాబట్టి జాతికి వివరణ యివ్వవలసిన అవసరం వుంది. దానివలన ఆనాటి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినా భరించవలసినదే. ఆ ప్రభుత్వాలను నడిపిన వ్యక్తులు యిక్కడ ప్రధానం కాదు, కేంద్రం అనేది ఒక ఎంటిటీ. అది నిరంతరం కొనసాగుతోంది. సంజాయిషీ చెప్పవలసిన బాధ్యత దానికి వుంది. కానీ ప్రధాని మోదీ ఆ బాధ్యత విస్మరించారు. రహస్యాన్ని కాపాడుతూ సందేహాలను పెంచిపోషించ దలచారు. మమతా బెనర్జీ యీ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. రాష్ట్రప్రభుత్వపు ఆర్కయివ్స్‌లో వున్న 64 నేతాజీ ఫైళ్లను 2015 సెప్టెంబరులో పబ్లిక్కు విడుదల చేసింది. వారం రోజుల తర్వాత 1938 నుండి 1947 వరకు నేతాజీకి సంబంధించిన కాబినెట్ పేపర్లను బహిర్గతం చేసింది. దాంతో బెంగాల్లో ఆమె పాప్యులారిటీ పెరిగిపోయి, కాంగ్రెసు వ్యతిరేక ఓట్లన్నీ తృణమూల్‌కు పడిపోతాయన్న శంక కలిగిందేమో, బిజెపి ప్రభుత్వం నేతాజీ పుట్టినరోజు జనవరి 23 న నేతాజీ కుటుంబాన్ని పిలిచి వారి ఎదురుగా 100 ఫైళ్లు విడుదల చేసింది. వాటిలో 15 వేల పేజీలున్నాయి. ఇకపై నెలనెలా పాతిక ఫైళ్లను విడుదల చేస్తామని వాగ్దానం చేశారు. ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఫైళ్ల ద్వారా కొత్తగా తెలిసిన విషయం ఏమీ లేదు. రాబోయే ఫైళ్ల ద్వారా కూడా ఏమైనా తెలుస్తుందో లేదో భగవంతుడికే తెలియాలి. ఈ లోపున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రభుత్వాలకు కావలసినది అదే!
నేను హైస్కూల్లో చదివే రోజుల్లోనే నేతాజీ చచ్చిపోలేదట, బ్రిటిషు వాళ్ల కళ్లు కప్పడానికై, బోసు కావాలని తన చావు వార్త సృష్టించి, మారు వేషంలో దేశంలో ప్రవేశించి, ఉత్తర ప్రదేశ్‌లో గుమ్నామీ బాబా పేరుతో వున్నాడట అని చెప్పుకునేవాళ్లం. అప్పట్లో సమర్ గుహ అని ఫార్వర్డ్ బ్లాక్ (నేతాజీ స్థాపించిన పార్టీ) ఎంపీ వుండేవాడు. బోసు బతికే వున్నాడని ప్రచారం చేయడమే అతనికి ప్రధాన వ్యాపకం. ఓసారి బోస్ ఫోటో యిదిగో అంటూ ఒక వృద్ధుడి ఫోటో విడుదల చేసేశాడు. తీరా చూస్తే బోసు పాత ఫోటోలోని మొండెం తీసుకుని పైన ఆయన అన్నగారు శరత్ చంద్ర బోసు తల అతికించేశాడు. అప్పట్లో ఫోటోషాప్ లేదు కాబట్టి యీ అతుకు బాగా తెలిసిపోయి అందరూ హేళన చేశారు. అయినా ఆయనను బెంగాలీలు ఆదరిస్తూనే వచ్చారు. ఎందుకంటే వాళ్లకు నచ్చినట్లుగా సత్యాన్ని వక్రీకరిస్తున్నాడు కాబట్టి! 1977లో ఎమ్ఓ మత్తయ్ తన పుస్తకంలో రాశాడు – ఇంకో వందేళ్లు పోయినా బోసు బతికే వున్నాడని బెంగాలీలు నమ్ముతారు, బోసు కూడా మామూలు మనిషేనని వాళ్లను నమ్మించడం కష్టం, నిజాన్ని తట్టుకోలేరు అని.
నేతాజీ స్వభావాన్ని ఏ మాత్రం తెలిసున్నవారైనా యీ బాబా ఉదంతాన్ని కొట్టిపారేస్తారు. బోసు ప్రధానంగా రాజకీయనాయకుడు. ఆధ్యాత్మిక గురువు కాదు. అవకాశాలు వస్తే వదులుకునేవాడు కాదు. కాంగ్రెసు అధ్యక్షపదవికి వరుసగా రెండోసారి నిలబడకూడదనే సంప్రదాయం వున్నా దాన్ని ధిక్కరించి, నిలబడి గెలిచినవాడు. కాంగ్రెసులోంచి బయటకు వచ్చాక ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెట్టినవాడు. అలాటివాడు మారుపేరుతో అనామకంగా ఎందుకుంటాడు? ప్రజల్లో తిరిగి స్వతంత్ర భారత ప్రభుత్వ విధానాలకు మద్దతుగానో, వ్యతిరేకంగానో ఉద్యమించడా? పైగా అతనికి సన్యాసం తీసుకునేటంత వైరాగ్యం వుందని ఎవరు చెప్పారు? అతనికి కుటుంబంతో చాలా అనుబంధం. అన్నగారు శరత్ బోసు అంటే చాలా గౌరవాభిమానాలు. లేటుగా 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న భార్య (జర్మనీలో వుండగా ఆయన వద్ద సెక్రటరీగా పనిచేసిన ఎమిలీ స్కెంకెల్) అన్నా, 46 ఏళ్ల వయసులో పుట్టిన కూతురన్నా కూడా యిష్టం వుండే వుంటుంది. వాళ్లను కూడా ఆయన తన ఉనికి తెలియపరచలేదు. ఈ విషయాన్నే బోసు కూతురు 73 ఏళ్ల అనితా బోస్ ఫాఫ్ ఎత్తి చూపింది. మా నాన్న హృదయం లేని మనిషి కాడు. బతికి వుండి వుంటే, వీలు వుండి వుంటే తప్పక మాతో సంపర్కం పెట్టుకునేవాడు అంది.
ఇక రెండో పుకారేమిటంటే బోసు రష్యాలో ఖైదీగా వున్నాడని. మాస్కోలో రాయబారిగా వుండగా డా|| రాధాకృష్ణన్ ఆయన్ని చూశారని ..ట కబుర్లుగా చెప్పుకునేవారు. రష్యా ప్రమేయం నాకు అర్థం కాదు. బోసు జపాన్‌కు సన్నిహితుడు. యుద్ధం సాగుతూండగానే బోసుకు, జపాన్ సైన్యానికి విభేదాలు వచ్చాయి. బర్మా వరకు ఫర్వాలేదు కానీ ఇండియాలో ఐఎన్ఏ (ఆజాద్ హింద్ ఫౌజ్ అనబడే ఇండియన్ నేషనల్ ఆర్మీ) తప్ప జపాన్ సైన్యం అడుగుపెట్టడానికి వీల్లేదని బోసు నిబంధన విధించడం వారికి కొరుకుడు పడలేదు. తామే సైన్యం, ఆయుధాలు అన్నీ సమకూర్చి కీలుబొమ్మలా వుంటాడని అనుకుని నిలబెట్టిన యీ పెద్దమనిషి తమకే ఎదురుతిరుగుతున్నా డేమిట్రా అనుకున్నారు. అందువలన వాళ్లే విమానప్రమాదాన్ని కల్పించారేమో, విరాళాలుగా సేకరించిన బంగారంలో చాలా భాగం కొట్టేశారేమో తెలియదు. అలా కాదు, ఆయన 1945 ఆగస్టు 17 న మంచూరియాకై ఎక్కిన విమానం అక్కడ క్షేమంగా చేరి, మంచూరియాలో రష్యన్లకు యుద్ధఖైదీగా పట్టుబడ్డాడు అనుకుని చూడాలి. మంచూరియాలో జపాన్ నిలబెట్టిన కీలుబొమ్మ ప్రభుత్వంపై రష్యా ఆగస్టు 7నే దాడి చేసింది. అక్కడి ప్రమాదం తెలిసే బోసు విమానం ఎక్కారనుకోవాలి. ఎందుకు? యుద్ధంలో జపాన్ ఓడిపోవడం చేత గెలిచిన రష్యాను ఒప్పించి, ఇండియాపై దాడి చేయమని అడుగుదామనిట! బోసు జర్మనీకి వెళ్లి క్యాంపు వేసినా ఇండియాపై దాడికి హిట్లర్‌ను ఒప్పించలేకపోయాడు. ఇక జపాన్‌తో చేతులు కలిపితే అది దెబ్బ తింది. రష్యా అప్పటికే తూర్పు యూరోప్‌ను ఆక్రమించి వుంది. ఇండియాపై ఆసక్తి ఏముంటుంది? అయినా బోసు వెళ్లి అడుగుదామని అనుకున్నారు.
సరే, రష్యాకు ఆయన చిక్కితే వాళ్లు ఆయన్ను కుదరదు అని చెప్పి వెనక్కి పంపించి వుండాలి, లేదా జపాన్‌తో చేతులు కలిపిన శత్రువుగా పరిగణించి యుద్ధఖైదీగానైనా విచారించి వుండాలి. లేదా అమెరికాకో, బ్రిటన్‌కో అప్పచెప్పాలి. తన పెరల్ హార్బర్‌పై దాడి చేసినందుకు జపాన్‌మీద అమెరికాకు కసి కాబట్టి, జపాన్‌తో కలిసినందుకు బోస్‌మీద కోపం వుండి వుండాలి. జపాన్‌తో కలిసి తన ప్రాంతాలపై దాడి చేసినందుకు బ్రిటన్‌కు కసి వుండాలి. అందువలన వాళ్లు బోసును తమకు అప్పగించమని రష్యాను కోరి వుండాలి. రష్యాకు బోసుతో డైరక్టు వైరం, స్నేహం ఏమీ లేవు. నిక్షేపంలా అప్పగించేయవచ్చు. లేదూ చంపి పారేయవచ్చు. ఊరికే జైల్లో కూర్చోబెట్టి తిండి పెట్టవలసిన అగత్యం ఏముంది? స్టాలిన్ రోజుల్లో మహామహా వాళ్లే ఉఫ్‌మని ఎగిరిపోయేవారు. అలాటిది ఒక జపాన్ మిత్రుణ్ని దాచి వుంచుకుని ప్రయోజనం ఏముంది? వేరేవాళ్లతో ఎక్స్ఛేంజ్ చేయడానికి వీలుగా కొందరిని సజీవంగా వుంచుకుంటారు. అలాటి ఖైదీల మార్పిడి కూడా దరిమిలా ఏమీ జరగలేదు. బోసు ఇండియాకు తిరిగి వస్తే తన పాప్యులారిటీకి దెబ్బ కాబట్టి రష్యాలోనే అతన్ని బంధించి వుంచమని నెహ్రూ కోరి వుంటాడని వూహిద్దామన్నా 1945 నాటికి నెహ్రూ పెద్ద లీడరేమీ కాదు, భారతదేశానికి స్వాతంత్య్రం యిస్తారని అప్పటికి ఊహల్లో కూడా లేదు. రెండవ ప్రపంచయుద్ధానంతరం చర్చిల్ ఓడిపోయి లేబరు పార్టీ బ్రిటన్‌లోకి అధికారంలోకి రావడంతోనే స్వాతంత్య్రం సిద్ధించింది. ప్రధాని ఎవరవుతారో అని కాస్త ఊగిసలాట జరిగి నెహ్రూ కావడం జరిగింది. అలాటప్పుడు రెండేళ్లు ముందుగానే నెహ్రూ మాట వినడానికి స్టాలిన్ అంత చిన్న లీడరేమీ కాదు. ఒకవేళ నెహ్రూకి కసి వుందనుకున్నా, రష్యా నెహ్రూ మాట విందనుకున్నా అలాటి పరిస్థితుల్లో బోస్‌ను చంపిపారేసి వుంటారు కానీ జైల్లో కూర్చోబెట్టి మేపుతారా? తప్పించుకుని పారిపోతే ఎప్పటికైనా ప్రమాదమే కదా! -(సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2016)