జర్మన్ ఇన్‌కమ్‌టాక్స్ శాఖ వారు కార్నిలియస్ గుర్లిట్ అనే పన్ను ఎగవేతదారుడి యింటిపై దాడి చేసి అటకమీద జాడీలు, చీకటి గదులు సోదా చేసినపుడు అతని యింట్లో వాళ్లకు డబ్బు మూటలు కనబడ లేదు కానీ, 1.3 బిలియన్ డాలర్ల విలువైన చిత్రపటాలు, కళాఖండాలు కనబడ్డాయి. గుర్లిట్ తండ్రి హిల్డ్‌బ్రాండ్ గుర్లిట్ కళాఖండాలను ఎగుమతి చేసే వ్యాపారంలో వుండేవాడు. అతను 1930-40లలో కొన్న ఆ బొమ్మల వెనక చరిత్ర వుంది. నాజీలు పోలండ్‌పై, ఫ్రాన్సుపై దాడి చేసినపుడు అక్కడి ధనిక యూదుల యిళ్లల్లో వున్న ఖరీదైన చిత్రాలను నాజీలు స్వాధీనం చేసుకునేవారు. ఒక్కోప్పుడు వాళ్లపై ఒత్తిడి చేసి తక్కువ ధరకు కొనేవారు. మరొకప్పుడు అసలేమీ యిచ్చేవారు కారు. ఫ్రాన్సులో 1940-44 మధ్య అలా వశపరచుకున్న పెయింటింగులు, యితర వస్తువులు లక్షకు మించి వుంటాయని ఒక అంచనా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రకారులు వేసిన యీ చిత్రాలు యూదుల యిళ్లల్లో వున్నాయి కాబట్టి అవి భ్రష్టుపట్టిపోయాయని నాజీ ప్రాపగాండా మంత్రి గోబెల్స్ నిర్ణయించాడు. అవి పారేయడం కంటె యితర దేశాలకు అమ్మి డబ్బు గడిస్తే మంచిది కదా అని అతని ఉద్దేశం.
ఇతర దేశాలలోని ప్రముఖులతో ధనికులతో లింకులు వున్నవాడెవడాని వెతికితే యిదిగో యీ హిల్డ్‌బ్రాండ్ గుర్లిట్ కనబడ్డాడు. అతని నాయనమ్మ యూదురాలు, తాత జర్మన్. యూదు కనక్షన్ వున్నా అవసరం వుంది కాబట్టి ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా యితని ద్వారా చాలా అమ్మించాడు. అలా అమ్మగా మిగిలిపోయినవాటిని గుర్లిట్ తన యింట్లోనే వుంచుకున్నాడు. అతని తదనంతరం అతని కొడుక్కి వారసత్వంగా యీ బొమ్మలు వచ్చాయి. కొడుకు వేరే వ్యాపారం చేసి దెబ్బ తిన్నాక యీ బొమ్మలను ఒక్కొక్కటీ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం కంటపడ్డాయి. నాజీలు బలవంతంగా స్వాధీనం చేసుకున్న కళాఖండాల గురించి ద్ధానంతరం యూదులు ఆందోళన చేశారు. చాలామందికి వెనక్కి యిచ్చేశారు కూడా. వ్యక్తి చనిపోతే వాళ్ల వారసులకు యిచ్చేశారు. అయినా చాలా చిత్రాలు మిస్ అయిపోయాయి – యీ విధంగా! 2007లో ఒక జర్మన్ ఎక్స్‌పర్ట్ ఇలా దోచుకున్న ఆర్ట్ గురించి ఒక పుస్తకం రాసి ప్రచురించాడు. నాజీల ఘోరాలు తవ్వే కొద్దీ బయటకు వస్తూనే వుంటాయి లాగుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్