తమిళనాడులోని కొంగునాడు (కోయంబత్తూర్, ఈరోడ్, తిరుప్పూర్, సేలం, కరూరు ప్రాంతాలు) మాండలికానికి, సంస్కృతికి ఎంతో సేవ చేసిన పెరుమాళ్ మురుగన్ అనే ఒక సాహిత్యకారుడు ఇప్పుడు నానా ఇబ్బందులూ పడుతున్నాడు. దీనికంతా కారణం నాలుగేళ్ల క్రితం అతను రాసిన నవల! అప్పుడు రాని గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దాని వెనుక మతరాజకీయాలున్నాయి కాబట్టి అనే సమాధానం వస్తుంది. ముందుగా మురుగన్ చేసిన భాషాసేవ గురించి తెలుసుకోవాలి. 1983లో 17 వ ఏట దక్షిణ తమిళనాడులోని కరిసాల్ ప్రాంతపు మాండలికానికి ఎవరో తయారు చేసిన నిఘంటువు చూశాక అతనికి తన కొంగునాడుకి మాత్రం ఇలా ఎందుకు చేయకూడదా అనిపించింది. 17 సంవత్సరాల కృషితో దాన్ని 2000 సం॥ విడుదల చేశాడు. నిజానికి తమిళ సాహిత్యంలో కథలు, కవిత్వాలలో చాలాభాగం చెన్నయ్ నగర మధ్యతరగతి జీవనం గురించి రాసినవే, గ్రామీణ ప్రాంతాలను వర్ణించవలసి వస్తే తంజావూరు, తిరునల్వేలి జిల్లాల గురించో రాసినవే. కొంగునాడు నుంచి షణ్ముగసుందరం అనే ఆయన 1942లో రాసిన ‘‘నాగమ్మాళ్’’ అనే నవల ప్రసిద్ధం. ఆ తర్వాత తన ప్రాంతం నుండి ఎవరూ పెద్దగా రాయటం లేదని గ్రహించిన మురుగన్ 1991 నుండి ధారాళంగా ఫిక్షన్ రాయడం మొదలుపెట్టాడు. ఇప్పటికి 35 పుస్తకాలు రాశాడు. అంతేకాదు కొంగునాడు చరిత్ర గురించి టి ఎ ముత్తుస్వామి కోనార్ రాసిన అలభ్యపుస్తకాన్ని సంపాదించి మళ్లీ వెలుగులోకి తెచ్చాడు.
ఇలాంటి మురుగన్ ఈ జనవరి న పోలీసుల సలహాపై వూరు విడిచి కుటుంబంతో సహా పారిపోవలసి వచ్చింది. మర్నాడు అతని ‘‘మాతొరుభాగన్’’ అనే నవలకు నిరసనగా తిరుచెంగోడులో బంద్ నిర్వహించబడింది. దీనికి ముందు డిసెంబరు 26 న కొంతమంది చేరి అతని పుస్తకం ప్రతులను తగలబెట్టడం, పుస్తకాన్ని బహిష్కరించి రచయితను ఖైదు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అతన్ని బెదిరిస్తూ ఫోన్‌కాల్స్ కూడా రాసాగాయి. ఇంతకీ ఆ పుస్తకంలో కథేమిటి? నూరేళ్ల క్రితం జరిగిన కథ అది. సంతతి లేని పొన్న, కాళీ అనే దంపతులు పిల్లల కోసం తపిస్తారు. ఇరుగుపొరుగువారి సూటిపోటి మాటలు పడలేక దేవుళ్లకు మొక్కుతారు. గుళ్లకు తిరుగుతారు. చివరకు తిరుచెంగోడు అనే వూళ్లో అర్ధనారీశ్వరాలయంలో ప్రతీ ఏటా జరిగే వైకాశీ విశాఖం రథోత్సవంలో పాల్గొంటారు. పూర్వకాలంలో కొన్ని పండుగలలో స్త్రీపురుషులు ఇష్టం వచ్చినట్లు చరించే ఆచారం వుండేది. హోలీ పండగకు మూలం అదేనంటారు తాపీ ధర్మారావు గారు తన ‘‘పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు’’ పుస్తకంలో. వివాహిత స్త్రీలు తమ రవికలను కుప్పగా పోస్తే పురుషులు వచ్చి ఏరుకునేవారట. ఎవరి రవిక వస్తే ఆ స్త్రీతో అతను శయనించవచ్చు.
అలాంటి సందర్భాల్లో ఒక స్త్రీకి తన మొగుడే తగిలాడట. అప్పుడే ‘‘పండగనాడూ పాత మొగుడేనా?’’ అనే సామెత వచ్చిందట. ఇలాంటి సందర్భాల్లో జరిగే రతిక్రీడను అప్పటి సమాజం తప్పుగా పరిగణించేది కాదు. మహారాష్ట్రను ఏలిన పీష్వాలు ‘‘కంచుకక్రీడ’’ పేరుతో ఇలాంటి కేళీవిలాసాలు జరిపేవారట. కొంగునాడు ప్రాంతంలో అప్పట్లో ఆ వూళ్లో ఇలాంటి ఆచారం వుండేది. ఆ సందర్భంగా గర్భవతులైన స్త్రీలు ఆ పిల్లలను ‘సామి కొడుత్త పిళ్లయ్’ (దేవుడిచ్చిన సంతానం) గా భావించేవారు. కాబట్టి కాళీ దానిలో పాల్గొందని రచయిత రాశారు. నాలుగేళ్లగా నవలలోని ఆ వుదంతం ఎవరికీ తప్పుగా తోచలేదు.
మురుగన్ పుస్తకాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే అతనికి సాహిత్య ఎకాడమీ ఎవార్డు వచ్చే అవకాశం వుందని భావించిన కొందరు అభిమానులు ఆ పుస్తకాన్ని ‘‘ఒన్ పార్ట్ ఉమన్’’ పేరుతో 2014లో అనువదించారు. అవార్డు మాట ఎలా వున్నా ఆ పుస్తకం ఉత్తర భారతంలో వున్న హిందూత్వవాదుల కళ్లల్లో పడింది. తమిళనాడులో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్న బిజెపి సమర్థకులైన హిందూత్వవాదులకు ఈ పుస్తకంలో మార్గం గోచరించింది. ఇక మురుగన్‌పై దాడి మొదలుపెట్టారు. హిందూ మున్నని, కొన్ని కులసంఘాలు కలిసి మురుగన్ కొంగునాడు స్త్రీల పరువు తీశాడని, తిరుచెంగోడుకు అప్రతిష్ట తెచ్చాడని దాడులు మొదలుపెట్టారు. కావాలంటే రాబోయే ముద్రణలో ఆ వూరిపేరు తీసేస్తానని, అభ్యంతరాలున్న భాగాలు తొలగిస్తానని మురుగన్ ఆఫర్ చేశాడు. వాళ్లు వినటం లేదు. పుస్తకం మొత్తం బహిష్కరించాలని పట్టుబడుతున్నారు. పోలీసులు కలగజేసుకుని హిందూ సంఘాలతో మురుగన్‌కు సమావేశం ఏర్పాటు చేశారు. చర్చలకు మురుగన్ వెళ్లాడు కానీ ఆ సంఘాల ప్రతినిథులు ఎవరూ రాలేదు. వాళ్లకు కావలసినది వివాదం, పరిష్కారం కాదు.
పుస్తకంలో నుండి అసందర్భంగా కొన్ని భాగాలు తీసుకుని, వాటిని కరపత్రాలుగా వేసి, చూడండి హిందూమతాన్ని ఎలా అవమానపరిచాడో అంటూ వూళ్లో పంచుతున్నారు. నిజానికి భర్త లేనప్పుడు, అశక్తుడైనపుడు వేరే వారి చేత పిల్లలు కనడం హిందూ సమాజంలో అనాదిగా వుంది. దాన్ని ‘నియోగధర్మం’ అంటారు. అలాంటి సందర్భాల్లో పుట్టిన బిడ్డ బీజదానం చేసిన పురుషుడికి చెందడు. క్షేత్రం స్త్రీది కాబట్టి, ఆమెకు యమాని ఐన ఆమె భర్తకు చెందుతాడు. భారతంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అలా పుట్టినవారే. వారి తండ్రులు చనిపోతే తల్లులతో వేదవ్యాసుడు శయనించాడు. వారిని ఎవరూ తక్కువగా చూడలేదు. ధృతరాష్ట్రుడు విశాలమైన కురురాజ్యాన్ని రాజుగా ఏలాడు. అతని నాయనమ్మ అయిన సత్యవతి వివాహం చేసుకోకుండానే పరాశరుని చేత వ్యాసుణ్ని కన్నది. అయినా ఆమెను పెళ్లాడడానికి శంతనుడికి అభ్యంతరం లేకపోయింది. పరశురాముడు భూమండలమంతా తిరిగి తిరిగి క్షత్రియుడన్న ప్రతివాడిని సంహరించాడు. అప్పుడు రాణులు ఇతరులతో శయనించి పిల్లలను కన్నారు. అలా పుట్టినవారు రాజులయ్యారు. క్షేత్రప్రధానంగా క్షత్రియులు గానే, తమ దివంగత తండ్రులకు వారసులుగానే గుర్తింపబడ్డారు.
ఇలాంటి తర్కాలు వినడానికి అక్కడి హిందూ సంఘాలు తయారుగా లేవు. వీరికి దన్నుగా నిలబడడానికి మరి కొన్ని వర్గాలు ముందుకు వచ్చాయి. మురుగన్ రచయిత మాత్రమే కాదు, గవర్నమెంటు కాలేజీలో లెక్చరరు కూడా. కొన్ని కులసంఘాలు తిరుచెంగోడు, నామక్కల్ ప్రాంతాల్లో స్కూళ్లను, కాలేజీలను ప్రారంభించి పూర్తి వ్యాపారంగా మార్చేశాయి. వాటిని విమర్శిస్తూ మురుగన్ పెద్ద ఉద్యమం నడుపుతున్నాడు. వాళ్లంతా ఇతనిపై పగబట్టారు. యు. సహాయం అనే అధికారి సేలం జిల్లా కలక్టరుగా ఉండగా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాడు. వారు అతనిపై ధ్వజమెత్తగా మురుగన్ సహాయంకు అండగా నిలిచి ప్రజల మద్దతు కూడగట్టాడు. ఇప్పుడు వీరంతా కలిసి మురుగన్‌ను వూరి నుంచి తరిమివేశారు. అయితే తమిళనాడులోని సాహితీకారులందరూ మురుగన్‌కు అండగా నిలిచారు. మురుగన్ పుస్తకాన్ని ప్రచురించిన ప్రచురణకర్త ఏ మాత్రం జంకకుండా వ్యవహారాన్ని కోర్టుకి తీసుకెళతా నంటున్నాడు.
ఎమ్బీయస్ ప్రసాద్