నిర్భయ హంతకులను ఉరి తీసేటప్పటికి దేశం హమ్మయ్య అని నిట్టూర్చింది. ఎప్పుడో ఉరి తీయవలసిన వారు ఎన్ని వాయిదాలు వేయించుకున్నార్రా బాబూ, అసలు మనం బతికుండగా వీళ్ల ఉరిని చూస్తామా లేదా, ఒక అమాయకురాలిని నిర్దయగా చంపేశారే, తమ ప్రాణాల దగ్గరకి వచ్చేసరికి క్షమాభిక్ష పెట్టమని ఎంత ప్రాధేయపడ్డారో చూడు, ఒక్కో వెధవని నాలుగేసి సార్లు ఉరి తీయాల్సింది, చట్టంలో ఉన్న వెసులుబాట్లు అన్నీ వాడుకుంటున్నారు, ఎవరు వీరికి సలహాలిస్తున్నది, వాడిని పట్టుకుని తన్నాలి- ఇలా చాలాసార్లు అనుకున్నాం. ఈ నేరస్తులే కనుక పలుకుబడి ఉన్న ధనికులో, రాజకీయ నాయకుల సంతానమో అయితే యిలాటి వాయిదాలకు పెద్దగా స్పందించేవారం కాదు. ఇవన్నీ మామూలే అని సర్దుకుపోయేవాళ్లం. కూటికి లేని వెధవలు, వీళ్లు కూడా ఉరికంబం ఎక్కకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారే అని విలవిలలాడిపోయాం.
న్యాయవిచారణలో చాలా పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది, తప్పుడు ఆరోపణలతో అమాయకులకు కూడా శిక్ష పడే ప్రమాదం ఉంది అనే ఎఱికతో మన రాజ్యాంగనిర్మాతలు న్యాయవ్యవస్థలో అడుగడుగునా అనేక స్పీడుబ్రేకర్లు ఏర్పరచారు. ఎక్కడా అన్యాయం జరగలేదని నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యేదాకా శిక్ష పడకుండా చూశారు. ఒక వ్యక్తి తీర్పుతోనే సరిపెట్టకుండా, పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ జాగ్రత్తను ఉపయోగించుకుని న్యాయం పొందేవారు కొందరైతే, దురుపయోగం చేసి, అన్యాయం చేసేవారు కొందరుంటున్నారు. అందుకే సత్వరన్యాయం చేయాలని అంటూంటారు.
సత్వరన్యాయం అంటే పోలీసులు నేరం జరిగిన తర్వాత నిష్పాక్షికమైన, సమర్థవంతమైన దర్యాప్తు జరిపి, కోర్టులో నిలిచే సాక్ష్యాలు సేకరించి, సరైన సెక్షన్ల కింద కేసు మోపాలి. న్యాయమూర్తులు రోజువారీ విచారణ జరపాలి. ఉత్తుత్తి వాయిదాలు అడిగే న్యాయవాదులకు జరిమానాలు వేసి, తీర్పు త్వరగా యివ్వాలి. ఇక ప్రభుత్వం విచారణ జరిగే సమయంలో జడ్జిని బదిలీ చేయకూడదు. రాజకీయపార్టీలు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని జడ్జిని చంపించేయకూడదు. అతనిపై అబద్ధపు ఆరోపణలు చేసి పరువు తీయకూడదు. సామాజిక సంస్థలు నిందితులు ఫలానా వర్గానికి చెందినవారు కాబట్టి, చూసీచూడనట్లు వదిలేయాలని, అదే డబ్బున్నవాళ్లయినా, అగ్రవర్ణాల వారైనా మరోలా ఉండేదని.. యిలాటి అడ్డగోలు వాదనలు చేసి పైకోర్టుల్లో అడ్డుకోకూడదు. తీర్పు వచ్చాక క్షమాభిక్ష అడిగితే రాష్ట్రపతి వెంటనే అవునోకాదో చెప్పాలి తప్ప, ఏళ్ల తరబడి తాత్సారం చేసి, భావి నేరస్తులకు దిలాసా యివ్వకూడదు. కానీ అనేక కేసుల్లో యివన్నీ జరుగుతున్నాయని తెలుసు.
ఈ కేసులో ఉరి తీయడంలో జరుగుతున్న ఆలస్యం గురించి మాడభూషి శ్రీధర్ ఒక వ్యాసంలో ఒక వాదన వినిపించారు – ఉరి తీయలేదనంటే శిక్ష పడలేదని అర్థం కాదు. ఎప్పుడైతే జైల్లో పడ్డారో అప్పటి నుంచే శిక్ష అమలవుతోంది. ఫలానా తేదీన చస్తామని ముందే తెలియడంతో మనిషి క్షణక్షణం ఛస్తాడు. ఆ వేదన, ఆ సంఘర్షణే అసలైన మరణయాతన- అని. నిజమే కానీ యివన్నీ అందరి విషయంలో వర్తించవు. నిర్భయ హంతకులకు మర్నాడు ఉరి అనగానే భోజనం సయించడం మానేసింది తప్ప, అప్పటిదాకా ముద్ద దిగిందిగా. చివర్లో ఆ నాడు దిల్లీలోనే లేను అంటూ మరో కొత్తవాదన వినిపించబోయారుగా. రాజీవ్ గాంధీ హంతకులను యావజ్జీవంగా మార్చడం చేతనే కదా, రాజకీయ పార్టీలు వారిని విడుదల చేయాలని అడుగుతున్నాయి. ఆ హంతకులకు పిల్లల్ని కనాలని వుంటుంది, వాళ్లకు పెళ్లి చేయాలని వుంటుంది, వాటికి తాము హాజరు కావాలనీ ఉంటుంది. మరి రాజీవ్ మాత్రం యివన్నీ అక్కరలేదని, అతనికి జీవించే హక్కు లేదని తీర్మానించే హక్కు వారికెవరు యిచ్చారు?
నిర్భయ, దిశ.. యిలా చట్టాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలు ఆగ్రహపడుతూనే ఉన్నారు. ఓ పక్క రేపిస్టులు మాత్రం తమ పని అడ్డూ, ఆపూ లేకుండా చేసుకుంటూ పోతున్నారు. లక్ష మంది జనాభాలో రేప్ చేశారన్న నిందితుల సంఖ్య 2012లో 4.3 మంది ఐతే, 2013కి 5.7, 2014కి 6.1, 2015కి 5.7, 2016కి 6.3, 2017కి 5.2, 2018కి 5.2గా వుంది. అంటే ఏడేళ్ల తర్వాత లక్షకు దాదాపు ఒక రేపిస్టు పెరిగాడన్నమాట. అంటే మొత్తం జనాభాలో 13,400 మంది పెరిగారన్నమాట. రేప్ కేసులు 2012లో 1.01 లక్షలుంటే, 2013లో 1.15 లక్షలు, 2014లో 1.25 లక్షలు, 2015లో 1.37 లక్షలు, 2016లో 1.52 లక్షలు, 2017లో 1.46 లక్షలు, 2018లో 1.56 లక్షలు ఉన్నాయి.
కఠినమైన చట్టాలు వచ్చాక తగ్గకపోగా ఎందుకిలా పెరుగుతున్నాయి? ఏవిటి వాళ్ల ధీమా? ఏవిటి వాళ్ల ధైర్యం? అంటే ‘అబ్బే గతంలో బలాత్కారాలు జరిగినా రిపోర్టు చేసేవారు కారు, యిప్పుడు ముందుకు వచ్చి చేస్తున్నారు. అందువలన పెరిగాయి’ అని అంటున్నారు. పైగా 2013 నాటి నిర్భయ చట్టం తర్వాత రేప్ నిర్వచనాన్ని బాగా విస్తృతం చేశారు. సెక్స్‌పరమైన వ్యాఖ్యలు చేసినా, కోరిక తీర్చమని అడిగినా, తాకబోయినా, అమ్మాయికి యిష్టం లేకుండా పోర్న్ సినిమాలు, బొమ్మలు, పుస్తకాలు చూపినా రేప్ కిందే వస్తాయి. దాంతో ముందులో బాగానే ఉండి, తర్వాత చెడిన సందర్భాల్లో స్త్రీలు దీన్ని ఉపయోగించే అవకాశం కలుగుతోంది. 2013లో ఒక న్యూస్‌పేపరు వాళ్లు చేయించిన అధ్యయనంలో దిల్లీలో నమోదయిన 460 కేసుల్లో 40% కేసులు పరస్పరాంగీకారంతో సెక్స్‌లో పాల్గొన్న తర్వాత యిద్దరి మధ్య గొడవలు వచ్చి పెట్టిన కేసులే. మరో 25% కేసుల్లో పెళ్లి చేసుకుంటానంటే సెక్స్‌కి ఒప్పుకుని, తర్వాత చేసుకోనని మాట తప్పితే రేప్ చేశాడంటూ పెట్టిన కేసులే.
మీ టూ కేసుల్లో కొన్ని నిజమైన కేసులైతే మరి కొన్ని పాతికేళ్ల కితం బుగ్గ గిల్లాడు, యివాళ రచ్చకెక్కుతున్నాను వంటి కేసులు కూడా వచ్చాయి. ఈ కేసుల విషయంలో కూడా పెళ్లి చేసుకుంటాడన్న ఆశతో కొంతకాలం శృంగారం నెరపి, తర్వాత చేసుకోననగానే ‘నాకు యిష్టం లేకుండా రెండేళ్లు బలాత్కారం చేశాడు’ అని ఆరోపించేవాళ్లూ ఉన్నారు. ఓ సారి బలాత్కారం చేశాడంటే నమ్మవచ్చు. రెండేళ్ల పాటు అనేక స్థలాల్లో, వేర్వేరు సందర్భాల్లో అనుభవించినప్పుడు అది బలాత్కారం ఎలా అవుతుంది? నిందితుడు యిదే వాదిస్తాడు. తన యిష్టం మీదనే జరిగింది తప్ప నేను బలవంత పెట్టలేదు అని. కానీ 1983లోనే క్రిమినల్ లా లో సవరణ చేశారు. ఇలాటి సందర్భాల్లో పరస్పరాంగీకారం లేదని స్త్రీ చెపితే కోర్టు అదే నమ్మాలి అని. చట్టం ఏం చెప్పినా పోలీసు స్టేషన్‌లో రిపోర్టు తీసుకోవలసిన పోలీసాధికారికి, ‘ఇదేదో తిరకాసు వ్యవహారం’ అని తోస్తే కేసు నమోదు చేసుకోకపోవచ్చు.
డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడి తమతో వాగ్వివాదానికి దిగి, తిట్లకు లంకించుకునే జూబిలీ హిల్స్ మహిళలతో వేగే పోలీసులకు సానుభూతి ఉంటుందనుకోవడం కష్టం. స్త్రీలు అనవసరంగా బయటతిరిగి, తిప్పలు పడి, తమకు కూడా తిప్పలు తెచ్చిపెడుతున్నారని వారు అనుకుంటూన్నట్లు అనేక సందర్భాల్లో తేల్తోంది. దిశ విషయంలో రిపోర్టు చేయడానికి వెళ్లినపుడు వారి వ్యాఖ్యలు చూశాం. పైగా చట్టాలు చేసేస్తున్నారు తప్ప వాటి గురించి క్షేత్రస్థాయి దాకా అవగాహన పెంచే ప్రయత్నాలు జరగటం లేదు. దాంతో వాళ్లు పాత పద్ధతుల్లోనే వెళుతున్నారు. నేరం జరిగిన చోటే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమనేది మామూలు పద్ధతి. రేప్ విషయంలో ఎక్కడైనా రిపోర్టు చేయవచ్చనే ‘జీరో ఎఫ్‌ఐఆర్’ ప్రొవిజన్ కల్పించారు. కానీ దిశ కేసును హ్యేండిల్ చేసిన పోలీసు స్టేషన్‌లోని వారికి యిది తెలిసి వుండదు. మా పరిధి కాదని తిరస్కరించారట.
పోలీసు ఉద్యోగినులు స్టేషన్లో ఎక్కువమంది ఉంటే మగవారి కంటె ఎక్కువ సానుభూతి చూపుతారని ఒక ఆశ. పైగా మహిళా నేరస్తుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. మహిళా ఉద్యమకారులను మహిళా పోలీసులే హేండిల్ చేయకపోతే అది వేరే పేచీ. అందువలన పోలీసు ఫోర్సులో ఉద్యోగినుల శాతం 33%కి పెంచమని 2013-19 మధ్య కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆరుసార్లు లేఖలు రాసింది. పెద్ద స్టేషన్లలో 3గ్గురు మహిళా ఎస్‌ఐలు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు వుండాలని 2013లోనే కేంద్ర హోం సెక్రటరీ రాశారు. అయితే ఆ లక్ష్యం నెరవేరటం లేదు. 2013లో జాతీయస్థాయిలో మహిళా పోలీసుల శాతం సగటున 5.3 అయితే, 2017కు 7కు చేరింది. కేంద్రం అజమాయిషీలో ఉన్న దిల్లీ పోలీసు ఫోర్సులో కూడా 8 మాత్రమే వుంది.
పోనీ పోలీసుగా పని చేయడానికి తగినంతమంది మహిళలు సిద్ధపడటం లేదేమోనని 2019లో కేంద్రం మహిళా పోలీసు వాలంటీర్ల (ఎంపివి) వ్యవస్థను ఏర్పరచమంది. వీళ్లు పోలీసులకు, మహిళా బాధితురాళ్లకు మధ్య వారధిగా పనిచేస్తారు. 2013లో ఏర్పరచిన నిర్భయ నిధి నుంచి, దీని కయ్యే ఖర్చు తీసుకోండి అంది. అయితే 12 రాష్ట్రాలు మాత్రమే ఎంపివిను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వీటిల్లో కూడా 7 రాష్ట్రాలు – ఝార్‌ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్ – ఆ ప్రాజెక్టుపై పైసా ఖర్చు పెట్టలేదు.
నిర్భయ ఫండ్ కిందే కేంద్రం 2015 ఏప్రిల్ 1న ఒన్ స్టాప్ సెంటర్ (ఒఎస్‌సి) అని ప్రారంభించింది. అక్కడ బలాత్కారానికి గురైన మహిళలకు కావలసిన అన్ని సేవలూ, అంటే వైద్యసహాయం, పోలీసు సహాయం, న్యాయపరమైన సలహాలు, కోర్టులో కేసు మేనేజ్‌మెంట్, సైకలాజికల్ కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం – ఒకే చోట లభ్యమౌతాయి. ఇప్పుడు దేశంలో 595 సెంటర్లున్నాయి. బిహార్, దిల్లీ, బెంగాల్, కర్ణాటక మాత్రం సెంటర్లు పెట్టలేదు.
నిర్భయ ఫండ్ కింద నగరాలకు ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ స్కీము కూడా ఉంది. నగరవీధుల్లో లైట్లు, సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయడం, ఒక యింటిగ్రేటెడ్ కంట్రోలు రూము ద్వారా వాహనం నెంబరు కెమెరాలో నోట్ కాగానే, దాని చరిత్రంతా తెలుసుకోవడం, కేవలం మహిళలే నిర్వహించే ఔట్‌పోస్టులు, పోలీసు పెట్రోలింగు ఏర్పాటు చేయడం, మహిళలే నిర్వహించే మహిళా టాయిలెట్స్ అధికసంఖ్యలో నిర్మించడం – యిలాటి వెన్నో ఆ స్కీములో వున్నాయి. ఇలా ఎన్నో రకాల పనులు నిర్భయ ఫండ్ కింద చేయవచ్చు. దానికి మొత్తం కార్పస్ రూ.3600 కోట్లు ఉంది.
ఏదైనా ఏడాదిలో రాష్ట్రం తన కోటాను వినియోగపరచకపోతే ఆ నిధులు మురిగిపోతాయి. కానీ యీ ఫండ్ విషయంలో మాత్రం మినహాయింపు యిచ్చారు. ఎలాగోలా మీరు వాడితే చాలు అన్నారు. కేంద్రం యిప్పటికే 65% రూ.2050 కోట్లు ఆ ఫండ్‌కు కేటాయించింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ నిధుల్లో కేవలం 20% మాత్రమే రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, సిక్కిమ్, త్రిపుర – యిప్పటిదాకా ఒక్క పైసా కూడా యీ నిధి నుంచి వాడుకోలేదు.
బలాత్కారం కేసుల్లో నేరం నిరూపించే ఆధారాలు సేకరించడం అతి ముఖ్యం. గతంలో డాక్టరు రెండు వేళ్లు లోనికి జొనిపి, రేప్ జరిగిందో లేదో తేల్చేవారు. దాన్ని టూ ఫింగర్ టెస్ట్ అంటారు. 2013లో సుప్రీం కోర్టు యీ పద్ధతిని నిరసించింది. దాంతో బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చి అండ్ డెవప్‌మెంట్ కిట్‌ను తయారు చేయించింది. దాన్ని సెక్సువల్ ఎసాల్ట్ ఎవిడెన్స్ కలక్షన్ కిట్ అంటారు. అలాటి 3వేలకు పైగా కిట్లను రాష్ట్రాలకు అందచేసి, 6 వేల మందికి అవి ఎలా వాడాలో తర్ఫీదు యిప్పించింది. అయినా అనేక రాష్ట్రాలలో పాత పద్ధతే ఉపయోగిస్తున్నారు. కొన్ని జిల్లాలలో అడిగితే ‘అలాటివి వున్నాయని విన్నాం కానీ ఎప్పుడూ చూడలేదు’ అన్నారు. ముఖ్యపట్టణాలలోనే అలా వుంటే, యిక గ్రామాల సంగతి చెప్పనే అక్కరలేదు. ఈ ఆధారం శాస్త్రీయంగా లేకపోతే ముద్దాయి తప్పించుకునే అవకాశం మెండుగా ఉంది.
పోలీసులను తర్ఫీదు చేయకపోవడం వలన యిలాటి యిబ్బందులు వస్తున్నాయి. ఎన్‌సిఆర్‌బి (నేషనల్ క్రైమ్ రిసెర్చ్ బ్యూరో) ప్రకారం 2012లో రిపోర్టయిన కేసుల్లో 96% వాటిపై విచారణ జరిపారు. 2018 వచ్చేసరికి అది 83%కి పడిపోయింది. నిజానికి ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదయ్యాక పోలీసులే అత్యాచార బాధితుల యిళ్లకు వెళ్లి మిగిలిన విచారణ చేయాలి. కానీ అలా జరగటం లేదు. బాధితురాలు మాటిమాటికి పోలీసు స్టేషన్‌కు వెళ్లి గుర్తు చేయడం, వెళ్లినప్పుడల్లా పోలీసులు హేళనగా మాట్లాడడం వీటి కారణంగా కొంతకాలానికి విసుగెత్తి ఊరుకుంటున్నారు. ఈ లోగా నిందితుడి నుంచి కబుర్లు వస్తాయి – అయినదేదో అయింది. పోయిన నీ మానం ఎలాగూ రాదు. మేం యిచ్చే డబ్బు పుచ్చుకుని విత్‌డ్రా అయిపో అని. కాదూ కూడదని పట్టుబడితే ఉన్నావ్ వంటి కేసుల్లో బాధితురాలి కుటుంబసభ్యులను కూడా చంపేసిన సంగతి చూశాం.
ఇక కోర్టు దాకా వెళ్లిన కేసుల సంగతి చూడబోతే దిగులు వేస్తుంది. రెండు నెలల్లో విచారణ పూర్తి కావాలని చట్టం చెపుతోంది కానీ అలా జరగటం లేదు. 2019 జనవరి – జూన్ మధ్య నమోదైన 24 వేల కేసుల్లో కేవలం 4% కేసుల్లో మాత్రమే విచారణ పూర్తయిందట. సత్వర విచారణకై దేశమంతా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. 704 ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో 2019 సెప్టెంబరు 30 నాటికి పెండింగులో ఉన్న కేసులు 7 లక్షలు! ఇదేమిటని న్యాయమూర్తులను అడిగితే ‘ఏం చేయమంటారు, పోలీసులు సరైన ఆధారాలు పట్టుకురారు. అసమర్థతో, అవినీతో, నిందితుల పలుకుబడో తెలియదు. అలాటి సాక్ష్యాలతో తీర్పు యివ్వలేక వాయిదా వేయాల్సి వస్తోంది.’ అంటున్నారు.
ఇక ఉరిశిక్ష విషయానికి వస్తే- క్రింది కోర్టు విధించే మొత్తం ఉరిశిక్షల్లో సెక్స్ నేరాలకై విధించే ఉరిశిక్షలు 2016లో 18%, 2017లో 39%, 2018లో 41%, 2019లో 53% ఉంటున్నాయి. అయితే హైకోర్టుకి వచ్చేసరికి సెక్స్, దరిమిలా హత్య నేరాలకై ఉరి పడిన వారిలో మూడో వంతు మంది తప్పించుకుంటున్నారు. హైకోర్టు ఉరి ఖరారు చేసిన యిలాటి నిందితుల్లో కేవలం మూడో వంతు మందివి మాత్రమే సుప్రీం కోర్టు ఖరారు చేస్తోంది. తక్కినవారికి శిక్ష తగ్గిస్తోంది. ఎందుకిలా అంటే వరకట్న నిషేధం చట్టం, ఎస్సీఎస్టీ అత్యాచారనిషేధ చట్టం లాగానే యీ చట్టమూ దుర్వినియోగం అవుతోందన్న సంశయాలు వుంటున్నాయి. ఏది నిజమైన కేసో, ఏది అబద్ధమైన కేసో తెలియక, ఎందుకైనా మంచిదని సాగదీస్తున్నారు. క్షణికావేశంలో చేశారేమోనన్న మార్జిన్ కూడా యిస్తున్నారు.
వీటన్నిటి కారణంగా రేపిస్టులు చెలరేగి పోతున్నారు. మొత్తం మీద పరిస్థితి చూస్తే అనేక స్థాయిలలో చట్టాలు అమలు కావటం లేదని, ప్రభుత్వాలలో, అధికారుల్లో చిత్తశుద్ధి లోపిస్తోందని అర్థమౌతోంది. దిశ కేసులో హంతకులను ఎన్‌కౌంటర్ చేసినపుడు చప్పట్లు కొట్టడం కంటె అడుగడుగునా ప్రభుత్వం అలసత్వాన్ని నిలదీస్తూ ఉంటే, సమాజంలో బలాత్కారాలు తగ్గుతాయి.
ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)