కరోనా భయం.. మరో జంట ఆత్మహత్య

కరోనా వస్తే ఆ లెక్క వేరు. కానీ అది రాకముందే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్న దగ్గు వస్తే కరోనా వచ్చిందని బెంబేలు పడిపోతున్నారు. ఎండకు శరీరంలో వేడి పెరిగితే అది కరోనా అని…

కరోనా వస్తే ఆ లెక్క వేరు. కానీ అది రాకముందే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్న దగ్గు వస్తే కరోనా వచ్చిందని బెంబేలు పడిపోతున్నారు. ఎండకు శరీరంలో వేడి పెరిగితే అది కరోనా అని కంగారు పడుతున్నారు. ఈ భయం, కంగారు, టెన్షన్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే కొంతమంది ఏకంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.

నిన్నటికి నిన్న బెంగళూరులో రోడ్డు రవాణా సంస్థకు చెందిన గోపాలకృష్ణ తనకు కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఇంటికి దగ్గర్లో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడిలాంటిదే మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. రాజమండ్రిలో ఈ విషాధం చోటుచేసుకుంది.

తమకు కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో భార్యాభర్త ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఏకంగా ఒంటిపై కిరోసిన పోసుకొని నిప్పంటించుకున్నారు. తమకు కరోనా వచ్చిందేమో అనే భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నామని, చనిపోయే ముందు లేఖ రాసి మరీ వీళ్లు తనువు చావించారు.

కరోనాపై అనవసరపు భయాలు పెట్టుకోకూడదని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. కరోనా ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామ వాలంటీర్ల సహకారంతో ఇంటింటికీ చేరవేరుస్తున్నారు. నిజంగా కరోనా ఉందనే అనుమానం వస్తే హాస్పిటల్ కు రావాలని, టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో భయాందోళనలు తగ్గడం లేదు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.