టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. చాలా కాలం తరువాత ప్రశంసలతో ముంచెత్తారు. రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టి అభినందించారు. ఇంతకూ చంద్రబాబు అభినందించింది ఎవరినో తెలుసా? తాను రాజకీయంగా బంధం తెంచుకున్న ప్రధాని నరేంద్ర మోడీని. చంద్రబాబు ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకోలేదు.
ఇప్పటి విపత్తులో అలాంటి అవకాశమూ లేదు. కానీ కరోనా మహమ్మారిని పారదోలడానికి ప్రధాని తీసుకుంటున్న చర్యలను, నిర్ణయాలను, సామాన్య ప్రజలను, పేదలను ఆదుకోవడానికి చేస్తున్న ఆర్ధిక సాయాన్ని మెచ్చుకుంటూ చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో కేంద్రం రూ. 1 . 70 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీని తరువాతనే చంద్రబాబు ప్రధానిని ప్రశంసిస్తూ లేఖ రాశారు.
పారిశుధ్య కార్మికులకు, ఆరోగ్య కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రకటించినందుకు బాబు బాగా పొగిడారు. ఒకరోజు జనతా కర్ఫ్యూపై, మూడు వారాల దేశవ్యాప్త లాక్ డౌన్ పై హర్షం వ్యక్తం చేశారు. బాబు రాసిన ఈ లేఖలో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే … మోడీ ప్రభుత్వాన్ని బాబు మానవత్వం మూర్తీభవించిన ప్రభుత్వం అని కొనియాడారు. బీజేపీతో బంధం తెగిపోయిన తరువాత చంద్రబాబు కేంద్రాన్ని, ప్రత్యేకించి మోడీని ఈ విధంగా ఆకాశానికి ఎత్తడం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు.
బీజేపీతో మళ్ళీ కలవాలని ఉద్దేశంతోనే బాబు ఈ విధంగా లేఖ రాశారని కొందరు రాజకీయ కోణంలో ఆలోచించవచ్చు. కానీ ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, నిర్ణయాలను మెచ్చుకోవడం వెనుక రాజకీయాలు ఉంటాయని అనుకోలేం. బాబు హృదయపూర్వకంగానే ప్రధానిని ప్రశంసించి ఉండొచ్చు.