అయినా 2010 జనవరి 12 న సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆదేశించింది. కారణం ఏమిటంటే నిందితులైన పోలీసు అధికారులపై నార్కో పరీక్షలు చేయడానికి సెషన్సు కోర్టు అనుమతి యిచ్చినా గుజరాత్ ప్రభుత్వం చేయించలేదు. మేం యిప్పటికే చాలా చర్యలు తీసుకున్నాం అంటూ గుజరాత్ ప్రభుత్వం 8 ఎటిఆర్ (యాక్షన్ టేకెన్ రిపోర్టులు) సమర్పించినా (2008లో యిచ్చిన దాన్లోనే కౌసర్ బీ ఫేక్ ఎన్కౌంటర్లో చనిపోయిందని ఒప్పుకోవడం జరిగింది) వాటిలో చాలా అవకతవకలున్నాయని, విచారణ సరైన దిశలో జరగలేదని సుప్రీం కోర్టు భావించింది. నిజానికి సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులైన పోలీసు అధికారులకు నార్కో టెస్టులు చేయించడానికి అనుమతి కోరుతూ డిఐజిగా వున్న రజనీశ్ రాయ్ నోట్ పంపిన మర్నాడే సొహ్రాబ్ కేసును అతని నుంచి తప్పించారు. నోట్ రాసేముందు సీనియర్లను సంప్రదించి, అందరూ సమ్మతించిందే రాయాలని మందలించారు. అతని కాన్ఫిడెన్షియల్ రిపోర్టులో అప్పటిదాకా వున్న 'వెరీ గుడ్'ను 'యావరేజ్'కు దింపేశారు. ఇవన్నీ చూసి సుప్రీం కోర్టు కేసును సిబిఐకు అప్పగించింది.
సొహ్రాబ్ విషయంలో లాగే ప్రజాపతి కేసులో కూడా గుజరాత్ ప్రభుత్వం మొగ్గలు వేసింది. 2006లో అతని చనిపోయినపుడు 'అతన్ని రాజస్థాన్ నుండి తెచ్చి అహ్మదాబాదు కోర్టులో హాజరు పరిచి, వెనక్కి రైల్లో రాజస్థాన్ తీసుకెళుతూంటే అతని సహచరులు పోలీసుల కళ్లల్లో కారం చల్లి పారిపోయారు. పోలీసులు అతని గురించి వెతికితే మర్నాడు హైవే వద్ద కనబడ్డాడు. ఎదురుకాల్పుల్లో మరణించాడు' అని చెప్పారు. ఆ తర్వాత పోలీసుల కళ్లల్లో కారం ఛాయలు కనబడలేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో 2010 జులై 30 లో 'ప్రజాపతి కూడా ఫేక్ ఎన్కౌంటరులోనే చనిపోయాడు' అని గుజరాత్ పోలీసు శాఖ ఒప్పుకుంటూ చార్జిషీటు ఫైల్ చేసింది. మర్నాడే అనుబంధ చార్జిషీటు వేసింది – సొహ్రాబ్ ఎన్‌కౌంటరుకి, దీనికీ సంబంధం లేదు అని.
సిబిఐ విచారణ కారణంగా 2010 జులైలో అమిత్ షాను హత్యానేరంపై అరెస్టు చేశారు. మూణ్నెళ్లలోనే గుజరాత్ హైకోర్టు అతనికి బెయిల్ యిచ్చింది. అయితే మర్నాడే సుప్రీం కోర్టు జడ్జి అఫ్తాబ్ ఆలమ్ విచారణ పూర్తయ్యేవరకు అతను గుజరాత్లో వుండడానికి వీల్లేదని ఆదేశించారు. దాని వలన 2010-12 మధ్య అమిత్ షా ఢిల్లీలో కాపురం పెట్టారు. అమిత్ బెయిలు రద్దు చేయమని సిబిఐ కోరినా సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. కేసు గుజరాత్లో నడుస్తున్నంతకాలం మా పని సాగటం లేదని, తమ అధికారులను వేధిస్తున్నారని సిబిఐ మొర పెట్టుకోగా 2012 సెప్టెంబరులో సుప్రీం కోర్టు ఆ కేసును ముంబయికి బదిలీ చేసింది. ప్రజాపతి చావు గురించిన ఫైళ్లు కూడా తరలించాలని సిబిఐ, అక్కరలేదు, దానికీ దీనికీ సంబంధం లేదని గుజరాత్ ప్రభుత్వం మొండికేయడంతో తరలింపు ఆలస్యమైంది. 2013 మేలో ముంబయిలో వున్న సిబిఐ స్పెషల్ కోర్టుకు రికార్డులు తరలించారు. ఇక అక్కణ్నుంచి స్పెషల్ కోర్టు న్యాయాధీశుల వ్యవహారం ప్రారంభమైంది.
2013 ప్రారంభంలో సుప్రీం కోర్టు జడ్జి ఒకాయన బొంబాయి హై కోర్టులోని సీనియర్ జడ్జికి ఫోన్ చేసి కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా అకళంకితుడైన న్యాయమూర్తికి కేసు అప్పగించండి అని కోరారట. ఏ కేసు ఎవరికి అప్పగించాలో నిర్ణయించే హైకోర్టు కమిటీలో ముగ్గురు సీనియర్ జడ్జిలు వుంటారు, చీఫ్ జస్టిస్ అధ్యకక్షుడిగా వుంటాడు. ఈ కేసు విషయంలో చీఫ్ జస్టిస్ మొహిత్ షా తను గుజరాతీ కాబట్టి ఆ మీటింగుకి రాకపోతే మంచిది అంటూ తప్పుకున్నాడు. కమిటీ నిర్ణయం ప్రకారం కేసును జెటి ఉత్పాత్‌కు కేటాయించారు. ఆ రికార్డులు అవీ గుజరాతీలోంచి, ఇంగ్లీషులోకి, మరాఠీలోకి అనువాదాలు చేయించేసరికి ఏడాది పట్టింది. ఈ వ్యవహారం అంతా చూసేసరికి బొంబాయి చీఫ్ జస్టిస్ షాపై సుప్రీం కోర్టు జడ్జిలకు అనుమానం వచ్చింది. 2013 మార్చిలో ప్రమోషన్లకు తగరని కొలీజియం భావించిన ముగ్గురు చీఫ్ జస్టిస్‌లలో షా ఒకరు! తక్కిన యిద్దరూ గుజరాత్ చీఫ్ జస్టిస్, ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్! (ఇప్పుడు కొలీజయంనే రద్దు చేసేశారు)
రికార్డుల మాట ఎలా వున్నా ఉత్పాత్ అమిత్ షాను పిలిపించి ప్రశ్నలు అడగదామనుకున్నారు. అయితే అమిత్ తరఫు లాయరు రకరకాల సాకులు చెప్పాడు – డయాబెటిక్ కాబట్టి కదలలేడనీ, ఢిల్లీలో బిజీగా వున్నాడనీ.. యిలా. ఇలా ఏడాది సాగదీయడంతో (యీ లోపున మోదీ ప్రధాని అయ్యారు) ఉత్పాత్‌కు ఒళ్లుమండి 2014 జూన్ 6 న యివాళ మినహాయింపు యిస్తున్నాను కానీ జూన్ 20 నాటి హియరింగ్‌కు అమిత్ హాజరై తీరాలి అని గట్టిగా చెప్పారు. అప్పుడూ అమిత్ రాలేదు. ఉత్పాత్‌కు ఒళ్లు మండిపోయింది. జూన్ 26కి రాకపోతే ఊరుకోను అన్నారు. అంతే ఒక రోజు ముందు అంటే జూన్ 25న ఆయన్ను పూనాకు బదిలీ చేసేసింది బొంబాయి హైకోర్టు. ఎందుకంటే మే లోనే కేంద్రంలో ప్రభుత్వం మారింది. అమిత్ షాకు బలం పెరిగింది. ఈ బదిలీ ఏమిటి అని మీడియా అడిగితే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ 'మా అమ్మాయి పూనాలో చదువుకుంటోంది కాబట్టి అక్కడకు బదిలీ చేయండి అని ఉత్పాతే అడిగారు. అందుకే బదిలీ చేశాం' అని చెప్పారు. సొహ్రాబ్ సోదరుడు ఇది అన్యాయం, ఉత్పాత్గార్ని వెనక్కి రప్పించండి అని బొంబాయి చీఫ్ జస్టిస్‌కు మొరపెట్టుకుంటే నాలుగు నెలలు పోయాక మళ్లీ రిజిస్ట్రార్ జనరల్ గారే 'మీ అభ్యర్థనను ముగ్గురు హైకోర్టు జడ్జిల కమిటీ పరిశీలించి నిరాకరించింది' అని జవాబిచ్చారు. కేసు విచారణ మొదలు నుంచి తుది దాకా ఒక జడ్జి చేతనే చేయించమని సుప్రీం కోర్టు ఆదేశించింది కదా అంటే, విచారణ ప్రారంభం కాలేదు కాబట్టి యిప్పుడు మార్చవచ్చు అంది బొంబాయి హైకోర్టు.
2010 ఉత్పాత్ స్థానంలో బ్రిజ్మోహన్ లోయా వచ్చారు. ఈయనది పాపం ఉదారబుద్ధి. అమిత్ షా స్వయంగా హాజరు కాకపోయినా ఏమీ అనలేదు. ''విచారణ ప్రారంభమైన తర్వాత మాత్రం వచ్చి తీరాలి'' అని సూచించారు. నవంబరు 30 న ముంబయి నుండి నాగపూరు పెళ్లికని వెళ్లి ప్రభుత్వ గెస్ట్హవుస్లో బస చేశారు. మర్నాటికల్లా పోయారు. తీవ్రమైన గుండె నొప్పి అన్నారు. 52 ఏళ్ల వ్యక్తి యింత త్వరగా పోవడంతో అందరికీ అనుమానాలు వచ్చాయి. ఢిల్లీలో కొందరు ఎంపీలు యీ మిస్టరీ పై విచారణ జరిపించాలంటూ ప్రదర్శనలు నిర్వహించారు. సొహ్రాబ్ సోదరుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశాడు – 'మొదటాయనను బదిలీ చేయించారు, రెండో ఆయన యిలా అయ్యారు. జడ్జిలను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది' అని. లోయా పోయిన 15 రోజలకు ఎంబి గోసావీ అనే ఆయన్ని జడ్జిగా వేశారు. స్పీడుకు మారుపేరు యీయన. డిసెంబరు 15 న హియరింగు మొదలుపెట్టి మూడు రోజుల్లో ముగించేశాడు. డిసెంబరు 29 న తీర్పు యిచ్చేశాడు. 710 మంది సాకక్షుల స్టేటుమెంట్లు, చార్జిషీటు కలిపి 22 వేల పేజీలుంది. అదంతా ఎప్పుడు చదివాడో ఏమో కానీ ఆయన తన తీర్పులో 'ఈ కేసు అమిత్ షాపై రాజకీయ కారణాలతో మోపబడింది' అనే నిర్ణయానికి వచ్చేసి, కేసు కొట్టేశాడు. అమిత్ షాతో అనేకమంది పోలీసులు విముక్తులు అయిపోయారు. – (సశేషం)
ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)