ఎమ్బీయస్‌: న్యాయస్థానాలపై నియంత్రణ- 1

ఇప్పటివరకు సుప్రీం కోర్టు, హైకోర్టు నియామకాలు, బదిలీలకై అమల్లో వున్న కొలోజియం వ్యవస్థను రద్దు చేస్తూ, జాతీయ న్యాయ నియామకాల కమీషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ కేంద్రం కితం వారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2003లో…

ఇప్పటివరకు సుప్రీం కోర్టు, హైకోర్టు నియామకాలు, బదిలీలకై అమల్లో వున్న కొలోజియం వ్యవస్థను రద్దు చేస్తూ, జాతీయ న్యాయ నియామకాల కమీషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ కేంద్రం కితం వారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2003లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైన పనిని యీనాటి ఎన్డీయే ప్రభుత్వం పూర్తి చేసింది. ఇటీవలే ఏప్రిల్‌ 5న  మోదీ న్యాయాధీశులను ఉద్దేశించి మాట్లాడుతూ పైపైన గ్రహించినదాన్ని (పెర్సెప్షన్‌) బట్టి తీర్పులు యివ్వడం మానుకోవాలి అన్నారు. ఫైవ్‌స్టార్‌ కార్యకలాపాల వలన అలాటి తీర్పులు యిస్తున్నారని కూడా అన్నారు. ఇప్పుడు యీ చర్య! కోర్టులను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం తప్ప యిది వేరేమీ కాదని అందరికీ అర్థమవుతోంది. గతంలో ఇందిరా గాంధీ కూడా 'కమిటెడ్‌ జ్యుడిషియరీ' పేర యిలాటి దారులే తొక్కారు. సోషలిస్టు విధానాల అమలుకై చట్టాన్ని, సహజ న్యాయాన్ని పక్కదారులు పట్టించినా ఫర్వాలేదనే వామపక్ష న్యాయాధీశులు ఆమె కాలంలో రాజ్యమేలారు.  మధ్యలో కొంతకాలం కోర్టులు ప్రభుత్వాన్ని అదిలించే స్థితికి వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వాలు అనేక కుంభకోణాలపై విచారణలు యిష్టం లేకపోయినా చేపట్టవలసి వచ్చింది. మళ్లీ యిప్పుడు కోర్టులు పార్లమెంటు అధీనంలోకి వచ్చేట్లు వున్నాయి. పార్లమెంటు అంటే మెజారిటీ పార్టీ అభిమతం అనే అర్థం. సమసమాజస్థాపన పేరుతో సంస్కరణలు మొదలుపెట్టి కోర్టులను తనవైపు తిప్పుకున్న ఇందిరా గాంధీ తర్వాతి రోజుల్లో వాటిని తమ స్వార్థం కోసం, రాజకీయప్రయోజనాల కోసం, కేసులు తప్పించుకోవడం కోసం వినియోగించుకున్నారు. అప్పటి న్యాయాధీశులు ఆమెకు తాళం వేస్తూ వచ్చారు. ఇప్పుడూ అదే జరుగుతుందా అన్న అనుమానం రావడానికి కారణం మోదీ సర్కారు వచ్చాక కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరు! ముఖ్యంగా ఎత్తి చూపవలసినది – సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులోంచి అమిత్‌ షాను బయటపడేసిన విధం! 9 ఏళ్లుగా నలుగుతున్న కేసును వింత కారణాలతో సిబిఐ స్పెషల్‌ కోర్టు జడ్జి 2014 డిసెంబరులో మూడు రోజుల విచారణతో తేల్చిపారేశారు. 

ఎన్‌కౌంటర్లు, నకిలీ ఎన్‌కౌంటర్లు మన రాష్ట్రానికి కొత్త కాదు. 45 ఏళ్ల క్రితం నక్సలిజం సమస్య వచ్చినప్పటి నుండి తీవ్రవాది చనిపోగానే పోలీసులకు అది ఎన్‌కౌంటరు, ప్రచ్ఛన్న మావోయిస్టులకు, పౌరహక్కుల వాళ్లకు అది నకిలీ ఎన్‌కౌంటరు! అందువలన గుజరాత్‌ ప్రభుత్వం కూడా  సొహ్రాబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసిందని వినగానే ఓహో అక్కడా మావోయిస్టులున్నారన్నమాట అనుకోవడం కద్దు. అక్కడ కేసు అలాటిది కాదు. సొహ్రాబ్‌ ఉద్దీన్‌కు మావో, లెనిన్లతో ముఖపరిచయం కూడా లేదు. ఈ కేసులో సిబిఐ సాకక్షులుగా వచ్చిన అహ్మదాబాద్‌ లోని పాప్యులర్‌ బిల్డర్స్‌ కంపెనీ యజమానులు థరథ్‌ పటేల్‌, రమణ్‌ పటేల్‌ ప్రకారం చెప్పాలంటే అతను పోలీసుల తరఫు గూండా. పోలీసులు బిల్డర్లను బెదిరించి డబ్బు గుంజడానికి సొహ్రాబ్‌ను, అతని మనుష్యులను పంపేవారు. ఈ పటేల్‌ ద్వయం వద్ద డబ్బు గుంజిన పోలీసు అధికారుల్లో ముఖ్యులు అభయ్‌ చూడాసమా, డిజి వంజారా! వీళ్లు అప్పటి గుజరాత్‌ హోం శాఖలో సహాయ మంత్రి అమిత్‌ షా పేరు చెప్పి బిల్డర్లను, యితరులను డబ్బు గుంజేవారు. మేం మాట నమ్మం అంటే అమిత్‌ చేత మాట్లాడించేవారు. 

ఈ పటేల్‌ సోదరులు డబ్బు యివ్వడానికి నిరాకరించడం చేతనో ఏమో కానీ 2004లో వాళ్ల ఆఫీసులో కొందరు వచ్చి రిసెప్షన్‌ వద్ద తుపాకీతో గాల్లో కాల్పులు కాల్చి అందర్నీ భయపెట్టారు. పోలీసుకు కేసు నమోదు చేసినప్పుడు సొహ్రాబ్‌ పేరే కాదు ఎవరి పేరూ రాయలేదు. తర్వాత కొన్నాళ్లకు విచారణ చేసి సిల్విస్టర్‌, ప్రజాపతి అనే యిద్దరిని అనుమానితులుగా పేర్కొన్నారు. బిల్డర్లు మాత్రం ఆ కాల్పులు జరిపినది సొహ్రాబ్‌ మనుష్యులే అన్నారు. కానీ సొహ్రాబుద్దీన్‌పై పోలీసులు ఏ కేసూ పెట్టలేదు. అది జరిగాక ఒక ఏడాదికి అంటే 2005 నవంబరులో పట్టుకుని కాల్చేశారు. ఈ మధ్యలో అతను చేసిన నేరం అంటూ ఏమీ కనబడదు. ఇంకొక వాదన ప్రకారం – యీ పటేల్‌ సోదరులు రాజస్థాన్‌ నుంచి మార్బుల్‌ తెచ్చి అమ్మేవారు. సొహ్రాబ్‌ వారి నుండి డబ్బు గుంజేవాడు. వాళ్లే అమిత్‌ షాకు లంచం యిచ్చి అతని ద్వారా పోలీసుల చేత సొహ్రాబ్‌ను మట్టుపెట్టించారు. పటేల్‌ సోదరులపై అనేక క్రిమినల్‌ కేసులున్నాయి. (ఇవన్నీ తమ దగ్గర డబ్బు గుంజడానికి పోలీసులు 2001-05 మధ్య బనాయించినవి అని వాళ్లంటారు) వాళ్లు అమిత్‌ షాకు చెప్పిన తర్వాత వంజారా, చూడాసమా సొహ్రాబ్‌ మనుషులను వెళ్లి పటేల్‌ ఆఫీసులో కాల్పులు జరపమని చెప్పారని, అది సాకుగా పెట్టుకుని సొహ్రాబ్‌ను చంపేశారనీ అన్నారు. కానీ ఆఫీసులో కాల్పులు జరిపిన ఏడాది దాకా సొహ్రాబ్‌ను పట్టుకోవడం జరగలేదు. అందువలన దీన్ని ఎంతవరకు నమ్మాలో తెలియదు) అంటే జరిగినదేమిటి అంటే సొహ్రాబ్‌ పోలీసులను ఎక్కువ వాటా కోసం వేధించడమో, బ్లాక్‌మెయిల్‌ చేయడమో చేసి వుండాలి. అందుకని వాళ్లు అతన్ని లేపేశారు. దీని వెనక్కాల అమిత్‌ షా హస్తం వుందా లేదా అన్నదే ప్రశ్న.

నేరం జరిగిన తీరు, దాన్ని కవర్‌ చేసిన తీరు చూస్తే అమిత్‌ షా వంటి పెద్ద తలకాయ హస్తం వున్నట్లు అనుమానం వస్తుంది. సంఘటనలన్నీ ఒక క్రమంలో పేర్చి చూస్తేనే ఒక అంచనా ఏర్పడుతుంది. సిబిఐ కోర్టుకి తెచ్చిన సాకక్షుల్లో ఒకతను 'అమిత్‌ షా సొహ్రాబ్‌ జీవించే హక్కు కోల్పోయాడు అని అన్నాడు' అని చెప్పాడు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ యితన్ని చంపడానికి గుజరాత్‌ నుంచి ఏకంగా ముగ్గురు ఐపియస్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారంటే వారికి రాజకీయ మద్దతు వుందనే అనుకోవాలి. వచ్చినవారు అప్పా (పోలీసు ఎకాడమీ) వారి గెస్ట్‌ హౌస్‌లో బస చేసి, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఏమీ చెప్పకుండా సొహ్రాబ్‌, అతని భార్య  కౌసర్‌ బీ ఎక్కిన బస్సును వెంబడించారు. వాళ్లు హైదరాబాదులో కలీముద్దీన్‌ అనే అతని వద్దకు వచ్చి వుండి, తీర్థయాత్రకై సాంగ్లీ వెళుతున్నారు. వాళ్లతో బాటు వున్న సొహ్రాబ్‌ అనుచరుడు తులసి ప్రజాపతియే పోలీసులకు ఆనుపానులు చెప్పాడని సమాచారం వుంది. జహీరాబాద్‌ వద్ద బస్సు ఆపారు. బస్సులోకి ఎక్కి ఎకాయెకి వాళ్లు కూర్చున్న 29, 30 సీట్ల వద్దకు వెళ్లి మగవాళ్లిద్దరినీ కిందకు దిగమన్నారు. కౌసర్‌ బీ తాను కూడా దిగుతానని చెప్పి పోలీసులు వద్దంటున్నా దిగిపోయింది. ఆ బస్సులో వున్న ప్రయాణీకులు యీ మేరకు సాక్ష్యం చెప్పారు. మర్నాడు అంటే 2005 నవంబరు 23 న సొహ్రాబ్‌ను, కౌసర్‌ను గుజరాత్‌లోని వల్సాడ్‌, భారుచ్‌ల ద్వారా దిషా ఫారహౌస్‌కు తీసుకెళ్లారు. రెండు రోజులు పోయాక అతన్ని అర్‌హామ్‌ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి కాల్చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కౌసర్‌ను కూడా కాల్చేయడం జరిగింది. కారణాలు తెలియవు. ఈ ఎన్‌కౌంటర్‌ గురించి చెపుతుందన్న భయం కావచ్చు. – (సశేషం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

[email protected]