ఏదో కొత్తగా చెయ్యాలి.. పుట్టిన నేలకు పేరు తీసుకురావాలి.. పదిమందికి ఆదర్శంగా నిలవాలి.. ఈ తపనే నెల్లూరు జిల్లాలోని ఓ కుగ్రామం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎదిగిన మల్లి మస్తాన్‌బాబు, కాస్త కొత్తగా ఆలోచించాడు. రొటీన్ లైఫ్‌కి భిన్నంగా జీవించాలనుకున్నాడు. పర్వతారోహణవైపు అడుగులేశాడు. జాతి గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగాడు.
కానీ, దురదృష్టవశాత్తూ కాలం కాటేసింది. ఆండీస్ పర్వతాల్ని అధిరోహించేందుకు వెళ్ళిన మల్లి మస్తాన్‌బాబు, ఈ ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆండీస్ పర్వతాలపై భగవద్గీత, భారత జాతీయ జెండా వుంచి, ఆ ఫొటోల్ని పంపిన మస్తాన్‌బాబు, అంతలోనే ప్రాణాలు కోల్పోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మల్లి మస్తాన్‌బాబు సాధించిన విజయాల్ని గుర్తించాయి. పలువురు రాజకీయ ప్రముఖులు స్వగ్రామం చేరుకున్న మల్లి మస్తాన్‌బాబు పార్తీవ దేహానికి నివాళులర్పించారు.
‘మల్లి మస్తాన్‌బాబు చనిపోలేదు.. ఆయన రగిల్చిన స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.. మల్లి మస్తాన్‌బాబు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి..’ అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పలువురు రాష్ట్రమంత్రులు, ఇతర రాజకీయ నాయకులు ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ లాంఛనాలతో మల్లిమస్తాన్‌బాబు అంత్యక్రియలు జరిగాయి. వేల సంఖ్యలో ప్రజలు ఈ అంత్యక్రియలకు హాజరై, మల్లి మస్తాన్‌బాబుకి ఘనంగా కడసారి వీడ్కోలు పలికారు.