ఎమ్బీయస్‌: న్యాయస్థానాలపై నియంత్రణ- 2

సొహ్రాబ్‌ చావు సంగతి బయటపడగానే సహజంగా వార్తల్లోకి ఎక్కింది. గుజరాత్‌ పోలీసులు వెంటనే అతను లష్కరే తొయిబా టెర్రరిస్టనీ, రాష్ట్రంలోని పెద్ద రాజకీయ నాయకుణ్ని (మోదీ అని భావం) చంపడానికి వచ్చాడని, అహ్మదాబాద్‌ నుండి…

సొహ్రాబ్‌ చావు సంగతి బయటపడగానే సహజంగా వార్తల్లోకి ఎక్కింది. గుజరాత్‌ పోలీసులు వెంటనే అతను లష్కరే తొయిబా టెర్రరిస్టనీ, రాష్ట్రంలోని పెద్ద రాజకీయ నాయకుణ్ని (మోదీ అని భావం) చంపడానికి వచ్చాడని, అహ్మదాబాద్‌ నుండి సూరత్‌ వెళుతుంటే మధ్యదారిలో అతన్ని పట్టుకున్నామనీ, అతను కాల్పులు కాల్చడంతో ఎదురుకాల్పులు జరిపామనీ, వాటిలో అతను చనిపోయాడనీ, తమ సాహసకృత్యం ద్వారా టెర్రరిజానికి గుజరాత్‌లో స్థానం లేదని చాటామని చెప్పుకుని కేసు మూసేశారు. కానీ సుప్రీం కోర్టు యీ కథ నమ్మలేదు. ఈ చావుపై విచారణ జరిపించమని 2006 జనవరి 14న గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుజరాత్‌ డిజిపిగా వున్న పిసి పాండే విచారణ ప్రారంభం కాకుండా ఆర్నెల్లు ఆపాడు. సుప్రీం కోర్టు ఊరుకోలేదు, మూడుసార్లు గుర్తు చేసింది. (ఇలా గుర్తు చేసే న్యాయమూర్తులున్నారనే వాళ్ల నియామకాలు, బదిలీలు యిప్పుడు కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం తన గుప్పిట్లోకి తెచ్చుకుంది) దాంతో గతిలేక జూన్‌ నెలాఖరులో మొదలుపెట్టాడు. చివరకు విచారించే టీములో చూడాసమా, అమీన్‌ వుండి తీరాలని రాతపూర్వకంగా ఆదేశాలు యిచ్చాడు. 

ఇంకో ఆర్నెల్లు పోయేసరికి గుజరాత్‌ పోలీసులు సొహ్రాబ్‌ను అహ్మదాబాద్‌ సూరత్‌ల మధ్య పట్టుకోలేదని, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎత్తుకుని వచ్చామని ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఆంధ్రతో కలిసి జాయింటు ఆపరేషన్‌ అంది. మాకే పాపం తెలియదు బాబోయ్‌, మాకున్న నకిలీ ఎన్‌కౌంటరు కేసులు చాలనట్లు యిదొకటా అని ఆంధ్ర పోలీసులు మొత్తుకున్నారు. దాంతో గుజరాత్‌ పోలీసులు సుప్రీం కోర్టుకు 'ఆంధ్ర పోలీసులకు సంబంధం లేదు' అన్నారు. టెర్రరిస్టు కార్యకలాపమైతే ఆంధ్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలి కదా, అని కోర్టు అడిగితే 2007లో 'అబ్బే గుజరాత్‌ పోలీసులు తమంతట తామే పేరుకోసం, కీర్తి కోసం, ప్రమోషన్ల కోసం సొహ్రాబ్‌ను పట్టుకుని చంపేశారు' అన్నారు. దానిపై డి జి వంజారా, రాజకుమార్‌ పాండ్యన్‌ అనే సీనియర్‌ అధికారులతో సహా 13 మంది పోలీసులపై చార్జిషీటు దాఖలు చేయడం జరిగింది. (అప్పటిదాకా విధేయుడిగా వుండి తప్పనిసరి పరిస్థితుల్లో యిలా చేసిన డిజిపి పిసి పాండేపై అమిత్‌కు అమితకోపం వచ్చిందిట. ముగ్గురు ఐపియస్‌ అధికారులను తను అరెస్టు చేయించిన మర్నాడే తనను ఢిల్లీకి పంపేశాడనీ డిఐజి రజనీశ్‌ రాయ్‌కు చెప్పుకుని వాపోయాడట) ఎంత తప్పు చేసినా పోలీసులు యింతలా ఒప్పేసుకుంటారా అన్న అనుమానం వస్తోందా? దానికి ముందు కాస్త కథ జరిగింది.

సొహ్రాబ్‌ ఎన్‌కౌంటరు కేసు విచారించే బాధ్యత అప్పగించిన వసంత్‌ సోలంకీ అనే గుజరాత్‌ పోలీసు యిన్‌స్పెక్టరు చాలా గట్టివాడు. తన సీనియర్‌ అధికారులది తప్పుందని తన రిపోర్టులో రాసేశాడు. అది అమిత్‌ షాను మండించింది. 2006 నవంబరులో సోలంకీ గీతా జోహ్రీ అనే ఐజీ (ఇన్‌స్పెక్టరు జనరల్‌) కింద పనిచేస్తున్నాడు కాబట్టి ఆమెను పిలిచి ఎడిషినల్‌ డిజిపి జిసి రాయగిర్‌, డిజిపి పిసి పాండేల ఎదుట ''నీ కింద పనిచేసే వ్యక్తి యిలాటి రిపోర్టు రాసి అందర్నీ యిబ్బందుల్లోకి ఎలా నెట్టగలిగాడు?'' అని అడిగాడు. రాయగిర్‌ అమిత్‌ షాతో ''నేను కొద్ది రోజుల్లో రిటైరు కాబోతున్నాను. ఈ రిపోర్టు బయటకు వస్తే నాకు చాలా కష్టం.'' అని వేడుకున్నాడు. (ఈ సందర్భంగా 'మీరంతా బయట పడాలంటే ఫలానాది చేయండి' అని అమిత్‌ తనకు చట్టవిరుద్ధమైన ఆదేశాలు   యిచ్చినట్లు, 'ఆ ఆదేశాలు పాటించలేను, నన్ను దయచేసి సిఐడి ఎడిషనల్‌ చార్జి నుంచి తప్పించండి' అని తను అమిత్‌ను కోరినట్లు రాయగిర్‌ సిబిఐకు సాక్ష్యం యిచ్చాడు) అమిత్‌ గీతా కేసి తిరిగి ''విన్నావుగా, ఆ రిపోర్టులు చింపి పారేయి. ఎవరికీ ఏ చికాకూ లేకుండా మార్చి కొత్తగా రాయమను.'' అని గట్టిగా చెప్పి పంపించాడు. ఆమె ఆఫీసుకి తిరిగి వచ్చి సోలంకీని పిలిచి ''ఇదీ కథ'' అంది. అంతా విని సోలంకీ ''మా నాన్న స్వర్గం నుంచి దిగి వచ్చి ఆదేశించినా నేను మార్చను. సొహ్రాబ్‌ సంగతి సరే, అతని భార్య అమాయకురాలు. ఆమెను కూడా పట్టుకెళ్లి అన్యాయంగా కాల్చేశారు. వీళ్లను గట్టున పడేస్తే ఆ స్త్రీహత్యా పాతకం మనకూ చుట్టుకుంటుంది.'' అన్నాడు. ఆమె నుదురు బాదుకుని యితన్ని బయటకు పొమ్మంది. ఇతను బయటకు వచ్చి గీతా జోహ్రీ పియే ఆచార్యతో లోపల జరిగిందంతా చెప్పాడు. సోలంకీ, ఆచార్య యిద్దరూ ఆ మేరకు సిబిఐకు సాక్ష్యాలు యిచ్చారు. 

ఇది జరిగిన నెలకు అంటే డిసెంబరు 18న సోలంకీ సొహ్రాబ్‌ ఎన్‌కౌంటరులో నిజానిజాలు తేలాలంటే అతని వద్ద పనిచేసి, పోలీసులకు సాయపడి, ప్రస్తుతం ఉదయపూరు జైల్లో వున్న తులసీ ప్రజాపతి, సిల్విస్టర్లను యింటరాగేట్‌ చేయాలని దానికై తనకు అనుమతి యివ్వాలని సోలంకీ పైఅధికారులకు ఉత్తరం రాశాడు. దానిపై గీతా జోహ్రీ తను కూడా సోలంకీతో వెళదామనుకుంటున్నాననీ, అనుమతి యివ్వాలనీ కోరుతూ నోట్‌ రాశారు. వీళ్లకు అనుమతి నిరాకరిస్తూనే అక్కడ ప్రజాపతిని 9 రోజుల్లో లేపేశారు. డిసెంబరు 27 న అతను ఎన్‌కౌంటర్లో (!?) చచ్చిపోయాడు. సోలంకీ రాసిన లేఖ యిప్పుడు కనబడడం మానేసింది. దాని ఆఫీసు కాపీ కూడా మాయమైంది. ఎందుకంటే 2007 మార్చిలో డిప్యూటీ ఎస్‌పి (క్రైమ్‌) అహ్మదాబాద్‌ జోన్‌గా ఎన్‌కె అమీన్‌ను వేసి అతనికి యితని ఫైళ్లన్నీ అప్పగించమన్నారు. ప్రజాపతి చచ్చిపోయాక 'యిప్పుడు నువ్వు కావలిస్తే ఉదయపూరు వెళ్లవచ్చు' అని సోలంకీకి అనుమతి యిచ్చారు! సొహ్రాబ్‌ సోదరుడు యీ విచారణ మొత్తం మీద చాలా సందేహాలు లేవనెత్తాడు. 'సొహ్రాబ్‌ టెర్రరిస్టయితే, ఎదురు తిరిగి వుంటే, పట్టుకున్నాక 48 గంటల పాటు సజీవంగా ఎందుకు వుంచారు? ఫామ్‌హౌస్‌లకు తీసుకెళ్లి వివరాలు రాబట్టడం దేనికి? పోలీసు స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు? అతని భార్య ఏ నేరం చేసిందని చంపేశారు? ఇప్పుడు ప్రజాపతి కూడా మిస్టీరియస్‌గా ఎన్‌కౌంటరుకి గురి కావడం ఏమిటి? గుజరాత్‌ పోలీసులు నిజాలు చెప్పడం లేదు. అందువలన కేంద్రప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించాలి' అని సుప్రీం కోర్టుకి పిటిషను పెట్టుకున్నాడు. 

ఠఠ్‌, సిబిఐ విచారణను ఒప్పుకోం అని గుజరాత్‌ ప్రభుత్వం తన తరఫున హేమాహేమీల చేత సుప్రీం కోర్టులో వాదింప చేసింది. వారిలో జగమెరిగిన రామ్‌ జెఠ్మలానీ, ముకుల్‌ రోహ్‌ాతగీ (ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాక 2014 జూన్‌లో దేశానికి ఎటార్నీ జనరల్‌ అయ్యారు) ఉదయ్‌ లలిత్‌ (ఆగస్టు 2014లో సుప్రీం కోర్టు జడ్జి అయ్యారు) వున్నారు. 'గుజరాత్‌ పోలీసు వ్యవస్థ చక్కగా విచారణ జరిపి కేసు మూసేసింది, అపరాధులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటాం, యిప్పుడు సిబిఐకు అప్పగించడం దేనికి?' అని వాళ్లు వాదించారు. సిబిఐ రంగంలోకి దిగితే యీ పోలీసు అధికారులు ఎవరి ఆదేశాలపై యింత ఘాతుకాలు చేశారో బయటకు వస్తుందని భయం కావచ్చు. అలాటి పరిస్థితుల్లో 2007లో గుజరాత్‌ ప్రభుత్వం 13 మంది పోలీసు అధికారులను బలి యిచ్చి హమ్మయ్య అనుకుంది. అయితే కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మరీమరీ ప్రశ్నించడంతో కౌసర్‌ బీని కూడా ఫేక్‌ ఎన్‌కౌంటర్లో చంపేశారనీ, ఇల్లోల్‌ అనే గ్రామానికి తీసుకెళ్లి ఆమె శవాన్ని దహనం చేసేశారనీ కూడా 2007 మేలో చెప్పారు. – (సశేషం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives