పేదల ఆసుపత్రిపై పెద్దల కన్ను

విమ్స్ ప్రైవేటు యోచనలో బాబు సర్కార్ Advertisement నగరం నడిబొడ్డున ఉన్న విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ప్రైవేటు బాట పడుతోందా.. అందుకేనా బాబు సర్కార్ ఉదాశీన వైఖరిని అవలంబిస్తోంది, నిధులను…

విమ్స్ ప్రైవేటు యోచనలో బాబు సర్కార్

నగరం నడిబొడ్డున ఉన్న విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ప్రైవేటు బాట పడుతోందా.. అందుకేనా బాబు సర్కార్ ఉదాశీన వైఖరిని అవలంబిస్తోంది, నిధులను సైతం విదిలించకుండా చోద్యం చూస్తోంది… ఈ ప్రశ్నలు ఇపుడు నగరవాసులలో కలుగుతున్నాయి. ప్రస్తుతం సర్కార్ ఆలోచనలు ఆ దిశగానే సాగుతున్నాయని, అడుగులు అటు వైపుగానే పడుతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్‌కు ధీటుగా ఎదుగుతున్న విశాఖలో నిమ్స్ తరహాలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్న ధ్యేయంలో 2007లో అప్పటి వైఎస్‌ఆర్ ప్రభుత్వం విమ్స్ ప్రతిపాదన చేసింది. 

నాడు సీఎంగా ఉన్న వైఎస్ విశాఖ సమీపంలో 110 ఎకరాల స్ధలంలో విమ్స్‌కు స్థలం కేటాయించి శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో 66 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేశారు. మొత్తం పదిహేను బ్లాకులతో అత్యాధునిక సాంకేతిక సంపత్తితో విమ్స్‌ను నిర్మించాలని ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే, 2009లో వైఎస్ మరణించాక విమ్స్ పడేకసింది. 66 కోట్ల రూపాయల నిధులతో ఆరు బ్లాకులు మాత్రం పూర్తి అయ్యాయి. వైద్యులు పూర్తి స్ధాయిలో నియామకం జరగలేదు, ఇక అత్యాధునిక పరికరాల ఊసే లేదు. రోశయ్య, కిరణ్‌కుమార్ ప్రభుత్వాలు విమ్స్‌ను పట్టించుకోలేదు. కిరణ్ సర్కార్ చివరి రోజులలో 30 కోట్ల రూపాయలను విమ్స్ కోసం కేటాయిస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ, నిధులు మాత్రం ఇవ్వలేదు. 

ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన బాబు సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలోనే జరిగింది. ఈ సమావేశంలో విమ్స్‌కు 30 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, ఆ నిధులు కూడా చాలా ఆలస్యంగా విడుదల అయ్యాయి. మరో అరవై కోట్లు రూపాయలు కనుక మంజూరు చేస్తే విమ్స్ పూర్తి అవుతుందని ఆసుపత్రి అధికారులు తెలియచేసినా, ఇక్కడి ప్రజా ప్రతినిధులు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఇపుడు విమ్స్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉంది. విమ్స్ నిధులను మంజూరు చేయడం పక్కన పెట్టి దీనిని ప్రైవేటీకరించాలని బాబు సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. 

దీనిపై పలు వైద్య సంస్ధలు కన్ను వేయడంతో రేపో మాపో విమ్స్ ప్రైవేటు వేటు పడనుందని అంటున్నారు విమ్స్‌లోని కొన్ని బ్లాక్‌లను తమకు అప్పగించాలని ఇప్పటికే టాటా మెమోరియల్ ఆసుపత్రి బాబు సర్కార్‌కు ప్రతిపాదించినట్లుగా తెలిసింది. తమకు హెల్త్ సిటీలో క్యాన్సర్ ఆసుపత్రి కోసం స్థలం కేటాయించారని,, అక్కడ నిర్మాణాలు పూర్తి అయ్యేంతవరకూ విమ్స్‌లో ఖాళీగా ఉన్న బ్లాక్‌లను వాడుకుంటామని పేర్కొంటోంది. అదే విధంగా, విమ్స్‌పై జీఎంఆర్ గ్రూప్, కామినేని ఆసుపత్రి కూడా కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. 

విమ్స్ 110 ఎకరాల విస్తీర్ణంలో ఉండడం, నగరం నడిబొడ్డున ఉండడంతో దీనిపై భారీ వైద్య సంస్ధల చూపు పడింది. విభజన తరువాత విశాఖ అతి పెద్ద నగరంగా ఉండడంతో ఇక్కడ కూడా తమ భారీ ఆసుపత్రులను ఏర్పాటుచేసుకోవాలని వారంతా యోచిస్తున్నారు. వారి కళ్లకు అనాధగా ఉన్న విమ్స్ కనిపిస్తోంది. ఆలనా పాలనా లేకుండా ఉన్న విమ్స్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. సర్కార్ కూడా అలాగే ఆలోచన చేస్తే కనుక విమ్స్ ఇక ప్రైవేటు దారిలో నడుస్తున్నట్లుగానే భావించాలి. 

విమ్స్ వంటి సంస్ధను ప్రైవేటుపరం చేయడం దారుణమని, దానిని అడ్డుకుంటామని ప్రతిపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీనిపై మాజీ ఉప మేయర్ దొరబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా విమ్స్‌ను గత సర్కార్ ఏర్పాటుచేసిందని, దానిని ఆ విధంగానే రూపకల్పన చేయాలని, పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని కోరారు. ఇతర విపక్షాలు, ప్రజా సంఘాలు కూడా విమ్స్ విషయంలో సర్కార్ కనుక వేరే విధంగా ఆలోచన చేస్తే ఊరుకోమని హెచ్చరించాయి. కాగా, విమ్స్‌కు మరో  యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు కనుక మంజూరు చేస్తే చక్కని ప్రభుత్వ వైద్య శాల జనానికి అందుబాటులోకి వస్తుందని విమ్స్ ఆసుపత్రి వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి, ఆ దిశగా బాబు సర్కార్ ఆలోచన చేయాలని నగర ప్రజలు కూడా కోరుతున్నారు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,